Previous Page Next Page 
సంపూర్ణ ప్రేమాయణం పేజి 5


    "వద్దు తాతా! నువ్వు ఈ పరిస్థితులలో తప్పుకుంటే యూనియన్ చీలిపోతుంది. కేవలము నీమీద గౌరవంతో అందరూ ఒకటిగా వుంటున్నారు" అన్నాడు వేణు.

    "కానీ జీతాలు లేక కార్మికులు పట్టు సడలిపోతుంది బాబూ! ఎంతో కాలం మనమాట వినరు."

    "వాళ్ళందర్నీ కూర్చోబెట్టి, మన భవిష్యత్ ప్రణాళిక ఏమిటో చెబ్దాం" అన్నాడు వేణు. అతడికి నిజానికి ఈ కార్మిక సంఘాల్తో పెద్దగా పరిచయం లేదు. అతడు కార్మికుల్లో ఒకడు. అంతే!! పగలు పనితోనూ_ సాయంత్రం చదువుతోనూ మొన్న మొన్నటివరకూ సరిపోయిందతనికి.

    "ఎలా పరిష్కరిస్తాం ఈ సమస్యని?"

    "దయానందం కేవలం మేనేజర్ మాత్రమే! మనం అసలు యజమానిని కలుసుకుందాం. ఆయన మంచివాడులాగే కనబడ్తాడు కదా! ఆయనకి మన సమస్య చెబ్దాం."

    "డబ్బున్నవాళ్ళు ఎవరూ మంచివాళ్ళు కాదు వేణూ!"

    "ప్రయత్నించి చూడడంలో తప్పులేదుగా?"

    ఆ రోజే కార్మిక బృందం ఒకటి ఫ్యాక్టరీ అసలు యజమానిని కలుసుకోవడానికి బయలుదేరటానికి సిద్ధపడింది. దయానందం కంగారు పడ్డాడు. ఈ సమస్యనుంచి తను తొలగింపబడటం అతడికి ఇష్టం లేదు. ఇప్పుడు చిన్నదిగా కనిపించిన ఈ చర్చే, భవిష్యత్తులో ఇంకా ఎంతో పెద్ద పరిణామానికి దారితీసి, తన ఉనికికే ముందు ముందు భంగం కలిగించవచ్చు. అందుకే, "మీరెందుకు ఆయన్ని కలుసుకోవటానికి వెళ్ళటం! ఆయన మీ యజమాని! ఆయన్నే మీ దగ్గరికి పిలిపిస్తాను. తన కార్మికుల బాగోగులు చూసుకోవటం, వాళ్ళ సమస్యలు పరిష్కరించటం ఆయన బాధ్యత కాదా ఏం?" అన్నాడు తియ్యగా, కన్విన్సింగ్ గా మాట్లాడడం దయానందానికి వున్న కళల్లో ఒకటి. కార్మికులు దానికి వప్పుకొన్నారు.

    మరుసటిరోజు సాయంత్రం అయిదింటికి ఆయన వస్తున్నట్లూ కబురు అందింది.

    నాలుగింటికి పబ్లిక్ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ అయ్యాక ఒక ఊరేగింపుగా వెళ్ళి, తమ 'అసలు యజమాని'కి తమ కోర్కెల జాబితా మెమొరాండంగా సమర్పించాలన్నది వాళ్ళ ఆశయం.

    కానీ దయానందం గొప్ప ప్లాన్ వేశాడు.

    ఫ్యాక్టరీలో ఒక వర్గం హింసవైపు మొగ్గుతూందని అతడికి తెలుసు. ఆ వర్గంతోపాటు కొంతమంది రౌడీలను కలిపాడు. చెయ్యవలసిందేమిటో వారికి చెప్పాడు. యజమాని వచ్చి ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్ లో దిగుతాడు. సభ నుంచి ఊరేగింపు బయల్దేరి గెస్ట్ హౌస్ కి వస్తుంది. అక్కడ మెమొరాండం సమర్పిస్తారు. అలా సమర్పిస్తున్న సమయానికి రౌడీలు చెలరేగుతారు. అంతా రసాభాస అవుతుంది. యజమాని కంగారుపడతాడు. కార్మికుల పట్ల మరింత విరక్తి పెంచుకుంటాడు. అదే తనకి కావల్సింది.

    అతడు మరోవైపు పోలీసుల్ని కూడా పిల్చి గెస్టుహౌస్ వెనుక వుంచాడు.

    సాయంత్రం నాలుగింటికి మీటింగు ప్రారంభం అయింది.

    వేణుకి ఇలాంటి మీటింగుల్లో మైకు పట్టుకుని ఉపన్యసించే అలవాటు లేదు. చివర వరసలో కూర్చున్నాడు. ఆ నియోజకవర్గపు ప్రతిపక్ష ఎమ్మెల్యే అర్ధగంటనుంచే ఏకధాటిగా ఉపన్యసిస్తూ వుంటే బోరుగా వింటున్నాడు. అప్పుడప్పుడు వెనకరోడ్డుమీద వెళ్ళే సైకిళ్ళను చూస్తున్నాడు. ఎమ్మెల్యే ఉపన్యాసం అయిన తర్వాత మరో కార్మిక నాయకుడు మైకు పుచ్చుకున్నాడు. సమ్మెని మరింత ఉధృతం చెయ్యవలసిన ఆగత్యం గురించి చెప్పి తరువాత, యజమానికి సమర్పిస్తూన్న మెమొరాండం చదివి వినిపించసాగేడు.

    ఇంతలో అందరూ వెనక్కి చూడటంతో వేణు కూడా వెనుదిరిగాడు. దూరంగా రోడ్డుమీద ప్లిమత్ కారు వస్తూ కనిపించింది.

    అదే తమ యజమానిది!

    కార్మికులందరూ కుతూహలంగా దానివైపు చూడసాగేరు. దుమ్ము లేపుకుంటూ అది తమ గెస్టుహౌస్ వైపు సాగిపోయింది.

    వెనుకసీట్లో కుడివైపు సర్ జగపతిరావు బహద్దూర్ కూర్చుని వున్నారు. ఎడమవైపు ఆయన కూతురు ప్రేమ కూర్చుని వుంది. ఆమె రోడ్డు పక్కగా జరుగుతున్న ఈ మీటింగ్ వైపు క్షణంసేపు ఆసక్తిగా చూసింది. అంతలో కారు ఆ ప్రదేశాన్ని దాటిపోయింది.


                         *    *    *
   

    తమ ప్రొప్రైటరు వూర్లోకి వచ్చాడని తెలిశాక సభ చాలించి, కార్మికులు ఊరేగింపుగా గెస్టుహౌస్ వైపు నడిచారు.

    అదే సమయానికి దయానందం, జగపతిరావుతో అక్కడ జరుగుతున్న పరిస్థితులు వివరించి చెప్పి, "కేవలం మెమొరాండం స్వీకరించమనీ, ఏ హామీలు ఇవ్వొద్దనీ" అంటున్నాడు.

    "నేనలా వూర్లోకి వెళ్ళొస్తాను నాన్నా! ఇక్కడ మీ గొడవల్లో నేనెందుకు?" అంది ప్రేమ.

    దయానందం కల్పించుకుని, "ఉండండమ్మగారూ! ఇప్పుడిక్కడో మంచి డ్రామా జరుగుతుంది. మీరు చూడాలి" అన్నాడు.

    "డ్రామా ఏమిటి?"

    "వీళ్ళు పేరుకి కార్మికులుగానీ, ఒక్కొక్కరూ పెద్ద రౌడీలు. నేను అన్ని ఏర్పాట్లూ చేసే వుంచాననుకోండి. వీళ్ళ కోరలు ఎలా పీకి వేయబడ్తాయో చూడండి!"

    __అంటూ గెస్ట్ హౌస్ పక్కకి వెళ్ళాడు. అక్కడ పోలీసు అధికారి రెడీగా వున్నాడు. అతడికి చెప్పవలసింది చెప్పి, దయానందం ముందుకొచ్చేసరికి ప్రొసెషన్ కూడా అక్కడికి చేరుకుంది. ఊరేగింపుకి ముందుభాగాన రామయ్య, మరో నలుగురు కార్మిక నాయకులూ వున్నారు. ఊరేగింపు అక్కడితో ఆగిపోయింది. ప్రేమ పక్కగది కిటికీలోంచి ఈ జనాన్ని చూస్తూంది.

    కార్మికులంతా గెస్టుహౌస్ కి దూరంగా నిలబడ్డారు. నలుగురు మాత్రం మెమొరాండం పట్టుకుని లోపలికి నడిచారు. అందులో రామయ్య వున్నాడు. శాంతియుతంగా ఈ సమస్యని పరిష్కరించుకోవాలనుకుంటున్న వారిలో అతడు ప్రధముడు.

    లోపల సంప్రదింపులు జరుగుతున్నాయ్.

    బైట కార్మికులు అసహనంతో వేచివున్నారు.

    "ఫ్యాక్టరీ ఈ సంవత్సరం నష్టంలో నడిచింది. మీరే చూస్తూన్నారుగా" అన్నాడు మానేజర్ దయానందం.

    "అబద్ధం" కార్మికుల్లో ఒక యువకుడు అన్నాడు. అతడి పేరు లింగం.

    జగపతిరావు కల్పించుకుని, "ఫ్యాక్టరీ అకౌంట్లన్నీ మీరు అంగీకరించిన మధ్యవర్తికే చూపించేం కదా! అతడు కూడా దీనికి వప్పుకున్నాడు" అన్నాడు.

    "మధ్యవర్తిని మీరు కొనేశారు."

    "రేపు ఇంకో మధ్యవర్తిని మీరు పెట్టినా ఇలాగే అంటారు. దీనికి అంతెక్కడ?"

    దీనికి కార్మిక ప్రతినిధులు సమాధానం చెప్పలేకపోయారు. రామయ్యకి మాత్రం ఒక విషయం బాగా తెలుసు. చాలా జాగ్రత్తగా రెండు రకాల పుస్తకాలు తయారు చేయబడుతున్నాయ్. ఒకటి అసలైంది. రెండోది కార్మికుల కోసం- ఇన్ కంటాక్స్ వారికోసం! కానీ ఈ విషయాన్ని ఋజువుల్తోసహా బైట పెట్టడం ఎలా?

    లోపల ఇంకా సంభాషణ జరుగుతూ వుండగానే బైట నిలబడ్డ కార్మికుల్లోంచి ఎవరో విసిరినా రాయివచ్చి కిటికీ అద్దానికి తగలటంతో అది భళ్ళున శబ్దమై పగిలిపోయింది. దాంతో జగపతిరావు బెదిరిపోయాడు. కార్మిక ప్రతినిధుల్లో యువకుడు విజయగర్వంతో "మా కోర్కెలు మన్నించకపోతే మీ సౌధాలన్నీ ఇలాగే కూలిపోతాయి జాగ్రత్త!" అని నినాదం చేసేడు.

    మానేజరు కల్పించుకుని, "మీరిలా దౌర్జన్యం చేస్తే ఇక చర్చల ప్రసక్తే లేదు" అన్నాడు నిష్కర్షగా.

    "అయితే ఫ్యాక్టరీ కూడా నడవదు" అన్నాడు లింగం.

    "నీలాంటివాడు వుండబట్టే చర్చలు ఇలా ఫెయిల్ అవుతున్నాయి."

    "నువ్వు బైటకెళ్ళు" అన్నాడు మానేజరు.

    "నన్ను వెళ్ళమనటానికి నువ్వెవడివిరా!"

    "మర్యాదగా మాట్లాడు."

    "మానేజరు పేరుతో యాజమాన్యం ఇంట్లో పనిచేసే కుక్కవి! నీకు మర్యాదేమిటి?"

    మిగతా కార్మిక నాయకులు కంగారుపడ్డారు. తమ అందర్లోకి చిన్నవాడైన ఆ యువకుడిని వారించటానికి ప్రయత్నం చేశారు. వారు వాదించే కొద్దీ లింగం మరింత రెచ్చిపోసాగేడు.

    చూస్తూ చూస్తూ వుండగానే గొడవ పెద్దదైంది. మానేజరూ, లింగం ఒకరి కాలరు ఒకరు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇటు ప్రొప్రైటరూ, అటు మిగతా నాయకులు వారిని విడిపించటానికి ప్రయత్నించసాగేరు. ఈ లోపులో దయానంధం అతడిని బలంగా తియ్యటంతో అతడు పట్టుదప్పి పడిపోయాడు. పాన్ మీదపడి నుదుటిమీద రక్తం రాసాగింది. ఆ రక్తంతోనే గుమ్మం దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి, "చూసేరా కార్మిక సోదరులారా! చర్చలకు పిలిచి మన మానేజ్ మెంట్ చేస్తున్న అఘాయిత్యం" అని అరిచాడు.

    దాంతో బైటవున్న కార్మికులు రెచ్చిపోయారు. వాళ్ళలో కలిసిపోయిన రౌడీలు ఇదే అదనుగా భావించి గెస్ట్ హౌస్ లోకి చొరబడ్డారు. దాని కోసమే చూస్తున్న పోలీస్ ఇనస్పెక్టరు లాఠీచార్జి ఆర్డరు చేశాడు.

    క్షణంలో అది కురుక్షేత్రంగా మారింది.

    పోలీసులు కార్మికుల్ని చావబాదటం మొదలుపెట్టారు.

    ఇటువంటి పరిస్థితుల్లో అనుభవం వున్న రౌడీలు మాత్రం చేతికి దొరికింది దొరికినట్టు మాయం చెయ్యసాగేరు.

    ఇద్దరు రౌడీలు ప్రేమ ఉన్న గదిలోకి ప్రవేశించారు.

    వాళ్ళని చూసి ప్రేమ బిత్తరపోయి నిల్చుంది. బైట కేకలూ, అరుపులూ భయంకరంగా వినిపిస్తున్నాయ్. ఒక రౌడీ ప్రేమ దగ్గరికి వెళ్ళి చెవికున్న రింగులు లాగటానికి ప్రయత్నించసాగాడు. మరో రౌడీ ఆమె హాండ్ బ్యాగ్ లాక్కున్నాడు. ప్రేమ కెవ్వున అరిచింది. ఈ లోపులో ఇద్దరు పోలీసులు గదిలో ప్రవేశించి, రౌడీల్ని లాఠీచార్జి చేసే నెపంమీద ప్రేమకి మరింత దగ్గరగా వెళ్ళారు. రౌడీలకీ, పోలీసులకీ మధ్య దాదాపు దొమ్మీలాటిది జరిగింది.

    బైట గుంపుని పోలీసులు చెదరగొట్టడం మొదలు పెట్టగానే వేణు అక్కడనుంచి తప్పుకోవటానికి ప్రయత్నించాడు. అతడికి ఇలాంటి వాటిలో తలదూర్చటం అంతగా ఇష్టం వుండదు. అతడికి అక్కడినుంచి ఎలా తప్పించుకోవాలో అర్ధంకాలేదు. పోలీసులు వలయాకారంలో చుట్టుముట్టి దొరికిన వాడ్ని దొరికినట్టూ కొడుతున్నారు. వేణు గుంపుని తప్పించుకుని ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ పరిస్థితి మరింత అధ్వాన్నంగా వుంది. సర్ జగపతిరావు బహద్దూర్ బల్లక్రింద దూరివున్నాడు. రామయ్య ఏమయ్యాడో తెలీదు. వస్తువులన్నీ చిందరవందరగా పడివున్నాయ్. సరిగ్గా అప్పుడే ప్రేమ పెట్టిన కేక వినిపించింది. అతడు అటు వెళ్దామని అనుకొనేలోపులో ఇద్దరు పోలీసులు ఆ గదిలో ప్రవేశించటం కనిపించింది. దాంతో తన ప్రయత్నం విరమించుకున్నాడు. కాని ఈ లోపులో ప్రేమ పోలీసుల్ని చూసి మరింత భయంతో, తలుపు తెరుచుకుని బైట కొచ్చింది.

    గుమ్మంలో మెరుపుతీగలా నిల్చునివున్న ఆ అమ్మాయిని ఓ క్షణం కన్నార్పకుండా చూసేడు వేణు. అంతలో లోపలవాళ్ళు బైటకి వస్తూన్న అలికిడి వినిపించింది.

    "అటు వెళ్ళండి క్విక్" అని అరిచాడు వేణు. ఆమె అయోమయంగా అతడివైపు చూసింది. ఇంతలో బైట టియర్ గాస్ వదిలిన సవ్వడి వినిపించింది. మరింతమంది ఆ ఇంట్లోకి వస్తూ కనిపించారు. వాళ్ళంతా కార్మికులు కారని, తమలో ఎలాగో ఒకలా చేరినవారనీ గ్రహించి ఆమెవైపు దూసుకుని వెళ్ళి పక్కగదిలోకి ఆమెని లాగి తలుపు వేసేసేడు. ఈ ఆకస్మిక చర్యకు ఆమె మరింత బెదిరిపోయి అతడివైపు చూసింది. కానీ ఆ చీకట్లో అతడు కనపడలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS