ఇదిగో... ఇక్కడే ఆనందంతో నా మనసు గంతులు వేసింది. ఉక్కిరి బిక్కిరి అయిపోయాను...
గబుక్కున కుర్చీలోంచి లేచాను.
నమస్కారం పెడదామని అనుకుంటే చేతిలో ఫైలుంది. ఈ వెధవ ఫైలు చేతిలోకి ఎలా వచ్చింది?
విసురుగా టేబులు మీద ఫైలు పడేశాను. ఆ విసురుకి దొంతరగా ఉన్న మిగతా ఫైళ్లు నేలమీద పడ్డాయ్. గబగబ క్రిందికి వంగి వాటిని ఏరి టేబుల్ మీద పెట్టి చిరునవ్వు నటిస్తూ నమస్కారం పెట్టి ఎదురుగ చూశానుగానీ అక్కడ సుబ్బలక్ష్మి గానీ పరాంకుశంగానీ కనబడలేదు.
నేను దరిద్రపు మొహాన్ననీ, నష్ట జాతకుడిననీ చిన్నప్పటినుండి మా అమ్మ నన్ను తిడ్తూనే ఉంది. అది నిజమే అనిపించింది నాకు. ఎందుకంటే సుబ్బలక్ష్మిని మా సెక్షనులో కాకుండా ప్రక్క సెక్షనులో వేశారు.
సుబ్బలక్ష్మి అటెండెన్సు రిజిష్టరులో సంతకం చెయ్యడానికి రోజూ మా సెక్షనుకి రావాలి... అలా రోజూ ఆమెను చూసే అదృష్టం కలిగింది.
ఒకసారి అటెండెన్సు రిజిష్టరులో నేను సంతకం చేస్తుంటే వెనుకే సుబ్బలక్ష్మి నిలబడింది తనుకూడా సంతకం చెయ్యడం కోసం.
"అరె...పెన్ తేవడం మర్చిపోయాను. మీ పెన్ ఇస్తారా సంతకం పెట్టి ఇస్తాను" అని నన్ను సుబ్బలక్ష్మి అడిగేసరికి "ఆహా... ఎంత అందమైనదీ ప్రపంచము... ఈసృష్టిలో ప్రతి యొక్కటియూ ఎంతో మధురమైనదిగదా?- భగవంతుని లీలలు ఎవ్వరికి అర్థమగును?.... అని ఆలోచిస్తూ తన్మయత్వంలో కళ్ళు మూసుకున్నాను.
'మీకు పెన్ ఇవ్వడం ఇష్టం లేకపోతే పోనీలెండి-"
ఉలికిపడి కళ్లు తెరిచి చూశాను సుబ్బలక్ష్మి నావంక అయోమయంగా చూస్తూ నిలబడి ఉంది.
నా తన్మయత్వం ఆమె తప్పుగా అర్థం చేసుకుందని గ్రహించాను.
"ఎంతమాట-మీకు పెన్ ఇవ్వడం నా అదృష్టం" అన్నాను.
పెన్ క్యాప్ తీసి వెనకకు తగిలించి ఆమె చేతికి ఇచ్చాను. అమ్మ తిట్టినట్టు నేను నష్ట జాతకుడినే. పెన్ను ఇచ్చేటప్పుడు కనీసం ఆమె చేతివేళ్లు కాదుకదా ఆ వేళ్ళ తాలుకు గోళ్ళు కూడా తగల్లేదు.
"ఏమిటండి మీ పెన్ వ్రాయడంలేదు..." సుబ్బలక్ష్మి పెన్ పైకెత్తి పాళీవైపు నిశితంగా పరిశీలుస్తూ చూసి అంది.
.jpg)
"ఏదీ ఇలా తెండి..."
ఆమె చేతిలోంచి పెన్ తీసుకున్నాను. మా అమ్మ తిట్టినట్టు ఈసారి కూడా నేను నష్టజాతకుడినే.
ఆమెకంటే నిశితంగా పాళీని చూశాను. ఎడమ చేతిలోకి మార్చి మళ్ళీ చూశాను. పాళీ భూమికి లంబంగా ఉండేటట్టు పెన్నుని నిలువుగా పట్టుకుని చూశాను.
"పెన్ను బాగానే ఉందే!!.... ఇప్పుడే నేను సంతకం కూడా చేశాను. మీరు పట్టుకునేసరికి పిచ్చిముండ సిగ్గుపడిపోయి ఉంటుంది... హి....హి...హి...హి..."
ఆమె నవ్వలేదు.
నేను క్రిందికి వంగి ఓ చిత్తుకాగితం తీసి దానిమీద వ్రాసి చూశాను....
ఉహూ... లాభంలేదు. నేలమీదికి పెన్ను విదిలించాను.మళ్ళీ విదిలించాను. మళ్ళీ వ్రాశాను. కాగితం చిరిగింది. పెన్ను మళ్ళీ విదిలించాను. ఇంకు రాలడం లేదు.
"పరవాలేదులెండి... ఈయన దగ్గర పెన్ను తీసుకుని సంతకం చేసేశాను"
సుబ్బలక్ష్మి నాతో చెప్పి వాళ్ళ సెక్షన్ లోనే పనిచేసే గణేశ్ రావ్ తో కలిసి వెళ్ళిపోయింది.
పెన్ను కనిపెట్టిన వెధవెవడో ఇంకు లేకపోయినా వ్రాసేటట్టు ఎందుకు కనిపెట్ట లేకపోయాడు?... నా పెన్ను వ్రాయక వ్రాయాపోయే ఆ గణేశ్ గది పెన్నెందుకు రాయాలి?....థూ...
"ఫైళ్ళే అనుకున్నాను...అటెండెన్స్ రిజిస్టర్ల మీద కూడా ఉమ్మేస్తున్నావా?..." గుడ్లురుముతూ అన్నాడు మా సూపరింటెండెంట్.
నా వెనకే ఆయన నిలుచుని ఉండటం నేను చూడలేదు మరి.
ఈ మధ్య నాకేమిటో మహా చెడ్డ వికారంగా ఉంటోంది. ఒకరోజు డాక్టరు దగ్గరికి వెళ్ళాను.
"వికారంగా ఉంటుందండీ..." అన్నాను.
"మూడు పూట్లా నోమిన్ మాత్రలు వాడు..." అని చెప్పాడాయన.
మాత్రలు వాడానుగానీ అవేమీ పని చెయ్యలేదు.
నా వందరూపాయలు అప్పు తీర్చలేకపోయినా పాపారావ్ నాకు అంతరంగిక సలహాదారు. అందుచేత నా వికారం సంగతి వాడికి చెప్పాను.
.jpg)
"కొద్ది రోజులుగా నిన్ను గమనిస్తున్నాను... నీ వికారం గురించి నాకు అర్థం అయిపోయింది. అది మందులకీ, పచ్చళ్ళకీ, అల్లం రసాలకి తగ్గే వికారం కాదు."
