"అప్పుడేమో సరిగ్గా చూడక 'ఇదో పీడ' అని పంపించి వేశారు. ఇప్పుడు అవసరం రాగానే ఆ పీడా కావాల్సి వచ్చిందంటావా, పంపొద్దమ్మా" అంది పావని ఆవేశంగా.
"పంపవద్దంటే ఎలా కుదురుతుంది పావనీ? వాళ్ళ తల్లి జబ్బుతో ఉంటే సుందరి కాకపోతే మరెవరు చూసే వాళ్ళుంటారు చెప్పు. మనం మన సౌఖ్యం మాత్రమే చూసుకోవడం తప్పు" అంది అరుంధతి.
స్త్రీ "పనికోసం" అన్న భావన మొదటిసారి కలిగింది పావనికి.
"ఇన్నాళ్ళూ ఆవిడగారు ఉద్యోగానికి వెళితే ఇంటినీ, పిల్లల్నీ అమ్మ చూసుకునేది. అప్పుడేమో నేనో అదనపు బరువయ్యాను. ఇప్పుడు అమ్మ మంచాన పడగానే నేను గుర్తొచ్చాను. నాకు అమ్మను చూసుకునే టైమే వుండదు. వాళ్ళ పిల్లల పని, వంటపనితో సరిపోతుంది. 'అమ్మ' అన్నదీ కేవలం వంక మాత్రమే" అంది సుందరి.
"మరయితే రానని చెప్పి పంపేసేయ్ పిన్నీ!"
"నేనెలా చెప్తాను? ఈ ఇంటిలో ఉండే హక్కు నాకు లేదు."
"అలా మాట్లాడతావేం సుందరీ! అయినవాళ్ళకు అవసరమైనప్పుడు పంపకపోతే మమ్మలనే అంటారు, నిన్ను పంపమని చెప్పే హక్కు మాకెక్కడుంది. నిష్టూరంగా మాట్లాడకు" అంది అరుంధతి.
అప్పుడర్ధమయింది పావనికి. సుందరికి వెళ్ళడం యిష్టంలేదు. కానీ విశ్వపతి, అరుంధతి సంఘానికి భయపడి వెళ్ళమంటున్నారు. బలవంతంగా పంపుతున్నారు.
"ఒకప్పుడు నన్ను బావకిచ్చి పెళ్ళి చేయడానికి ఈ అన్నయ్యే సిద్దపడ్డాడు. పెళ్ళిచేసుకుని నేనీ ఇంటికొస్తే ఏం చేసేవాళ్ళు? అత్తిల్లు వదిలి వచ్చి అమ్మను చూసుకోమనే వాళ్ళా?"
"అది జరిగితే నీ తరపున వాదించే హక్కు నాకుండేది, ఇప్పుడు పరిస్థితి అదికాదు. నువ్వు వెళ్ళక తప్పదు సుందరీ. మీ అన్నయ్య ఎంత అధమస్థితికి దిగజారి మాట్లాడాడో నీకు తెలీదు" విశ్వపతి గుమ్మంలోంచే అన్నాడు.
రాత్రి పడుకున్నప్పుడు తన బాధ వెళ్ళబోసుకుంది సుందరి.
"ఆ ఇంట్లో నాకు గౌరవం ఉండదు పావనీ! ఇక్కడ- ఒకరికి బరువుగా ఉన్నాననే ఆలోచనే నాకు రాదు. మీరూ అంతటి స్థానాన్ని యిచ్చారు. అక్కడ అలా కాదు. వదిన ఏం చెప్తే అలా చేయాలి. భోజనం కూడా ఆవిడ చేయమన్నప్పుడు అదీ ఏం పెడితే అది తినాలి. ప్రతిక్షణం నరకం ఆ యింట్లో."
"నేను వెళ్ళను అంటే వాళ్ళేం చేయగలరు?" ఆవేశంగా అంది పావని.
"మీ నాన్నకూ, నాకూ లోపాయికారి సంబంధం వుందంటారు. పెళ్ళి చేసుకుంటే ఆస్థి రాసివ్వాల్సి వస్తుందని ఇలా వుంచుకున్నాడంటారు" చీకట్లోకి చూస్తూ భావరహితంగా అంది సుందరి.
* * *
సుందరి వెళ్ళిపోయాక గానీ ఆమె లేని వెలితి పూర్తిగా తెలిసి రాలేదు. విశ్వపతి స్కూలుకి వైస్ ప్రిన్సిపాల్ అయ్యాడు. సుందరి ఉన్నప్పుడు ధీమాగా స్కూలు బాద్యతంతా తనమీద వేసుకున్నాడు. ఇప్పుడు వదిలించుకునే అవకాశం లేదు. పావనికి క్షణం తీరిక లేకుండా చేసినా పని తరగడంలేదు. అటు కాలేజీ చదువు, ఇటు ఇంట్లో పనితో సతమతమయిపోతోంది. ఎప్పుడూ లేనిది తమ్ముడు, చెల్లెళ్ళ మీద విసుక్కుంటోంది. ఒక సాయంత్రం తన బాధంతా శైలజ దగ్గర వెళ్ళబోసుకుంది.
"మీ నాన్నగారు సుందరిని పంపనని గట్టిగా చెపితే బాగుండేది" అంది శైలజ.
"ఆయనెలా చెప్తారు?"
"ఎందుకు చెప్పగూడదు? సుందరికి వెళ్ళడం అసలు యిష్టం లేదు. ఆమె మేజర్ కాబట్టి బలవంతం చేసి వాళ్ళన్నయ్య తీసుకెళ్ళలేడు. మీ ఆసరా కొంత ఉంటుందనిపిస్తే ఆమె తప్పకుండా వాళ్ళన్నయ్యతో దెబ్బలాడగలిగేది. ఆ స్త్రీని మీరో మిషన్ లా వాడుకున్నారంతే."
"వాళ్ళమ్మకేమయినా అయితే మామీదే నిందవేస్తారని నాన్న భయపడ్డారు. అదీగాక మా నాన్నకు సుందరిని వదలడం ఇష్టంలేదన్నట్లు అసభ్యంగా మాట్లాడాడు మావయ్య."
"అయిదేళ్ళు మీ కోసం తన శక్తినంతా దారపోసిందే. ఆమెకోసం ఆ మాత్రం నింద భరించలేకపోయారా? అంతగా అయితే వాళ్ళ తల్లినే ఇక్కడకు పంపమని చెపితే బుద్ది వచ్చేది."
"ఆ మాటే అన్నాను నేను కూడా. అమ్మేమందో తెలుసా? నా ఒక్కదాని మందుకే కొనలేకపోతున్నారు నాన్నగారు. మరో రోగిష్టి భారం నెత్తిన వేసుకునే స్థితిలో లేరు అని. అదీ నిజమే కదా! అందుకే పిన్నిని బలవంతంగా పంపించివేశాం. తలచుకున్నప్పుడల్లా చాలా బాధేస్తోంది. ఏమిటో ఈ సమస్యలన్నీ" బాధగా అంది పావని.
"కరెక్టు! అదే నేను ఎప్పుడూ చెప్పేది, పరిస్థితులెప్పుడూ మనకు అనుకూలంగా వుండవు. చేయ్యాలనుకున్నది చెయ్యలేక పోతాం.....చెయ్యగూడని పనులు చేయాల్సివస్తుంది. ఎవ్వరూ డానికి అతీతులు కారు. నాలుగురోజులకే నువ్వింత బాధపడుతున్నావే. జీతం భత్యం లేకుండా మీ ఇంట్లో సకల పనులు చేసింది. మీ సంతోషం కోసం తపించిపోయింది. అవసరానికి ఆసరా ఇమ్మని నోరు విప్పి అడిగింది. అయినా చేయగలిగారా? పదిమంది ఏమనుకుంటారో అని భయం. సంఘ ప్రభావం పడని ఇల్లుండదు! మరో నాలుగు రోజులకి పక్కింటిని చూచి నువ్వు ఈర్ష్యపడినా ఆశ్చర్యంలేదు అబ్బ మా అమ్మ గూడా ఆరోగ్యవంతురాలయితే ఎంత బావుండేది? అనిపించకపోదు. మీ నాన్నగారి సహనానికి కూడా ఒక హద్దు వుంటుంది. ఆయన చిరాకుపడ్డా ఆశ్చర్యపడవలాసిన అవసరం లేదు. అది సహజం.....నువ్వెప్పుడూ గ్రేట్ ఎక్స్ పెక్టేషన్ తో వుంటావు. అది అంత మంచిది కాదు."
"చాల్లే ఉపన్యాసం ఇక ఆపు. పొరపాటున నీ దగ్గర నా గోడు వెళ్ళబోసుకున్నాను" లేచింది పావని ఉక్రోషంగా. తననేమన్నా సహించగలదు కాని తండ్రిని అంటే మాత్రం సహించలేదామె. అందులో శైలజలాంటి పరాయి అమ్మాయి.
