Previous Page Next Page 
మొగుడు ఇంకో పెళ్ళాం వజ్రాలు పేజి 5


    "గుర్తుంది సార్! మా పెద్ద బాస్ కి మనం మామూలిచ్చే రోజు ఇవ్వాళ."
    ఆటోడ్రైవరు ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో హోటల్నుంచి ఫలహారాలు తీసుకొచ్చాడు.
    రాంబాబు జీప్ లో కూర్చుని టిఫిన్ చేశాడు.
    "ఈ హోటల్ వాడు కొంచెం నకరాలు చేస్తున్నాడు సార్! నిన్న మధ్యాహ్నం మా దోస్త్ వచ్చినప్పుడు టూ బై ఫోర్ చాయ్ తాగుదామని వెళితే బిల్ కట్టాల్సిందేనని కిరికిరి పెట్టాడు. రోజూ మార్నింగ్ ఒక్కసారీ కాఫీ ఫలహారం ఇస్తానుగానీ రోజంతా ఫ్రీగా యివ్వటం కుదరదని అందరిముందూ గలీజ్ గా మాట్లాడాడు సార్!"
    "అంత తల పొగరుగా వుంటే ఓ రోజూ హోటల్ ముందు రోడ్డు మీద పార్క్ చేసిన వాడి కస్టమర్సు స్కూటర్లు, కార్లు అన్నీ చలాన్ చేసి పడెయ్. రెండో రోజు వాడి కలెక్షన్ సగమయిపోతుంది."
    "ఎస్సార్!" ఆనందంగా అన్నాడు బషీర్.
    అతను ఫలహారం చేసేసరికల్లా బషీర్ ఫ్లాస్క్ లో కాఫీ తెప్పించాడు.
    "నాలుగు కేస్ లు పట్టుకురా_ త్వరగా వెళ్ళాలి."
    "ఎస్సార్" అని ట్రాఫిక్ జంక్షన్ మధ్యకెళ్ళాడతను.
    అయిదు నిమిషాల్లో అరడజను స్కూటర్లను తీసుకొచ్చి రాంబాబు ముందు నిలబెట్టాడు.
    "ఇన్సూరెన్స్ నిన్నే ఎక్స్ పైర్ అయింది సార్! రేపు రెన్యూ చేయిస్తాను" అన్నాడొకడు.
    "అదేం కుదరదు. నూటయాభై చలాన్ కట్టు" కఠినంగా అన్నాడు రాంబాబు చలాన్ పుస్తకం కోసం వెతుకుతున్నట్లు నటిస్తూ.
    "రెండో కానిస్టేబుల్ కి తనేం చేయాలో క్షుణ్ణంగా తెలుసు. ఆ స్కూటర్ వాడిని పక్కకు పిలిచాడు.
    "ఓ యాభయ్ నాకిచ్చెయ్. ఇన్స్ పెక్టర్ గారికి తెలీకుండా వదిలేస్తాను."
    అతను చప్పున యాభయ్ నోటు తీసిచ్చి స్కూటర్ డ్రైవ్ చేసుకెళ్ళిపోయాడు.
    రాంబాబు టైమ్ చూసుకున్నాడు.
    పదయింది.
    ఇంకో గంట టైముంది బ్యాంక్ క్లోజ్ చేయడానికి.
    అంత పోలీస్ ఇన్స్ పెక్టరయినా అతని గుండె వేగంగానే కొట్టుకోసాగింది. చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడు తను.
    కానీ తప్పదు. అర్జంటుగా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలంటే అంతకంటే గత్యంతరం లేదు.
    టైమ్ పదకొండయింది. రాంబాబు వెంటనే జీప్ లో కూర్చుని స్టార్ట్ చేశాడు.
    బషీర్ మళ్ళీ సెల్యూట్ కొట్టాడు.
    "నేను ఓ రౌండ్ కొట్టి వస్తాను. జాగ్రత్త."
    జీప్ నెమ్మదిగా వెళ్తోంది రోడ్డుమీద.
    బ్యాంక్ దగ్గరకొచ్చాక స్లో అయ్యింది.
    కొద్దిదూరంలో పార్కింగ్ దగ్గర ఆపి ఓసారి చుట్టూ చూశాడు.
    ఎవరూ తనని గమనించటం లేదు. బ్యాంక్ గేటు మూసివేశారు.
    కొద్దిసేపు వెనుక డోర్ తెరచి వుంచుతారు లోపలివాళ్ళు వెళ్ళిపోడానికి. అతనికి చెమటలు పట్టేస్తున్నాయి.
    ఇంకో అయిదు నిమిషాలు_
    అంటే సరిగ్గా పదకొండున్నరకు వాళ్ళిద్దరూ దొంగిలింపబడిన స్కూటరు మీద వస్తారు.
    అతను చూస్తూండగానే స్కూటర్ వచ్చి ఆగింది. ముందు విక్కీ స్కూటరు దిగాడు. ఎవరూ చూడకుండా వాడికి చేయి వూపాడు రాంబాబు. వాడు కూడా చేయి వూపి బ్యాంక్ వెనుక డోర్ వైపు వెళ్ళాడు. మరికొద్ది నిమిషాల తర్వాత రాణీ కూడా హ్యాండ్ బ్యాగ్ తో లోపలకు నడిచింది.
    రాంబాబుకి భయం పెరిగిపోతోంది.
    అంతా సవ్యంగా జరిగేవరకూ టెన్షన్ తప్పదు.
    ఇలాంటి బ్యాంక్ రాబరీల్లో విక్కీ పెద్ద ఎక్స్ పర్టే.
    అయినాగానీ రాణీకిది కొత్త. రాణీ ఇంతవరకూ కేవలం చీటింగ్ కేసుల్లోనే పేరుతెచ్చుకుంది. ముఖ్యంగా దొంగనోట్లు చెలామణీ చేయటంలో రాణీని మించినవారు లేరు.
    ఇంకో క్వాలిఫికేషనేంటంటే రాణీ చాలా సెక్సీ ఫిగర్.
    ఛాన్స్ దొరికితే రాణీతో సెకండ్ సెటప్ ఏర్పాటు చేసుకోవాలని తన కోరిక.
    కానీ రాణీలాంటిదాన్ని మెయింటెయిన్ చేయాలంటే మాటలు కాదు. నెలకు కనీసం యాభైవేపు ఆదాయం వుండాలి.
    ఈ బ్యాంక్ రాబరీ ప్లాన్ సక్సెస్ అయితే అప్పుడింక ఏ సమస్యా వుండదు.
    రాంబాబుకి భయం ఎక్కువయిపోతోంది.
    జీప్ లో కూర్చుని చకచక తన యూనిఫారం తాలూకూ షర్టు తీసేసి సివిల్ షర్టు వేసుకున్నాడు.
    టైమ్ చూశాడు... పదకొండూ నలభై!
    జీప్ స్టార్ట్ చేశాడు. బ్యాంక్ కి పక్కనే వున్న పెద్ద చెట్టుకింద ఇంజన్ ఆఫ్ చేయకుండా పార్క్ చేశాడు.
    జీప్ నెంబర్లు ప్లేటు ముందే మార్చేశాడు.
    ఏ క్షణాన్నయినా విక్కీ, రాణి పరుగుతో రావచ్చు. కొంచెం నగరానికి దూరంగా వున్న ఏరియా కావడంతో జనసమ్మర్ధం చాలా తక్కువగా వుంది.
    ఒక్కసారిగా రివాల్వర్ కాల్పులు వినిపించినయ్ బ్యాంక్ భవనంలో నుంచి.
    వరుసగా మూడు బులెట్స్.... 'అబ్బా' అన్న ఆర్తనాదం... కెవ్వున ఆడవాళ్ళ కేకలు....
    మళ్ళీ వెంటనే నిశ్శబ్దం!
    రాంబాబు గుండె నోట్లో కొచ్చినట్లనిపించింది.
    భయం నరాల్లో నుంచి పాకుతోంది.
    ఏం జరిగుంటుంది? కాల్పులెవరివి? విక్కీవా లేక సెక్యూరిటీ గార్డువా?
    అంతలోనే ధైర్యం...
    విక్కీ సామాన్యమయిన దొంగ కాదు_ డేర్ డెవిల్ రాబరర్! ఎన్నోసార్లు బ్యాంక్ లు లూఠీ చేశాడు. కానీ కేవలం ఒక్కసారి మాత్రమే దొరికాడు.
    అందుకే వాడిని ఎన్నుకున్నాడు తను.
    మరుక్షణం పెద్దగా బ్యాంక్ అలారం వినిపించసాగింది. ఏం జరిగి వుంటుంది? విక్కీ లొంగిపోయాడా వాళ్ళకు?
    రాంబాబుకేం చేయాలో అర్థం కాలేదు.
    ఆ సమయంలో తనక్కడ వుండటం ఎవరయినా చూస్తే తను చిక్కుల్లో పడతాడు. హఠాత్తుగా ఫ్రంట్ డోరు తెరచుకుంది. శరవేగంతో ముందు రాణి, వెనుక విక్కీ పరుగుతో రావటం చూసేసరికి రాంబాబుకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది.
    ఫస్ట్ గేరు వేశాడు.
    జీప్ నెమ్మదిగా కదులుతోంది.
    ముందు రాణీ ఎక్కేసింది వెనుకనుంచి.
    జీప్ వేగం అందుకుంటూండగా విక్కీ కూడా ఎక్కేసి వెనుక కాన్వాస్ క్లోజ్ చేసేశాడు.
    రాంబాబు జీప్ వేగం సడెన్ గా పెంచేశాడు.
    కాళ్ళూ చేతులూ వణుకుతున్నాయతనికి.
    అనుకున్న ప్రకారం క్షణాల్లో జీప్ ఓల్డ్ సిటీలో కొచ్చేసింది. సంతోషనగర్ సమీపంలో వుంది తాము వెళ్ళాల్సిన కాలనీ.
    మెయిన్ రోడ్ మీద నుంచి జీప్ కాలనీలోకి వేగంగా తిరిగేసరికి కల్నల్ కనకారావు తన కుక్కపిల్లను అప్పుడే రోడ్డుమీదకు గొలుసుతో తీసుకొస్తూ జీప్ కి అడ్డం వచ్చేశాడు. జీప్ ని చూసి బెదిరిన కుక్కపిల్ల రోడ్ కి ఒక వేపూ, కనకారావు మరొక వేపూ నిలబడాల్సి వచ్చింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS