Previous Page Next Page 
మంచివాడు పేజి 5

అతని అడ్రసు తన దగ్గిర లేదుగా? ఎలా పంపించడం? అతను తనని గురించి ఏమనుకుంటాడు? దొంగ అనుకుంటాడేమో? అనుకోనియ్! తను నిజంగా దొంగతనం చేశాడా ఏమన్నానా? మర్చిపోయాడు! అంతేగా? మనియార్డరు ద్వారా పంపాలంటే అతని అడ్రసు లేదాయె.
"అబద్ధం! నువ్వు మర్చిపోలేదు. కావాలనే దిగేశావ్.
"నువ్వు దొంగవు. ఘరానా దొంగవు" లోపల ఏదో అరిచింది.
"ఏయ్ నువ్వు నోర్ముయ్! నేనేం కావాలని మర్చిపోలేదు. నిజంగా నేను మర్చిపోయాను. ఇందులో దొంగతనం ఏముంది? అతనిమీద నాకూ జాలిగానే వుంది. ఇలా జరిగినందుకు బాధగానే వుంది."
బస్ మని తల ఎత్తిన అంతరాత్మ నెత్తిమీద ఒకటివేసి దాన్ని పడుకోబెట్టాడు రామం.

                                                          *    *    *    *
మళ్ళీ చివ్వున అంతరాత్మ తలఎత్తి "ఏం? ఆరోజు నన్ను కసిరికొట్టావుగా? నిజంగా మర్చిపోతే ఆ డబ్బు ఇప్పుడు ఇచ్చెయ్!" గట్టిగా అరిచింది!
దీని సిగతరగ ఇదొకటి మధ్యలో మాటకు ముందు నేను వున్నానంటూ బయలుదేరుతుంది.
"ఏడ్చావ్ లే నోరు మూసుకో! ఇప్పుడు నా దగ్గిర అంత డబ్బు ఎక్కడుంది?"
"ఇప్పుడు లేకపోతేనేం? అతన్ని ఇంటికి తీసుకెళ్ళు రేపు సర్దు."
"మంచిదానివే! దొంగ వేషం వాడూనూ! పక్కా దొంగలా కన్పిస్తున్నాడు."
"నీకంటేనా?"
"నువ్వు నోరుమూస్తావా లేదా?"
చెవులు గింగురుమనేలా నవ్వింది అంతరాత్మ.
"ఏమిటా పిచ్చినవ్వు?"
"దొంగ మంచివాణ్ని దొంగ అంటుంటేను..." మళ్ళీ నవ్వు.
"నేను దొంగనా? వాడు మంచివాడా ? ఎవరైనా వింటే నవ్విపోతారు."
"అవును. లోకం దృష్టిలో నువ్వు మంచివాడివే. నీకు చాలా మంచిపేరు వుంది. పరస్త్రీలను కన్నెత్తి (దొంగ చూపులు తప్ప) చూడవు. పదిమందిలో (రహస్యంగా తప్ప తాగవు. చాలా మంచివాడివి. ఎవరూ తెలుసుకోలేరనుకుంటే తప్ప దొంగతనం, రంకుతనం చెయ్యవు."
"నువ్వు నోరు మూసుకుంటావా లేక గొంతు పిసకమంటావా?"
"నా గొంతు వదిలెయ్! ఊపిరాడటం లేదు. నాకెందుకులే. నీ ఇష్టం వచ్చినట్టే చెయ్!"
"అలారా దారికి! మాటకు ముందు నేనున్నానంటూ బయలుదేరకు. జాగ్రత్త!"
"ఏరా రామం! ఒంట్లో బాగాలేదా? ఒళ్లంతా చెమట్లు పట్టిందేం?" రామం స్నేహితుడు ప్రశ్నించాడు.
రామం తృళ్ళిపడ్డాడు. "ఏదోరా కొంచెం గిడ్డీగా వుంది" అంటూ కర్చీపుతో ముఖం తుడుచుకోసాగాడు.
"వీరేనా మీ స్నేహితులు మద్రాసు వెళుతుంది?"
"మళ్ళీ తగలడ్డావ్?" అనుకున్నాడు రామం. "అవును" అని సమాధానం చెప్పాడు.
"ఇతనెవరు?" పైనుంచి కిందకు శల్యపరీక్ష చేస్తూ అడిగాడు రామం స్నేహితుడు.
"నాపేరు గోపాలం. ఒకప్పుడు బ్యాంకులో పనిచేసేవాణ్ని."
"మరి ఇప్పుడో?" రామం స్నేహితుడు అడిగాడు.
"నా వేషం కన్పించడంలా! ఇప్పుడు నిరుద్యోగిని, ఉద్యోగం పోయింది."
"ఏం, ఏం చేశావ్?"
ఏకవచన ప్రయోగానికి ఆశ్చర్యపోతూ ఓ నిముషం అతని ముఖంలోకి చూశాడు గోపాలం.
"క్యాష్ మూడువేలు పోయింది. ఇక్కడే, ఈ విజయవాడ నుంచి ఇదే బండికోసం ఎదురుచూస్తూ పోగొట్టుకున్నాను. ఆరోజే ఇన్ స్పెక్షన్ జరిగింది. వేరే డబ్బు తెచ్చిపెట్టే సమయం కూడా లేకపోయింది. మా బాస్ నోరు పారేసుకున్నాడు. కోపంతో నాలుగు తగిలించాను. ఉద్యోగం పోయింది. జైలుకు కూడా వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పటికి నా భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. దొంగతో కాపురం చెయ్యనని డైవోర్సుకు కోర్టుకు వెళ్ళింది." నవ్వుతూ చెప్పాడు గోపాలం.
రామం ముఖంలోకి చూశాడు.
"మీకు ఒంట్లో బాగా లేనట్లుంది. కాసేపు కూర్చోండి" అన్నాడు గోపాలం.
"అబ్బే! నాకేం లేదు. బాగానే వుంది." నంగినంగిగా అన్నాడు రామం.
"ఇంకా నయమే. అతను నన్ను గుర్తుపట్టలేదు. గుర్తుపడితే ఏం చేసేవాడో?"
రామం లోలోపల వణికిపోతున్నాడు.
బండి వచ్చింది. రామం స్నేహితుడు ఎక్కాడు. బండి కదలబోయేముందు రామం భుజంమీద చెయ్యివేసి "వస్తానండి రామంగారూ!" అన్నాడు గోపాలం.
రామం అదిరిపడి గోపాలం ముఖంలోకి చూశాడు. గోపాలం కదుల్తున్న బండి ఎక్కి, డోర్ దగ్గిర నిలబడి నవ్వుతూ చెయ్యి ఊపాడు.
రామం అప్రయత్నంగా రెండు చేతులూ జోడించి నమస్కరించాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS