Previous Page Next Page 
త్రీ -ఇన్- వన్ పేజి 57

     "మరి?..." నేను బెంబేలెత్తి పోయాను.

    ఈ వికారం శారీరిక రుగ్మతవల్ల కలిగింది కాదు.. అది మానసికమైనది... దీనికి కారణం సుబ్బలక్ష్మి..."

    "సుబ్బలక్ష్మి !!..."

    "అవును... సుబ్బలక్ష్మిని నువ్వు ప్రేమిస్తున్నావు. వికారం ఈజీక్వల్టు ప్రేమ... హహహ..."

    వెంటనే చేతికి జేబురుమాలు అందని కారణంగా చొక్కా పైకెత్తి నోటికి అడ్డుపెట్టుకుని నవ్వాడు పాపారావు. అతని చొక్కా క్రింది భాగం అంతా తడిసిపోయింది.

    ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. పాపారావు మాటలే నా చెవుల్లో ప్రతి ధ్వనిస్తున్నాయ్.

    "వికారం ఈజీక్వల్టు ప్రేమ ....." అవును సుబ్బలక్ష్మి నా డ్రీమ్ గర్ల్ - సుబ్బలక్ష్మిని నేను ప్రేమిస్తున్నాను. ఇన్నాళ్ళకి నేను కూడా ప్రయోజకుడినయ్యాను.... సుబ్బలక్ష్మిని నా స్వంతం చేసుకుంటేగానీ నా వికారం తగ్గదు.

    మర్నాడు...

    "సుబ్బలక్ష్మిని నేను వికారిస్తున్నాను" అన్నాను పాపారావ్ తో.

    పాపారావు అర్థంకానట్టు చూశాడు నావైపు.

    "అదే...ప్రేమిస్తున్నాను...వికారం ఈజీక్వల్టు ప్రేమ. నిన్న రాత్రంతా బాగా ఆలోచించాను."

    "ఈ వ్యవహారంలో నీ సలహా కావాలి ఇప్పుడు నేనేం చెయ్యాలి?"

    "ముందు ఆమె పనిచేసే సెక్షనుకి రోజూ ఏదో నెపంమీద వెళ్ళు... ఆమె వైపు చూపులూ, చిరునవ్వులూ విసిరి ఆమె అంటే నీకు యిష్టం ఉందని ఆమెకి తెలిసేలా ప్రవర్తించు... తరువాత నెమ్మది నెమ్మదిగా మాటలు కలుపు...

    "రోజూ పనిలేకుండా ఏ నెపం పెట్టుకుని ఆ సెక్షనుకి వెళ్ళాలి? తీరా వెళ్ళిన తరువాత అక్కడ ఓ మూల నిలబడి ఆమెవైపు చూస్తూ ఉంటే ఏం బావుంటుంది?.... అంటూ నా సందేహాన్ని వెలిబుచ్చాను.

    పాపారావ్ విసుక్కున్నాడు.

    "మరీ ఇంత అజ్ఞానం అయితే ఎలా?.... సెక్షనులోని గణేశ్ రావ్ తో స్నేహం కలుపుకో. అతనితో మాట్లాడడానికి వెళ్ళినట్టు వెళ్ళి ఆమె మీదకి లుక్స్ విసురు. అన్నట్టు గణేశ్ రావుది ఆ అమ్మాయి ప్రక్కసీటే, బాగా దగ్గరుండే లుక్స్ విసరొచ్చు.

    పాపారావ్ సలహా నాకు బాగా నచ్చింది. అప్పటికప్పుడే సుబ్బలక్ష్మి పనిచేసే సెక్షనులోకి వెళ్ళాను. ఆ సమయంలో సుబ్బలక్ష్మి టైప్ చేస్తోంది. గణేశ్ రావ్ ఫైల్లో ఏదో కెలుకుతున్నాడు పెన్నుతో.

                                     

     కుర్చీ లాక్కుని గణేశ్ రావు ముందుకుర్చున్నాను. గణేశ్ రావ్ తలెత్తి నా వైపు చూశాడు.

    "హలో గురూ బావున్నారా? ఏమిటో ఈ మధ్య మీరు మా సెక్షనుకు రావడం లేదు..." అన్నాను చాలా కలుపుగోరు తనంగా.

    గణేశ్ రావ్ తెల్లబోయి నా వంక చూశాడు. బహుశా హఠాత్తుగా నేను చనువుగా పలకరించినందుకు కాబోలు.

    "బాగానే ఉన్నాను... ఏం పనిమీద వచ్చారు?..."

    ఈ వెధవ హఠాత్తుగా ఇలా అడుగుతాడని అనుకోలేదు. వచ్చిన వాడితో ఆ మాటా ఈ మాటా మాట్లాడితే వీడి సొమ్మేం పోయింది? ఏం పనిమీద వచ్చారట! బోడిస్టెయిలూ వీడూను.

    "పనేంలేదు... నా సీట్లో అంతగా పనిలేదు. పోనీ గోళ్ళు గిల్లుకుందా మనుకుంటే అవెప్పుడో కొరికేశాను... హి...హి...హి..."

    సుబ్బలక్ష్మి వంక ఓరగా చూశాను. ఆమె నా జోక్ కి నవ్వలేదు. అంత అందమైన అమ్మాయికి సెన్సాఫ్ హ్యోమర్ లేకపోవడమేమిటి? ఉహూ... ఉండే ఉంటుంది. నా జోక్ విని ఉండకపోయి ఉండొచ్చు... అంతే.

    "మీకు పనిలేక పోవచ్చుగని నాకు చాలా పని ఉంది.." అని తల ఫైల్లో దూర్చేశాడు గణేశ్ రావు.

    నేను పాపారావు దగ్గరికి వెళ్ళి వాడిని చెడామడా తిట్టేశాను... నీ సలహా ఏడ్చినట్టే ఉందని.

    "మరి ప్రేమంటే ఏమనుకున్నావ్? సహనం ఉండాలి. అవమానాలూ బాధలు భరించాలి... సుబ్బలక్ష్మితో నీకు కాస్త పరిచయం అయ్యేవరకూ ఆ గణేశ్ రావుగాడిని జిడ్డులా పట్టుకో... ఆ తరువాత వాడిని నువ్వు కేర్ చెయ్యక్కరలేదు..." అన్నాడు మర్నాడు... పాపారావ్.

    గణేశ్ రావు ఎదురుగా కుర్చీ లాక్కుని కూర్చున్నాను. "హలో బావున్నారా?" సుబ్బలక్ష్మి వైపు చూస్తూ గణేశ్ రావుని అడిగాడు.
                                        
   

     "బావున్నాను గానీ... చాలా బిజీగా ఉన్నాను."

    వెధవ... నేను సుబ్బలక్ష్మి గురించి వస్తున్నట్లు... పసిగట్టలేదు కదా....


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS