భారతిని అతడు ప్రేమించడం లేదు.
కేవలం వాంఛ, పశువాంఛ, వ్యామోహం తప్ప ఆమెపట్ల అతనికి మరో ఉద్దేశం లేదు. ఇంత కాలంగా అతనిలో నిక్షిప్తంగా వున్న వ్యామోహం ఇప్పుడు విజృంభించి అతన్ని పశువుని చేస్తోంది.
మనోహర్ని నడిరోడ్డుపైన హత్య చేయాలన్నంత కసితో పళ్ళు కొరికాడు బోసుబాబు. అతని పిడికిలి బిగుసుకొంది.
కానీ మనోహర్ ఇదేమీ గమనించలేదు. అతన్నో పిచ్చికుక్కని చూసినట్టుగా చూసి కారెక్కి స్టార్ట్ చేశాడు.
బోసు చేతిలోని సిగరెట్ పీకని కింద పడేసి బాబు కాలితో కసిగా నలిపేశాడు.
అతనేదో నిశ్చయానికి వచ్చినవాడిలా నడవడం మొదలుపెట్టాడు.
శ్రీదేవి క్లాత్ స్టోర్స్ ముందుకొచ్చిన కాళ్ళకి బ్రేకులు వేసినట్టుగా ఆగిపోయాడు. అతని మస్తిష్కంలో ఏదో ఆలోచన మెరుపులా మెరిసింది.
గబగబా శ్రీదేవి క్లాత్ స్టోర్స్ లోకి నడిచాడు బోసుబాబు.
33
భారతి మీద కక్షసాధించాలన్నీ, ఆమె తిరిగి మనోహర్ని కలుసుకోకుండా చెయ్యాలన్నీ ఒక్కటే మార్గం.
భారతి తల్లికి చెప్పాలి.
ఆమెకి భారతి ప్రేమాయణాన్ని ఫోన్లో చెప్పేస్తే ఆ ప్రేమ కధకి మంగళహారతి పాడేస్తుందని బోసుకి తెలుసు.
బోసు టెలిఫోన్ రిసీవర్ని తీసి నెంబరు డయల్ చేశాడు.
"ఎవరికి!" అడిగాడు షాపు ఓనరు వెంకటేశం.
బోసు వెకిలిగా నవ్వాడు.
"భారతికి" అన్నాడు.
..... అదే సమయంలో భారతి హాల్లో అడుగుపెట్టింది. ఇంట్లో తల్లిలేదని పోర్టికోలోనే తోటమాలి చెప్పడంతో కులాసాగా కూనిరాగం తీస్తూ మేడమెట్లు ఎక్కబోతుంది భారతి.
అంతలో ఫోన్ మోగింది.
భారతి వెనక్కి దిగివచ్చి రిసీవర్ని లిప్టుచేసి "హలో" అంది.
"కెన్ ఐ స్పీక్ టు మిసెస్ లక్ష్మీపతి?" అడిగింది అవతల గొంతు.
ఆ గొంతెక్కడో విన్నట్లు అనిపించింది భారతికి.
"ఆమె లేదు. మీ పేరు చెప్పండి" అంది భారతి.
"హిహిహి" అని వెకిలిగా ఓ నవ్వు వినిపించింది.
"స్టుపిడ్. నువ్వా గాడిదలా ఏవిటా సకిలింపు!" అంది ఈసడింపుగా.
"ఈ గాడిద సకిలింపు మీ మమ్మీ విన్నాక నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడుస్తావు."
"ఏంటి కధ!" తీక్షణంగా అడిగింది.
"కథే. కానీ కధలాలేదు. చాలా స్పీడుగా వుంది. దానికి స్పీడ్ బ్రేకర్లు అడ్డువెయ్యాలంటే మీ మమ్మీకి చెప్పాలి. అప్పుడుగానీ మనసు చల్లారదే బుల్ బుల్" అన్నాడు బోసుబాబు.
"రాస్కెల్" కోపంతో ఆమె ముక్కుపుటాలు ఎగిరిపడుతున్నాయి వాడు ఎదురుపడితే పీక పిసికి చంపాలనిపిస్తోంది.
బోసు నవ్వాడు.
"నీ ఇష్టమొచ్చినట్టుగా దీవించు. ఏం పర్వాలేదు. నిన్నటిదాకావాడ్ని ఛీ కొట్టావు. ఈరోజు వాడి ఒళ్ళో దూరుతున్నావు. ఇన్నాళ్ళనించి నీకోసం తహతహలాడిపోతున్న నా గుండెకి నిప్పుపెడుతోంది. చూస్తూ వూరుకోడానికి నేను చేతకాని వాడిని కాదు."
"ఏం చేస్తావ్?"
"జనగణమణ పాడేస్తాను. నీ కాళ్లు విరగొట్టి మూలపడేస్తుంది మీ మమ్మీ."
"కల కంటున్నావా!"
"కాదు జరగబోయేదాన్ని ఫోర్ కాస్ట్ చేసి చెబుతున్నాను. మనోహర్ నెంబర్ వన్ రోగ్. వాడు ప్రేమిస్తున్నానని నాటకం ఆడి నీతో ఆడుకొని వదిలేస్తాడు. నేను నిన్ను ప్రేమించానని అబద్దం చెప్పడం లేదు. మళ్ళీ నీ జోలికి రాను" అన్నాడు.
"పిచ్చికూతలు కూస్తే నీ నాలిక చీరేస్తాను" ఆవేశంగా అంది భారతి.
బోసు నవ్వాడు.
"డైరెక్టుగా అడిగితే ఏ ఆడదానికైనా ఒళ్ళుమండిపోతుంది. నేను నీ జోలికి రాను. ప్లీజ్ యు బి నైస్ టు మీ లైక్ యు ఆర్ టు హిమ్" అన్నాడు.
"ఒరేయ్ నక్కా, ఇప్పుడు నేను చెప్పేది విను. నేను ఫూల్ నికాదు నేనూ మనోహర్ పెళ్ళి చేసుకుంటున్నాం. దానికి పెద్దవాళ్ళందరి అండదండలు వున్నాయి. అంచేత నీ నోరుని కట్టేసుకో. లేకపోతే నీలాంటి నక్కల్ని కుక్కల్ని ఎలా వేటాడాలో నాకు బాగా తెలుసు."
"ఈ పెళ్ళి జరగనివ్వను" అన్నాడు బోసుబాబు.
"ఏడిశావు" అని ఫోన్ పెట్టేసింది భారతి. బోసు రిసీవర్ని పెట్టేస్తుంటే వెంకటేశం అన్నాడు. "ఇంకెప్పుడు ఇక్కడ్నించి ఫోన్ చేయకండి. వాళ్ళు మాకు బాగా తెలిసినవాళ్ళు" అని.
"అయితే దాని సంగతి నీకేం తెలుసు. అది నాతో తిరిగింది. సినిమా కొచ్చింది. బార్ కొచ్చింది. మందుకొట్టింది" అన్నాడు బోసు.
"అవన్నీ మాకనవసరం. మా షాపునించి ఇలాంటి పిచ్చి పిచ్చి కాల్స్ ఎవరికి చేసినా వూరుకోం. తెలిసిన వాడివి కనుక ఈసారికి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడూ మా షాపుకి రాకండి" అన్నాడు వెంకటేశం.
బోసు అతనికేసి కోపంగా చూసి బయటికి నడిచాడు.
భారతి అతనితో ఫోనులో అంత ధైర్యంగా మాట్లాడిందే కానీ ఆమెకి తెలీకుండానే ఆమె గుండెనిండా భయం చోటు చేసుకొంది.
