"మరెలా?"
"అందుకనే కదా నేను ఏడ్చేది!"
"ఇక్కడి నుండీ పారిపోటానికి లేదన్న మాట."
"చాలా కష్టం."
శ్రీమహాలక్ష్మి ఒక్క నిమిషం ఆలోచిస్తూ వుండిపోయింది. ఆ తరువాత అంది. "ఈ గది ఇంత చల్లగా వుందేం?"
'ఇది ఎ.సి. రూమ్ అనీ ముందే చెప్పాను గదా! ఎ.సి. రూమ్ అంటే ఇలా చల్లగానే వుంటుంది.'
శ్రీమహాలక్ష్మి మళ్ళీ తీవ్రాలోచనలో పడింది.
"ఇంత వివరంగా చెప్పినా, ఈ పిల్ల భయపడటం గానీ, ఏడ్వటం కానీ చెయ్యలేదు. ప్రపంచంలో ఇలాంటి అమ్మాయిలు కూడా వుంటారా. ఉత్త పల్లెటూరి మొద్దు. ముందు ముందు ఎన్ని బాధలు పడాలో తెలియక సంతలో చేగోడీలు అమ్ముకునే దానిలాగా చాలా చక్కగా కూర్చుంది" అనుకుంది క్రిష్ణవేణి.
అంతవరకూ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడుకున్న అమ్మాయి నీరజ లేచి కూర్చుంది. మౌనంగా వీళ్ళ మాటలు వినసాగింది.
"నేను మాత్రం ఛస్తే ఇక్కడ వుండను. వాళ్ళెవరయినా ఎదురుపడనీ, వాళ్ళను నాలుగు ఉతికి ఇక్కడనుండి పారిపోతాను." అప్పటికే ఒక నిశ్చయానికి వచ్చిన శ్రీమహాలక్ష్మి తన నిర్ణయం చెప్పేసింది.
"నువ్వు కాదు మేమూ వుండం. కాకపోతే నీకు తెలియనిది మరో విషయం వుంది. మనలాంటి వాళ్ళు ముందు ఎదురుతిరుగుతారనీ, సమయం చూసి పారిపోతారనీ, ఇక్కడ వీళ్ళకు బాగా తెలుసు. రౌడీల్లాంటి వాళ్ళు మనకి కాపలాగా బయట వుంటారు. మనం పారిపోతూంటే వాళ్ళు మనలని నాలుగు ఉతికి తీసుకువచ్చి మళ్ళీ యింట్లో పడేస్తారు." వ్యంగ్యంగా అంది కృష్ణవేణి.
"ఏడ్చారు. ఒకసారి మా వూళ్ళో బండ భీముడి చేతిలో కర్ర వున్నా కూడా వాడిని నేనొక్కదానినే నాలుగు ఉతికాను. నేను కొట్టేసరికి వాడు చేతిలో కర్రని అక్కడే పారేసి, నాకు దండం కూడా పెట్టి 'కొట్టకమ్మా తల్లీ! ఇంకెప్పుడూ నీ జోలికి రాను." అని చెప్పి అదే పాటున పరుగు తీశాడు." తన అనుభవాన్ని గొప్పగా చెప్పింది శ్రీమహాలక్ష్మి.
శ్రీమహాలక్ష్మి దేహాన్ని ఒకసారి ఎగాదిగా చూసి నువ్వు కొడితే ఒక దెబ్బకే అవతలివాడు చచ్చి వూరుకుంటాడు. కానీ, ఇక్కడున్న రౌడీలు మీ వూళ్ళో వున్న బండరాముడిలాంటి వారుకాదు. వీళ్ళకి చాలా కిటుకులు, మెళకువలూ తెలుసు. ఒకడినయితే కొడతావ్, ఇద్దరు ముగ్గురి నయితే ఏం చేస్తావ్?" అంది కృష్ణవేణి.
అప్పుడు అక్కడే వున్న ఇంకో పిల్ల నీరజ నోరు తెరిచింది.
"మనం వీళ్ళ దగ్గర వుండి బాధలు పడే బదులు సమయం చూసి ఎదిరించి ఉపాయంగా పారిపోదాం. పల్లెటూరి అమ్మాయి ఈ అమ్మాయికే ఇంత ధైర్యం వుంటే, చదువుకున్న మనకు ఇంకెంత ధైర్యం వుండాలి. ఏం చెయ్యాలో ఆలోచిద్దాం!" ఆశగా అంది నీరజ.
వాళ్ళ మాటలతో చిన్న ఆశ లాంటిది కృష్ణవేణికి కూడా కలిగింది. "వాళ్ళొచ్చేలోపల మనం ఆలోచిద్దాం!" అంది.
ఆ తరువాత ముగ్గురూ స్నేహితులయిపోయారు.
ఆలోచిస్తూ, చర్చిస్తూ కూర్చున్నారు.
24
సమయం గడిచిపోతున్నది.
ఏ.సి. గది తలుపులు మెల్లగా తెరచుకున్నాయి.
ఒక లావుపాటి ఆమె, మొలలో కత్తి, చేతిలో కర్రా పట్టుకుని రౌడీలాగా వున్న మరొకతనూ, గదిలోకి వచ్చారు.
ఆమె లోపలికి వచ్చింది. కానీ వాడుమట్టుకు గుమ్మం అవతల కాపలాగా నుంచున్నాడు.
"ముగ్గురూ ఏం చేస్తున్నారు?" వాళ్ళవేపు ఉరిమి చూస్తూ అడిగింది రత్నమణి అనే ఆమె.
ఆ మాట రత్నమణి అడగంగానే నీరజా, కృష్ణవేణి ఒక మూలకి నక్కి పెద్దగా ఏడుపు ప్రారంభించారు. శ్రీమహాలక్ష్మి మాత్రం ఏడవకుండా లేచి నుంచుంది.
