Previous Page Next Page 
మొగుడు ఇంకో పెళ్ళాం వజ్రాలు పేజి 6


    రాంబాబుకి వళ్ళు మండిపోయింది కనకారావు మీద.
    "కమాన్_ ఆ కుక్కపిల్లను అడ్డం తియ్యవయ్యా" అన్నాడు కోపంగా.
    "ఏయ్ మిస్టర్! డోంటాక్ రాట్! ఇక్కడ స్పీడ్ ముప్పైకి దాటకూడదన్న బోర్డు కనిపించలేదూ నీకు? ఆర్ యూ బ్లైండ్? రెసిడెన్షియల్ కాలనీలో ఇంత స్పీడా? ఇప్పుడే పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోను చేస్తా" అన్నాడు మండిపడుతూ.
    రాంబాబుకి ఏం చేయాలో అర్థం కావటం లేదు.
    ఆ కుక్కపిల్ల మీద నుంచే జీప్ ని పోనివ్వాలని వుందిగానీ తమంతట తామే పోలీసులకి 'క్లూ' ఇచ్చినట్లవుతుంది.
    విక్కీ చటుక్కున జీప్ లోంచి దూకి కుక్కపిల్ల దగ్గరకొచ్చి అమాంతం దానిని రెండు చేతుల్తో ఎత్తి కల్నల్ వేపు విసిరేశాడు. 'కుయ్యో' మంటూ గావుకేకలు పెట్టసాగిందది.
    జీప్ స్టార్టయింది.
    విక్కీ మళ్ళీ పరుగుతో జీప్ ఎక్కేశాడు.
    కల్నల్ ఇంగ్లీష్ లో తిడుతూ గావుకేకలు పెడుతున్నాడు.
    "బాస్టర్స్! ఒక్క నిమిషం ఆగండ్రా... మీ జీప్ నీ... మిమ్మల్నీ గన్ తో కాల్చిపారేస్తాను" అంటూ రివాల్వర్ తో రెండు రౌండ్లు కాల్చాడుగానీ అవి జీప్ కి తగల్లేదు.
    రాంబాబు శరవేగంతో జీప్ నడుపుతూ జీపులోని వైర్ లెస్ ఆన్ చేశాడు.
    "హలో... హలో... హలో... ఇన్స్ పెక్టర్ రాంబాబు హియర్! అనుమానాస్పద పరిస్థితుల్లో ఒకడు ఒక జీప్ ని డ్రైవ్ చేసుకుంటూ కూకట్ పల్లి వైపు వెళుతున్నాడు. ఫాలో హిమ్_ ఎలర్ట్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్" అన్నాడు మిస్ లీడ్ చేస్తూ.
    జీప్ లో వెనుక కూర్చున్న విక్కీ ఉలిక్కిపడ్డాడు.
    "అదేంటి గురూ! అలా ఎందుకు చెప్పావ్?"
    "క్రైమ్ పద్ధతిని బట్టీ, బ్యాంక్ వాళ్ళు చెప్పే వర్ణనలను బట్టి రాబరీ చేసింది నువ్వేనని మా వాళ్ళకు తేలిగా తెలిసిపోతుంది. నీకోసం వెతుకుతూ అందరూ కూకట్ పల్లి ఏరియా చుట్టుముడతారు. మనమిక్కడ సేఫ్" అన్నాడు రాంబాబు.
    విక్కీకి అతని మాటలు అనుమానం కలిగించాయి.
    జీప్ ఇప్పుడు ఇంకో ఏరియాలో ప్రవేశించింది.
    కొత్తగా కడుతున్న కాలనీ అది.
    అక్కడక్కడ ఓ ఇల్లు కనబడుతోంది.
    "ప్లాన్ సెంట్ పర్సెంట్ సక్సేసేనా?" అడిగాడు రాంబాబు.
    "విక్కీ యా మజాకానా? బ్యాక్ డోర్ ఎంట్రీ, ఫ్రంట్ డోర్ ఎగ్జిట్ మన స్పెషాలిటీ గురూ!" గర్వంగా అన్నాడు విక్కీ.
    రాణీ విక్కీ చేతిని అందుకుని ముద్దుపెట్టుకుంది.
    "ఆఖర్లో సెక్యూరిటీ వాడు నేను అమ్మాయిని కదాని కొంచెం ఎడ్వంచర్ చేయడానికి ప్రయత్నించాడు. నేను రెండు బులెట్స్ వాడి మోకాల్లోకి దించాక గానీ వాడికి అర్ధంకాలేదు నా లెవలేంటో" అంది రాణి.
    "మరి మూడు బులెట్స్ శబ్దాలు వినిపించాయేమిటి?"
    "ఎందుకయినా మంచిదని ఒకటి మేనేజర్ నెత్తికి రెండంగుళాల పైన వదిలాను దెబ్బకు అన్ కాంషస్ అయిపోయాడు.
    జీప్ ఓ అందమయిన ఇంటిముందాగింది.
    ఇంటికి తాళం వేసి వుంది. తాళం ఓపెన్ చేశాడు.
    ముగ్గురూ లోపలకు నడిచారు.
    విక్కీ బుర్రంతా ఆలోచనల్లో కిక్కిరిసిపోయి వుంది.
    రాంబాబు వైర్ లెస్ లో చెప్పిన వివరాలు అతనిలో అనుమానాలను రగిలించాయి.
    తనను ఎలాగయినా పోలీసులకి పట్టిచ్చి రాంబాబే వజ్రాలను కాజేయాలని ప్లాన్ చేసినట్టు అనుమానంగా వుంది.
    లేకపోతే అలా చెప్పాల్సిన అవసరం లేదు.
    "ఒరే రాంబాబూ! నువ్వు పోలీసోడివయితే నేను దొంగన్రా! పోలీసోడు ఎప్పటికయినా దొంగలు కనిపెట్టే కొత్త కొత్త టెక్నిక్ ల గురించి అంతా అయిన తర్వాత నేర్చుకోవలసిందేగానీ, దొంగలను పట్టుకోడానికి కొత్త టెక్నిక్ లు కనిపెట్టడం మీవల్ల కాదురా" అనుకున్నాడు లోలోపల.
    "ఎన్ని వజ్రాలున్నాయ్?"
    "తెలీదు... మొత్తం బాక్స్ కొట్టుకొచ్చేశాం" అంది రాణి.
    ముగ్గురూ బాక్స్ తెరచి చూశారు.
    రెండు వజ్రాలున్నాయి.
    అవి ఒకోటీ కనీసం పాతిక కోట్లుంటుందని తను న్యూస్ పేపర్లో చదివాడు చాలాకాలం క్రితం.
    రాంబాబు కళ్ళు జిగేల్ మన్నాయి వాటిని చూసేసరికి.
    అదంతా నిజమని నమ్మబుద్ధి కావటం లేదు.
    కేవలం ఓ చిన్న రిస్క్ తో కోటీశ్వరుడయ్యే అవకాశాలు బోలెడున్నాయి ఈ లోకంలో.
    రాంబాబు హాల్లో ఇనప్పెట్టె తెరిచాడు తాళం చేతితో.
    "బాక్స్ లోపల పెట్టెయ్" రాణికి చెప్పాడు.
    రాణీ బాక్స్ లోపల పెట్టగానే తిరిగి తాళం వేసేశాడతను.
    "తాళం చెవి నాకివ్వు గురూ" అడిగాడు విక్కీ.
    "ఎందుకు?"
    "నీమీద నాకు నమ్మకం లేదు. ఎందుకంటే నువ్వు పోలీసువి. ఏ క్షణంలోనయినా నన్ను మోసం చేసి ఆ వజ్రాలు నువ్వు కాజేస్తావని నాకు అనుమానం"
    రాంబాబు నవ్వాడు.
    "ఒరేయ్! అనుమానించటం మా డిపార్ట్ మెంట్ పనిరా! దొంగల పనికాదు. ఎవడి డ్యూటీ వాడు చేస్తేనే బాగుంటుంది. అదీగాకుండా నీ బుద్ధి ఒరిజనల్ గానే దొంగబుద్దని నాకు తెలుసుకదా. మర్యాదగా బయటకు పద_ మనం ముగ్గురం ఈ పోలీసుల హడావుడి తగ్గాక ఒక రోజు ఇక్కడే కలుసుకుని ఆ వజ్రాలు అమ్మేసి సమంగా పంచుకుని ఎవరిదారిన వాళ్ళు ఆనందంగా గడుపుదాం_ ఓ.కె?"
    రాంబాబు తలూపాడు.
    విక్కీకి లోలోపల అనుమానం మరింత బలపడింది.
    రాంబాబు బ్రెయిన్లో చెడ్డ ఆలోచన వుంది. లేకపోతే తల అన్నిసార్లు వూపాల్సిన అవసరం లేదు. తన తండ్రి ఎప్పుడూ ఒకేమాట చెప్తూండేవాడు.
    "ఒరే విక్కీ! ఎవడ్నయినా నమ్ముగానీ పోలీసోడిని మాత్రం నమ్మకురా_ సర్వనాశనం అయిపోతావ్"
    మొదట్లో తండ్రి మాట అబద్ధమని కొట్టిపారేశాడు గానీ అనుభవం మీద అది గోల్డెన్ రూల్ అన్న విషయం తెలిసొచ్చింది.
    అందుకే రాంబాబు విషయంలో ఇంతగా ఆలోచిస్తున్నాడు.
    తనను జైలు నుంచి స్వయంగా విడిపించి "ఒరే విక్కీ! ఈ చిల్లర దొంగతనాలు ఎంతకాలం చేస్తావురా? నేనో ప్లాన్ చెప్తా_ చేశావంటే నువ్వూ నేనూ కూడా కోటీశ్వరులయిపోవచ్చురా. ఆ డబ్బుతో నువ్వు ఎలక్షన్లలో నిలబడి గెలవచ్చు. లేదా బిజినెస్ చేసుకోవచ్చు. పోలీసుల చేతిలో పడే గొడవంతా వదిలిపోతుంది" అని చెప్పాడు రాంబాబు.
    తను వెంటనే వప్పుకున్నాడు.
    అప్పుడు ఈ బ్యాంక్ రాబరీ గురించి చెప్పాడు రాంబాబు.
    ఆ బ్యాంక్ లో ఒక కస్టమర్ వజ్రాలు దాచుకున్నట్లు తనకు ఇన్ ఫర్మేషన్ వచ్చిందనీ, తను లోపల వ్యవహారం చూసుకుంటే అతను బయట వ్యవహారం చూసుకుంటాడనీ అన్నాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS