Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 57

"అచ్చంగిల్లాయిలు వున్నా హాయిగా ఆడుకుందుము. ఈ గదిలో పచ్చీసు, పాళీ కూడా లేదు. శ్రీదేవిని చూపిస్తాము అని చెప్పి, ఈ గదిలోకి నన్ను ఎందుకు తెచ్చి పడేశారు? ఈ పిల్లల్ని అడిగితే ఏమో చెవిక్రింద ఒకటే ఏడుపు. ఇది బ్రోతల్ హౌసు అన్నారు. అంటే ఏమిటంటే చెప్పరు. నేనేమిటి అని అడిగేసరికి ముందేమో నన్ను చూసి నవ్వారు. ఆ తరువాత ఏమో నువ్వు మొద్దువి" అంటూ నాతో మాట్లాడటం మానేశారు.
దాంతో నాకు చిర్రెత్తుకు వచ్చి, "మీ ఏడుపేదో మీరు ఏడవండి. యు...రా!' అని తిట్టుకుని, హాయిగా మంచం ఎక్కి దర్జాగా పడుకున్నాను.
శ్రీమహాలక్ష్మి అలా చెబుతూ వుంటే "ఇది గట్టి పిండమే" నన్నట్లు రౌడీవైపు చూసి నవ్వుతూ కళ్ళెగరేసింది.
"అవునే అక్కాయ్! చిన్న ఏనుగు పిల్ల" అన్నాడు ఆ రౌడీ.
వాడు ఆకారానికి ఎత్తూ, లావూ రౌడీలాగా వున్నాడు గానీ, కంఠస్వరం మాత్రం ఆడంగి రేకుల ముత్తయ్య కంఠస్వరం లాగా వినవచ్చింది.
"నాకు శ్రీదేవిని ఎప్పుడు చూపిస్తారు?" శ్రీదేవిని చూపించటమే తనకి ముఖ్యమన్నట్లుగా శ్రీమహాలక్ష్మి మరొకసారి అడిగింది.
"చూపిస్తాను, చూపిస్తాను. ఇక్కడ నా మాట విన్నవాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తాను. కోరినదల్లా సమకూరుస్తాను. కానీ ఎదురుతిరగకూడదు. నా మాట వినాలి, నేను చెప్పింది చెయ్యాలి." ఆనందంగా కళ్ళు ఇంత చేసుకుని అంది రత్నమణి.
"మీరు చెప్పినట్లే చేస్తాను. మీరు చెప్పింది కూడా వింటాను. నాకు మాత్రం శ్రీదేవిని చూపించాలి. నాకు సినిమా వాళ్ళంటే భలే యిష్టం."
"ఆడ తారలే యిష్టమా! లేక మగ తారలు కూడా ఇష్టమేనా?" వస్తున్న నవ్వును దాచుకుంటూ అడిగింది రత్నమణి.
"నాకు ఇద్దరన్నా యిష్టమే. ఆడవాళ్ళల్లో శ్రీదేవి, మగవాళ్ళలో చిరంజీవి భలే యిష్టం! ఎవరిని చూపించినా చూస్తాను. చిన్నవాళ్ళయినా పరవాలేదు."
"మా తల్లే! సినిమాల్లో చేరాలని లేదూ!" రత్నమణి అడిగింది.
"చేరాలనుంటే మాత్రం వాళ్ళలాగా నాకు చెయ్యటం రావద్దేంటి? నేను సినిమాల్లో చేరనులేండి. నాకు యాక్టర్లని చూపించండి చాలు, మనమే అక్కడికి వెళ్ళాలా, వాళ్ళే ఇక్కడికి వస్తారా?" శ్రీమహాలక్ష్మి ఆత్రుతగా అడిగింది.
"మా యిల్లు చాలా గొప్పదిలే! శ్రీదేవిలూ, చింతామణులూ అంతా ఇక్కడికే వస్తారు. రాత్రిళ్ళు అయితే కృష్ణా, శోభన్ బాబు, మురళీమోహన్ ఇప్పుడు క్రొత్తగా నాగార్జున అందరూ వస్తారు. నీ చిరంజీవి కూడా వారానికి రెండుసార్లు వస్తాడు."
"అమ్మ బాబోయ్! ఇదెంత గొప్ప యిల్లండీ!" అంది శ్రీమహాలక్ష్మి.
"ఇది గొప్ప యిల్లు కాదు. బ్రోతల్ హౌస్. అది మోసగత్తె. అన్నీ అబద్ధాలే చెబుతున్నది." కృష్ణవేణి ఏడుపు కంఠంతో గట్టిగా అరిచి చెప్పింది.
"నోరు ముయ్యవే పక్షీ! వెర్రి మొర్రి కూతలు కూసావంటే చమడాలు వూడదీయిస్తాను. ఈ పిల్ల చూడు ఎంత చక్కగా మాట్లాడుతున్నదో. దీన్ని చూసి నవ్వుతూ ఎలా మెలగాలో నేర్చుకోండి."
"ఆ పిల్లకి ఏమీ తెలియదు!" మరోసారి పెద్దగా అరుస్తూ చెప్పింది కృష్ణవేణి.
"నీకు మహా తెలిసి చచ్చింది, దీనికి తెలియలేదు. నేను చెప్పినట్లు చేశారా సరే, లేకపోతే మీ పని దినం దినం నరకమే." అంటూ రత్నమణి వాళ్ళేం చేయాల్సిందీ వివరంగా చెప్పింది.
"నేను చస్తే ఒప్పుకోను" అంది కృష్ణవేణి.
"నేను ఉరి పోసుకుని చచ్చిపోతాను" అంది నీరజ.
శ్రీమహాలక్ష్మి మాత్రం ఏమీ అనలేదు. "అత్తయ్యా!" అంటూ వరస కలిపేసి పిలుస్తూ, నాలుగువేళ్ళూ ముడిచి చిటికెన వేలు ఎత్తి చూపిస్తూ 'అర్జంట్ గా అవసర నిమిత్తం అవతలకి వెళ్ళాలని' తెలియజేసింది.
శ్రీమహాలక్ష్మి ముఖం అందంగా వున్నా, అచ్చం దిబ్బరొట్టెలాగా వుంటుంది. ఆ ముఖంలో ఏ భావాలూ ఒక పట్టాన కనపడవు. శ్రీమహాలక్ష్మి చేస్తున్నది నటన అన్నది, అందువల్లనే రత్నమణి గుర్తించలేక పోయింది. ఆ గదికే వున్న ఎటాచ్ డ్ బాత్ రూమ్ వైపు వేలుపెట్టి చూపించి "ఆ తలుపు తీసుకుని లోపలకి వెళ్ళు!" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS