బాస్ గాడిని నరికి ముక్కలు చేసినా పాపంలేదు! అంతకు క్రితం ఊళ్ళోకి వచ్చి ఫోన్ చేసినవాడు. ఇప్పుడెందుకు తాటితోపులో దాక్కున్నట్లు? ఎవరికి భయపడి? వాడు తప్ప అక్కడ యింకా ఎవరూ లేరు.
బాస్ గాడిని ఇన్ స్పెక్టర్ గుర్తించలేదా! మారువేషంలో వుండటం వల్ల ఇన్ స్పెక్టర్ ని బాస్ గాడు గుర్తించలేదా? అసలు వీళ్ళ మారువేషాలు ఏమిటి? వీళ్ళకి బాస్ గాడికి ఎలా పరిచయం అయింది!
అన్నీ ప్రశ్నలే. సమాధానాలు వక్కటీలేవు. కోటీ యాభై లక్షల రూపాయలు విలువగల వజ్రాలు ఎక్కడున్నా మా బాస్ గాడికి తెలుసు. ఇలా రోజూ మేము ఇన్ స్పెక్టర్ ని ఫాలో అయ్యేబదులు, బాస్ గాడి పీక పుచ్చుకుంటే సరి__
ఆలోచించి ఆలోచించి మాంచి ప్లాన్ వేశాను. బాస్ గాడిని బంధించి చావచితక్కొట్టి చెవులు మూస్తామని బెదిరించి కోటీ యాభై లక్షల రూపాయల విలువగల వజ్రాలు ఎక్కడ దాచాడో తెలుసుకోడం ఇన్ స్పెక్టర్ గారితో వివరంగా మాట్లాడటానికి కూడా లేదు. ఇప్పటికే చాలా అబద్ధాలు ఆడి వున్నాము. పోలీసుతో తలపడి తల గోక్కునేకన్నా కొరివితో తల గోక్కోటం నయం.
రాత్రి పదకొండు గంటలవేళ నేను రామ్ సింగ్ రెండోకంటికి తెలీకుండా తాటితోపు దగ్గరకి వెళ్ళాం. ఈ రెండు రోజులబట్టీ మేము చాటుగా వుండి పరిశోధన చేయటం వల్ల బాస్ గాడు ఎక్కడ పడుకుంటున్నాడో మేము కనిపెట్టాం.
తాటితోపు నుంచి ఐదునిమిషాలు వెనక్కి నడిచి వెళితే కొండలు వస్తాయ్. చిన్నచిన్న కొండలు. వాటిలో గుహలు వున్నాయి. ఒక గుహలో బాస్ గాడు నివాసం ఏర్పరచుకున్నాడు. అక్కడ గుహ వున్నట్టే తెలియదు. ఎందుకంటే గుహకి అడ్డంగా ఏదో చెట్టు పిచ్చిగ అడ్డంగా పాకి వుంది. దానిని తొలగించుకుని లోపలికి వెళితేగాని అక్కడ గదిలాంటి గుహ వుందని తెలియదు.
ఇవన్నీ మేము ముందే చూసుకోబట్టి మా పని చాలా సులువైంది.
రాంసింగు చేతిలో పవర్ ఫుల్ టార్చ్ లైట్ వుంది.
నా చేతిలో కత్తి వుంది.
నా నడుముకి బెల్ట్ లాగా సైకిల్ చైన్ వుంది.
అవసరమయితే ఉపయోగించడానికి మరికొన్ని పరికరాలు మా వంటిమీదనే వున్నాయ్.
బాస్ గాడు బాగా నిద్రపోతూ ఉంటాడు.
ఇదే మంచి సమయం.
పిల్లుల్లాగా వకరి వెనక వకరం తీగల్ని తొలగించుకుని గుహలో అడుగు పెట్టాం.
నేను కత్తిని చేతిలో బిగించి పట్టుకున్నాను.
రాంసింగ్ ఛక్ మని టార్చిలైటు స్విచ్ నొక్కాడు.
ఒక్కసారిగా గుహంతా వెలుగుతో నిండిపోయింది.
ఎదురుగా వున్న దృశ్యం చూసి అవాక్కయిపోయాను నేను.
నేలమీద అస్తవ్యస్తంగా బాస్ పడుకుని బాధతో కొట్టుకొంటూ ఛాతీమీద చెయ్యి పెట్టి నొక్కుకుంటున్నాడు.
వెలుతురు ఎదురుగా వుండటం వల్ల బాస్ మాకు కనబడుతున్నాడు గాని మేము బాస్ కి కనబడటం లేదు.
ముందుగా_
"ఎవరది?" అన్నమాట ఆ వెంటనే "హెల్ప్ మీ!" అన్నమాట బాస్ నోట్లోంచి వచ్చాయ్.
ఆ పరిస్థితుల్లో బాస్ గాడిని చూసిన నాకు వాడు నాటకం ఆడుతున్నాడని అనిపించలేదు.
"నేనే బాస్! గుండూరావ్ ని. నీవు నరికేసుకున్న నీ కుడిచేతిని. ఇతనేమో నీకు కోటీ యాభయ్ లక్షల రూపాయల విలువగల వజ్రాల సంగతి చెప్పిన రాంసింగ్" అంటూ దగ్గరకి వెళ్ళాము.
నా గడ్డం తొలగించి బాస్ కు నా ముఖం చూపించాను.
బాస్ నన్ను గుర్తుపట్టాడు.
ఒక్కసారిగా భోరుమన్నాడు.
ఇది నాటకం కాదు.
బాస్ నిజంగానే ఏడుస్తున్నాడు.
నా చేతులు పట్టుకుని_
"నన్ను క్షమించు" అన్నాడు.
"ఏంటి యార్! ఈ నాటకం? బాస్ గాడ్ని గట్టిగా అడుగు." రామ్ సింగ్ పెద్ద గొంతేసుకొని అన్నాడు.
బాస్ గాడు ఒక చేతిలో గుండెని గట్టిగా నొక్కి పట్టుకొని "నేను మారానంటే ఎవరూ నమ్మరు. గంటక్రితం వరకు నేను నరరూప రాక్షసుడినే. మృత్యుదేవత నాముందుకొచ్చి తలుపు తట్టింది. మృత్యువుని నేను తప్పించుకోలేను. ఈ నిజం నాకు తెలిసిపోయింది. వంటరిగా చనిపోతున్నాను. ఆ భయం ఈ బాధ భరించలేక ఎవరయినా వస్తే బాగుండునని భగవంతుడిని కోరుకున్నాను. మీరు వచ్చారు. నేను మీపట్ల ద్రోహం చేశాను."
బాస్ గాడు ఇంకేదేదో చెప్పబోతుంటే... బాస్ గాడి నోట్లోంచి భగవంతుడి గురించి మాటలా! దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అనిపించింది.
