Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 56


    'టు నాట్ టు అహోబిలం చెప్పినట్లు నిజంగ బాస్ గాడు పారిపోతే నాకెంత అవమానం. అహోబిలం అనుమానం వ్యక్తంచేస్తే "అలా జరిగినను జరగవచ్చు. జరక్కపోవచ్చు చూద్దాం" అని గంభీరంగ అంటే గౌరవంగా వుండేది. బాస్ గాడు అక్కడే వుండి చస్తాడని గ్యారంటీ ఏమిటి?" దబాయింపు సెక్షను తీసుకుని దబాయించి పారేస్తిని, నా మాట పోయిన నా పరువు ఏమి కావలె!'


    ఇన్ స్పెక్టర్ వర్ధనరావు హెడ్ కానిస్టేబుల్ అహోబిలం ఎవరి మానాన వాళ్ళు ఆలోచిస్తూ "పచ్చబొట్టు పొడుస్తాం" అని అరవటం మరచిపోయి అలా నడుస్తూ ఊరు చివరికి వెళ్ళారు. తామిద్దరిని ఇరువురు సిక్కు సోదరులు చాటుగ అనుసరిస్తూ వస్తున్నారని గ్రహించలేదు.


    బాస్ గాడు ఎక్కడికి చావలేదు అక్కడే చచ్చాడు (వున్నాడు). వీళ్ళిద్దరి ముఖాలు వెలిగిపోవటం చూసి "ఏంటి మహా ఆనందంగా వున్నారు?" అని అనుమానంగా అడిగాడు.

    
    "పచ్చబొట్లు పొడవకుండానే పెద్దనోటు చేతిలో పడుతుంటే ఆనందంగాక అశ్రుకణాలు రాలుతాయా సామీ!" అన్నాడు అహోబిలం.


    "మా శిష్యగాడు చెప్పింది అక్షరాలా నిజం సామీ! రాత్రి రొయ్యల వేపుడు, చేపల పులుసు, మట్టగిడసల కూరతో అన్నం లాగించేసి రెండు గళాసుల సారాయం పుక్కిట పట్టేసి "ఆడ నా కూతురు ఈడ నా పెళ్ళాం" సినిమాకెళ్ళి రాత్రంతా స్వర్గం చూసి వచ్చాము" ఓనర్ యాక్షన్ తో చెప్పేశాడు వర్ధనరావు.


    బాస్ గాడు నమ్మాడు. తేలిగ్గా నవ్వేస్తూ  "తాగి తందనాలాడుతూ పిచ్చివాగుడు వాగి నా గుట్టు రట్టు చేయకండి. నాకు కోపం వస్తే మనిషిని కాను. వెనుకాముందు చూడకుండా చంపిపారేస్తాను. నేయిచ్చే యాభై రూపాయలని పోగొట్టుకోకండి. మీ పనులమీద విశ్వాసం కుదిరితే చివరికి పెద్ద మొత్తం డబ్బిస్తాను" అన్నాడు ఇంకా ఆశపెడుతూ.


    "చివరికి అంటే ఎప్పుడు సామీ!" ఆతృతగా అడిగాడు అహోబిలం.


    "శిష్యగా! నీకు బుద్ధిలేదు. సారాతో తలంటినా తలకు పట్టిన బూజు పోదు. గురూని నేను మాటలాడుతా కదా!" అని అహోబిలంని కేకలేసి బాస్ గాడివేపు తిరిగి "సామీ! మేము ఎంత తాగినా వాగము, తూలము. చుక్క పడకపోతేనే పిచ్చివాగుడు, వెర్రి తూలుడు వస్తుంది. మీరెలా చెపితే అలా చేస్తాం. డబ్బు మాత్రం ఏపూటది ఆ పూట యివ్వాలి. అంతే సామీ నేను కోరేది. నా మాటలమీద విసివాసముంచండి" అన్నాడు వర్ధనరావు.


    ఆ మాటలకి బాస్ గాడు సంతోషించాడు. యీతఫా పెద్ద లిస్ట్ చెప్పి ఎక్కువ డబ్బులు యిచ్చి జబారు వెళ్ళి కొనుక్కురమ్మని చెప్పి శిష్యుణ్ణి పంపి గురువుని దగ్గర వుంచుకున్నాడు. ఖాళీ మాత్రల సీసా యిచ్చి ఈ మాత్రలు తప్పక కొనుక్కురమ్మని చెప్పాడు వకటికి రెండుసార్లు.


    ఎంత తొందరగ నడిచినా ఊళ్ళోకి వెళ్ళాలంటే గంటపైనే పడుతుంది. పైగా కొన్ని కొనే వస్తువులున్నాయి. అహోబిలం గంటన్నర తర్వాత బాస్ గాడు చెప్పినవన్నీ తెచ్చాడు.


    బాస్ గాడు సంతోషించి యీతఫా అరవై రూపాయలు యిచ్చి మళ్ళీ సాయంత్రం వచ్చి కనపడమని చెప్పి ఇద్దరిని పంపించి వేశాడు.


    దారిలో


    "గురువా! వీణ్ణి చూస్తుంటే నాకో అనుమానం వస్తున్నది. తాటి తోపులో వీడు ఒక్కడే దాక్కున్నాడేమోనని...పట్టేసుకుంటే పోయేది" అన్నాడు అహోబిలం.


    "శిష్యగా! నిన్నేదో అనుమాన పిచాచం ఆవరించింది. ఇందాక వెళ్ళేటప్పుడు బాస్ గాడు పారిపోయి వుంటాడని అనుమానం వ్యక్తం చేశావు. వాడు పారిపోడు అని నా అంతరాత్మ నొక్కి నొక్కి వక్కాణిస్తున్నా! నీ అనుమానం నా మనసులో దూరి అల్లకల్లోలం చేసింది. ఇప్పుడు మరో అనుమానమా! వద్దు చెప్పొద్దు. నాకు బుర్ర వుంది. ఆలోచించగలను. మనం వరుసగ నాలుగైదు రోజులు వాడి దగ్గరకి వెళ్ళొచ్చి ఆపై ఆలోచిద్దాము ఏంచేద్దామా అన్నది."


    "అలాగే గురువా!" అన్నాడు అహోబిలం.


    ఇరువురు సిక్కు వేషధారులు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తమని ఫాలో అయ్యారని ఇన్ స్పెక్టర్ వర్ధనరావుగాని హెడ్ కానిస్టేబుల్ అహోబిలంకాని ఎరుగరు.


    వాళ్ళెవరోకాదు విజయ్, రామ్ సింగులు.


                                          26


    వరుసగ రెండు రోజులపాటు


    నేను రామ్ సింగు ఇటు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు దిగ్రేట్ హెడ్ కానిస్టేబుల్ అహోబిలంని వాళ్ళు మారువేషాలలో వున్నప్పుడు ఫాలో అయి చూశాను. వీలయినప్పుడల్లా వాళ్ళ మాటలు విన్నాము.


    అటు తాటితోపుల్లో దాక్కున్నవాడిని చూశాము. దాక్కున్నవాడు నా బాస్ గాడు. నన్ను రామ్ సింగుని నరకం చూపిస్తూ గదిలో బంధించి మా ప్రాణాలు నిలువున తీద్దామని చూసిన నరరూప రాక్షసుడు. బతికి బైటపడ్డ తర్వాత కూడా ఇన్ స్పెక్టర్ కి దొంగ ఫోన్ చేసి పోలీసుల ద్వారా మా ప్రాణాలు తీద్దామని చూసినవాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS