Previous Page Next Page 
మొగుడు ఇంకో పెళ్ళాం వజ్రాలు పేజి 7


    లోపల తనకో అసిస్టెంటు అవసరం వుంటుందన్నాడు తను.
    రాంబాబు అప్పుడు లాకప్ లో వున్న రాణిని విడిపించుకొచ్చాడు.
    రాణి వేగం తనకు నచ్చింది.
    జీవితాంతం రాణి తన పక్కనుంటే వరల్డ్ బ్యాంక్ ని కూడా ఖాళీ చేసేయ వచ్చనిపించింది.
    ముగ్గురూ ఇంటికి తాళం వేసి బయటికొచ్చారు.
    హఠాత్తుగా విక్కీ మీదకు తాళం చేతులు విసిరేడు రాంబాబు.
    విక్కీ ఆశ్చర్యంగా చూశాడు.
    "తాళం చేతులు నీకెందుకిచ్చానో తెలుసా?"
    "ఎందుగ్గురూ?"
    "దొంగకు తాళం చేతులిమ్మని పెద్దలన్నారు కాబట్టి. తాళం చేతులిస్తే వాడి చేతులు కట్టేసినట్లేనట" పగలబడి నవ్వుతూ అన్నాడు.
    రాణీ కూడా అతనితోపాటు నవ్వేయసాగింది.
    "జీపెక్కండి_ మీ యిద్దర్నీ మెయిన్ రోడ్డు దగ్గర వదిలినే వెళ్ళిపోతాను."
    ఇద్దరూ జీపెక్కారు.
    మెయిన్ రోడ్డు దగ్గరకు రాగానే జీప్ ఆపి వాళ్ళిద్దర్నీ దింపేశాడు.
    "ఒరే విక్కీ! ఇద్దరూ వారానికో రోజు నాకు ఫోన్ చేస్తూండండి. అంతా సవ్యంగా వుందనుకున్నప్పుడు ముగ్గురం ఈ ఇంటి దగ్గరే కలుసుకుని సొమ్ము పంచుకుందా_ సరేనా?"
    ఇద్దరూ ఆనందంగా తలూపారు.
    జీప్ స్టార్ట్ చేస్తూంటే రాణి రాంబాబు వంక చూసి కన్నుకొట్టింది.
    రాంబాబు వులిక్కిపడ్డాడు.
    అది తనకంటే ఫాస్ట్ గా వున్నట్లుంది.
    "రాణీ! నువ్వు రేపే ఫోన్ చెయ్యి."
    "అలాగే సార్."
    వాళ్ళ కోడ్ విక్కీకి అర్థమైంది. తన పిచ్చిగానీ రాణిలాంటిదాన్ని రాంబాబు వదుల్తాడా?
    వాళ్ళిద్దరూ చెరో దారి వెళ్ళిపోగానే తను మళ్ళీ యూనిఫారం వేసుకుని జీప్ నెంబర్ ప్లేట్ తీసి తుప్పల్లో పారేసి ఒరిజినల్ ప్లేట్ ఫిట్ చేసుకుని స్టార్ట్ చేసుకుని హెడ్ క్వార్టర్స్ వైపు బయలుదేరాడు.
    రాంబాబు వైర్ లెస్ తో అంతా అల్లకల్లోలంగా వుంది.
    తను పారేసిన నెంబర్ ప్లేట్ గల జీప్ కోసం వెతకమని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ ఇన్ స్ట్రక్షన్స్ వెళ్తున్నాయి.
    రాంబాబు గుండె ఝల్లుమంది.
    తన జీప్ నెంబరెలా దొరికింది వాళ్ళకు?
    బ్యాంక్ వాళ్ళు చూసే అవకాశం లేదు.
    ఇంకెవరు కనిపెట్టి వుంటారు?
    కొంతదూరం వెళ్ళేసరికి పెట్రోల్ వ్యాన్ ఎదురొచ్చింది.
    లోపల ఏ.సి.పి. కనిపించేసరికి జీప్ దిగి సెల్యూట్ కొట్టాడు రాంబాబు.
    "నీ కోసమే వెతుకుతున్నా రాంబాబూ! వేర్ యూ హావ్ గాన్?"
    "నాకు ఇన్ ఫర్మేషన్ వచ్చింది సార్! ఆ బ్యాంక్ రాబరర్స్ వుపయోగించిన జీప్ ఇటే వెళ్ళిందని."
    "ఎక్కడైనా కనిపించిందా?"
    "లేద్సార్! కానీ ఆ విక్కీగాడు ఒక జీప్ డ్రైవ్ చేసుకుంటూ రాష్ గా వెళ్ళడం నేను గంటక్రితం చూశాను. బహుశా వాడే బ్యాంక్ రాబరీ చేసి వుంటాడు."
    "విక్కీయా? అనుమానం లేదు. ఇది ఖచ్చితంగా వాడిపనే అయి వుంటుంది. బ్యాంక్ రాబరీ చేసిన పద్ధతి కూడా అచ్చం వాడు ఫాలో అయ్యే పద్ధతే. కమాన్_ మెసేజ్ ప్లాష్ చేయండి. విక్కీ కోసం ఛేజ్ మొదలుపెట్టమనండి" అరిచాడు ఏ.సి.పి.
    వాన్ వెళ్ళిపోయింది.
    వెనుకే జీప్ కూడా బయల్దేరింది.
    రాంబాబు తనలో తను ఆనందంగా నవ్వుకున్నాడు.
    విక్కీ పోలీసుల చేతి నుంచి తప్పించుకోవటం ఇంపాజిబుల్. బహుశా తెల్లారేసరికల్లా లాకప్ లో వుంటాడు. వాడే బ్యాంక్ రాబరీ చేసినట్లు దొంగ సాక్ష్యాలను తను ఏర్పాటు చేశాడంటే కనీసం పదేళ్ళు జైల్లో వుంటాడు.
    తనూ, రాణీ ఆ వజ్రాలు తీసుకుని హాయిగా జీవితం ఎంజాయ్ చేస్తారు.

