Previous Page Next Page 
అనైతికం పేజి 5


    సూర్యమ్ అంగీకరిస్తున్నట్టు - "సాక్షి భారతీయ ఫిలాసఫీ చదువుకుందని ఆమె తరఫు న్యాయవాది ప్రస్తావించడం వల్ల నేనీ ప్రశ్న వేయవలసి వచ్చింది. అదే విధంగా ఇస్లాంలో ప్రవక్త 'స్త్రీ పురుషుడి పక్క ఎముక నుంచి సృష్టించబడింది' అని చెప్పడం కూడా సత్యదూరం కాదు. షాబానో కేసులో జడ్జిమెంటులోని ఒక వాక్యాన్ని భారతీయ ముస్లిం మతాధిపతులు తప్పుపట్టారు. స్త్రీ అంత నాజూకైందని, అందుకనే ఆమెను జాగ్రత్తగా, అపురూపంగా చూసుకోవాలని ప్రవక్త అన్నాడు. 'వుమన్' అన్న పుస్తకంలో రచయిత చెప్పిందదే. అంతే తప్ప సాక్షి చెప్పినట్టు స్త్రీని సరిచెయ్యాలనుకుంటే అది విరిగిపోతుందని మహమ్మద్ ప్రవక్త ఉద్దేశ్యం కాదు. గౌరవనీయురాలైన న్యాయవాది కూడా ఈ పుస్తకాన్ని తప్పుగా అర్థం చేసుకుందని చెప్పడానికి విచారిస్తున్నాను. 250 సంవత్సరాల క్రితం స్త్రీ హక్కుల పరిరక్షణోద్యమం ప్రారంభమైన మాట నిజమే! అయితే ఈ రెండువందల యాభై సంవత్సరాల్లోనూ స్త్రీ పరిస్థితి మరింత దిగజారిందని మాత్రమే రచయిత ఆవేదన వెలిబుచ్చాడు. హక్కుల పరిరక్షణకోసం పురుషుడితో యుద్ధం చేయవలసి వస్తే అందులో ఓటమి తప్పదని సోదాహరణంగా వివరిస్తూ ఆటవిక న్యాయాన్ని ఉదహరించాడు. ఇక్కడ పురుషుణ్ణి అడవిలోని ఒక బలమైన జంతువుగా వర్ణించాడు. హక్కుల పరిరక్షణోద్యమం కేవలం ఉపన్యాస వేదికలకీ, కవితలకీ, కథలకీ మాత్రమే పరిమితమవుతుందని ఎన్నో గణాంకాలతో సహా నిరూపించాడు. స్త్రీ పురుషులు పరస్పరం ఒకరిమీద ఒకరు ఆదారపడవలసిన జీవులని, హిందూయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, జైనిజం, బుద్ధిజం మొదలైన మతాలన్నీ నొక్కి వక్కాణిస్తున్నాయని రచయిత చెప్పిన అభిప్రాయాన్ని "అవివాహితురాలైన" న్యాయవాది అర్థం చేసుకోక పోవడంలో తప్పులేకపోయి వుండవచ్చు" అన్నాడు.

 

    "అబ్జెక్షన్ మిలార్డ్!" అంటూ మళ్ళీ లేచాను.

 

    జడ్జి కల్పించుకుని "మీకు వివాహమైందా?" అనడిగింది.

 

    "లేదు మిలార్డ్!" అన్నాడు సూర్యమ్. "ఆ మేరకు అదృష్టవంతుణ్ణి". కోర్టు హాల్లో నవ్వులు వినిపించాయి. నాకు చిరాగ్గా అనిపించింది. ఒక క్లిష్టమైన సమస్యని అందరూ ఇంత తేలిగ్గా ఎందుకు తీసుకుంటున్నారో అర్థంకాలేదు.

 

    సూర్యమ్ తనవైపు సాక్షుల్ని ప్రవేశపెట్టాడు. మొదటిసాక్షి డాన్ బట్లర్. లండన్ ఉత్పత్తిదారుల సంఘపు అధ్యక్షుడు.

 

    "ఒకే ప్రశ్న! ప్రసూతి సమయంలో స్త్రీకి మూడు నెలల పాటు సెలవు ఇవ్వాలి అన్న జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మీ ప్రతిస్పందన ఏమిటి?"

 

    "యవ్వనంలో వున్న స్త్రీలని, అప్పుడే వివాహమైన వారిని మేము ఇంటర్వ్యూ సమయంలోనే ఏదో ఒక వేరే కారణం చెప్పి నిరాకరిస్తున్నాం".

 

    కోర్టులో ఇబ్బందికరమైన నిశ్శబ్దం నాట్యం చేసింది. తర్వాతి సాక్షిగా ప్రముఖ మానసిక శాస్త్రవేత్త జేమ్స్ ని పిలిచాడు.

 

    "ఒక గదిలోకి అపరిచితుడు ప్రవేశిస్తే రెండు నెలల పసి పిల్లల ప్రతిస్పందన గురించి మీరు చేసిన రిసెర్చ్ వివరాలు చెప్తారా?"

 

    "పాపైతే తాగుతున్న పాలసీసాని వదిలి ఆగంతకునివైపు చూస్తుంది. మగపిల్లవాడైతే పట్టించుకోడు".

 

    "వయస పెరిగేకొద్దీ ఈ తేడా తగ్గుతుందా? పెరుగుతుందా?"

 

    "నాలుగు నెలల వయసులో... భయమేసినప్పుడు గానీ, లేదా కొత్త పరిసరాల్లోగానీ ముప్పైశాతం మగపిల్లలు ఏడిస్తే, అరవైశాతం ఆడపిల్లలు ఏడుస్తారు".

 

    క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభిస్తూ "పై ఉదాహరణలు మీరింత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు?" అని ప్రశ్నించాడు.

 

    "న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో దాదాపు వెయ్యిమంది పసిపిల్లల మీద మేమీ ప్రయోగం జరిపాము. జెరోమ్ అనే శాస్త్రవేత్త కోతులమీద కూడా ఈ ప్రయోగం జరిపి లైంగికభేదానికీ, మనస్తత్వానికీ ప్రగాఢ సంబంధం వుందనీ, అది పుట్టినప్పటినుంచీ ప్రారంభమవుతుందనీ సహేతుకంగా నిరూపించాడు".

 

    కోర్టువారి అనుమతితో ఒక పాపని ప్రవేశపెట్టాడు సూర్యమ్. ఆ పాప వయసు పన్నెండు సంవత్సరాలుంటాయి.

 

    "నీకు తొలి సెక్స్ అనుభవం జరిగి ఎన్నాళ్ళైంది?"

 

    నేను అబ్జెక్షన్ చెప్పబోతున్నంతలోనే సూర్యమ్ జడ్జితో "నేను చెప్పబోయే విషయానికీ, ఈ ప్రశ్నకీ దగ్గర సంబంధం వుంది మిలార్డ్! ఇన్ కెమెరాలో సాక్షిని ఏకాంతంగా విచారణ జరుపుతానన్నా నాకు అభ్యంతరం లేదు. కాని నా సాక్షి తనంతట తానే ఈ వివరాలన్నీ ప్రపంచానికి వెల్లడి చేయాలనుకుంటోంది' అన్నాడు.

 

    "ప్రొసీడ్"

 

    "రెండు సంవత్సరాలు" జవాబిచ్చింది పాప.

 

    "అంటే పదేళ్ళ వయసులో".

 

    "అవును".

 

    కోర్టులో గుసగుసలు ప్రారంభమయ్యాయి.

 

    "నీ కెంతమంది బాయ్ ఫ్రెండ్స్ వున్నారు?"

 

    "దాదాపు పదిమంది" నిర్భయంగా చెప్పంది.

 

    "నువ్వు సంతృప్తిగా వున్నావా?"

 

    "లేను" అన్నది.

 

    ఆ పరిస్థితుల్లో కూడా నాకా అమ్మాయి సమాధానాలు ఆశ్చర్యంగా అనిపించాయి. వయసుకు ముందే ఎక్కువ మెచ్యూర్ అయినట్టు అనిపించింది. రకరకాల అనుభవాలు బహుశా ఆ అమ్మాయిని అలా రాటుదేలేలా చేసి వుంటాయి.

 

    "నీ అసంతృప్తికి కారణం ఎవరని నీ ఉద్దేశ్యం?"

 

    "నా తల్లి"

 

    కోర్టులో ఒక్కసారిగా కుతూహలంతో కూడిన స్తబ్దత ఆవరించింది.

 

    "నీ తల్లిని ఏ విధంగా మూలకారణం చేయగలవు?"

 

    "నా తల్లి ఒక సేల్స్ డైరెక్టర్. నెలకి ఇరవైరోజులు దేశమంతా తిరుగుతూ వుంటుంది. దానితో నా తండ్రి ఒక తాగుబోతుగా మారాడు. చిన్నతనం నుంచీ ఇంట్లో ఒక్కదాన్నే వుండవలసి రావడంతో పక్కింటి యాభై ఏళ్ళ అంకుల్ చూపించిన అభిమానాన్ని ప్రేమనుకున్నాను. ఆ తర్వాత పధ్నాలుగేళ్ళ రాబర్ట్, అంకుల్ కన్నా అందంగా తోచాడు".

 

    "దట్సాల్ మిలార్డ్".

 

    క్రాస్ చేయడానికి ఏమీలేనట్టు నేను తల అడ్డంగా వూపాను.

 

    ఆ తర్వాతి సాక్షి విలియమ్స్.

 

    "ప్రఖ్యాత సినీతార గ్రేటా గార్బోకీ, మీకూ వున్న సంబంధం ఏమిటి?"

 

    "ఆవిడ జీవిత చరిత్ర నేను రాస్తున్నాను".

 

    "ఆమె గురించి కొంచెం చెప్పగలరా?"

 

    "1930 ప్రాంతంలో గ్రేటా గార్బో యువకుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తించింది. ఆ స్వీడిష్ నటీమణి నికర ఆస్తులు వేయి మిలియన్ డాలర్లకు పైగా వుంటాయని అంచనా. ఆమె ఆటోగ్రాఫ్ ఒకదాన్ని వేయిపౌండ్లు పెట్టి ఒక అభిమాని కొనుక్కొన్నాడన్న ఒక్క ఉదాహరణ చాలు".

 

    "1930 సెప్టెంబర్ 18వ తారీఖున ఏం జరిగింది?" సూర్యమ్ ప్రశ్నించాడు.

 

    "ఆమె తన డెబ్భై అయిదవ పుట్టినరోజు జరుపుకుంది. ఎవరూ లేకుండా ఒక్కత్తే హాల్లో 75 కొవ్వొత్తుల్ని ఆర్పింది. తర్వాత నిశ్శబ్దంగా రోదించసాగింది. తన జీవిత చరిత్రని నాకు చెప్పి ఈ సంఘటన గురించి వివరిస్తూ చుట్టూ వున్న ఆకర్షణల్ని చూసి అదే జీవితమని భ్రమపడి నేను చేసిన ఒకే తప్పు వివాహం చేసుకోకపోవడం" అంది.

 

    తర్వాత సాక్షి ఒక సగటు బ్రిటీష్ వనిత.

 

    "మీ వివాహం జరిగి ఎన్నాళ్లైంది?"

 

    "పదేళ్ళు".

 

    "మీరెంతకాలం నుంచి ఉద్యోగం చేస్తున్నారు?"

 

    "పన్నెండు సంవత్సరాలనుంచి".

 

    "అంటే వివాహం జరగడానికి రెండు సంవత్సరాల ముందునుంచీ" అన్నాడు సూర్యమ్. "మీరు ఉద్యోగం ఎందుకోసం చేస్తున్నారు?"

 

    "ఆర్థిక అవసరాల కోసం".

 

    "ఆ అవసరం లేకపోతే మీరు ఉద్యోగం చేయరా?"


    
    "నేను పొద్దున్నే లేవగానే దేవుణ్ణి ప్రార్థిస్తుంటాను. ఏదో ఒక అద్భుతం జరగాలని నాప్రార్థన. నా సంసారం, ఇల్లు, పిల్లలు చూసుకుంటూ వుండిపోతే అంతకన్నా కావలసింది మరేమీ లేదు".

 

    ప్రశ్నించడానికి నాకు మంచి పాయింట్ దొరికింది. లేచి సాక్షి దగ్గరకి వెళ్ళాను.

 

    "ఉద్యోగంలో మీకేమీ ఆనందం లేదా?"

 

    "మొదట్లో వుండేది. ఇప్పుడేమీలేదు".

 

    "మీదంటూ కొంత సంపాదన వుండడంవల్ల మీకు తృప్తి లభించడం లేదా?"

 

    ఆమె కాస్త తటపటాయించి "లభిస్తోంది" అంది.

 

    సూర్యమ్ వైపు ఒకసారి చూడాలన్న కోరికని బలవంతంగా అణచుకున్నాను. "వివాహం జరిగిన వెంటనే మీరు ఉద్యోగం మానేశారనుకోండి. అదృష్టవశాత్తు మీ భర్త మంచివాడు కాబట్టి సరిపోయింది. అదే ఏ తాగుబోతో, మరో స్త్రీ పట్ల మోజు వున్నవాడో అయి మిమ్మల్ని ఈ క్షణం వదిలిపెడితే మీరేం చేసి వుండేవారు?"

 

    సాక్షి సమాధానం చెప్పలేదు. నేను కొనసాగించాను.

 

    "పదేళ్ళపాటు మిమ్మల్ని ఒక చెరుకులాగా వాడుకుని పీల్చి పిప్పిచేసి ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత వదిలేస్తే అప్పుడు మీకు ఈ ఉద్యోగం తప్ప మరే దిక్కు వుండేది?"  

 

    సూర్యమ్ లేచి "ప్రశ్నకీ, మన కేసుకీ ఏ సంబంధమూ లేదు మిలార్డ్" అన్నాడు.

 

    "ఉంది" ఆవేశంగా అన్నాను. "స్త్రీ పురుషులిద్దరూ సమానంగా చదువుకుని ఒక వివాహ బంధంలో ప్రవేశించినప్పుడు ఉద్యోగ బాధ్యతల్ని పురుషుడు, సంసార బాధ్యతల్ని స్త్రీ స్వీకరిస్తే, పది సంవత్సరాలు గడిచి ఆ స్త్రీ నిర్వీర్యమైపోయినప్పుడు, భర్త ఆమె నొదిలేస్తే అప్పుడామె పరిస్థితి ఏమిటి? ఉద్యోగానికి రక్షణ వున్నట్టు, సంసారానికి లేదు కదా!"

 

    కోర్టు హాల్లో చప్పట్లు వినబడ్డాయి. ఈ లోపులో సూర్యమ్ వెళ్ళి జడ్జికి ఒక పుస్తకాన్ని అందించాడు.

 

    "ఏమిటిది?" అడిగిందామె.

 

    "బెర్ట్రండ్ రస్సెల్ ఆత్మకథ మిలార్డ్. అందులో 161వ పేజీలో అతడు తన భార్యల గురించి రాశాడు" అని, జడ్జి ఆ పుస్తకాన్ని తిరగేస్తుండగా తాను కొనసాగించాడు. "బెర్ట్రండ్ రస్సెల్ తన నోబుల్ బహుమతిలో సగం మొత్తాన్ని మొదటి భార్యకీ, మిగతా సగాన్ని రెండో భార్యకీ ఇచ్చి, మూడవ భార్యతో సాధారణ జీవితం గడపవలసి వచ్చింది" అని రాసుకున్నాడు.

 

    "మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నందుకు ఆ మాత్రం శిక్ష పడాల్సిందే". వెనకనుంచెవరో అన్నారు. కోర్టు హాల్లో నవ్వులు. సూర్యమ్ తొణక్కుండా "నేను చెప్పేది అదే మిలార్డ్! రస్సెల్ కన్నా అతడిని వదిలిపెట్టినందుకు అతడి భార్యలు ఎక్కువ సంపాదించారు" అన్నాడు.

 

    అతడి వ్యాఖ్య పట్టించుకోకుండా నేను సాక్షిని ప్రశ్నించడం కొనసాగించాను. మీరు పన్నెండు సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నారు. పురుషుల నుంచి ఏ విధమైన మానసిక, భౌతిక అత్యాచారాలూ ఎదుర్కొనలేదా?"

 

    "ఉద్యోగంలో అవి తప్పవు. మన జాగ్రత్తలో మనం ఉండాలి".

 

    "స్త్రీలందరూ సంఘటితమై తమ హక్కుల పరిరక్షణ కోసం పోరాడాలని మీకెప్పుడూ అనిపించలేదా?" సూటిగా ప్రశ్నించాను.

 

    "ఎలా పోరాడాలి?" అమాయకంగా అడిగింది.

 

    వెంటనే మాట్లాడబోయి ఒక్కక్షణం ఆగాను. ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. "సాక్షులు ఎదురు ప్రశ్నలు వేయకూడదు. కేవలం అడిగినదానికి సమాధానం చెప్పాలి" అన్నాను.

 

    సాక్షి సమాధానం చెప్పలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS