"నీ ప్రశ్నలకి వరసగా సమాధానం చెప్పుకుంటూ వస్తాను. నేనెవరు అని అడిగావు కదా__ నా పేరు జోషీ! ఇండియన్ మిలట్రీ సీక్రెట్ సర్వీస్ కమేండర్ ఇన్ చీఫ్ ని" ఇంగ్లీషులో అన్నాడు. "నువ్వు అడిగిన రెండో ప్రశ్న ఏమిటీ గొడవంతా అని. అది కనుక్కోవటానికే ఢిల్లీ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అధికార పత్రంతో స్వయంగా వచ్చాను. నువ్వు డాక్టర్ గోయల్ ని కలుసుకోవటానికి వచ్చానన్నావ్. నువ్వు అతడిని కలుసుకోవటానికి వెళ్ళిపోతానంటే నాకు అభ్యంతరం లేదు."
"ఎక్కడున్నాడు అతడు?"
"స్వర్గంలో... మా ప్రశ్నలన్నిటికీ సరియైన సమాధానం చెప్పక నిన్నరాత్రి వరకూ చిత్రహింసలు అనుభవించి, చివరగా నిన్నరాత్రి కాల్చి చంపబడ్డాడు మిస్టర్ వేణూ!"
వేణు ఉలిక్కిపడ్డాడు. గోయల్ కాల్చి చంపబడ్డాడు.
"మిస్టర్ వేణూ! రెండు నెలల క్రితం తెలిసింది మాకు గోయల్ పాకిస్తాన్ గూఢచారి అని. అప్పట్నుంచీ అతడిని ట్రాప్ చేసేం. పదిరోజులక్రితం అతడు ఋజువుల్తో సహా పట్టుబడ్డాడు. కానీ దురదృష్టవశాత్తు ఎంత బాధించినా అతడు ఏ విషయము బయటపెట్టలేదు. మా పద్ధతులు నీకు తెలుసో తెలీదో! గూఢచారి దొరకగానే ముందు మా సీక్రెట్ సర్వీస్ కి అప్పగిస్తారు. మేం పెట్టే బాధల్లో అతడు చనిపోయినా మూడో కంటికి తెలీదు. సాధారణంగా మా నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నాలుగు రోజుల క్రితం వరకూ అతడిని 'ట్రీట్' చేసి ఇక లాభం లేక మిలట్రీ కోర్టుకి అప్పగించాం. నిన్నరాత్రి కోర్టు జడ్జిమెంటు ప్రకారం కాల్చి చంపేసేం. ఈరోజు నువ్వు అతడికోసం రావటం మాకు ఆశ్చర్యం, ఆనందకరం కూడా, చెప్పు__ ఏం పని మీద అతడికోసం వచ్చావు?"
"మీరనుకున్నంత పెద్ద విషయం ఏమీలేదు. ఒక కాగితం మీద సంతకం తీసుకోవడానికి వచ్చాను."
"ఏదా కాగితం?"
వేణు తటపటాయించాడు. ఈ కవర్లో రామయ్య తాత పేరు ఉందేమో అతడు అనవసరంగా ఇరుక్కుంటాడు. కానీ ఇది భారత ప్రభుత్వ సైన్యపు ఉన్నతాధికారుల్తో పని. అందులోనూ దేశ రక్షణకి సంబంధించినది. ఈ చిన్న విషయాన్ని అనవసరంగా పెద్దది చేయటం ఎందుకు? కాగితం ఇచ్చేసి ఏ గొడవా లేకుండా బయటపడటమే మంచిది.
జోషి వేణు మొహంలో భావాల్ని గమనిస్తున్నాడు.
వేణు ఒక నిర్ణయానికి వచ్చినట్టూ జేబులోంచి కవరు తీసి జోషీకి ఇచ్చాడు. జోషి దాన్ని అందుకుని కవరు చింపి లోపలి కాగితాన్ని తీశాడు. వేణు దాన్ని చూసి స్థబ్దుడయ్యాడు.
అది ఒక మ్యాప్. దానితోపాటూ ఒక ఉత్తరం వుంది.
అది చదివి జోషి నవ్వేడు.
"పాపం! మా ప్రత్యర్ధులు ఇంకా ఈ డాక్టరుగారు సైన్యంలో పని చేస్తూనే వున్నారనుకుంటున్నారు. భవిష్యత్తులో చెయ్యవలసిన పన్లు ఉత్తరంలో వ్రాసి పంపారు" అన్నాడు. అంతలో అతడి మొఖం కఠినంగా మారింది. "మిస్టర్ వేణూ! ఎవరు పంపగా వచ్చావ్ ఇక్కడికి చెప్పు" అన్నాడు.
ఈపాటికి వేణూకి మొత్తం విషయం అంతా అర్ధమయింది. డబ్బుకి కక్కుర్తిపడి రామయ్య తాత ఎంత ప్రమాదకరమైన గూట్లో ఇరుక్కున్నాడో బోధపడింది. అతడు జోషీవైపు చూసి "క్షమించండి నేను చెప్పలేను" అన్నాడు. ఈ విషయం మూడోకంటికి తెలియకూడదు సుమా అన్నప్పుడు రామయ్యకి తనిచ్చిన వాగ్దానం గుర్తొచ్చింది.
"నీకేమీ ప్రమాదం రాదు."
"నాకు ప్రమాదం రాదు. నేను ఎవరి దగ్గర్నుంచి ఈ కవరు తెచ్చానో చెపితే, వారికీ ప్రమాదం రాదు. ఆ విషయం నాకు తెలుసు. కానీ, నేను ఆ పేరు వెల్లడించనని మాట ఇచ్చాను. మాటవరసకి కూడా నేను మాట తప్పను క్షమించండి" అన్నాడు వేణు.
"గోటితో పోయేదాన్ని గొడ్డలివరకూ తెస్తున్నావ్! ఎలాగూ నీచేత నిజాన్ని కక్కిస్తాము. ముందే చెబితే నీకే మంచిది."
"సారీ చెప్పను. ప్రాణం పోయినా సరే."
ఇంతలో బయట నిలబడ్డ జవాన్లు ఇద్దరూ లోపలికి వచ్చారు.
అప్పట్నుంచీ నరకం మొదలైంది.
చాలా సిస్టమాటిక్ గా చిత్రహింస మొదలైంది.
పాంటు అరికాళ్ళ దగ్గర కట్టేసి లోపలికి రెండు తొండల్ని వదిలి పెట్టారు. చాలా ఘోరమైన హింస అది. మొదట్లో అవి అటూ ఇటూ గాభరాగా తిరిగినయ్, తర్వాత కొరకటం మొదలుపెట్టాయి. ఈ నరకయాతన అరగంటసేపు అనుభవించాక మళ్ళీ ఇంటరాగేషన్ మొదలైంది.
వేణూకి, రామయ్యతాత ఇందులో ఎంతవరకూ ఇరుక్కుపోయాడో అర్ధంకాలేదు. అతడు దేశద్రోహం తలపెట్టాడా కానీ ఏమో? డబ్బు ఎంత పనైనా చేయిస్తుంది. ఏది ఏమైనా కానీ అతడు దేశద్రోహి కానీ- కాకపోనీ, తను మాత్రం అతడికి మాట ఇచ్చాడు అంతే!
ఇంటరాగేషన్ అయ్యాక బ్రెయిన్ వాష్ మొదలైంది. రక్తాన్ని మరిగించే ఎలక్ట్రికల్ షాక్స్!
కట్టివేయబడ్డ కుర్చీనుండి విడిపించుకోవడానికి అతడు ప్రయత్నించే కొద్దీ మరింత బలంగా బిగుసుకుపోయే కట్లు.
ఒకరోజు గడిచింది. అతడికి తిండీ, నీరూ ఇవ్వబడలేదు. ఇరవై నాలుగు గంటల్లో జవసత్వాలు పూర్తిగా నశించిపోయి జీవచ్చవంలా తయారయ్యాడు. అతడికి చెల్లెలు గుర్తుకొచ్చింది. మృదుల ఎం చేస్తుందో ఏమో.
రెండోరోజు అతడిని ఐస్ మీద పడుకోబెట్టారు. ప్రత్యక్ష నరకం అంటే ఏమిటో తెలిసింది. శరీరం మీద ఎక్కడా గాయాలుండవు, మచ్చలుండవు కానీ నరకయాతన.
మూడోరోజు జోషి వచ్చి అతడిని లేపి కూర్చోపెడుతూ "నువ్వు అదృష్టవంతుడివి" అన్నాడు. వేణు అతికష్టం మీద కనురెప్పలు పైకెత్తాడు. "ఈ రోజు కోర్టులో నీ మీద కేసు జరుగుతుంది."
అతను మాట్లాడలేదు.
"అదృష్టవంతుడివి అని ఎందుకు అంటున్నానో తెలుసా? ఈ చిత్రహింసల ద్వారా ప్రాణం పోవడం కన్నా మిలటరీ కోర్టు శిక్ష ద్వారా ప్రాణం పోవటం మంచిది. తుపాకీ శబ్దం విన్పించక ముందే ప్రాణం పోతుంది. మిస్టర్ వేణూ! మీరంటే నాకెందుకో సదభిప్రాయం ఏర్పడింది. మిలటరీ కోర్టులో దయాదాక్షిణ్యాలు, వాదోపవాదాలు వుండవు. అంతా ఒక గంటలో జరిగిపోతుంది. మీకు మరణశిక్ష పడటం ఖాయం. మీరు అమాయకులన్న భావం నాకు కలిగింది. కాబట్టి నేనో సలహా చెబుతాను. ఎవరో ఈ కవరు గోయల్ కి అందజేస్తే వందరూపాయలు ఇస్తామన్నారని, అంతకు తప్ప మీకేమీ తెలీదని కోర్టులో చెప్పండి. మీకు శిక్ష తగ్గవచ్చు, నిజానికి నేను మీకు సలహా ఇవ్వకూడదు. కాని మీరు అనవసరంగా ఇందులో చిక్కుకొని ఎవర్నో రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారని నా అనుమానం."
వేణు శుష్కంగా నవ్వి- "మీ అనుమానం నిజమే! కానీ క్షమించండి. నేను అబద్ధం చెప్పను" అన్నాడు.
మర్నాడు కోర్టులో కేసు మొదలైంది. కోర్టు అంటే పెద్ద ఆర్భాటం ఏమీలేదు. ఒక జడ్జీ వున్నాడు. జోషి వున్నాడు. ఇంకో ఇద్దరు ఆఫీసర్లు వున్నారు. వేణూని రెండు మూడు ప్రశ్నలడిగి అతడి దగ్గర్నుంచి సరైన సమాధానం రాక జడ్జిమెంట్ ఇచ్చేశాడు. దేశద్రోహానికి తోడ్పడినందుకు ఒకే ఒక శిక్ష- మరణశిక్ష.
వేణూని తిరిగి సెల్ దగ్గరికి తీసుకెళ్తూ జోషి అన్నాడు. "నువ్వు మూర్ఖుడివి" అని. నిజమే అనిపించింది వేణూకి.
"రేపు సాయంత్రం నాలుగింటికి శిక్ష అమలు జరుగుతుంది" అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి కాళరాత్రే అయింది వేణూకి.
ఒక్క నిముషంపాటు రామయ్యని కలుసుకోగలిగితే బావుణ్ణు. అసలు దీని వెనుక వున్నది ఎవరో తెలుస్తుంది. రామయ్యక్కూడా దీంట్లో భాగం వుండే వుంటుంది. లేకపోతే తనతో ఒట్టు ఎందుకు వేయించుకుంటాడు?
రాత్రంతా నిద్రపట్టలేదు. మృదుల భవిష్యత్తు గురించిన చింతతో మనసంతా వ్యాకులమైంది. ఆలోచనలతోనే సాయంతం నాలుగైంది. అతడిని గ్రౌండ్ లోకి తీసుకెళ్ళారు. ఆ మైదానానికి ఒక చివర పొడవాటి గోడ వుంది. వేణూకన్నా ముందు ఒక ఖైదీని తీసుకెళ్ళారు. అతడు గింజుకుంటున్నాడు. ఆరు తుపాకులు ఒక్కసారిగా మ్రోగిన శబ్దం. అంతే- తర్వాత నిశ్శబ్దం.
ఒళ్ళంతా తూట్లుపడి ఎర్రటి మాంసం ముద్దగా మారిన శరీరాన్ని ఇద్దరు జవాన్లు పక్కకి లాగిపడేశారు. తర్వాత వేణు వంతు వచ్చింది.
చేతులు తల వెనక్కి పెట్టి గోడకి మొహం ఆన్చి నిలబెట్టారు.
"ఇప్పుడన్నా నిజం చెప్పు. నేను ఆడినమాట తప్పను, నిన్ను విడిచిపెట్టి అసలు వాడిని పట్టుకుంటాం."
"నేనూ ఆడినమాట తప్పను."
జోషి దూరంగా వెళ్ళిపోయాడు.
మిలటరీ బూట్ల శబ్దం వచ్చి కొద్దిదూరంలో ఆగింది. తర్వాత కమేండ్ వినబడింది. తుపాకులు భుజం నుంచి చేతుల్లోకి తీసుకుంటున్నట్టూ శబ్దం. వేణు కళ్ళు మూసుకున్నాడు. 'భగవంతుడా! నా చెల్లెలికి ఏ ఆపదా రానీయకు. దాని జీవితం నేను లేకపోయినా సుఖంగా జరిగిపోవాలి, ఎలా చూసుకుంటావో....'
అతడి ఆలోచన్లని తెగ్గొడ్తూ గాలిలో ఆఖరిమాట గట్టిగా విన్పించింది.
"ఫైర్"
చావు వచ్చేస్తే ఫర్లేదు. చావు ముందు కోమా వచ్చి, ఆ మత్తులో ప్రాణంపోయినా ఫర్లేదు. కానీ సంపూర్ణ ఆరోగ్యంతో వుండి కొద్దిక్షణాల్లో రాబోయే చావుకోసం ఎదురు చూడటం ప్రత్యక్ష నరకం.
అతని పరిస్థితి అలానే వుంది. ఆ ఒక్కక్షణంలో వెయ్యి ఆలోచనలు ముందు తుపాకీ పేలిన శబ్దం వినిపిస్తుందా? లేకపోతే ఒక్కసారిగా శరీరం తూట్లు తూట్లు పడటంతో ప్రాణం పోతుందా? ఏదీ- ఇంకా వినపించదే తుపాకీ శబ్దం?
ఎన్ని ప్రిన్సిపల్స్ వున్నా - ఎంత ధైర్యవంతుడయినా, ఆ క్షణం వేణుకి వెన్నులో చలి పుట్టింది. ఈ స్థితి భయంకరంగా వుంది. తొందరగా.... తొందరగా పేలితే బావుండు! కానీ వెనకాల అసలు చీమ కదిలిన అలికిడి కూడా వినిపించటం లేదు.
గట్టిగా మూసుకున్న కళ్ళను తెరిచాడు. ఎదురుగా గోడ కనపడుతూంది. అక్కడక్కడా పెచ్చులూడిపోయిన గోడ.... తుపాకీ పేలివుంటే తన రక్తం ఆ గోడమీదకు చిమ్మాల్సింది.
ఒక్కొక్క సెకనూ యుగంలా గడుస్తూంది. అతడు తలతిప్పి కొద్దిగా పక్కకి చూసేడు. ఏ అలికిడి వినిపించకపోవడంతో మరింత ధైర్యంచేసి వెనక్కి తిరిగాడు.
వెనకాల మిలటరీ లేదు, తుపాకులు లేవు.
ఒక కుర్చీలో వృద్ధుడు ఒకడు కూర్చుని తాపీగా హుక్కా కాలుస్తూ తననే చూస్తున్నాడు. వేణుకి అది కలో నిజమో అర్ధంకాలేదు. ఆ వృద్దుడెవరో కాదు. బ్యాంకులో దొంగలు అటకాయించగా తను రక్షించినవాడు. అతడు ఈ మిలటరీ క్యాంప్ లోకి ఎలా వచ్చాడో ఎందుకు వచ్చాడో అర్ధంకాక అయోమయంగా చూశాడు.
వేణుని చూసి అతడు నవ్వాడు.
"రా అబ్బాయ్! ఇలా వచ్చి కూర్చో. ఒక సిగరెట్టు తాగు, టెన్షన్ తగ్గుతుంది" అన్నాడు. వేణు వద్దన్నట్లు తలూపాడు. దగ్గరకెళ్ళి కూర్చోకుండా నిలబడి, "ఏమిటి జరుగుతూంది ఇక్కడ" అని అడిగాడు.
దానికి సమాధానం చెప్పకుండా వృద్ధుడు హుక్కా తాగడంలో నిమగ్నమయి, "ప్రాణం పోయినా నువ్వు అబద్ధం చెప్పవన్నది నిజమే నన్నమాట" అన్నాడు.
వేణుకి బ్యాంకులో తామిద్దరి మధ్యా జరిగిన సంభాషణ గుర్తొచ్చింది.
'నువ్వు ఎప్పుడూ నిజమే చెప్తావా?' అని ఆయన అడిగినప్పుడు తను 'అవును' అనటం.... ఇదంతా ఏదో నాటకం అని అర్ధమవుతున్న కొద్దీ అతడిలో కోపం చోటు చేసుకోసాగింది.
"ఏమిటిదంతా?" అని అడిగాడు.
