"యూ ఆరెక్సీడింగ్ యువర్ లిమిట్స్" డిజిపి ఉక్రోషంగా అన్నాడు.
"బాధ్యతగల ఖాకీ బట్టల లిమిట్స్ ఖద్దరు బట్టలకు సలాం చేయడమే అయితే ఆ బాధ్యత నాకు అక్కర్లేదు."
"మిస్టర్ అవినాశ్" కమీషనర్ నచ్చచెప్పబోయాడు.
ఇంతలోనే జోక్యం చేసుకున్న డి.జి.పి. "యూ ఆర్ సస్పెండెడ్" అంటూ మంత్రిగారికి వత్తాసు పలికాడు.
"వెల్ కమ్ సర్" శాల్యూట్ చేసిన అవినాశ్ "అంతే కాదు నేను నేరస్థుడ్ని అయినప్పుడు శిక్షకే సిద్ధపడుతున్నాను. అంటే మీ దయాదాక్షిణ్యాలు నాకు అక్కర్లేదని చెబుతూ శలవు తీసుకుంటున్నాను." ఆవేశంగా వెనక్కి తిరిగి బయటకు నడిచాడు.
ఇక్కడ బ్యూరోక్రసీ రాజకీయాలతో చేతులు కలిపింది. ఎందరు దోషులకో సింహస్వప్నమైన డిసిపి అవినాశ్ ని దోషిగా నిర్ణయించింది.
* * * *
మధ్యాహ్నం పన్నెండు గంటలు కావస్తున్నది.
అసహనంగా పచార్లు చేస్తున్న అవినాశ్ బజర్ మోగడంతో వెళ్ళి తలుపు తెరిచాడు.
ఎదురుగా శశాంక నిలబడి వున్నాడు.
పోలీసు క్వార్టర్సులో కాక జూబ్లీహిల్స్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వుంటున్న అవినాశ్ ఇంకా బ్రహ్మచారే. కాబట్టే ఇంటిలో సందడి లేదు. మనసులో నెమ్మదించని అలజడి తప్ప.
"రండి." కూర్చోమన్నట్టుగా సౌంజ్ఞ చేశాడు అవినాశ్. "సారీ నేను మాట నిలబెట్టుకోలేకపోయాను" పన్నెండు గంటలలో దోషిని పట్టుకుంటానని తనే దోషిగా మారిన అవినాశ్ నిజాయితీగా తన ఓటమి అంగీకరించాడు.
"నాకు తెలుసు మీరు సమర్థులైన అది సాధించలేరని" మృదువుగా నవ్వాడు శశాంక. "అవును మిస్టర్ అవినాశ్! అనుభవంలో మీకన్నా చిన్నవాడినైనా అతి స్వల్పకాలంలో తెలుసుకున్న నిజమిది. మీ వ్యవస్థ లేకపోతే ప్రభుత్వం లేదు. కాని మిమ్మల్ని ప్రభుత్వం శాసిస్తుంది. ఆ ప్రభుత్వమూ ప్రజలెన్నుకున్నదే కావడంతో మా మూర్ఖ ప్రజలు ఆ ప్రభుత్వాన్నే సమర్ధిస్తుంది తప్ప మీ డిపార్ట్ మెంటు భుజం పట్టదు. ప్రజల దృష్టిలో మీరు శతృవులు. ఎప్పుడో ఒకనాడు ప్రజలనుంచి తమనితాము రక్షించుకోవడం కోసం రాజులు రక్షక భటుల్ని ఉపయోగించుకోవడంతో మొదలైన మీ వ్యవస్థ బ్రిటిష్ పరిపాలనలో మరింత క్లిష్ట దిశకు చేరుకుంది. మీరూ ప్రజల్లోని వాళ్లే. కాని తమను పాలిస్తున్న పరాయిదేశం వాళ్లకి పెయిడ్ సర్వెంట్స్ గా మారారు. కాబట్టి విదేశీయులు శాసనాన్ని మీరు అధికారికంగా అమలుచేయడంలో ప్రజలకి దూరమైపోయారు. శాసనాలు ఉల్లంఘించి స్వరాజ్యం సాధించాలనుకున్న వాళ్ళు బ్రిటిష్ జాతీయులతోపాటు మిమ్మల్నీ శతృవులుగానే భావించారు. అదిగో అక్కడ మొదలైంది ఈ భావదారిద్ర్యం. అది అలాగే ఇంతవరకు కొనసాగిపోతూంది. బ్రతకనేర్చిన పోలీస్ ఆఫీసర్లు స్థిరంగా పైకెదుగుతారు. లేనివాళ్లు మీలా నలిగిపోతుంటారు. ఇదంతా చెప్పింది మిమ్మల్ని ఓదార్చాలని కాదు. కాని నన్ను ఇలాగే మీరు ఓదార్చబోయిన ఆ రోజుని గుర్తు చేయాలని..."
ఒక అద్భుతమైన అనాలికన్ తో కొంత వూరట నందించిన శశాంకను తదేకంగా చూస్తూ నిర్లిప్తంగా నవ్వాడు.
"అయామ్ సారీ..." జరిగిందానికి తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూనే "ఇప్పుడేం చేయబోతున్నారు" అడిగాడు శశాంక.
"ప్రస్తుతానికి సస్పెండ్ చేయబడ్డాను... పోస్ట్ మార్టం రిజల్ట్స్ తర్వాత ఎంక్వయిరీలో నేను దోషినని నిరూపించబడితే..."
"నిరూపించబడతారు..."
"ఏం..."
"మీరు హింసించినట్టు ఆధారాలున్నాయి కాబట్టి సాగర్ చావుకి ఆ హింసే కారణమని పోరెన్సిక్ డాక్టర్స్ చేత సర్టిఫికెట్ ఇప్పించడం జయచంద్రకి కష్టం కాదు కాబట్టి."
"అంటే..."
"ఇంత అనుభవంకల మీరూ జయచంద్రని తక్కువగా అంచనా వేశారు మిస్టర్ అవినాశ్..."
"నాకర్థం కావడంలేదు"
శశాంక పెదవులపై విడివడని అదే చిరునవ్వు "నిన్న రాత్రి మీరు స్టేట్ మెంట్ తీసుకుని వెళ్లిపోయాక స్టేషన్ లో ఎస్సై వుండగానే ప్రసాదనే ఓ క్రిమినల్ తాగి లోపలికి వచ్చాడు. స్టేషన్ లో అల్లరి చేస్తుంటే యస్సై సెల్లో వేసి ఇంటికి వెళ్ళిపోయాడు" ఒక చిన్న ఉలికిపాటు. "నో... ఇది నిజం కాదు."
"నన్ను పూర్తిగా చెప్పనివ్వండి మిస్టర్ అవినాశ్... ప్రసాదుని అలా పంపింది జయచంద్ర. ఎందుకంటే నేరస్థుడిగా సెల్లోకి ప్రవేశించిన ప్రసాదు సాగర్ ని చంపితే తప్ప మిమ్మల్ని నేరస్థుడిగా మార్చలేడు కాబట్టి."
"కాని సెల్లో మరో నేరస్థువాడ్ని వుంచినట్లు రిజిస్టర్ లో ఎంట్రీ లేదు."
