Previous Page Next Page 
ఆగ్నిశ్వాస పేజి 58


    "ఉండదు... ఎందుకంటే అప్పటికా యస్సైని జయచంద్ర కొనేశాడు కాబట్టి..."


    షాక్ తిన్నట్టుగా చూశాడు అవినాశ్... అదే యస్సై ఉదయం శవాన్ని మాయం చేస్తానంటూ తనను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు.


    తను ఏం వింటున్నాడు ఇంత ఉన్నతమైన స్థానంలో గల తను ఓ యస్సై ఇలా మోసంచేయడానికి ప్రయత్నించాడూ అంటే జయచంద్ర పలుకుబడి ఇంత లోతుగా విస్తరించి పోయిందా.


    "నో ప్రోబ్లమ్" తల పంకించిన అవినాశ్ "హెడ్ కానిస్టేబుల్ ని నిలదీసి కక్కిస్తాను" అన్నాడు స్వగతంలో.


    "అసంభవం"


    "అదేం"


    "యస్సై వెళ్లిన అరగంటకి హెడ్ కానిస్టేబుల్ ని నేను కొనేసాను కాబట్టి"


    "వ్వాట్" ఈ ఫౌల్ ప్లే అవినాశ్ కేం అర్థం కావడం లేదు. "మీరెందుకు కొన్నారు."


    "నా స్నేహితుడు జాకీని మరో నేరస్థుడిగా సేల్ లో పెట్టడానికి"


    "దేనికి"


    "మీకు తెలీని ఓ చీకటి రాత్రి ప్రసాదనబడే ఓ నేరస్థుడు సాగర్ పొట్టమీద కాలుంచి ఊపిరి పోయేవరకూ ఎలా టార్చర్ చేసి చంపాడో సాక్ష్యంగా వుండడానికి"


    "మరి ఆ ఇద్దరూ"


    "యస్సై ఆ దేశంపై ప్రసాదుని తెల్లవారు తుండగా బయటకు పంపినట్టే నా కోరిక మీద హెడ్ కానిస్టేబుల్ జాకీని పంపేశాడు."


    "జాకీ వచ్చినట్టు యస్సైకి తెలుసా?"


    "తెలీదు... తెలిసినా హెచ్.సి.ని నిలదీయలేడు..."


    "సాగర్ ని ప్రసాదు చంపినట్టు హెచ్.సి.కి తెలుసా"


    "తెలిసి వుండదు... కారణం ప్రసాదు వచ్చిన కారణం యస్సైకి ఒక్కడికే తెలుసు కాబట్టి. లేడా తెలిసి వుండొచ్చు. ఇద్దరూ తేలుకుట్టిన దొంగల్లా ఓ అండర్ స్టాండింగ్ కి వచ్చుండొచ్చు."


    "డామిట్ హౌ కెన్ ఇట్ బి..." అసహనంగా కణతలు నొక్కుకుంటూ "ఇంత జరిగిందంటే ఎలా నమ్మను..." అన్నాడు.


    "ఇలా..."


    ఓ కవరుతో ఫోటోలు అందించాడు శశాంక.


    ఉద్వేగంగా వాటినందుకున్న అవినాశ్ తాగిన మత్తులో ప్రసాద్ సాగర్ ని చంపుతుండగా మూడు నాలుగు ఏంగిల్స్ లో తీయబడిన ఆ ఫోటోల్ని చూడగానే పాలభాగంపై స్వేదం అలుముకుంది.


    "మీరు జరిగింది తెలుసుకుని సంతృప్తిగా ఇంటికి వెళ్లారు. నేను జరగబోయేది గెస్ చేసి రాత్రంతా కాపు వేసాను."


    "మరి ప్రసాదు ఫోటోలు తీస్తుండగా జాకీని అభ్యంతరం పెట్టలేదా"


    "అభ్యంతరం పెట్టే స్థితిలో వుంటేగా... చంపే ముందు మరో ఫుల్ బాటిల్ తాగి పూర్తిగా పరిసరాల్ని మరిచే స్థితికొచ్చాడు. అదే జాకీకి అనుకూలించింది కూడా."


    "థాంక్యూ" శశాంక చేతులు పట్టుకున్నాడు. "థాంక్యూ వెరీమచ్... ఇలాంటి సన్నివేశం నా జీవితంలో ఎదురౌతుందని వూహించని నేను తొలిసారి నా ఓటమితో పాటు అవివేకాన్ని అంగీకరిస్తున్నాను శశాంకా" తను ఎలాంటి హేయమైన వ్యవస్థలో బ్రతుకుతున్నదీ అవినాశ్ తెలుసుకున్న చివరి క్షణమది.


    శశాంక మనసులో అసదృశ్యమైన సంతృప్తి. తనను సవ్యమైన మార్గంలోకి నడిపించబోయిన అవినాశ్ మనసులో చోటు చేసుకున్నది. ఈ దేశంలో  ఆశావాదులైన యువతపై ప్రేమే అయితే తనూ తన వంతు ప్రేమని ప్రకటించాడిలా.


    ఎంతటి అందమైన ఆత్మవంచన...


    వెళ్ళబోతున్న శశాంకని ఆపేడు అవినాశ్. "శశాంకా నేను నేరస్థుడ్ని బంధించలేకపోయినా మీ శ్రీమతిని ఎందుకు హత్యచేసిందీ తెలుసుకో గలిగాను."


    ఎక్కడో ఓ రాబందు రెక్కల చప్పుడు...


    మరెక్కడో ఝుంఝానిల ఢమరుధ్వానం...


    ఒక్క అంగలో అవినాశ్ ని చేరుకున్నాడు శశాంక...


    అదే ఆ జవాబు కోసమే అతడు రోజుల తరబడి అంగలార్చుకు పోతున్నాడు.


    "జయచంద్ర మిమ్మల్ని అల్లుడిగా చేసుకోవాలనుకున్నాడు."


    "వ్వాట్" ముందు ఉలికిపడ్డాడు... ఆ తర్వాత తను సరిగా వినలేదేమో అని నొసలు చిట్లించి రెట్టించాడు.


    "అవును ఒక చిన్న కారణమిది. నమ్మశక్యం కాని నిజంలా అనిపించినా అతడి కూతురు మిమ్మల్ని కోరుకోవడంతో ఇంత అనర్థము జరిగిపోయింది."


    తెగిపోయిన బంధపు అంచుల నుండి క్రొన్నెత్తుటి దారాలు హఠాత్తుగా ప్రవహిస్తుంటే "హౌకెన్ ఇట్ బి..." ఆపాదమస్తకం ప్రకంపించి పోతున్నాడు. ఎక్కడో ఇరాక్ ఇరాన్ ల మధ్య జరిగే యుద్ధంలో ఇక్కడున్న ఓ లేత ప్రాణి కన్ను మూయడమేమిటి...


    "అమెజాన్ లో రక్తం తాగాలనిపించిన ఓ మృగం వాంఛకి ఇక్కడ ఓ సున్నితపాశం వికలమై తను శాపగ్రస్తుడవటమేమిటి... "హౌ... ఇది... ఇదెలా సాధ్యం" అడుగుతున్నాడు.


    "జయచంద్రకున్న ఒకే ఒక్క బలహీనతే అనండి సాఫ్ట్ కార్నర్ కానివ్వండి అతడి కూతురు. ఆమె భర్తగా కోరింది మిమ్మల్ని అంతే. ఒక తిరుగులేని చక్రవర్తి తన గారాల కూతురు కోర్కెను కాదనలేక మీ భార్యని హత్య చేయించాడు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS