"అయాం సో సారీ మనోహర్. అవంతి నాకు చెప్పాలని ప్రయత్నించినా ఆమెకి కూడా నేను అవకాశం ఇవ్వకుండా అజ్ఞానంలో వుండిపోయాను" అలా అంటూనే ఆమె అతని చేతిని తన చేతిలోకి తీసుకొంది.
అతని కళ్ళలోకి ఆత్మీయంగా చూస్తూ అతని చేతిని ముద్దుపెట్టుకుని, "ఐ లవ్ యు మనోహర్" అంది భారతి.
"థాంక్యూ డియర్" అన్నాడు మనోహర్. డియర్ అన్న అతని సంబోధన ఆమె మనసులో పూలవానని కురిపించింది.
ఇప్పుడు తనతో ఎన్నో సంగతులు మాట్లాడాలనిపిస్తోంది.
అతని ముందే ఉండిపోవాలనిపిస్తోంది. ఇప్పుడతన్ని విడిచి ఇంటికి వెళ్ళాలనికూడా అనిపించడంలేదు.
"నువ్వు నేను చెప్పినదంతా నమ్ముతున్నావా!" అన్నాడు సిగరెట్ వెలిగిస్తూ.
భారతి చిత్రంగా చూసింది.
"ఎందుకొచ్చిందా అనుమానం!"
మనోహర్ తమాషాగా నవ్వాడు. ఆమె చేతిని నిమురుతూ అన్నాడు. "నేను విచ్చలవిడిగా తిరిగిన తిరుగుబోతుని, తాగుబోతుని అలాంటివాడిని నీలాంటి ఓ మంచి అమ్మాయి ప్రేమిస్తోందంటే ఏదో కలలాగా అనిపిస్తోంది. ఇదంతా నిజమేనా!"
"మీకు అవంతికీ వున్న సంబంధం ఏమిటో కూడా నాకు చెప్పింది మనోహర్. మీరెంత మంచివారో కూడా నాకు చెప్పింది. ఇప్పుడు మీలోని సంస్కారాన్ని, మంచితనాన్ని, వీటినిమించిన మీ ప్రేమని కళ్ళారా చూశాను. నేను నిజంగా మిమ్మల్ని కావాలని కోరుకుంటున్నాను. ఐ లవ్ యు, ఐ లవ్ యు సోమచ్" అంది భారతి.
కాళీ కప్పుని టేబులుపైన పెట్టేసి బిల్ పేచేసి లేచి నించున్నాడు మనోహర్.
ఆమెకి చేతిని అందించాడు.
ఆమె సందేహించలేదు.
అతని చేతిని అందుకొని లేచి నిలబడింది.
అతనందిస్తున్న ఆ 'చేయూత' జన్మజన్మలకీ తనకు లభించాలని మనసులోనే కోరుకుంది భారతి.
మనోహర్ తో పాటుగా కారు పార్కింగ్ దగ్గరికి నడిచింది భారతి.
"ఇక నే వెళతాను" అంది భారతి.
"నేను డ్రాప్ చేస్తాను"
భారతి కారెక్కింది.
కారు నడుస్తున్నంతసేపు మనోహర్ ఏదో చెబుతూనే వున్నాడు.
ఆమె నవ్వుతూ వింటూనే వుంది.
కారు పంజాగుట్ట దగ్గరికి రాగానే.
"ఇక్కడాపండి. నేను దిగేస్తాను" అంది.
"ఏం ఇంటివరకూ రాకూడదా!" అడిగాడు.
"సారీ, మరోలా అనుకోవద్దు. మమ్మీతో పెద్ద డేంజరు. ఈసారి కలుస్తాను"
అతను కారు టర్నింగ్ లోకి తిప్పసాగాడు.
"మీ బావ ఎలా వున్నాడు!"
"అతను వెళ్ళిపోయాడు. అవును. అతను కూడా మీ ఏజంటే, మీ గురించి ఎంతో గొప్ప గాచెబుతూంటే నా వొళ్ళు మండిపోయింది" అంది నవ్వుతూ భారతి.
"ఇప్పుడు"
"నా మనసంతా మీరే. ఎప్పుడూ మీ గురించే వినాలనుంది" కారు దిగుతూ అన్నది భారతి.
"మళ్ళా ఎప్పుడు!"
"మీ ఇష్టం"
"నా ఇష్టమేగానీ, నీ ఇష్టంతో నిమిత్తం లేదా!"
భారతి అందంగా నవ్వింది.
"నా మీద పూర్తి అధికారాన్ని సంపాదించుకున్నారు. ఇంక నా ఇష్టం దేనికి! మీ మాటని కాదంటే మాత్రం మీరు వింటారా!"
మెడికల్ షాపు బయట పేవ్ మెంట్ పైన నిలబడి వున్నాడు బోసుబాబు.
"అడుగో వెధవ, గుంటనక్కలా అక్కడే వున్నాడు" అంది భారతి.
మనోహర్ అటు చూశాడు.
బోసుబాబు అసహనంగా వున్నాడు.
"మళ్ళీ నీ జోలికి రాలేదుగా!
"ఊహూ, రిపోర్ట్ చేస్తానంటే బావ వద్దన్నాడు. పోనీండి వాడేం చేస్తాడు!"
మనోహర్ బోసువైపు తీక్షణంగా చూస్తూ అన్నాడు.
"చిన్న పామునికూడా పెద్ద కర్రతో కొట్టమన్నాడు. లేకపోతే అది పగతో పెరిగి పెద్దదై కాటేసే అవకాశముంటుంది భారతీ? అయినా నేను వాడినో కంట కనిపెడుతూనే వుంటాను. అవసరమైతే ఈ ఊరినుంచి ట్రాన్స్ ఫర్ చేయించేస్తాను" అన్నాడు.
"ఓ.కే. బై బై" అంది భారతి.
"బై" అన్నాడు.
భారతి వెనక్కి వెనక్కి తిరిగి అతన్ని చూస్తూ వెళుతోంది.
ఆమెకి వెళ్ళాలనిపించడంలేదు. కొంతకాలం ఓపికపడితే ఎలాగూ అతనితోనే తన ముడిపడుతోంది. గంటలు క్షణాల్లా గడిచిపోయినాయి అతనితో మాట్లాడుతుంటే.
మనోహర్ కారు దిగి భారతి కంటికి కనిపించినంత దూరం చూస్తూనే వున్నాడు.
బోసు పేవ్ మెంట్ మీద నుంచి కదల్లేదు. అతనిలో ఈర్ష్యాద్వేషాలు హిమాలయ పర్వతాల స్థాయిలో పెరిగిపోతున్నాయి.
భారతిని మనోహర్ వెంట చూశాక అతని గుండె భగ్గుమనిమండిపోతోంది. భారతి పూర్తిగా చేయిజారిపోయినట్లుగా అతనికి అర్థం అవుతూనే వుంది.