ఒకవైపు పరీక్షలు- మరోవైపు యింటి పనితో బాగా నలిగి పోయింది పావని. ఆ తరువాత సెలవులిచ్చారు. ఆ సమయంలోనే ఒక సంఘటన జరిగింది.
3
ఆ క్లాసు వాళ్ళందరూ పిక్నిక్ కి వెళ్ళారు.
దాదాపు పాతికమంది అమ్మాయిల్తో కంపార్టుమెంట్ కళకళలాడుతూ వుంది. వృద్దుల నుంచి నూగుమీసాల కుర్రవాళ్ళ వరకు అందరికీ ఆ కంపార్టుమెంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయి ప్రతి స్టేషన్ లోనూ మరికొందర్ని తనలో నింపుకుంటుంది.
అమ్మాయిలు స్వేచ్చగా అల్లరి చేస్తూ తమతో తాము కబుర్లు చెప్పుకుంటూ అబ్బాయిలకి తోచిన పేర్లు పెడుతూ నవ్వుకుంటున్నారు. పావని దృష్టి రెండు వరుసల అవతల కిటికీ దగ్గర సీటు దగ్గర కూర్చున్న కుర్రవాడిమీద పడింది. అతడికి పదిహేడు ఏళ్ళుంటాయి. కాస్త నల్లగా వున్నా బాగానే ఉన్నాడు ఎప్పట్నించి ఆమెని చూస్తున్నాడో ఆమె తనని చూడగానే కళ్ళు తిప్పుకుని కిటికీలోంచి బయటకు చూడసాగాడు. బయట చెట్లు, పొలాలు, టెలిఫోన్ స్తంభాలు వేగంగా వెనక్కివెళ్తున్నాయి.
పావని కూడా కొంతసేపు బయటికి చూసి.... తిరిగి అతడి సీటు వైపు చూసింది. ఆ కుర్ర్రవాడు ఆమెవైపే చూస్తున్నాడు. అయితే ఈసారి వెంటనే కళ్ళు తిప్పుకోకుండా ఆమెనే చూడసాగాడు. స్త్రీ సహజమైన తత్తరపాటుతో ఆమె పక్కకు తిరిగిపోయింది.
శైలజతో మాట్లాడుతూ ఉందన్న మాటేగానీ ఆమె మధ్య మధ్యలో ఆ కుర్రవాడివైపు చూస్తోంది. దాదాపు అరగంట ఈ విధంగా గడిచింది. రైలొక పెద్ద స్టేషన్ లో ఆగటంతో చాలా మంది అమ్మాయిలు టిఫిన్ కోసం దిగారు. పావని తన సీట్లోనే ఉండిపోయింది. మాగజైన్ తీసుకుని చుదువుతూ మధ్యలో అటుచూసింది. ఈ అరగంట చూపుల పరిచయం వల్ల వచ్చిన ధైర్యంతో ఆ కుర్రవాడు నెమ్మదిగా నవ్వాడు.
ఆమె వెంటనే పుస్తకంలో తల దూర్చేసుకుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. అక్షరాలు మసగ్గా కనబడ్డాయి. చాలా సేపటికిగానీ సర్దుకోలేక పోయింది.
ఆ అమ్మాయి అందం..... విరిసిన మల్లెలా ఉంటుంది. దానికి తోడు పదహారేళ్ళ వయసు ఆ అందానికి వర్జినిటీని అద్దింది. ఆమె కాలేజీకి వెళుతున్నప్పుడు అయితేనేం, లైబ్రరీలో అయితేనేం, కుర్రవాళ్ళు కామెంట్ చెయ్యటం కొత్తకాదు. కానీ ఈ విధంగా ఒక కుర్రవాడు ఆమెవైపు ఇంత ఆర్తితో, ఆప్యాయతతో కూడిన దిగుల్తో చూడటం యిదే ప్రధమం. తన భావుకత్వాన్ని ప్రపంచం అర్ధం చేసుకోలేకపోతూందన్న బాధ అతడి మొహంలో నిరంతరం కనబడుతూ కళ్ళల్లో ప్రతిబింబిస్తూంది.
కొంచెం సేపయ్యేటప్పటికి ఆమె ఆ అబ్బాయి వంక చూడగలిగే స్థాయికి ఎదిగింది. అతడు నవ్వితే తల దించుకుని నవ్వుతుంది. అది అతడు గమనించాడని ఆమె గమనించింది. ప్రేమలో ఇంకా అనుభవం లేదు కాబట్టి అతడు ఇంకా చేతులతో సైగచేసే స్థాయికి గానీ, గాలిలో ముద్దు విసిరే స్థాయికి గానీ ఎదగలేదు.
