Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 7


    దానికిందకి వెళ్లాడు. బిల్డింగ్ కున్న సన్ సైడ్ క్రింద చెట్టు మొదట్లో పడుకున్నాడు. వర్షం వచ్చినా తనమీద పడే అవకాశం లేదు కానీ చలిగాలే ప్రాణాల్ని కొరికేస్తోంది. కానీ తప్పదు.

 

    నేలంతా చెమ్మ చెమ్మగా వుంది. లేచి ఏదైనా పేపర్ దొరుకుతుందేమోనని చూశాడు.

 

    చేతికందే దూరంలో తెల్లటి పేపర్ వున్నట్లు అనిపించింది. దాన్ని అందుకున్నాడు. అది పేపర్ కాదు - టవల్. క్వార్టర్స్ లో వున్నవాళ్ళు ఉతికి ఆరబెడితె కింద పడిపోయి వుంటుందని అనుకున్నాడు.

 

    దాన్ని కింద పరిచి పడుకున్నాడు.

 

    అలసిపోయిన శరీరాన్ని అలా నిద్రకు వేలాడదీయడం హాయిగా వుంది. ఆకలే పేగుల్ని కొరికేస్తోంది. అయినా భరించకతప్పదని కళ్ళు మూసుకున్నాడు.

 

    తను రూమ్ లో వున్నప్పుడు మధు రావడం - సరితాదేవి మనుషులు తనను చంపాలని వెదుకుతున్నట్లు చెప్పడం - వెంటనే తను పారిపోవడం - అన్నీ ఒక్కసారిగా కళ్ళముందు కదిలాయి.

 

    ఇలా అజ్ఞాతవాసంలో ఎన్నిరోజులుండాలి? మధు చెప్పినట్లు పదీ పదిహేను రోజులు చాలా? అప్పటికి సరితాదేవికి తనమీద కోపం తగ్గిపోతుందా? ఆమె కసి చల్లారకుంటే ఏం చేయాలి? తను ఒక్కడే ఎదుర్కోవాలి... తప్పదు. బాగా అలిసిపోయిన శరీరం నిద్రలోకి జారిపోయింది.

 

    అప్పుడు టైం కరెక్ట్ గా అయిదుగంటలు.

 

    తరుణ్ నిద్రపోయిన సమయంలో అక్కడున్న అమ్మాయిలంతా ఒక్కొక్కరే నిద్రలేస్తున్నారు.

 

    ఖచ్చితంగా ఉదయం అయిదుగంటలకు వాళ్ళ దినచర్య ప్రారంభమవుతుంది.

 

    అది విమలాబాయి అనాథ మహిళా సదన్.

 

    దాదాపు ఇరవై ఎకరాల స్థలంలో వున్న ఆ మహిళా సదన్ లో దక్షిణం వైపు పెద్ద గుమ్మడి పువ్వులాగా ఓ కుటీరం వుంది. అది విమలాబాయి నివాసం. ఆమే ఈ మహిళా సదన్ నిర్వాహకురాలు. ఎప్పుడూ తెల్లటి బట్టల్లో, చిరునవ్వుతో కనిపించే ఆమె అంటే అక్కడున్న వాళ్ళందరికీ భయమూ, భక్తీను.

 

    ఛాందోగ్యోపనినిషత్తులోని ఉద్ధాలకుని భూతాత్మ వాదం నుంచి వేదాంత దర్శనాల వరకు ఆమె అనర్గళంగా ఉపన్యసించగలదు. న్యాయ వైశేషిక ప్రతినిధి అయిన జయంతభట్టుకున్న వాగ్ధాటి ఆమె ప్రత్యేకత. అకలంకుడు, విద్యానందుడులకున్న తర్కపటిమ ఆమె సొత్తు. ధర్మశాస్త్రాలపై మేథోతిథి, కుల్లూక భట్టులకున్నంత జ్ఞానం ఆమె ఆస్తి.

 

    ఆమెకిప్పుడు నలభయ్ ఏళ్ళు. సాంప్రదాయాలకు, ఆచారాలకు ఆమె ఇచ్చే గౌరవం మరెవరూ ఇవ్వలేరు. సనాతన ధర్మాలను తు.చ. తప్పకుండా ఆచరించాలన్నది ఆమె అభిలాష.

 

    ప్రస్తుతం ప్రపంచంలో అంతా అశాంతి పేరుకుపోయింది. దర్మం, న్యాయం మచ్చుకయినా కనిపించడంలేదు. ఎక్కడ చూసినా పాపాలే, దీనికంతా కారణం పూర్వం మన పూర్వీకులు ఏర్పరిచిన కట్టుబాట్లను, ధర్మ సూత్రాలను మనం ఆచరించకపోవడమే.

 

    కాబట్టి మనం పూర్వీకుల అడుగుజాడల్లో వారిని స్మరిస్తూ నడవాలి. ఇదీ ఆమె నమ్మిన సిద్ధాంతం.

 

    తన ముప్ఫయ్యవ ఏట నుంచి దీన్ని ప్రచారం చేయడం ప్రారంభించింది. సంఘం సాఫీగా నడవాలంటే కులాలు వుండాలి. ఏ కులంవారు ఆ కులవృత్తినే విధిగా చేయాలి. క్షత్రియులే రాజ్యాన్ని పాలించాలి. ప్రజాతంత్ర వ్యవస్థ అంత బూటకం.

 

    రాజు వుండాలి. ఆ రాజు మన సంప్రదాయాలు అమలయ్యేట్లు చూడాలి.

 

    సంఘంలో కూడా కులవ్యవస్థ విధిగా కొనసాగాలి. మనది పవిత్ర దేశం, కాబట్టి స్త్రీలు ఈ విషయం మరిచిపోయి ఏవో ఉద్యోగాలంటూ బజార్నపడకూడదు. వితంతువులు మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదు. ఇలాంటివన్నీ సంఘంలో పెడధోరణులకు దారితీస్తుంది.    

 

    ఇవీ ఆమె ప్రచారం చేసిన సిద్ధాంతాలు.

 

    ఫెమినిజం అంటే ఆమెకు ఎక్కడలేని ద్వేషం. ఏమంటారు వీళ్ళంతా? స్త్రీలు, పురుషులూ సమానంగా వుండాలా? అది సాధ్యమయ్యే పనేనా? స్త్రీలు కనడం మానేసి దాన్ని పురుషులకు అప్పగిస్తారా? సృష్టిలోనే ఆ అసమానత వుంది. స్త్రీ చిన్నప్పుడు తల్లిదండ్రులు సంరక్షణలో, యవ్వనంలో భర్త కవచం కిందా, వృద్ధాప్యంలో పిల్లల చాటున సుఖంగా వుంటుంది. స్త్రీ మీద ప్రేమచేతనే మన పూర్వీకులు ఇలాంటి నియమాలు పెట్టారు. దీన్ని అధిగమించడమంటే స్త్రీలు వాళ్ళ పతనాన్ని వాళ్ళే కొనితెచ్చుకోవడం అన్నమాట.   

 

    ఈ విషయాలని సమర్థించడానికి పురాణ ఇతిహాల నుంచి ఎన్నో కొటేషన్ లు తెచ్చేది. సంస్కృతం శ్లోకాలతో ఆంగ్లంలో ప్రసంగిస్తుంటే అందరూ తాము మరిచిపోయేవారు.

 

    అస్పృశ్య నివారణకు, వితంతు వివాహాలకు పాటుపడిన గాంధీ, రాజారామ్ మోహన్ రాయ్, వీరేశలింగంలాంటి సంస్కర్తలను బాహాటంగానే వ్యతిరేకించేది.

 

    ఈ రోజు పాశ్చాత్యులు కనిపెట్టామన్న వాటిని మన పూర్వీకులు ఎప్పుడో కనిపెట్టారని ఆమె నిస్సందేహంగా బల్లగుద్ది మరీ చెప్పేది.

 

    ఆమె తత్త్వం నచ్చేవాళ్ళు బయల్దేరారు. పాశ్చాత్య నాగరికతతో ధ్వంసమైపోతున్న మన సాంప్రదాయాలను తిరిగి పునరుజ్జీవింపచేయడానికి వచ్చిన దూతలా ఆమెను భావించడం మొదలుపెట్టారు.

 

    ఆమెకు అన్నివిధాలా సహాయంచేయడం ప్రారంభించాడు. అయిదేళ్ళ క్రితం ఇక్కడ ఆమె తన నివాసం ఏర్పాటు చేసుకుంది.

 

    తన కుటీరం పక్కనే వృద్ధుల కోసం రెండు పెద్ద షెడ్లను నిర్మించింది. ఒకదానిలో పురుషులు, మరొకదానిలో స్త్రీలూ వుంటారు. ఈ వృద్ధుల ఆశ్రమానికీ, తన కుటీరానికీ మధ్య సభామందిరాన్ని నిర్మించింది. సాయంకాలం పూట ఇక్కడే ఆమె ఉపన్యసిస్తుంది.

 

    సభా మందిరానికి ఎదురుగ్గా కాస్తంత దూరంలో అనాథ మహిళా సదన్ ను ఏర్పాటు చేసింది. దీనిచుట్టూ ప్రత్యేకంగా అయిదు అడుగుల ప్రహారీ గోడను నిర్మించింది. మరీ పరిశీలించి చూస్తే తప్ప లోపలున్న అమ్మాయిలు కనిపించరు.

 

    వీటిపక్కనే వచ్చే జనం కోసం పది రూముల భవనాన్ని నిర్మించింది. అప్పుడప్పుడూ రాజకీయ నాయకుల్నుంచీ, చోటా ఆఫీసర్ల వరకు వస్తుంటారు. వచ్చి ఈమె చెప్పింది విని వెళుతుంటారు.

 

    ఇప్పుడు నిద్రలేచింది అనాథ మహిళా సదన్ లో వున్న అమ్మాయిలే. వీళ్ళంతా పాతిక సంవత్సరాల నుంచి ముప్ఫయి ఏళ్ళలోపు వారే. వీళ్ళల్లో చాలామంది వితంతువులు. వీళ్ళలో బాగా డబ్బున్న వాళ్ళు కూడా వున్నారు. వితంతువులకు చిత్త చాంపల్యం కలగకుండా, మరో పెళ్ళి చేసుకోవాలన్న ధ్యాస లేకుండా వాళ్ళను ఇట్టే మార్చే శక్తి విమలాబాయికి వుందని ఆమె అనుయాయులకు చాలా నమ్మకం.

 

    ఏదో ఖర్మకాలి వితంతువులయిపోయిన తమ కూతుర్లను, చెల్లెళ్ళను ఇక్కడ చేర్పిస్తుంటారు. ఇలా తన అనాథ మహిళా సదన్ లో చేరిన అమ్మాయిలకు సంవత్సరంపాటు శిక్షణ ఇస్తుంది విమలాబాయి. ఐహిక సుఖాలు మనిషిని ఎంత పాతాళంలోకి నొక్కేస్తాయో చెబుతుంది. సతీసహగమనం ఎంత గొప్పదో వివరిస్తుంది. వితంతువులు మళ్ళీ పెళ్ళి చేసుకుంటే, స్త్రీలు పురుషుడ్ని తక్కువ చేసి చూస్తే ఎంత అనర్థాలు జరుగుతాయో హృదయానికి హత్తుకునేటట్లు చెబుతుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS