Previous Page Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 6

 

    సీ.    మహిషవాహనుఁడు సమ్యగ్ధర్మపాలుండు
                      దారుణతర దీర్ఘ దండపాణి
        దువ్యాకాళిందీనదీ సోదరుఁడు నీల
                      వర్ణుండు కమలినీ వరసుతుండు
        గత జన్మ కర్మసంచితఫలదుఁడు యుధి    
                       షిరగురుఁ డమృతని షేచణుండు
        గంధవతీ మనఃకాసార సంచార
                       సంగతానంద చక్రాంగ విభుఁడు

    గీ.    విష్ణురుద్రాది భక్తీ వర్ధిష్ణు హితుఁడు
        దక్షిణేశుండు దర్మవిచక్షణుండు
        శమనుఁ డనుర క్తచిత్తుఁడై యమర మమ్ము
        నాయురారోగ్య యుక్తులఁ జేయుగాత!
            
                               నిరృతి

    సీ.    నరవహనుండు బంధుర ఖడ్గహస్తుండు
                వరచర్మధరుఁడు కర్భురశరీరుఁ
        డతులజగ ద్రక్షణంచత్కృ పానిధి
                చటులో గ్రయామినీ సంచరుండు
        సన్మార్గరోదిదుష్టని శాచర వ్రాత
                  వారకుం డురుబలాదారాకుండు
        నురుతర కుటిల నీలోన్నత కేశుండు
                   నికషావధూమణీ నిత్యరాతుఁడు

    గీ.    మహితబలవై భవోద్దండ మండితుండు
        కింకిణీరవ భూషణాలంకృతుండు
        మృదులవచనుండు నైరృతి మీకు నొసఁగు
        చిరతరారూడ బోగ విశేషములను.

                           వరుణుఁడు
    
    సీ.    మహనీయ సమదోగ్ర మకరవాహనుఁడు క
                   చ్చపమీనన క్రాడి జంతువిభుడుఁ
        పద్మినీమానస పంజర కీరంబు
                    ఫణగణాంచిత నాగ పాశధరుఁడు
        భీకరాకార గుంభిత కనత్కల్లోల
                    వారి సంభృత వార్ధి వల్లభుండు
        నూత్న తృణగ్రాహి రత్న విభూషితుం
                    డబిల జగద్వార్ష హర్షదాత

    గీ.    దుష్టనిగ్రహకారి యుత్కృష్ణ మహిముఁ
        డభయహస్తుఁడు కరుణారసార్ధ్ర హృదయుఁ
        డమృతజీవన మొనగూర్చి యన్వహంబు
        వరుణదేవుండు మిమ్ముఁ గాపాడుఁగాత.

                    వాయువు
    
    సి.    సకలభూత వ్రాత సంజీవనఖ్యాత
                   ముఖ్య మహా ప్రాణ మూర్తిధరుఁడు
        కర్పూర కస్తూరికా చందనాగరు
                    ధూపాది పరిమళ వ్యాపకుండు
        అత్మనుకూల మహావేగ మృగవాహ
                    నారూఢుఁ డభిల విశ్వాభియాయి
        విశ్వానర ప్రభుశాశ్వతసహవాసి
                    భీమాంజనేయుల ప్రియజనకుఁడు

    గీ.    పశ్చిమొత్తరమధ్య దిగ్భాగ నిరత
        పాలనోద్యోగి దేవతాప్రముఖుఁ డెపుడు
        వాయుదేవుండు చిరముగా నాయు విచ్చి        
        మంచి యారోగ్యమున మమ్ము మంచుఁగాత.


                           కుబేరుఁడు

    చం.    ఉనికట వెండికొండఁ దనయుండట రంభకు యక్షరాజు నా
        ధనపుఁ డనా బ్రసిద్దుఁడట దానవిభుండట పుష్పకంబుపైఁ
        జనునట పార్వతీపతికి సంగడికాఁడట యాత్మ సంపదల్
        పెనుపుగా నిచ్చి హెచ్చుగఁ గుబేరుఁడు మిమ్ము ననుగ్రహించుత.
    
                        ఈశానుఁడు

    సీ.    హిమశైల శిఖరోన్నత మహా వృషభవాహ
                    నాధిరోహణుఁడు విశ్వాది నేత
        నిరతార్దగాత్ర సన్నిహిత పర్వతరాజ        
                    పుత్రీద్వితీయానుభూతి రతుఁడు
        కైలాస పర్వతాగ్రనివాస పరితోషి
                     వరవీరగణవార పరివృతుండు
        సర్వభూతవ్రాత సర్వవిద్యాజాత
                    నిర్ణేత మహిత దృక్కర్ణభూషుఁ
    
    గీ.    డిష్టసఖుఁడు కుబేరుని కిందుధరుఁడు
        గగనకేశుఁ డతిస్వచ్ఛ కాంతితనుఁడు
        ఈశ్వరుండు మహానటుం డెల్లవేళ
        సర్వసౌఖ్యంబు లిడి మమ్ము సాఁకుఁగాక!
        
                          మరిడీ దేవత

    మ.    హరియైనా హరుఁడైన నింద్రుఁ డయినా అబ్జాసనుండైనని
        న్నేఱుఁగంజాలరు నీ మహామహిమ మా కెంచంగ శక్యంబటే
        పరదేవీ విషజాతి మారుతవల త్పాదద్వయా దూరమై
        మరిడీదేవత! మమ్ముఁ బ్రోవఁగదవమ్మా! పొమ్మ! మాయమ్మవై.

                            వటమూల మందిరా!
    
    ఉ.    చూపులు రెండు ముక్కుతుదఁ జొన్పియుఁ జూచినచూపు వెంటనే
        లోపలఁ జూచి చండకరులో శశిఁ గూర్చి చతుర్దళంబుపై
        దీపము వెట్టి దానితుది తేజము దానయి విశ్వమంతయు
        వ్యాపకుఁడై నపుణ్యుఁడు మహాత్ముఁడగు వటమూల మందిరా!
    
    ఉ.    కన్నులు మూసి నాదుమది కన్ను త్రికోణమునందుఁ జొన్పి లో
        సన్నపు దిడ్డి దూర్చి జలజంబులనిచ్చెన యెక్కి మింటిపై
        వెన్నెల రాజుఁ జేరి సుఖవేళ లయందును నీవు నేనయై
        యున్నను గాని నా హృదయ ముబ్బదయా వటమూలమందిరా!

    ఉ.    గట్టిగవెధలార్గురను ఖండనసేయక యేడుచింతలన్  
        గొట్టక మూడ్గురిండ్లు చెడఁగూల్పక (నీ పద) మబ్బునా భువిన్
        బొట్టును బోనమున్ దపము పోకులు బూడిదపూఁత లూరకే
        పెట్టును గాని నీదుదయఁ బెర్పడునా వటమూలమందిరా!
    
    ఉ.    వాలినయింద్రియాలయకవాటము లన్నియు మూసి నెమ్మదిన్
        దాళము వెట్టి లోవేలుఁగు తత్త్వము గన్గోని తట్టి సుందరిన్
        లాలిత నాగకన్య నుపలాలనచేసినవాఁడే యోగియౌ
        మాలిన వేషముల్ జముని మార్కొనునే వటమూలమందిరా!
    
    ఉ.    సాగినకోపవహ్ని నిజశాంతిజాలంబునఁ జల్లనార్చి యా
        శాగిరులన్ నివృత్తికులిశాహతి నుగ్గుగఁ జేసి యత్తమో
        నాగవిభున్ వివేకమృనాయకుడే నణఁగించి లోన సం
        యోగవియోగముల్ విడువ యోగియగున్ వటమూలమందిరా!

    ఉ.    వాలిన యింద్రియంపుఁ బెనువాతులకున్ మృదుగామందవా
        తూలవిలాసి నీ కుసుమతో యగుణంబుల వచ్చి చొచ్చినన్
        గ్రోలఁగనీక నెమ్మనము కుత్తుకవట్టి నినుం దలంచి యీఁ
        జాలినఁగాక మాటలఁ బ్రసాదములే వటమూలమందిరా!
       


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS