Previous Page Next Page 
సంపూర్ణ ప్రేమాయణం పేజి 6


    ఆ గది చాలా చిన్నది. స్టోర్ రూమ్. తోట పనిముట్లతో సహా వస్తువులన్నీ చిందరవందరగా పడివున్నాయి. ఒక ఎలుక అతడి కాళ్ళమీద పరుగెత్తింది. అతడు ఎత్తుగా వున్న కిటికీలోంచి బైటకి తొంగి చూసేడు. దాదాపు పావుగంట అలా గడిచాక, పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చినట్టుంది. క్షతగాత్రుల్నీ, రౌడీల్నీ, కార్మికనాయకుల్నీ వాన్ లోకి ఎక్కిస్తున్నారు. దయానందం చిరునవ్వుతో నిలబడి వున్నాడు. జగపతిరావ్ బహద్దూర్ కానీ, రామయ్యగానీ ఎక్కడా కనిపించలేదు.


                       *    *    *    *


    "మనం వాళ్ళని ఎదుర్కోలేం" అన్నాడు రామయ్య. అతడి కాలుకి కట్టువుంది. వెల్లకిలా పడుకుని వున్నాడు. మూడు రోజుల క్రితం జరిగిన దొమ్మీలో అతడి కాలు విరిగిపోయింది.

    వేణు మాట్లాడలేదు. రామయ్య అన్నాడు, "వాళ్ళు చాలా బలమైన పొజిషన్ లో వున్నారు- ఇప్పుడు చూడు మనమేదో వాళ్ళున్న చోటుకి ఊరేగింపుగా వెళ్ళి వాళ్ళమీద దాడి జరిపామని చూసేవాళ్ళకి అభిప్రాయం ఏర్పడింది" అన్నాడు. "ఇప్పుడు పోలీసులు కూడా రంగంలోకి వచ్చారు. దాంతో స్ట్రయిక్ పూర్తిగా ఫెయిలు కాబోతుంది. దొమ్మీలో విరిగింది కాబట్టి కాలికి కంపిన్సేషను కూడా ఏమీ ఇవ్వరు. సమ్మె వలన చాలా రోజుల్నుంచీ ఇంట్లో అందరికీ కడుపునిండా తిండిలేదు. ఇప్పుడు రెండు నెలలపాటు పక్క కదలకూడదంటే మరి ఈ ఇల్లు ఎలా గడుస్తుందో ఏమిటో" నిస్సహాయంగా అన్నాడు. వేణు దీనిక్కూడా మాట్లాడలేదు. ఎవరి జీవితాలు వారు నిర్మించుకోవటం మీద అతడికి స్పష్టమైన అభిప్రాయం ఉన్నది. అందువల్లే కష్టాలు అతడినెప్పుడూ బాధపెట్టలేదు. చెల్లెలి కళ్ళు నిలపాలంటే పాతికవేలు కావాలి! అతడు కష్టాల్ని బాధ్యతలు గానే గుర్తించాడు తప్ప- సెల్ఫ్ పిటీ వ్యక్తీకరించలేదు. 

    రామయ్య చెప్పేది వినసాగాడు.

    "ఆ లింగం అలా రెచ్చిపోకుండా వుండాల్సింది. దీంతో తప్పంతా మనమీదకు వచ్చింది. మనవాళ్ళు అసలు ఈ పరిణామాన్నీ, ఆ పోలీసుల్నీ వూహించకపోవడంతో బాగా దెబ్బలు తినాల్సి వచ్చింది. పైగా తప్పంతా మనదే అయినట్టు ఎవరి సానుభూతి లభించలేదు కూడా"

    అప్పుడు మాట్లాడాడు వేణు. "లింగం మన మనిషి అని నువ్వెందుకు అనుకున్నావ్ తాతా?" అని.

    రామయ్య అదిరిపడి "ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది?" అని అడిగాడు.

    "ఆ రోజు నేను మీతో లోపలకు రాలేదు. కానీ లింగం చెలరేగిన విధానం కృత్రిమంగా అనిపించింది. కానీ నా అనుమానాన్ని వెలిబుచ్చకుండా అతడిమీదే ఓ కన్ను వేసి వుంచాను. నిన్న రాత్రి దొరికాడు."

    "ఎలా దొరికాడు?"

    "దయానందం ఇంటి దగ్గర డబ్బు తీసుకుంటూ" అన్నాడు వేణు.

    "చాలా పకడ్బందీగా ఆ దయానందం, జగపతిరావు వేసిన ప్లాన్ ఇది. ఎంతో తెలివితేటల్తో మనని మోసం చేశారు- తప్పంతా మనమీదకి తోసేస్తూ." 

    రామయ్య కన్నార్పకుండా వేణువైపు చూసి, "వాళ్ళ తెలివితేటలు అలా వుంచు. నిన్ను చూస్తూంటే ముచ్చటగా వుంది. కొంతమంది పైకి తెలివిగా కనిపించి, లోపలంతా శూన్యంగా వుంటారు. నువ్వు పైకి మామూలుగా కనపడుతూ లోలోపల ఇంత తెలివిగా వున్నావంటే ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ వుంది. చూడు వేణు, ఈ కార్మికుల్ని రక్షించాలంటే అది నీ వల్లే అవుతుంది. అసలు వీళ్ళంతా కలిసి నిన్నే నాయకుడిగా ఎన్నుకుంటే ఎంత బావుణ్ణు."

    "నన్ను అనవసరంగా మునగచెట్టు ఎక్కిస్తున్నావ్?"

    "కాదు. వున్న విషయం చెప్తున్నాను. సరే, ఈ కార్మికులూ, వాళ్ళు నిన్ను ఎన్నుకోవటం ఇవన్నీ వదిలెయ్! నీ అంతట నువ్వే ఈ కార్మికులకోసం ఏదైనా చెయ్యకూడదూ?"

    "ఏం చెయ్యను?"

    "ఈరోజు కనుక్కున్నట్టే వాళ్ళ అసలు లాభాల సంగతి ఋజువుల్తో సహా కనుక్కున్నావనుకో, బోనస్ వస్తుంది కదా."

    "పో తాతా! అదంత సులభం అని నేననుకోను" అంటూ అక్కడ నుంచి లేచిపోయాడు వేణు. రామయ్య అంటే చూస్తూ వుండిపోయాడు. అతడికి వేణుని చూస్తూ వుంటే ఎప్పుడూ ఆశ్చర్యంగానూ, విచారంగానూ వుంటుంది. ఎందుకో వేణు లోపల ఇంకో వేణు వున్నాడనిపిస్తుంది. ఎవరైనా ఆ వేణుని బైటకు లాగితే ఎంత బాగుండును అనిపిస్తుంది.


                                                 *    *    *    *


    వేణు వెళ్ళిపోయాక రామయ్య దగ్గరికి ఒక ఇన్సూరెన్సు ఏజెంటు వచ్చాడు. అతడికి నలభై అయిదేళ్ళ పైబడి వుంటాయి. వచ్చి మంచం పక్కనే కూర్చుంటూ తనని పరిచయం చేసుకున్నాడు.

    రామయ్య కళ్ళల్లో ఆశ కనబడింది. అతడు తన కుటుంబం ఎలా గడుస్తుందా అన్న విషయమై లోపల ఆందోళనగా వున్నాడు.

    "నాకు ఇన్సూరెన్సు వస్తుందా?" అని అడిగాడు ఆశగా.

    ఆ ఏజెంటు నవ్వి, "రాదు. దొమ్మీలో విరిగిన కాలుకి ఇన్సూరెన్సు ఎలా వస్తుంది?" అన్నాడు. అంతలో రామయ్య మొహంలో నిరాశ గమనించి, చెప్పటం కొనసాగించాడు. "ఫ్యాక్టరీలో కార్మికులందరికీ ఉమ్మడిగా ఇన్సూరెన్సు వుంటుంది. ఎవరికి ఏ ప్రమాదం జరిగినా అది ఇవ్వబడుతుంది. అందువల్ల నేను ఎప్పుడూ కార్మికులమీద ఓ కన్నువేసి వుంచుతాను. చాలామందికి ఈ డబ్బు ఎలా రాబట్టాలో తెలీదు. నేను అదే ఆఫీసులో పని చేస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. నీకు ఈ ప్రమాదంలో అయిదువేలదాకా వస్తుంది. పోతే నువ్వు చేయవలసిందల్లా నీ కాలు వేరే ప్రమాదంలో విరిగిందని చెప్పటమే. ఆ దొమ్మీలో ఎవరూ ఎవరినీ పట్టించుకోలేదు కాబట్టి ఈ ప్రమాదం ఫ్యాక్టరీలో జరిగిందని చెప్పటానికి కావల్సిన సర్టిఫికెట్లని ఏర్పాటు చేస్తాను. డాక్టరు పరీక్ష కూడా నేను చేయిస్తాను. మొత్తం అన్నింటికీ కలిపి నాకు వెయ్యిరూపాయలు ఇవ్వవలసి వుంటుంది. అదీ కాంట్రాక్టు." 

    అతడంత ఉత్సాహం ఎందుకు చూపిస్తున్నాడో రామయ్యకి అప్పుడు అర్ధమయింది. ఇటువంటి బ్రోకర్లు గురించి అతడు విని వున్నాడు.

    రామయ్య అతడివైపు అనుమానంగా చూశాడు. ఆ ఏజెంటు హామీ ఇస్తున్నట్టుగా, "ఇందులో ఏమీ ప్రమాదం లేదు" అన్నాడు.

    "ఆ విషయం కాదు బాబూ, నేను ఆలోచిస్తున్నది."

    "మరి?"

    రామయ్య మాట్లాడలేదు.

    "ఇందులో తప్పేంలేదు. ఎంతోమంది ప్రభుత్వం డబ్బు తింటున్నారు. అందులో మనం కూడా ఒకళ్ళం."

    ఆ ముసలివాడు టెంప్ట్ అయ్యాడు.

    వచ్చిన ఇన్సూరెన్సు ఏజెంటు సీల్డు కవరు ఇస్తూ, "దీన్ని డాక్టర్ గోయల్ గారికి అందించాలి. ఆయన దీనిమీద సంతకం పెట్టి ఇస్తాడు. తీసుకురావాలి" అన్నాడు. గోయల్ మిలటరీ డాక్టరు.

    రామయ్య వాళ్ళున్న ఇండస్ట్రియల్ ఏరియాకి పది కిలోమీటర్ల దూరంలో మిలటరీ కాంప్ వుంది. కొన్ని వందల ఎకరాల ప్రదేశంలో వున్న కాంప్ అది. ఆ వూరి పిల్లలు రోడ్డు కిరువైపులా చేరి ఆ మిలటరీ వాళ్ళు కవాతు చేసుకుంటూ వెళ్ళటాన్ని చూస్తూ వుంటారు.

    "నేనెలా వెళ్ళను? కాలు విరిగిందిగా!"

    "ఎవరిచేతనైనా పంపించండి. నేను ఆయనతో అంతా మాట్లాడి వుంచాను. ఇది అందిస్తే చాలు" అంటూ లేచి, "ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. నా పేరు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ బైటకు రాకూడదు" అని వెళ్ళిపోయాడు.

    రామయ్య తల గోక్కుంటూ కవరువైపు చూశాడు.

    ఇందులో పెద్ద నీతినిజాయితీల ప్రసక్తి ఏమీలేదు. చాలామంది చేసేదే.

    అతడు వేణూని పిలిపించాడు. "వేణూ! నాకో చిన్న సాయం చేసి పెట్టాలి, ఇదిగో ఈ కవరు కాస్త డాక్టరుగారికి ఇవ్వాలి."

    "ఏ డాక్టరుగారు?'

    "డాక్టర్ గోయల్ అని, మిలటరీ డాక్టరుగారు కాంప్ లో వుంటారు. బైట సెంట్రీలని అడిగితే చూపిస్తారు. ఆయనతో ఈ కాగితాల మీద సంతకం పెట్టించి తీసుకురావాలి అంతే!"

    "ఏమిటా కాగితాలు?" అని అడిగాడు వేణు. రామయ్య చెప్పటానికి ఇష్టపడలేదు. అది గుర్తించి మరి అడక్కుండా, "సరే తాతా! దీనికేముంది? రేపే వెళ్తాను" అన్నాడు.

    "రేపు కాదు ఈరోజే!"

    "సర్లే ఈ రోజే వెళ్తాను."

    "వేణూ!"

    వేణు ఆ ముసలివాడివైపు చూసేడు. రామయ్య కొద్దిగా తటపటాయించి, "ఈ విషయం మూడో కంటికి తెలియకూడదు సుమా!" అన్నాడు. వేణు చిత్రంగా చూసేడు అతడివైపు. తరువాత ఏమనుకున్నాడో ఏమో, "అలాగే ఎవరికీ చెప్పనులే" అన్నాడు.

    ఆ సాయంత్రమే అతడు మిలటరీ కాంప్ కి వెళ్ళాడు. వ్యాన్లు ఒక దాని తరువాత ఒకటి బైటకొస్తున్నాయ్. సెంట్రీ గేటు దగ్గిర నిలబడి ఒక్కొక్కదాన్నీ పంపుతున్నాడు. అన్నీ వెళ్ళేవరకూ ఓపిగ్గా చూస్తూ నిలబడ్డాడు వేణు. ఫెన్సింగ్ లోపల నలుగురైదుగురు మిలటరీ జవాన్లు తోటపని చేస్తున్నారు. ఒక మూల టాంకులు కనబడుతున్నాయి.

    సెంట్రీ ఖాళీ అయ్యాక వేణు, అతడి దగ్గరికి వెళ్ళి, "డాక్టర్ గోయల్ గారిని కలుసుకోవాలి" అన్నాడు.

    సెంట్రీ మొహం చిట్లించి, "డాక్టర్ గోయలా?" అని అడిగాడు.

    ఇంతలో మోటార్ సైకిల్ మీద ఓ కమాండర్ వచ్చాడు అక్కడికి. సెంట్రీ హిందీలో ఏదో చెప్పాడు అతడికి. అతడు వేణువైపు చూసి, "నీ పేరు" అని అడిగాడు ఇంగ్లీషులో. వేణు చెప్పాడు.

    "రండి, మోటార్ సైకిల్ ఎక్కండి!"

    "గోయల్ మీరేనా?"

    "కాదు. తీసుకెళతాను."

    వేణు ఎక్కేక మోటార్ సైకిల్ ఒక పాడుపడిపోయిన ఇంటి ముందు ఆగింది. అతడికి అనుమానం వచ్చింది. అయోమయంగా కూడా వుంది.

    "దిగు" అన్నాడు మిలట్రీ మనిషి కంఠంతో. ముందున్నంత 'నెమ్మది' లేకపోవటం గమనించాడు వేణు. అతడి సిక్త్సు సెన్స్ ఏదో అపాయాన్ని సూచించసాగింది. అయినా ఇంతవరకూ వచ్చాక చేసేది ఏమీలేదు. అతడితోపాటూ లోపలికి నడిచాడు.

    పైకి పాడుపడిపోయిన ఇల్లులా కనిపిస్తున్నా లోపల విశాలంగా వుంది గది. ఒకమూల ఏవేవో పరికరాలున్నాయ్. మధ్యలో సోఫా వుంది. గోడలకి మ్యాప్ లున్నాయి. వాళ్ళు లోపలికి ప్రవేశించగానే అక్కడున్న జవాన్ లిద్దరూ అటెన్ షన్ లోకి వచ్చి సెల్యూట్ చేశారు. వాళ్ళ కళ్ళల్లో కనపడిన భక్తిభయాల్ని చూసి తనని తీసికొచ్చినవాడు ఎవరో పెద్ద రాంక్ ఆఫీసర్ అయి వుంటాడని గ్రహించాడు వేణు. అతడు కూర్చుంటూ తనని కూర్చోమనకుండా వుండటం కూడా గమనించాడు.

    ఆఫీసరు కనుసైగతో జవాన్లు బైటకి వెళ్ళిపోయారు. గదిలో నిశ్శబ్దం మిగిలింది. ఆఫీసరు వేణుతో, "గోయల్ తో నీకేం పని?" అని అడిగాడు.

    "ఒక కవరు ఇవ్వాలి."

    "ఏం కవరు?"

    "సారీ! చెప్పను."

    "తెచ్చావా?"

    "ఊఁ!"

    "మిస్టర్ వేణూ! నిన్ను చూస్తుంటే అమాయకుడిలా కనబడ్తున్నావ్. ఇందులో అనవసరంగా ఇరుక్కోకు. ఆ కవరు ఇచ్చేసి, దాని సంగతీ- వివరాలూ పూర్తిగా చెప్తే నేను నిన్ను రక్షించగలను" అన్నాడు.

    "అసలు మీరెవరు? ఏమిటీ గొడవంతా! నేను డాక్టర్ గోయల్ ని కలుసుకోవటానికి వచ్చాను. ఆయన లేకపోతే చెప్పండి. వెళ్ళిపోతాను అంతే!" అన్నాడు వేణు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS