Previous Page Next Page 
నానీ పేజి 4


    "డాక్టరువైపోవాలి."

 

    "ఎందుకు?"

 

    "తాతయ్య జబ్బు నయం చేయాలిగా."

 

    "అది ఇంక నయం కాదటగా?"

 

    "ఎవరన్నారు?"

 

    "మొన్న డాక్టరంకుల్ చెబుతుంటే విన్నాగా" క్షణం ఆగి "నేను పోలీసునైపోతాను" అన్నాడు.

 

    "దేనికి?"

 

    "దాన్ని జైల్లో పెట్టేస్తాను."

 

    'దాన్ని' అంటూ ఎవరినుద్దేశించి అన్నాడో తెలిసిన పావని అస్థిమితంగా కదిలింది. "తప్పు... అలా అనకూడదు."

 

    "ఎందుకు తప్పు... అదేగా నాన్నని పాడుచేసింది."

 

    ఆమె కళ్ళల్లో నిర్వేదంగా ఓ నీటిబొట్టు నిలిచింది. "ఎవర్నీ ఎవరూ పాడుచేయలేరు నాన్నా... కొన్ని జరగాల్సినవి అలా జరిగిపోతూంటాయి."

 

    "ఏం తెలీదు నీకు" అమ్మమాటలు అర్థంకానట్టు రోషంగా తాతయ్య గదిలోకి నడిచాడు.

 

    నిస్సత్తువగా తలనితిప్పి "ఏరా అల్లరి భడవా... బడికెళ్ళడం లేదటకదూ" అడిగాడు.

 

    "నువ్వు బాధపడ్డావా తాతయ్యా?"

 

    "ఆ... మరి బాధపడనా!"

 

    తలొంచుకున్న నానీ "ఈ వేళనుంచి వెళతాను తాతయ్యా! మరి నేనూ బాధపడుతున్నానుగా" అన్నాడు.

 

    "దేనికి?"

 

    "మనం ఏటిఒడ్డుకెళ్ళడంలేదుగా?"

 

    "అమ్మకూడా ఏరులాంటిదే అంటే ఒప్పుకున్నావు కదమ్మా! అప్పుడు అమ్మఒడిలో కూర్చుంటే ఏటిఒడ్డున ఉన్నట్టేగా."

 

    తల పంకించాడు చాలా అర్థమైపోయినట్టు.

 

    మరి తాటిపళ్ళో అనబోయి తాటిపళ్లకన్నా తాత తనకు ముఖ్యమనుకుని ఆగిపోయాడు.

 

    "ర్రేయ్ నానీ" గంభీరంగా అన్నాడాయన. నేను మంచం పట్టానని నువ్వు వేషాలు వేస్తే వూరుకోను వెధవకానా" అని "చెమ్డా లూడగొడతా. రోజూ ఉదయం సాయంకాలాలు నా గదిలోనే కూర్చోవాలి. నాకు నీ పాఠాలు అప్పచెప్పాలి. నే చెప్పే పాఠాలు వినాలి. అర్థమైందా?"

 

    తాతయ్య అంత ఉత్సాహంగా మాట్లాడుతుంటే అన్ని రోజుల బాధనీ మరిచిపోయిన నానీ అమాంతం తాతని చుట్టేసి "అలాగే తాతయ్యా" అన్నాడు.

 

    "ఏదీ ఓ నర్సరీరైమ్ చెప్పు. బాగా నటిస్తూ పాడాలి"

 

    "జాక్ అండ్ జిల్

 

    వెంటప్ ఏ హిల్

 

    టు ఫెచ్ ఏ పైలాఫ్ వాటర్"

 

    చేతులు తిప్పుతూ. తాతయ్యని సంతృప్తి పరచాలని ప్రయత్నిస్తూ ఆ పాటలోని భావమేదో తాతయ్యకి సంబంధించినట్టనిపించి ఆగిపోయాడు నీళ్ళు నిండినకళ్ళతో.

 

    "మరిచిపోయావట్రా భడవా... చూడూ... ఆ తక్కింది చెప్పేస్తా... జాక్ ఫెల్ డౌన్ అండ్ బ్రోక్ హిజ్ క్రేన్ అండ్ జిల్ కేమ్ డౌన్ టంబ్లింగ్ ఆఫ్టర్ హిమ్"

 

    ఈసారి చివరివాక్యం చెబుతూంటే విశ్వేశ్వరశాస్త్రి కంఠం వణికింది.

 

    "రా అమ్మా... బడికి టైమైంది" తల్లి పిలిచింది.

 

    సరిగ్గా అదే సమయంలో...

 

    విశ్వేశ్వరశాశాస్త్రంటే విపరీతమైన గౌరవభక్తులు గల కామందు శంకరయ్య హెల్త్ అసిస్టెంట్ కామేశ్వరి ఇంటికి వెళ్ళాడు.

 

    అసలు విషయం సేకరించడానికి ఆయనకి అన్నిరోజులు పట్టింది.

 

    చంద్రమనుకుని తలుపు తెరిచిన కామేశ్వరి ఎదురుగావున్న పెద్దమనిషిని చూసి కంగారుపడుతూనే "రండి " అంది.

 

    "రండా? ఓ.సి...! నేను కూర్చోవడానికి రాలేదే! నీ మైలగాలితో ఓ మహాత్ముడ్ని మంచం పట్టించావని మొహంమీద ఉమ్మేసిపోదామని వచ్చాను. థూ నీ యవ్వ" అంటూ నిజంగానే ఉమ్మేసి వెళ్ళిపోయాడు.

 

    పట్టించుకోలేదు కామేశ్వరి.

 

    మామూలుగా తుడిచేసుకుంది.

 

    వెళ్ళిన ప్రతి పంచాయితీలోనూ నదురుగావున్న వాడొకడితో కథ నడిపించి వాడి పంచకి నిప్పంటించడమూ. అక్కడ చలికాగడం పూర్తయ్యాక ట్రాన్స్ ఫరైపోతూ మరో పంచెకోసమో, పేంటుకోసమో వెదుక్కోడం ఆనవాయితీగా మార్చుకున్న ఆడది.

 

    ఈ మధ్యనే ట్రాన్స్ ఫర్లమీద మొహంమొత్తి జిల్లా పరిషత్తు చైర్మన్ తో మూడురాత్రులు గడిపి ఆ ముసలాయన మొదటి మూడురాత్రుల్ని మరిపించచేసేసింది.

 

    అదే కామేశ్వరి ధైర్యం...

 

    అయినా "ఒళ్ళొచ్చిన వూర్లో పళ్ళూడగొట్టించు కోవడం" పాడికాదని పాడిగేదెలా చంద్రంతో పర్మనెంటుగా సెటిలైపోదామని ఇప్పుడు శంకరయ్య లాంటివాడు ఛీ కొట్టి వెళ్ళేసరికి ముందుకొట్టొచ్చిన చంద్రాన్ని పాములా చుట్టేసుకుని బావురుమంటూ ఏడ్చింది.

 

    పల్లెలవారీగా ఎంతమంది ఆడపిల్లల కాపురాలు కూల్చిందీ, ఎంతమంది మగాళ్ళతో సంబంధాలు పెట్టేసుకుని వాళ్ళలో వాళ్ళు తలలు పగలగొట్టుకునేటట్టు నాటకాలు నడిపిందీ చెప్పని కామేశ్వరి కట్టుకోకపోతే తలకొట్టుకు చస్తానూ అంటూ శంకరయ్య హెచ్చరిక గురించి చెప్పేసిందికూడా.

 

    అంతకుపూర్వమే విషం తలకెక్కిన చంద్రం తండ్రి మంచంపట్టినదానికన్నా ఎక్కువ కదిలిపోయాడు. ఓ అరగంటసేపు కామేశ్వరితో గడిపి బయటికివస్తూచూశాడు.

 

    సరిగ్గా అతడు బయటికి వచ్చేవేళకి పావని, నానీ ఇంటిముందునుంచి వెళుతున్నారు.

 

    భర్తకళ్ళల్లోకి ఓ క్షణంపాటు చూసి తలతిప్పుకున్న పావని నానీ కళ్ళల్లోకి సైతం చూడలేకపోయింది.

 

    నానీని స్కూలుదగ్గరదింపి ఇంటికి వచ్చేసరికి సిద్ధంగా వున్నాడు చంద్రం.

 

    "ఏమే... ఏబ్రాసి మొహందానా! స్కూలుకెళ్లడానికి బోలెడన్ని తోవలున్నా ఆ ఇంటి ముందునుంచే వెళ్ళడంలో నీ వుద్దేశ్యమేంటే?" అన్నాడు పిడికిలితో జుట్టుపట్టుకుని.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS