ఇక మిగిలింది అతనితో పరిచయమే. పరమేశుదాసు సరైన వ్యక్తి అని నిర్ణయించుకున్న తరువాత నెల రోజులకి ఆయన అ టౌన్ కి వస్తున్నాడని తెలిసింది.
ఆయన ప్రోగ్రామ్ ఏమిటో తెలుసుకుంది. సాయంకాలం ఆరుగంటలకి గెస్ట్ హౌస్ లో కలుసుకోవడం మంచిదనిపించింది. మిగిలిన సమయాల్లో ఆయన చాలా బిజీగా వుంటాడు.
ఖచ్చితంగా ఆరుగంటలకి వెళ్ళింది. ఓ అమ్మాయి తనను కలుసుకోవడానికి వచ్చిందంటే వద్దనే మగవాడు ఈ భూ ప్రపంచంలో వుండడని ఆమె నమ్మకం. అందుకే ఎవరి ద్వారానో పరిచయం చేసుకోవడం కన్నా డైరెక్టుగా వెళ్లడమే మంచిదనుకుని వెళ్ళింది.
కాసేపటికి లోపలికి రమ్మని పిలుపొచ్చింది. దాసుకి ఏభై ఏళ్ళుంటాయి. ఆయన్ను చూస్తూనే సరస్వతీదేవికి శత్రువని, లక్ష్మీదేవికి మిత్రుడని తెలిసిపోతుంది. ఆయన మాట్లాడే భాష అంత దరిద్రంగా వుంటుంది. ఆయన వాడే సెంటునుంచి కారువరకు అంత విలాసంగా వుంటాయి.
అమాయకంగా, అంతకంటే అందంగా తన ఎదురుగ్గా నిలబడ్డ ఆమెను అదోలా చూసి కూర్చోమన్నట్లు సైగ చేశాడు ఆయన.
ఆమె ఎందుకొచ్చిందని రకరకాలుగా ఆలోచించాడు గానీ ఖచ్చితంగా ఆమె ఈ పనిమీద వచ్చుంటుందని ఆయన వూహించలేకపోయాడు. అలా మాట్లాడింది సరిత. చివరికి "నేనేదో రాచకార్యం కోసం ఇక్కడికి రాలేదు. మీరంటే గౌరవం. అందుకే చూసిపోదామని వచ్చాను" అంది.
ఈసారి వచ్చినప్పుడు మాత్రం మా ఇంటికి రండి అని చెప్పి వచ్చేసింది.
ఆమె వెళ్ళిపోయినా ఆమె వున్నట్లే దాసు ఫీలవడం ఆమె సాధించిన మొదటి విజయం.
మరి ఆమెకోసమే వచ్చాడో, నిజంగా ప్రభుత్వ పనులమీద వచ్చాడో గానీ మరో నెల తరువాత దాసు టౌన్ లో అడుగుపెట్టాడు.
పోయిన అవతారంలో ఇచ్చిన వరాన్ని ఈ అవతారంలో తీరుస్తున్న దేవదేవుడిలా చిరునవ్వు నవ్వి "మీ ఇంటికొస్తున్నాను రాత్రికి" అన్నాడు ఆయన సరితను చూస్తూనే.
రాత్రి తొమ్మిదిగంటలకి ఆమె ఇంటికి రహస్యంగా వెళ్ళాడు. అప్పటికి వున్నంతలో తన ఇంటిని శుభ్రంగా సర్దిపెట్టింది ఆమె.
చాలాసేపటి వరకూ మాటలు జరిగాయి గానీ అంతకుమించి ప్రొసీడ్ కావడానికి దాసుకే భయం వేసింది. ఆమె అంత గౌరవప్రదంగా మాట్లాడుతోంది మరి.
చివరికి వుండబట్టలేకపోయాడు.
డొంకతిరుగుడుగా అడిగాడు.
అయితే ఆమె మాత్రం డైరెక్టుగానే చెప్పింది "అన్నీ వున్నాయి నాకు. మంచి ఇల్లుంది. నెలకింత రాబడి వుంది. నన్ను అపురూపంగా చూసుకునే భర్త వున్నాడు. మరి నేనెందుకు ఒప్పుకుంటున్నానో తెలుసా? కేవలం మీ మీదున్న గౌరవంవల్లే"
"మంత్రి పదవి పొందడం కన్నా ఓ స్త్రీ మనసును గెలుచుకోవడంలోనే గొప్ప థ్రిల్ వుందని నాకిప్పుడు తెలిసింది" అన్నాడు దాసు.
నిజంగానే అలా ఫీలయ్యాడు.
ఆ రాత్రి ఆయన్ని సరిత మంచి మైదానాల్లో తిప్పింది. అగ్నిపర్వతాల లావాసెగ చూపించింది. నందివర్ధనాల చెట్టుకింద నిలబెట్టి పూలు పూయించింది. సముద్ర కెరటాల్లో ఉక్కిరిబిక్కిరి చేసింది. సంధ్యా సమయంలో పచ్చిక బయళ్ళలో విహారానికి తీసుకెళ్ళింది. ఇదంతా ఆమె పడకమీద నుంచే చూసిందంటే ఆమె ఎంతగా ఆయన్ని సుఖపెట్టిందో తెలుస్తుంది.
ఆ టెక్నిక్ కీ, ఆ హొయలకీ, ఆ సంభాషణా చాతుర్యానికీ, ఆ విలాసభరిత వీక్షణాలకీ ఆయన తన వయసునీ, తన అధికారాన్నీ - అన్నిటినీ మరిచిపోయాడు. తెల్లవారుజామున వెళుతూ "పదహారేళ్ళ కన్నెపిల్లతో ఓ రాత్రి గడపాలన్న కోరిక ఇన్నేళ్ళకి తీరింది" అన్నాడు. పాతిక సంవత్సరాల వయస్సున్న తనతో గడిపి ఆయన అలా అనడం అద్భుతమైన కామెంట్ గా ఆమె భావించింది.
మరో వారానికి ఆమెని హైదరాబాద్ రమ్మని దాసునుంచి కబురొచ్చింది.
"నీకేదో చేయాలని వుంది. అందుకే పిలిపించాను. ఇదిగో ఈ కాగితాల్లో సంతకం పెట్టు. స్వచ్ఛంద సేవాసంస్థను నీ పేరు మీద స్టార్ట్ చేయిస్తున్నాను. రిజిస్ట్రేషన్ వగైరాలు అన్నీ అయిపోయాయి. జర్మనీలో వున్న ఓ సంస్థ దీనికి ఫండ్స్ యిస్తుంది"
ఆమె సంతకాలు చేసింది.
"అన్నీ ఆలోచించే దీన్ని నీకు అప్పగిస్తున్నాను. అన్నిట్లోకి ఇది మంచిది. డబ్బుకి డబ్బూ, పేరుకి పేరూ వస్తుంది. ఎవరూ నిన్ను పట్టించుకోరు. తిన్నంత తిని, సేవ చేయగలిగినంత చెయ్" అని స్వచ్ఛంధ సేవాసంస్థను ఎలా నిర్వహించాలో, ఏమేం చేయాలో, ఏవిధంగా డబ్బు వస్తుందో, దానిని ఎలా ఖర్చు చేయాలో, ఎలా మిగుల్చుకోవాలో చెప్పాడు దాసు.
"మీరు సముద్రంలో దూకమన్నా దూకుతాను" అంది అంతా విన్నాక సరిత.
అలా సరిత స్వచ్ఛంధ సేవాసంస్థ ఒకదాన్ని ఏర్పాటుచేసింది. శిశువిహారాలను ఒకదాన్ని ఏర్పాటు చేసింది. జర్మనీ నుంచి రెండు జీపులొచ్చాయి. చాలా దేశాల నుంచి నిధులొచ్చాయి. సంవత్సరానికొకసారి -
"రూరల్ పూర్" మీదో, "అప్ గ్రేడ్ ఆఫ్ ది ఉమెన్" మీదో, "పిల్లల పోషణమీదో" సెమినార్ లు నిర్వహించేది. వాటికి తప్పనిసరిగా దాసు అధ్యక్షత వహించేవాడు.
వచ్చిన ప్రతిసారీ వెళ్ళేముందు ఆయన "పదహారేళ్ళ అమ్మాయితో..." అని చెబుతుంటే ఆమె చిర్నవ్వును పెదవులపై పూయించి వీడ్కోలు చెప్పేది. ఇలా అంచెలంచెలుగా ఆమె ఎదగసాగింది.
పిల్లల్ని కనడం సుతారమూ యిష్టంలేదామెకి. అందుకే యిప్పటికీ ఆమెకి పిల్లలు లేరు.
ఆమె సేవల్ని గుర్తించి ఇటీవల ఆమెకి ప్రభుత్వం "విశిష్ట సేవా అవార్డు"ను ప్రకటించింది. ఈ అవార్డును ప్రకటించనున్నట్లు ముందుగానే తరుణ్ పనిచేసే దినపత్రికవారికి తెలిసింది.
వెంటనే న్యూస్ ఎడిటర్ తరుణ్ కి కబురుచేసి పిలిచాడు.
"సరితాదేవి అవార్డు ప్రకటిస్తున్నారు. మన ఢిల్లీ రిపోర్టర్ ఫోన్ చేసి చెప్పారు. అవార్డు వచ్చింది గనుక ఆమె ఇంటర్వ్యూ వేద్దాం. అలాగే ఆమె సాధించిన అభివృద్ధిని కూడా రాద్దాం" అని చెప్పి ఆ పనిని తరుణ్ కి అప్పగించాడు న్యూస్ ఎడిటర్.
సరేనన్నాడు తరుణ్.
అతను ఏ పనైనా ఒప్పుకుంటే చాలా సిన్సియర్ గా చేస్తాడు. సరితాదేవి సంస్థ ఈ పదేళ్ళలో ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించిందీ, ఎంత ఖర్చు చేసిందీ, వచ్చిన నిధుల వివరాలన్నింటినీ సేకరించాడు.
శాంపుల్ గా గత సంవత్సరం ఈ సంస్థ అధ్వర్యంలో ఏం జరిగాయో, ఎంత ఖర్చు చేశారో కూడా సంపాదించాడు.
మొత్తం సమాచారం సేకరించుకున్నాక ఆమె ఏ స్థాయి నుండి ఎలా వచ్చిందీ వివరిస్తూ ఓ వార్త రాశాడు. అయితే ఆ వార్త కూడా ఆమె ప్రైవేట్ లైఫ్ కి సంబంధించింది కాదు. కేవలం ఆస్తుల వరకే పరిమితం అయ్యాయి.
