"సర్లెండి... పనెవరికి లేదు.. ఇరవై నాలుగ్గంటలూ ఇలా ఫైళ్లు ముందేసుకుని కూర్చుని ఇంత సీరియస్ గా పనిచేస్తే మెదడు మొద్దుబారి పోతుంది... మధ్య మధ్య నాలాంటి స్నేహితులతో కులాసాగా కబుర్లు చెప్తే అలసట అనేది ఉండదు..."
"ఇంతకీ మీపేరు?" గణేశ్ రావు కుర్చీలో అలసటగా వెనక్కువాలాడు.
***
"చూశారా... పని చేసి మీ మెదడు మొద్దుబారిపోయింది. నా పేరే మర్చిపోయారు. నా పేరు బుచ్చిబాబు అండీ బాబూ.."
"ఏం పనిమీద వచ్చారు?"
మళ్ళీ అదే కూత?
"అబ్బ... పనీ...పనీ... ఏం సిన్సియర్ వర్కర్లండీ బాబూ..." నువ్వు నటిస్తూ మస్కా కొడుతున్న ధోరణిలో అన్నాను.
వెధవ కాస్త చిరునవ్వు నవ్వాడు. పడ్డాడు... వల్లో పడ్డాడు.
"అద్సరేగానీ మీరు ఆవకాయ పెట్టుకున్నారా...?"
గణేశ్ రావు తెల్లబోయి చూశాడు.
సుబ్బలక్ష్మి కిసుక్కున నవ్వింది.
సుబ్బలక్ష్మికి సెన్సాఫ్ హ్యూమరుంది.
"ఏమిటీ??" గణేశ్ రావు అడిగాడు.
వీడికి బుర్రలేదు. పదిసార్లు చెపితే గానీ అర్థంకాదు.
"ఆవకాయ పెట్టుకున్నారా?..."
"అబ్బే ఇంకా లేదండీ..." ఇబ్బందిగా కదులుతూ సుబ్బలక్ష్మి వంక ఓ అరక్షణం చూసి అన్నాడు.
నాతో మాట్లాడుతూ అటు చూస్తాడేం వెధవ? కొంపదీసి సుబ్బలక్ష్మి తో వెధవ్వేహ్సలు వెయ్యాలని అనుకోవడం లేదుకదా..."
"ఇంకా ఆవకాయ పెట్టుకోలేదూ... మా యింట్లో పోయిన నెల్లోనే పెట్టేశాం... మార్కెట్లోకి పళ్ళు వచ్చేస్తున్నాయ్. ఇంకొద్ది రోజులుపోతే మీకు మామిడికాయలు దొరకవు. త్వరగా ఆవకాయ పెట్టుకోండి..."
"అలాగే.."

"అన్నట్లు మీరు మామిడికాయ ముక్కల్ని ఉప్పులో ఊరేసి ఎండబెట్టి నిలవ ఉంచుకుంటారా?...."
"ఆ..." గణేశ్ రావు మళ్ళీ ఇటునుంచి అటు కదిలాడు కుర్చీలో.
"మీకు మామిడి పళ్ళలో ఏ పళ్ళంటే యిష్టం?"
"ఏమీ యిష్టంలేదు..."
నాకు చెరుకు రసాలంటే యిష్టం... కానీ ఇక్కడ మంచి రసాలు దొరకవు... మా ఊళ్ళో మంచిరకం రసాలు ఇంతంత పెద్దవి దొరుకుతాయి. ఏమిటి అలా కదులుతున్నారు?... కుర్చీలో గుండు సూదులేమైనా ఉన్నాయేమో చూస్కోండి..."
గణేశ్ రావ్ సీరియస్ గా చూశాడు. నవ్వలేదు... వెధవకి సెన్సాఫ్ హ్యూమర్ లేదు. ఓరగా సుబ్బలక్ష్మి వంక చూశాను.
సుబ్బలక్ష్మి ముసిముసిగా నవ్వుతోంది నాకు చచ్చేంత ఉత్సాహం వచ్చింది.
"ఇక్కడ పళ్ళు తూకం వేసి అమ్ముతారు గానీ మా ఊళ్లో పాతికలు, పరకలు లెక్కన అమ్ముతారు... ఇంతకీ పరకలంటే ఎంతో తెలుసా?.... పదమూడండీ బాబూ. ఇంకపోతే అక్కడ పంచదార కలశాలు అనే మామిడిపళ్ళు కూడా దొరుకుతాయ్, అనీ..."
"నాకు అర్జెంటుగా బయటికి వెళ్ళే పనుంది.... వస్తాను..."
గణేశ్ రావ్ కుర్చీలోంచి లేచి సర్రున బయటికి వెళ్ళి పోయాడు. నేను కూడా లేవక తప్పలేదు.
,మర్నాడు అదే సమయానికి గణేశ్ రావ్ సెక్షనులోకి అడుగు పెట్టాను. కుర్చీలాక్కుని గణేశ్ రావ్ దగ్గర కూర్చుందామని అనుకుంటూ ఉండగా "ఏమోయ్ బుచ్చిబాబూ... ఇలారా-" అంటూ వాళ్ళ సెక్షన్ సూపరింటెండెంటు లక్ష్మణరావు పిలిచాడు.
రోజూ ఇలా వచ్చి మా క్లర్కుల్ని డిస్టర్బ్ చెయ్యకు అని తిట్టడానికి పిలిచాడేమో!... నెమ్మదిగా అతని దగ్గరికివెళ్ళి నిలుచున్నా.
"కూర్చో..."
కూర్చున్నాను.
"నువ్వు పలానావారి అబ్బాయివేనా?"
"అవునండీ!..."
"మరి చెప్పవేం?.... మీ నాన్న నేను క్లోజు ఫ్రెండ్సోయ్. పోలికబట్టి నిన్ను గుర్తుపట్టాను."

లక్ష్మణరావు ఒక గంటపైగా నన్ను కూర్చోబెట్టి నానారకం చెత్త వాగుడు వాగి నన్ను పంపించేశాడు. సుబ్బలక్ష్మిని చూడాలన్నా వీలులేకుండా ఆమె సీటు వెనక్కు ఉంది. ఆయన మాట్లాడుతుంటే వెనక్కి తిరిగి చూస్తే ఏం బావుంటుంది?