                      *    *    *    *

    రాంబాబు జీప్ లో అటు వెళ్ళాడో లేదో విక్కీ ఛటుక్కున వెనక్కి తిరిగి పరుగుతో అడ్డదారిన మళ్ళీ ఆ ఇంటి దగ్గరకు చేరుకుని తలుపు తాళం తెరచి లోపలికెళ్ళి ఇనప్పెట్టె తెరుస్తూంటే_ వెనుక గాజుల చప్పుడు వినిపించింది. అదిరిపడి వెనక్కు తిరిగి చూశాడు.
    రాణి.......
    "ను.... ను... నువ్వా?" అన్నాడు కంగారుగా.
    "నువ్విలాంటి వెధవపని చేస్తావని నాకు ముందే తెలుసు" అంది రాణి.
    "రాణీ! ఆ ఇన్స్ పెక్టర్ రాంబాబు మీద నాకు నమ్మకం లేదు. మనకంటే ముందే వచ్చి వీటిని కాజేస్తాడని నాకు తెలుసు. అందుకని నేనే కాజేస్తున్నాను."
    "ఓ_అలాగా!"
    "నీ షేర్ నీ కిచ్చేస్తాను రాణీ."
    "షేర్ అంటే ఎంత?"
    "నీకు పాతికయితే నాకు డెబ్బయ్ అయిదు."
    "ఆడపిల్లలక్కూడా ఇప్పుడు ఆస్థిలో సమాన వాటా వుందని పేపర్లో రాశారు_ చదవలేదా?"
    "నేను న్యూస్ పేపర్లు చదవను."
    "ఆడెడె... ఆ సంగతి తెలిస్తే ఆడపిల్లలకు 75 శాతం ఆస్తి చెందుతుందని రాసినట్లు చెప్పేదానినే."
    "సరే! ఫిఫ్టీ ఫిఫ్టీ..."
    అతను సేఫ్ లో నుంచి వజ్రాల బాక్స్ తీశాడు.
    సరిగ్గా అప్పుడే వినిపించింది పోలీస్ సైరన్.
    "రాణీ! కమాన్ పరుగెత్తు. ఎవర్దారి వాళ్ళు వెళ్ళిపోదాం. ఇంకాసేపయ్యాక మా ఇంటికిరా_ నీ సగం వాటా నీకిచ్చేస్తాను" అనేసి బాక్స్ తో బయటకు పరుగెత్తాడు. దూరంగా పోలీస్ వాన్ కనిపించిందతనికి. ఎలా పారిపోవాలా అని చుట్టూ చూశాడు.
    ఇంటి ముందు స్కూటర్ మీద కూర్చుని హారన్ కొట్టి భార్యను పిలుస్తున్నాడు ఓ యువకుడు.
    "ఒసేయ్! కమాన్. ఎంతసేపు? నీ అలంకారం తగలబడినట్టే వుంది. త్వరగా తగలడు" అంటూ అరుస్తూండగానే ఆ బాక్స్ తో అతని నెత్తిన కొట్టాడు విక్కీ.
    కిక్కురుమనకుండా కింద పడిపోయాడతను.
    వెంటనే ఆ స్కూటర్ తీసుకుని స్టార్ట్ చేసుకెళ్ళిపోయాడు విక్కీ.
    సందుల్లోనుంచి తిరిగి తిరిగి మెయిన్ రోడ్ మీదకు చేరుకునేసరికి అప్పుడే వస్తున్న మరో పోలీస్ జీప్ కనిపించింది.
    ఒక్కసారిగా స్కూటర్ వేగం పెంచాడతను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS