Previous Page Next Page 
మ్యూజింగ్స్ - 1 పేజి 5


    నాశరీరానికి వయసు  అతి అల్పం. ఏ ఆకర్షణా జ్ఞానమూ లేవు. కాని యీ హృదయం! ఎన్ని జన్మాల అనుభవాన్నో, యెన్ని అనుభవాల ఫలాన్నో, యెన్ని ప్రణయాల అగ్నినో వెంట తెచ్చుకుంది గావును!
    హృదయం-పాపం! తనబాధ తనకే తెలియని నా పసిహృదయం-ఆమెనించి యేం కోరుతోందో యెరగని ఆ హృదయం-ఆమె చుట్టూ మూగి చీకట్లో గొప్పగానం విన్నదానివలె అర్ధంకాని కనపడ్డది. ఆనాటినించి నిలిచింది బంగారమ్మ నా జీవితపథంలో మొదటి ప్రణయజ్యోతిగా ఏరూపాన్నైనా అప్రయత్నంగా ఆమె సౌందర్యంతో పోల్చి తూస్తుంది నా మనసు.
    ఈ జన్మలో లక్ష్మి కాళ్ళకింది పద్మంవలె వొచ్చే జన్మలో బంగారమ్మ స్వరూపం నాకు కళాదర్శమై, ఎట్లా మనసులోకి వొచ్చిందో అర్ధంకాక, బాధ పెడుతుంది గావును!
    ఈ ప్రేమలో యిన్ని mysterious influences పెట్టుకుని వాటి పక్షాంచలాలని అప్పుడప్పుడు అందుకోగలిగిన నేను, కధలలో స్త్రీ వ్యక్తుల్ని సృష్టించ ప్రయత్నిస్తే, ఎందుకర్ధమవుతాయీ, యీ పశువులకి!
    నా పూర్వ సుకృతంవల్ల యీనాడు నాకంటికి యెదురుగా, యీ బల్లల మధ్యనించి, వోమ్గిన పిల్లల పిచ్చి తలల మీదనించి, స్కూలు తోట కనిపిస్తోంది. ఈ ట్రెయినిమ్గు స్కూళ్ళలోంచి నవ్వూ, స్వేచ్చా, విశ్వాసమూ, ధైర్యమూ, అందమూ, తరమ గలిగారు. చాలా పాఠశాలల్లో గాలినీ, వెలుతురునీ కూడా బహిష్కరించాడు. (ఒక్క యీ ట్రైయినింగు స్కూళ్ళేమిటి అన్ని బళ్ళలోనూ యింతే) కాని యీ చెట్లు, యీ యెండ, గడ్డీ, గాలీ, యెట్లాగో అధికార్ల ఆజ్ఞల్ని తప్పించుకుని దొంగతనంగా జొరబడుతున్నాయి. రంగుల క్రోటన్ల మధ్య మొక్కలేని తొట్టిలో శూన్యప్రదేశాన్ని గడ్డి వయతో కప్పింది. ఆ గడ్డిమధ్య ఒక్కటే యెర్రని పువ్వు గాలిలో వూగుతూ అలిసిన నాదృష్టిని ఆపి పలకరించింది. అప్పుడే క్రొత్తగా భూమిని బద్దలు చేసుకుని, ముఖాన్నెత్తి, ఎండనీ, చెట్లనీ, చూసి పకపకనవ్వుతో తనుకూడా బతుకులోకి దూకాననే సంతోషంతో గంతులువేసి అడుగుతోంది. ఈ బిడ్డనుచూసి చుట్టూ వున్న ముసలమ్మ చెట్లు బోసి చిగుళ్ళు బైటపెట్టి ఆనందిస్తున్నాయి. మన అనుభవానికి అందదు గనక మనకి తెలీదుగాని, చెట్లకి జన్మవల్ల, వృద్ధివల్ల, ఆహారంవల్ల ఆనందం వుండదా? పసిపిల్లకి ఏమీ తెలీదు. కాని పాలుతాగి, గాలితగిలీ, ఆనందించదా? నిదానించి, తీరిక నా సానుభూతితో పరీక్షిస్తే యీ వృక్షాల మనోభావాల్ని గుర్తుపట్టగలం. చెట్లకి ప్రాణమూ, బాధా లేవుగనక వాటిని తినవచ్చునని నిశ్చలంగా నిశ్చయంగా తెలిసినట్టు వాదించేవాళ్ళని చూస్తే అసహ్యమేస్తుంది. మంచూ, వెన్నెలా, గాలీ, వానా చెట్లకి యిచ్చే ఆనందాన్ని చూడనివాడు అంధుడే.
    అట్లాగే ఆ పువ్వు కేసి చూచి కలలు కంటున్నాను ఎండ మెరుస్తోంది యెర్రని రేకులమీద భూమికి గాటు తగిలితే పైకివొచ్చిన రక్తపుచుక్కలాగుంది పువ్వు! ఆ పువ్వుని చూస్తే విశ్వనాధ సత్యనారాయణగారు ఏమని వర్ణించి వుంటారో?
    ఇట్లా ఆలోచిస్తా వుంటే గంట కొట్టారు. గడియారం మెల్లిగా తిరిగింది. చిత్తూరు రైలు చక్రాలవలె నా స్వేచ్చానందంలో పువ్వునే మరిచి నా గతినే మరిచి బైటికి పరిగెత్తాను. మంచినీళ్ళు తాగాను. ఏం చెయ్యను? పంగ నామాల పందికొక్కు హెడ్మాస్టరు మొహం. చూడాలి పోయి ఆపేపర్ని చ్చేందుకు.
    కాని ఏమిటా పోయిన ఆనందం? ఆ యెర్రని పువ్వు! కోటలోకి పరిగెత్తాను. ఆ తొట్టి మధ్య గడ్డిలో మెరుస్తో ఎవరో వుండ మట్టిపారేసిన యెర్రని కాలంతం కనపడ్డది. అదీ నన్ను రెండుగంటలు సంతోషపెట్టిన పుష్పం.
    ప్రాణం చివుక్కుమంది సిగ్గేసింది. ఆ కలని నేను అట్లానే వదిలి వుండకూడదూ? కాయితమే కానీ నిజమైన పుష్ప మివ్వగల ఆనందాన్నంతా యిచ్చిందికదా దూరాన్నించి! దార్ని మాట్లాడే వొదిలి వుండకూడదూ? జ్ఞానం, సత్యం అని దేవుళ్ళాడతారు యోగ్యులూ, నీతిపరులూ! సౌందర్యాన్ని ఆనందకరమైన భ్రమని వంపే జ్ఞానం యేం లాభం? వ్యభిచారిణి ప్రేమ తనదేనని? మోసపోయే భర్త, ఇంకొకడికి పుట్టిన బిడ్డని తనదేనని ప్రేమించే తండ్రి, లోకమంతా తన ఆజ్ఞలమీదనే నడుస్తోందని గర్వించే అధికారి, తాపి వొళ్ళుమరిచి చచ్చినవాళ్ళు బతికివున్నారని వూరటపొందే దుఖ్కితుడు, వీళ్ళందరికీ వాస్తవజ్ఞానం యేం వుపయోగం? ఈ లోకమంతా అశాశ్వతమని బోధించే ఉపనిషత్తులు; స్త్రీ సౌందర్యం రక్తమాంస మని రోత పుట్టింప చూసే నీతికావ్యాలు; నక్షత్రాలు, సూర్యుడు వుత్త నిర్జీవఅగ్ని జ్వాలలని నిరూపించే నూతన శాస్త్రము; గంగను ధరించి యెద్దునెక్కే శంకరుడు వుత్త చిత్తభ్రమ అని బోధించే rationists-వీళ్ళందరూ యెంత సౌందర్యాన్ని మింగేశారు?
    విరక్తి! విరక్తి! కొడుకెవడు, తల్లెవరు? భార్య యెవరు? అంతా మాయ! అని తత్వాలు పాడి, యీ లోక సుఖాన్నే ధ్వంసం చెయ్యాలని చూసే ప్రతివాణ్ణి కాల్చివెయ్యాలి. నిజంగా అక్కడ పువ్వంటేనేం? కాయితంవుండ వుంటేనేం? నాకు ఆనందమిచ్చేప్పుడు ఏదైతేనేం? అట్లా చూసుకుంటే, నిజమైన పుష్పం, విషయంలోకూడా ఆ యెర్రతనమూ ఆ మృదుత్వమూ నా మనసు కల్పించుకున్న గుణాలే. ఆగుణాలు నా మనసుని పుష్పంలో వున్నాయా? ఈ పంచేంద్రియాలే యీ దుఖాన్ని, భయాల్ని, యీ ప్రపంచ జ్ఞానాన్నీ కల్పించాయి. మనసు వాటి యింద్రజాలాలకి లోబడి కలలు కంటోంది. ఎందుకూ నిద్రలేపడం? కాని యీ యింద్రియా లేక్ ఆజ్ఞలు పెట్టగల మనసేవుంటే! ఆనందానుభవాల్నే తెప్పించుకోగల మనసే వుంటే! అదేనేమో స్వర్గం? ఒక కవి----
    ముళ్ళలో గులాబిపువ్వు వుందే అని ఆశ్చర్య పోతే, యింకో కవి-------
    గులాబిపువ్వు చుట్టూ ముళ్ళున్నాయే అని యేడుస్తాడు!


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS