Previous Page Next Page 
ఆగ్నిశ్వాస పేజి 56


    అతనికి అనుకూలురైన కొందరు ప్రత్యర్థులు సభ్యులని రెచ్చగొట్టారు.


    అంత కాలమూ అవినాశ్ ని ట్రాన్స్ ఫర్ చేయించమని జయచంద్ర అడుగుతున్నా అవినాశ్ కి పోలీసు వర్గాల్లోనే కాక ప్రజల్లో కూడా మంచి పేరుండడంతో సంశయించిన హోం మినిస్టర్ ఇది అదునుగా తీసుకున్నారు.


    ఒకనాడు గూండాగా బ్రతికిన శివయ్య హోం మినిస్టర్ సదాశివయ్యగా మారడంలో జయచంద్ర పాత్ర చాలా వుంది. ధనుష్కోటి జయచంద్రకి శతృవేమో కాని వాళ్ళిద్దరూ రాజకీయ నాయకులకు మిత్రులుగానే వుంటారు. అది సాంప్రదాయం.


    ఉదయం ఎనిమిదన్నరకల్లా హోం మినిస్టర్ ఇంటికి రమ్మని పిలుపు వచ్చింది అవినాశ్ కి.


    ఇంతదాకా జరుగుతుందని కలగనని అవినాశ్ కి బోధపడిపోయింది. ఇప్పుడు తను దోషిగా కోర్టు మార్షల్లో నిలబడబోతున్నాడు...


    ఇదీ అతనికి కొత్తకాదు.


    వెళ్ళిన ప్రతీచోట ఇంచుమించు ఇలాంటి సన్నివేశాల్ని ఎదుర్కొన్నాడు కాని, ఇలాంటి సంఘటన తన చేతుల్లో జరగడం ఇదే తొలిసారి.


    అప్పటికే తెల్లవారు ఝామున స్టేషన్ నుంచి హెడ్ కానిస్టేబుల్ సాగర్ చనిపోయాడని తెలియపరిచాడు.


    స్టేషన్ కి వెళ్ళేసరికి అక్కడే వున్న ఎస్.ఐ. పరోక్షంగా ఎదుర్కోవలసిన పరిణామాల గురించి హెచ్చరించి అవకాశమిస్తే శవాన్ని మాయం చేస్తానన్నాడు.


    ఆ క్షణంలో అవినాశ్ ఆ మాటల్ని ఎంత అవమానకరంగా తీసుకున్నాడు అంటే తన నిజాయితీ ఇలా పరిణమించినందుకు తనను ఇంప్రెస్ చేయడానికి ఓ సబార్డినేట్ తీసుకోబోయిన చనువుకి మండిపడ్డాడు...


    "బాధ్యతగల పొజిషన్ లో వుండి ఇలాంటి సలహా ఇస్తున్న నిన్ను నిజానికి సస్పెండు చేయాలి ఇన్ స్పెక్టర్. ఒక వేళ నేను నేరమే చేస్తే చట్టరీత్యా నేనూ శిక్షింపబడాలి. దట్స్ మై ప్రిన్స్ పుల్" అంటూ చివాట్లు వేసి శవాన్ని పోస్ట్ మార్టంకి తరలించాడు...


    ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో హోంమినిస్టర్ ఇంటికి వెళ్ళేసరికి అప్పటికే అక్కడ చేరిన విలేకర్లు కురిపిస్తున్న ప్రశ్నల వర్షానికి జవాబు చెప్పకుండా తలతిప్పుకున్నాడు అవినాశ్.


    గదిలో హోం మినిస్టర్ తోపాటు డిజిపి, కమీషనర్ ఆఫ్ పోలీస్ కూర్చుని వున్నారు.


    "ఎంత పని చేశావయ్యా పెద్దమనిషి" ముందుగా అరిచింది సదా శివయ్య. "అవకాశం దొరికిందని కొట్టి చంపేయడమేనా... ఇప్పటికే పోలీసుల జులుం ఎక్కువై పోయిందని పత్రికలూ, ప్రజలు గగ్గోలు పెట్టేస్తున్నాయ్. ఇప్పుడేం జవాబు చెబుతావు. ఏం చెబుతావు అని నేను నిన్ను నిలదీస్తున్నాను."


    "ఇలా జరుగుతుందని నేనూహించలేదు." తల వంచుకున్నాడు అవినాశ్.


    ఈ తప్పు తనదే అన్న బాధ అతడ్ని కృంగదీస్తూంది.


    "అలా అంటే చాలదు మిస్టర్ అవినాశ్... నువ్వు చేసిన తెలివితక్కువ పనికి మన డిపార్టుమెంట్ శాంతి భద్రతల విషయంలో బాధ్యత వహించే హోం మినిస్టర్ గారు తలవంచుకునే పరిస్థితి ఏర్పడింది. నువ్విప్పుడు సంజాయిషి ఇస్తే చాలదు. నీ బాధ్యతారాహిత్యానికి సిగ్గుపడాలి... శిక్షకు సిద్ధపడాలి" డి.జి.పి. హుంకరించాడు.


    సీనియారిటీతో సంబంధం లేకుండా సెలెక్షన్ పోస్టుగా డైరెక్టర్ జనరల్ అయిన ఆ పెద్దమనిషి ఒక రాజకీయ నాయకుడికి తొత్తుగా మాటాడుతున్నాడే తప్ప వాస్తవాల్ని లోతుగా పరిశీలించాలనుకోవడం లేదని తొలిచూపులోనే అర్థమైన అవినాశ్ నిశ్శబ్దంగా వుండిపోయాడు.


    "మిస్టర్ అవినాశ్" కమీషనర్ సాలోచనగా చూశాడు. అవినాశ్ నిజాయితీని అడుగడుగునా సమర్థించే వ్యక్తి ఆయనొక్కడే.


    "నేరస్థులచేత నిజం చెప్పించడంలో ఒక్కోమారు మనం కటువుగా ప్రవర్తించాలన్నది అందరూ ఒప్పుకునే సత్యమే అయినా ఇంతగా ఎందుకావేశపడ్డావు."


    అటెన్షన్ తో నిలబడివున్న అవినాశ్ రాత్రి సాగర్ సంతకం చేసిన స్టేట్ మెంట్ కాగితాన్ని అందించాడు.


    కమీషనర్ ఓ క్షణం చూసి హోం మినిస్టర్ ని కాస్త కూల్ చేయాలని డైరెక్టుగా అతడి చేతిలో వుంచాడు.


    ఉత్తరాలు చదవడమూ, సంతకము చేయగలగడం చేతనైతే చాలన్నచోట చదువాపేసిన సదాశివయ్య కాగితాన్ని ఆమూలగ్రమూ చదివి "అయితే మటుకు ఏంటి" అంటూ కసిగా ముక్కలు చేసి చెత్తబుట్టలో వేసేశాడు. "ఇలాంటి దానికోసం నిలువునా మనిషి ప్రాణాలు తీస్తావా... తీస్తావా అని నిన్ను నిలదీస్తున్నాను."


    ఉన్న ఒక అతిముఖ్యమైన ఆధారాన్ని ఆవేశం నటిస్తూ అలా చించివేయడంతో జయచంద్ర నుంచి మంత్రిగారికి ఎంత ముట్టబోతున్నదీ అవినాశ్ ఆలోచించలేదు...


    కాని...


    ఒక బాధ్యతగల వ్యక్తి అంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం సహించలేకపోయాడు.


    ఇదీ జీర్ణించుకోలేని అనుభవమే...


    అందుకే ముందు కమీషనర్ మొహం కేసి చూశాడు.


    ఇంత జరిగినా పెదవి విప్పని డిజిపి వైపు సూటిగా చూసి ఏదో అడగాలనుకున్నాడు కాని, అప్పటికే అవినాశ్ ముఖ కవళికల్ని గమనించిన సదాశివయ్య ఆవేశంగా విరుచుకుపడ్డాడు.

    
    "ఏంటయ్యా ... ఆ చూపులేంటి, తలదీసి మొలేస్తారా. అసలు నీ బాసుల దగ్గర ప్రవర్తించే తీరు ఇదేనా, ఇదేనా అని నిన్ను నిలదీస్తున్నాను."


    "సిగ్గుపడుతున్నాను." ఉద్రేకాన్ని నిభాయించుకుంటూ ఒక్కో పదాన్ని ఒత్తి పలుకుతూ అన్నాడు అవినాశ్. "అవును సదాశివయ్యగారు... చదువులో సంస్కారంలో మీకంటే నిజానికి గొప్పవారైనా అయిదేళ్ల మీ పరపతికి అతి విలువైన తన ఆత్మాభిమానాన్ని పణంగా పెడుతున్న గౌరవనీయులు నా అధికార్ల మౌనానికి నిజంగా సిగ్గుపడుతున్నాను. ప్రీజుడిస్ లేని పరిశీలనా జ్ఞానం పోలీస్ డిపార్ట్ మెంటుకి అతిముఖ్యమైన ఆయుధం అంటూ అకాడమీల్లో మాకు ఫేకల్టీస్ గా వచ్చి పాఠాలు చెప్పిన మా మార్గదర్శకులు మీరు చించిన కాగితాన్ని నిశ్శబ్దంగా చూస్తూ వుండిపోవడాన్ని ప్రిజుడిస్ కాక మరేమంటారూ అని నేనూ నిలదీస్తున్నాను"...


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS