Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 58


    కోపం పట్టలేకపోయాను.


    "బాస్! నీవు నన్ను రాంసింగ్ ని మృత్యు ముఖంలోకి చాలా దారుణంగా తోసేయబోయావు.


    చావు తప్పి కన్ను లొట్టబోయినంత పనయి బయటపడ్డాము.


    పోలీసులకి అబద్ధపు ఫోన్ కొట్టి ఇంకా మమ్మల్ని చావగొట్టించబోయావు.


    నీ మాటలు చేతలు అన్ని మోసపూరితాలే..."


    నా మాటలకి అడ్డు తగిలి "కాదుకాదు" అన్నాడు బాస్ గాడు.


    "కాదా! నేనేమీ చెవిలో చెట్లు మొలిపించుకుని లేను. నీ దగ్గరకి మారువేషాలలో ఉదయం సాయంత్రం వచ్చేది ఎవరో తెలుసా! ఇన్ స్పెక్టర్ వర్ధనరావు, హెడ్ కానిస్టేబుల్ అహోబిలం. వాళ్ళు నీ దగ్గరికి మారువేషాలలో దేనికి వస్తున్నారు?"


    "ఆ...వాళ్ళిద్దరూ ఇన్ స్పెక్టర్ కానిస్టేబులా...ఆ విషయమే నాకు తెలియదు. ఊళ్ళోకి వెళ్ళలేక మనిషికోసం తాటి తోపుల దగ్గరికి వెళ్ళి చూస్తుంటే వీళ్ళు కనపడ్డారు. డబ్బు ఆశ చూపి నాకు కావల్సినవి తెప్పించుకుంటున్నాను."


    "నేను నీ మాటలు నమ్మాలంటే చాలా నిజాలు కావాలి బాస్! నా ప్రశ్నలకి ముక్కుసూటిగా సమాధానం ఇవ్వు. నీవు చెప్పేది అబద్ధం అని తెలిసిన మరుక్షణం నా చేతిలోని ఈ కత్తి నీ నాలుకని వేయి ముక్కలుగాను, శరీరాన్ని లక్ష పీలికలను చేస్తుంది." కఠినంగా అన్నాను కత్తిపట్టిన చేతిని బాస్ గాడి కళ్ళముందు అటూఇటూ ఆడిస్తూ.


    బాస్ గాడు పేలవంగా నవ్వాడు.


    "అడుగు" అన్నాడు.


    "ఇలా ఇక్కడి దాక్కోవలసిన అవసరం ఏమొచ్చింది? కోటి యాభయ్ లక్షల రూపాయల వజ్రాలు ఎక్కడ వున్నాయి? ఈ రెండు నిజాలు చెబితే చాలు. నీ మాటల్లోని నిజం తెలిసిపోతుంది. ఆ తర్వాత ఆలోచిస్తాను ఏం చేయాలి అన్నది" కఠినంగా పలికాను.


    "అడగవలసినవే అడిగావు. ఆ రోజు మన స్థావరం రహస్యం చెప్పింది బలదేవ్ ముఠావాళ్ళు. బలదేవ్ ముఠానుంచి విడిపోయి నేను వంటరిగా ఒక స్థావరం...ముఠాని ఏర్పరుచుకున్నాను. పెంచుకున్నాను. నా గతం నీకు తెలియదు. నాకు బలదేవ్ కి ఎప్పుడూ పడదు.


    సమయం చూసి బలదేవ్ పోలీసులకి ఫోన్ చేయటం వాళ్ళు మన స్థావరం మీదకి దండెత్తటంతో నేను ఎక్కడివి అక్కడ వదిలేసి పరారయ్యాను.


    మీరు పోలీస్ స్టేషనులో వున్నారని తెలిసి తప్పుడు సమాచారంతో ఇన్ స్పెక్టర్ కి ఫోన్ చేశాను.


    వజ్రాలు మీ దగ్గరేవున్నామని నాలుగు తంతే చెపుతారనీను... నా కసి అలాంటిది.


    అసలు విషయం కోటీ యాభయ్ లక్షల రూపాయల విలువగల వజ్రాలు మీ ఇద్దరిని బంధించి నా చేజిక్కించుకున్నాను.


    ఆ వజ్రాలని పొట్లంగా కట్టి ఫారెన్ నుంచి తెప్పించిన ఓ టోపీ లోపల దాచి ఆ పొట్లం కనపడకుండా సిల్కు గుడ్డ మడతలు పెట్టి లోపల కుక్కి టోపీకేసి కుట్టేశాను.


    ఆ టోపీని పక్కగదిలో వంకెకి తగిలించాను.


    టోపీ తీసుకెళదాము అన్న ఆలోచన ఆ సమయంలో రాలేదు.


    ఊహించని మెరుపు దాడితో కంగారు వేసింది.


    కాళ్ళకి బుద్ధి చెప్పాను.


    స్థావరం అంతా ధ్వంసం చేసి పోలీసులు మన ముఠాలోని కొందరిని అక్కడికక్కడే చంపి మరికొందరిని పట్టుకొని వెళ్ళిపోయారు.


    స్థావరం దగ్గర పోలీసు కాపలా ఉండటం వల్లనను తిరిగి అక్కడికి రాలేకపోయాను.


    వారం తర్వాత వచ్చి చూస్తే స్థావరం అంతా పాడయిపోయి ఉంది.


    చాలా సామానులు విరిగి ముక్కలయి వున్నాయ్.


    వజ్రాలు దాచిన టోపీ ఎక్కడా కనపడలేదు.


    మీరు పోలీస్ స్టేషన్ లో వున్నారని తెలిసింది.


    మీరు అక్కడ క్షేమంగా వున్నారు.


    వజ్రాలున్న టోపీ మాయమయింది.


    ఆ కోపంతో_


    "మీ దగ్గరే వజ్రాలున్నాయని...నాలుగుతికితే ఆ రహస్యం చెబుతారని..." అని ఇన్ స్పెక్టర్ గారికి ఫోన్ చేసేవాడిని.


    ఈ ఊళ్ళోనే అక్కడక్కడా తల దాచుకొంటూ వుండగా బలదేవ్ ముఠా వాళ్ళు నన్ను చూడటం జరిగింది.


    వాళ్ళల్లో ఒకడు నా కాలిమీద కత్తి విసిరి గాయం చేశాడు.


    అలాగే ఆ గాయంతో ఊళ్లోంచి పారిపోయి ఇక్కడికొచ్చి దాక్కొన్నాను.


    నా ప్రాణం తీయడానికి అటు ఇన్ స్పెక్టర్, ఇటు బలదేవ్ ముఠాలోని వాళ్ళు విడుదలైతే మీరు వున్నారని నాకు తెలుసు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS