శ్రీమహాలక్ష్మి గునగునా నడుస్తూ వెళ్ళి.
ఎటాచ్ డ్ బాత్ రూమ్ తలుపు తీసుకుని లోపలికి వెళుతూనే, గుమ్మం దాటగానే ఒక అరుపు అరిచింది. ఆ వెంటనే వెనక్కి వచ్చేసి "ఛీ! అక్కడెక్కడ పోసుకుంటాం. అదేదో ఎత్తుగా వుంది (కయోడ్) దానిమీద కూర్చోవటం నాకు చేతకాదు బాబూ! మా యింట్లో దొడ్డిలాంటిది అయితే బాగుంటుంది" అంది.
"ఈ పిల్లని బయట గదిలో బాత్ రూమ్ కి తీసుకెళ్ళి వస్తాను. వీళ్ళిద్దరినీ ఒక కంట చూస్తూ వుండరా నాగేశూ! అని చెప్పింది రత్నమణి.
"దీన్ని బయటికి తీసుకెడతావా ప్రమాదమే అక్కాయ్!" కంగారుగా అన్నాడు నాగేశు.
"ఎవరివల్ల ప్రమాదమో, ఎవరివల్ల ప్రమాదం వుండదో నాకామాత్రం తెలియదుటరా నాగేశూ! నా చేతిలో ఎదురు తిరిగిన మహా మహా వాళ్ళే ఒక్క పిడికిలి పోటుకి మట్టికరిచారు." గొప్పగా అంది రత్నమణి.
'ఈ పిల్లకి సినిమా యాక్టర్ల ఆశ చూపిస్తే చాలు, తేలికగా పని అయిపోతుంది. ఇలాంటి సినిమా పిచ్చివాళ్ళకి ఇల్లూ, వాకిలీ పట్టదు.' అన్న వెర్రి అపోహలో వుంది రత్నమణి.
శ్రీమహాలక్ష్మిని తీసుకుని ఆ గదిలోంచి బయటికి వెళ్ళింది రత్నమణి. ఇరువురూ నడవాలోకి వచ్చారు. అక్కడి నుండి మరో గదిలోకి ప్రవేశించారు. "ఈ గదిలో మామూలు లెట్రిన్ వుంది. తొందరగా వెళ్ళిరా!" గుమ్మం దగ్గరే ఆగిపోతూ చెప్పింది రత్నమణి.
శ్రీమహాలక్ష్మి బయటికి వచ్చినప్పుడే చూసుకుంది అక్కడ ఎవరూ లేకపోవటం. ఏమాత్రం అలికిడి కూడా రావటం లేదు.
గదిలో తారసపడ్డ క్రొత్త పిల్లలు ఇద్దరూ అన్నీ జాగ్రత్తగా కనిపెట్టి చూసి, 'సరి అయిన సమయం చూసుకుని పారిపోదాం' అన్నారు. మీన మేషాలు లెక్కపెట్టడం శ్రీమహాలక్ష్మికి ఇష్టం లేదు. రత్నమణి లోపలికి వెళ్ళమనంగానే బాత్ రూమ్ లోకి వెళ్ళింది. నిమిషం ఆగి బాత్ రూమ్ లో నుండీ మామూలుగా బయటికి వచ్చింది.
"ఇప్పుడు పొట్ట చాలా తేలికగా వుంది." అంటూ శ్రీమహాలక్ష్మి పొట్టను ఒకసారి చేత్తో రాచుకుని ఆ తరువాత వంగి తన కాళ్ళకి వున్న పట్టా శీల వదులయితే, శీల బిగిస్తున్నట్లుగా వుండిపోయింది.
ఆ పిల్ల నిజంగానే పట్టాశీల బిగిస్తున్నది అనుకుంది రత్నమణి.
శీల బిగిస్తున్నట్లే బిగిస్తూ, చటుక్కున రత్నమణి కాలుని జలగలాగా పుచ్చుకుని బలవంతా ఉపయోగించి ఒక్క లాగు లాగింది శ్రీమహాలక్ష్మి.
రత్నమణి కూడా బాగా లావుపాటి మనిషే. వయస్సు కూడా యాభై పైనే. శ్రీమహాలక్ష్మి విసురుగా లాగేసరికి "ధబేల్!" మన్న పెద్ద శబ్ధంతో వెల్లకిలా పడిపోయింది.
తల వెళ్ళి "టంగ్!" మంటూ నేలను ముద్దు పెట్టుకుంది.
ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా శ్రీమహాలక్ష్మి అటొక్కాలు, ఇటొక్కాలు వేసి పర్వతంలా దూకి రత్నమణి పొట్టమీద కూర్చోటమే కాక, రెండు చేతులతో ఆమె జుట్టు బిగించి పట్టుకుని "టపా టపా" నేలకేశి కొట్టింది ఆమె తలని.
ఆ దెబ్బతో,
రత్నమణి చావలేదుగాని, పూర్తిగా స్పృహ తప్పింది. ఇప్పుడప్పుడే ఆమె లేచే ప్రశక్తే లేదు.
"హమ్మయ్య" అనుకుంటూ శ్రీమహాలక్ష్మి గర్వంగా పైకి లేచింది.
"ఒసేయ్! ఇవి పిడకలు కొట్టిన చేతులే! తెలివి మీ పట్నం వాళ్ళకే కాదే! మా పల్లెటూరి వాళ్ళకి కూడా వుంది. మేము తలచుకుంటే అడ్డెడు బియ్యాన్ని అరక్షణంలో పిండిగా కొట్టగలం. మీవన్నీ కాఫీ బ్రతుకులు. వెధవ బుద్దులూ. వెధవ ఉపాయాలూ" అని అనుకుంటూ అవతలికి వెళ్ళి, కంటికి కనపడ్డ ఒక చీరను తీసుకువచ్చింది. పరపరా చీరను చింపి నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళూ చేతులు గట్టిగా కట్టేసింది.
