Previous Page Next Page 
బ్రహ్మ ప్రళయం పేజి 5

ఎందుకనీ!
రాజకీయాలంటే రౌడీయిజం!
రాజకీయాలంటే రంకుతనం!
రాజకీయాలంటే బ్రోకరేజి!
ఈ దేశంలో ఎన్నికలు ఒక ఫార్స్!
ఇక్కడి చట్టాలకి చెప్పలేనన్ని చిల్లులు!
ఇక్కడి హక్కులు మామూలు మనుషులకి ఎందుకూ పనికిరావు. రాలుగాయి రాజకీయవేత్తలు అల్లర్లు చేయించడానికి మాత్రం పనికి వస్తాయి...ఈ సోకాల్డ్ హక్కులు!
ఇక్కడి శాసనసభల్లో ప్రజల సమస్యల గురించి చర్చలు వుండవు - కుంభకోణాలు- ఆరోపణలు, అల్లర్లు, మైకులు విరగ్గొట్టడాలు, తొడ చరచడాలు, సవాళ్ళు - స్పీకర్ దగ్గరికి పరిగెత్తడాలు - లేదా బయటికి వాకౌటు!
అంతే!
మరి ప్రజల సమస్యలు? ప్రజల సమస్యలు ఎవరికీ పట్టవు!
ఇకపోతే కోర్టులు.
ఒక కింది కోర్టులో కేసుపెడితే, అది తీర్పుకి రావడానికి ఒక దశాబ్దం పడుతుంది! హైకోర్టుకి అపీలు కెళ్తే, ఒక జీవితకాలం చాలదు!
ఒక్క మాటలో చెప్పాలంటే -
ఈ సిస్టమ్ ఫ్యూజ్ అయిపోయింది.
అందుకే ఇంత కన్ ఫ్యూజను!
రాజకీయవేత్తలు ప్రతి రంగాన్నీ సమూలంగా నాశనం చేశారు.
అందుకని -
ఇంక మిగిలింది ఒక్కటే పద్ధతి!
అదే మిలిటరీ డిక్టేటర్ షిప్!
ఇవాళ నుంచి దేశాన్ని మా మిలిటరీ టేక్ ఓవర్ చేస్తోంది!
భయపడకండి! శాశ్వతంగా కాదు!
కేవలం ఆరునెలలు మాత్రమే!
ఆరు నెలల్లో ఈ దేశాన్ని భూతల స్వర్గంగా మార్చేస్తాం!
ఆ తర్వాత మళ్ళీ కన్నికలు పెడతాం. ఈసారి ప్రజలు నిజంగా మంచివాళ్ళని ఎన్నుకోవచ్చు. ఆ తర్వాత ఇంక ఎవరికీ ఏ విధమైన బాధలూ వుండవు!
చెప్పడం ఆపి, కర్చీఫ్ తో మొహం తుడుచుకున్నాడు ఫీల్డ్ మార్షల్ సర్వాధికారి.
మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు.
"పూర్తిగా మిలిటరీ పాలన అంటే ఎలా వుంటుందో అని ఎవరూ భయపడనక్కరలేదు - నిజమే! మేము డిసిప్లిన్ నేర్పించగలం కానీ పరిపాలనలో అంత అనుభవం వున్నవాళ్ళం కాదు. అందుకని, మాకు సలహాలు ఇవ్వడానికి ఒక సివిలియన్ కౌన్సిల్ వుంటుంది. దానికి చీఫ్ మిస్టర్ గంభీర్ ఐ.ఏ.ఎస్" అన్నాడు.
టీవీ కెమెరా గంభీర్ మొహం మీదికి ఫోకస్ అయింది.
గంభీర్ కి యాభై అయిదూ, యాభై ఆరేళ్ళు వుంటాయి. పేరుకి తగినట్లు నిజంగానే చాలా గంభీరంగా వున్నాడు.
కెమెరా తనవైపుకి తిరగ్గానే, అభివాదం చేశాడు గంభీర్.
సర్వాధికారి గొంతు మళ్ళీ వినపడడం మొదలెట్టింది.
"అడ్వయిజరీ కౌన్సిల్ లో వుండే మిగతా సభ్యులు... రాజేశం, రామ్ మనోహర్ మిశ్రా, శిరోమణి...
సర్వాధికారి ఒక్కొక్క పేరు చెబుతూ వుంటే, కెమెరా వాళ్ళ మొహం వైపు తిరుగుతోంది.
వాళ్ళలో ప్రతి ఒక్కడూ తాజాగా జైలునుంచి విడుదల అయి వచ్చిన వాడిలాగానో, లేదా జైలుకి వెళ్ళబోయే వాడిలాగానో వున్నారు.
యాంటీ సోషల్ ఎలిమెంట్స్!
వాళ్ళ మొహాలు చూస్తే చాలు, ఫీల్డ్ మార్షల్ సర్వాధికారి పెత్తనంలో వుండబోయే మిలిటరీ పాలన ఎలా వుంటుందో అర్థమైపోతోంది!
"వెల్! దటీజ్ దట్! సాయంత్రం మళ్ళీ నేను మిగతా వివరాలు చెబుతాను. అంతదాకా - మీ మేధావులందరికీ ఒక సూచన! ఎవ్వరూ తోకాడించకండి! ఎవరికయినా, ఏమైనా సందేహాలు ఉన్నాయా?"
వెంటనే చిచ్చర పిడుగులాంటి ఓ పిల్లాడు లేచి నిలబడ్డాడు.
"నాకో సందేహం?" అన్నాడు.
"ఏమిటది?" అన్నాడు ఫీల్డ్ మార్షల్ సర్వాధికారి.
అతని గొంతు కూడా అతని యూనిఫారం లాగే, గంజి పెట్టినట్టు చాలా ఖడక్ గా వుంది. అతని మనసు కూడా డిటో అనుకున్నాడు సాహస్.
"నాకు సందేహం వుంది! ఈ పేపర్ వెయిట్ విసిరితే నీ మొహం బద్దలవుతుందా?" అని అంటూ, అక్కడే వున్న ఒక పేపర్ వెయిట్ ని బలంగా టీవీ స్క్రీన్ వైపు విసిరాడు ఆ పదమూడేళ్ళ పిల్లాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS