ఇక రెండో వార్త ఆ సంస్థ ఎంత బోగస్ గా పనిచేస్తుందో రాశాడు.
అవార్డు ప్రకటించేనాటికి న్యూస్ ఎడిటర్ ఊళ్ళో లేడు. ఆయన వుంటే మాత్రం యివి పబ్లిష్ అయి వుండేవి కావు. అప్పుడు డెస్క్ హాండిల్ చేసే సీనియర్ సబ్ ఇలాంటి వార్తల్ని వేయడంలో జంకడు. కనుక ఈ రెండు వార్తల్ని వేసి, వాటిమధ్య కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వార్త సింగిల్ కాలమ్ బాక్స్ లో వేశాడు.
తెల్లవారేటప్పటికి ఆటంబాంబుల్లా అవి పేలాయి. ఆ శకలాలన్నీ తగిలింది సరితాదేవికి.
దాదాపు పది సంవత్సరాలుగా కాపాడుకుంటున్న పరువూ, ప్రతిష్టా అన్నీ ఒక్కసారిగా పేలిపోయాయి.
అందుకే మొదటిసారిగా ఒక వ్యక్తిని చంపాలన్న నిర్ణయానికి వచ్చింది ఆమె.
ఏదయినా అనుకుంటే దాన్ని సాధించేవరకూ ఆమెకి నిద్ర రాదు. వెంటనే గణపతిరాజును పిలిపించింది.
అతను ఫ్రొఫెషనల్ కిల్లర్! డబ్బు తీసుకుని ఎవరినయినా చంపడంలో అతను ఆరితేరినవాడు. దీనికోసం స్వంతంగా ఓ ముఠా కూడా నడుపుతున్నాడు.
తరుణ్ ఫోటోని చూపించి చెప్పింది సరితాదేవి. "ఇతను మొన్నటి వరకు రిపోర్టర్. ఇప్పుడు ఉద్యోగం పోయింది. నాలాంటి దానిమీద వార్త రాసినందుకు పనిలోంచి తీసేశారు. అయినా కసి చల్లారడం లేదు - వాడ్ని చంపాలి"
గణపతిరాజు, సరితాదేవిల మధ్య ఒప్పందం కుదిరింది. తరుణ్ ని హత్య చేసినందుకు లక్ష రూపాయలిస్తానంది. సరేనని వెళ్లాడు.
కానీ యింతవరకు తరుణ్ ని చంపేశామన్న వార్త రాలేదు. అందుకే ఆమె అసహనంగా తిరుగుతోంది.
అంతలో గణపతిరాజు వచ్చాడు.
పనికాకపోవడం వల్ల ఆమె ముఖంలోకి చూసే ధైర్యం లేకపోయింది.
"విషయం తెలిసి పారిపోయాడు వాడు. అందుకే...." నీళ్ళు నమిలాడు అతను.
ఆమె కాసేపు ఏమీ మాట్లాడలేదు. ఇంత చచ్చు వెధవ్వా నువ్వు అన్నట్టు చూసింది.
"ఇంతకీ దొరకలేదంటావ్! ఎవరికీ అనుమానం రాకుండా, రహస్యంగా ప్లాన్ వేసినా నువ్వు సక్సెస్ కాలేదంటే ప్లాన్ లోనే ఏవో లొసుగులు వుండాలి" అంది అటూ ఇటూ తిరుగుతూనే.
"అంతా వెదికాం. అతను ఇంట్లో లేకపోతే స్నేహితుల యిళ్ళన్నీ గాలించాం. ఎక్కడో లీక్ అయినట్టుంది విషయం. పారిపోయాడు."
"అలా చెప్పడానికి సిగ్గుగా లేదూ?"
గణపతిరాజుకి పౌరుషం వచ్చింది. తీసుకున్న అడ్వాన్స్ ముఖాన కొడదామనుకున్నాడు. కానీ లక్షరూపాయల బేరం. అందునా సరితాదేవితో వ్యవహారం అంతమంచిది కాదని వూరకుండిపోయాడు.
"నన్ను, నా జీవితాన్ని, నా బతుకుని బజారుకీడ్చిన ఆ రాస్కెల్, ఆ తరుణ్ ఇంకొక్క క్షణం కూడా ఈ భూమ్మీద వుండకూడదు" అతనిమీదున్న కసి ఆమె గొంతులో వ్యక్తమౌతోంది.
"ఆ పని నాకు వదిలేశారు కదా! ఇక నిశ్చింతగా వుండండి. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి - వాడ్ని పరలోకాలకు పంపి, మిగిలిన డబ్బు పుచ్చుకుంటాను"
"మన మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం వాడ్ని చంపినందుకు లక్షరూపాయలివ్వాలి. ఇప్పుడు చెబుతున్నాను మరో ఇరవై అయిదు వేలు కూడా ఇస్తాను"
గణపతిరాజు ఆనందం పట్టలేక విజిల్ వేయబోయి బలవంతంగా ఆ కోరికను అణుచుకున్నాడు.
డబ్బుతో జరగని పని వుండదని ఆమెకి తెలుసు. అందుకే సోఫాలో కూర్చోగలిగింది.
"మా వాళ్ళు వాడ్ని వెదుకుతూ వున్నారు. ఏ క్షణంలో కనిపిస్తే ఆ క్షణంలోనే వాడి పని ఆఖరు"
"ఓ.కె! స్వయంగా నువ్వే వెళ్ళు"
"ఆఁ విషయం చెబుదామనే యిటొచ్చాను. ఇప్పుడే వెళ్ళి మా వాళ్ళను కలుసుకుంటాను"
"అయితే నువ్వు వెళ్ళచ్చు!"
గణపతిరాజు అక్కడి నుంచి కదిలాడు.
"ఒక్కమాట" సరితాదేవి పిలవడంతో ఆగాడు.
"ఎలా చేస్తావో నాకు తెలియదు. విజయదశమికల్లా వాడ్ని చంపి తీరాలి. అంటే" అని క్యాలెండర్ దగ్గరికి నడిచి అందులోని అంకెలను పరిశీలించింది సరితాదేవి. కాసేపు దానిని పరికించి తిరిగి అతని దగ్గరకొచ్చి "ఖచ్చితంగా విజయదశమి నెలరోజులుంది. ఈలోగా వాడి చావుకబురు నాకు తెలియాలి" అంది.
"నెలరోజులు గడువిచ్చారన్న మాట! అన్ని రోజులెందుకు? ఒకటో రెండు రోజుల్లో పని అయిపోతుంది" నమ్మకంగా చెప్పాడు గణపతిరాజు.
"అంత తొందరగా చేస్తే సంతోషమే! విజయదశమి గడిచిన మరుసటి రోజుకి కూడా ఆ పని కాకపోతే నేనెంత సీరియస్ అయిపోతానో నాకు తెలియదు."
"అలానే! వాడ్ని చంపే మీకు కనబడతాను"
"ఓ.కే! గుర్తుపెట్టుకో. గడువు విజయదశమి" మరో మారు హెచ్చరించింది.
* * * * *
అనాథ మహిళా సదన్ లోకి రహస్యంగా ప్రవేశించిన తరుణ్ తన మీద బ్యాటరీ లైటు వెలుగు పడడంతో ఒక్కసారిగా అలెర్ట్ అయ్యాడు. చిన్న మూమెంట్ తో చెట్టుపక్కకి తప్పుకున్నాడు.
సెంట్రీ ఒకడుగు ముందుకువేసుంటే అతను కనిపించేవాడే. కానీ అనుమానం వచ్చిన సెంట్రీ అక్కడి నుంచి కదల్లేదు. కారణం అది అనాథ మహిళా సదన్ కావడమే. సాధారణంగా పురుషుడు అనేవాడెవ్వడూ లోనికి వెళ్ళకూడదు. అది నియమం. దాన్ని ఉల్లంఘించడానికి సెంట్రీ సాహసించలేకపోయాడు. బ్యాటరీని అటూ ఇటూ తిప్పి పరికించిచూశాడు గానీ ఎవరూ కనిపించక పోవడంతో అక్కడ్నుంచి కదిలాడు.
అదంతా చెట్టు చాటునుంచి గమనించిన తరుణ్ మెల్లగా పైకి లేచాడు. చుట్టూ పరికించి చూశాడు.
అక్కడ చాలా బిల్డింగ్ లున్నాయి.
చిన్న కాలనీలాగా. మధ్యనున్న ఎర్రమట్టి రోడ్డుకి అటూ ఇటూ ఇళ్ళున్నాయి.
అతను క్వార్టర్స్ లోకి వెళ్లడానికి సందేహించాడు. ఇంతరాత్రి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు. లోపలున్నవాళ్ళు భయపడి తనను పోలీసులకి పట్టివ్వచ్చు. అప్పుడు తన వునికి సరితాదేవి మనుషులకు తెలిసిపోతుంది. అందుకే ఇక్కడే బయటపడకుంటే సరిపోతుంది. తెల్లవారి ఏంచేయాలో నిర్ణయించుకోవచ్చని అటూ ఇటూ చూశాడు.
చివరనున్న ఇంటి వెనక పచ్చగన్నేరు చెట్టు పచ్చగా పెద్ద ముత్తైదువులా వుంది.
