అప్రయత్నంగా అతను ఆమె భుజంపైన చెయ్యివేశాడు. భారతి ఉలిక్కిపడలేదు.
ఆమె కంగారుపడలేదు. సన్నగా నవ్వింది. అటు తర్వాత మెల్లగా అతని చేతిని పక్కకి తోసేయబోయింది.
కానీ అతను ఆమె భుజంమీదినుంచి చెయ్యి తీసేస్తున్నట్టుగా పట్టుని వదులుచేసి అంతలోనే మళ్ళీ గుచ్చి పట్టుకున్నాడు.
భారతి ఈసారి అతని చేతిని తోసేయడానికి ప్రయత్నించలేదు.
మనసిచ్చిన వాడు, మనసు పుచ్చుకొన్నవాడు, తొలిసారిగా చెయ్యి ఒంటిపైన వేస్తున్నాడు.
అంతేదా?
దానికే పెద్ద ఫోజు కొట్టి విదిలించి కొట్టడం సభ్యతకాదనిపించింది భారతికి.
"నీకు నేనెక్కువ చెప్పను. నా ఫాస్ట్ లైఫ్ గురించి నీకు తెలుసు. అందుకే నన్ను హేట్ చేస్తూ వచ్చావు. కానీ నేను మారిపోయాను. నీ కోసం మారిపోయాను. నిన్ను నేను ప్రేమించడమే దానికి కారణం భారతీ?" అన్నాడు మనోహర్.
భారతికీ చెప్పాలనే వుంది.
"నిన్ను నేను ప్రేమిస్తున్నాను మనోహర్" అని, కానీ ఆమె గొంతు దాటి ఆ మాటలు బయటకి రాలేదు. రావడం లేదు.
ఆరోజు జరిగిన దాని గురించి ఏమన్నా అడుగుతాడనుకుంది. కానీ ఆ మాటే ఎత్తడం లేదు. దానిని బట్టి అతనిలోని సంస్కారం ఆమెకి అర్థం అవుతూనే వుంది.
మనోహర్ ఆలోచనలు మరోలా ఉన్నాయి.
ఇంతకాలంగానూ ఎంతో అసహ్యించుకున్న ఆ అమ్మాయి, తను ఆత్మాహుతి చేసుకోబోతే తల్లడిల్లిపోయింది. తన నీడని సైతం భరించలేని ఆమె కారెక్కి తనసరసనే కూర్చుంది. తన మాటలని శ్రద్దగా వింటూన్నది.
ఆమె నోటితో చెప్పకపోయినా అతను గ్రహించాడు. ఆమెకూడా తనని ప్రేమిస్తోంది. ప్రేమంటే అదే, ప్రేమకున్న శక్తి అదే.
అతనిలో ఇప్పుడు అంతకు ముందున్న టెన్షన్ లేదు. గుండెలనిండా ఆనందం చోటు చేసుకుంటోంది.
"అయాం సారీ మనోహర్. మీకు కష్టం కలిగేలా చాలాసార్లు మాట్లాడాను అయినా కూడా నాకుగా నేను వెళ్ళి చిక్కుకున్న సాలెగూటి నించి నన్ను కాపాడారు. నేను మీకు చాలా రుణపడిపోయాను మనోహర్" అంది భారతి మెల్లగా. అలా అంటున్నప్పుడు ఆమె గొంతు సన్నగా వణికింది.
"నిన్ను కాపాడుకోవడం నా డ్యూటీగా భావించాను. ఏదో ఒకరోజు నీ మనసు మారుతుందన్న ఆత్మవిశ్వాసంతోనే ఇన్నాళ్ళూ ఎదురుచూశాను కానీ ఆఖరికి ఈరోజు కూడా నువ్విలా పెంకిగా ప్రవర్తించేసరికి నాకు బతకాలనిపించలేదు. ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది భారతీ!" అన్నాడు మనోహర్.
భారతి "థాంక్స్" అంది.
అతను కారు డ్రైవ్ చేస్తూంటే ఎడం చేత్తో ఆమె గెడ్డాన్ని పట్టుకుని ఆమె మొహాన్ని తనవేపుకు తిప్పుకున్నాడు.
"ఇప్పుడెక్కడికి!" అడిగాడు మనోహర్.
"ఏమో! నాకేం తెలుసు! కారెక్కమన్నది మీరు!" అంది భారతి.
"అయితే నా ఇష్టమొచ్చినచోటుకి తీసుకొనిపోవచ్చునన్నమాట?" అన్నాడు మనోహర్.
"నాకేం భయంలేదు. మీరెక్కడికి రమ్మన్నా వస్తాను" అంది.
భారతి తన మాటలని తానే నమ్మలేకపోతోంది. కానీ ఇదంతా మమ్మీకి తెలిస్తే చంపేస్తుంది. ఆ భయం ఆమెకి లోపల ఉన్నది.
మనోహర్ తనని ప్రేమిస్తున్నాడు.
తనూ అతన్ని ఇష్టపడుతోంది.
మనోహర్ కి చదువుంది.
స్టేటస్ వుంది.
అందం వుంది.
మమ్మీ కోరుకునే అర్హతలన్నీ అతనిలో ఉన్నాయి. అంచేత మమ్మీకి భయపడవలసిన పనిలేదని ఆమె అనుకుంటోంది. మమ్మీ అడ్డు చెప్పదన్న విశ్వాసం ఆమెలో వుంది.
"ఏదన్నా హోటల్ కి వెళ్ళి కాఫీ తాగుదాం" అన్నాడు.
"మీ ఇష్టం"
మనోహర్ కారుని తాజ్ మహల్ హోటల్ కి పోనిచ్చాడు.
ఫామిలీ రూంలో కూర్చున్నాక అన్నాడు మనోహర్.
"నాకీవేళ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినట్టుగా వుంది"
భారతి నవ్వింది.
వారిమధ్య నిజానికి భారతికిగానీ, మనోహర్ కిగానీ కలలో కూడా వూహించని కలయిక అది.
అంత తేలికగా భారతి మనసు మారుతుందని మనోహర్ ఏనాడూ అనుకోలేదు. కలలో సైతం అనుకోలేదు.
మనోహర్ చాలా చెడ్డవాడు. అతను కేరక్టర్ లేని మనిషన్న అభిప్రాయంతో వున్నదే కానీ అతనిలోని మంచితనాన్ని, అతని గుండెలోతుల్లో తనపట్ల గల ఆరాధననీ, ప్రేమనీ ఇంత కాలంగానూ నిర్లక్ష్యం చేసినందుకు ఎంతో బాధగా వుంది భారతికిప్పుడు.
బేరర్ కి కాఫీ ఆర్డర్ చేశాడు.
"నేనింకో విషయంలో నీకు సంజాయిషీ ఇవ్వాల్సి వుంది" అన్నాడు.
"ఏమిటీ!"
"జాన్సన్ హత్యకేసులో నేనే హంతకుడ్ని అనే అనునానం నీకుంది"
భారతి మౌనంగా వుండిపోయింది. ఆ మాటిప్పుడు ఆమెని సూదితో గుచ్చినట్టుగా వుంది.
"భారతి నేను నిరపరాధిని. అప్పట్లో ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ స్థాయిలో జరిగాయి. దెబ్బలాటలు, కొట్లాటలు ఎన్నో జరిగాయి. నా అపోజిషన్ కాండిడేట్ పూర్ణాకి ఓ పొలిటికల్ పార్టీతో సంబంధం ఉంది. ఆ పార్టీ అతన్ని బలపరిచింది. కానీ నా బలం ముందు నిలబడలేక నన్ను లేపేయడానికి ప్రయత్నించారు. పూర్ణ రౌడీలతో వచ్చాడు. జాన్సన్ పూర్ణ ఫ్రెండ్. అతను నన్ను వెనుకనుంచి పట్టుకున్నాడు. వచ్చిన రౌడీల్లో ఒకడు కత్తి తీసి నా గుండెల్లో దించబోయాడు. నేను మెరుపులా వెనక్కి తిరిగేసరికి అది జాన్సన్ డొక్కలో దిగిపోయింది. జాన్సన్ చనిపోయాడు. చనిపోయింది వాళ్ళ మనిషే కావడంతో నేనే అతన్ని హత్య చేయించానని ప్రచారం చేశారు. కానీ నిజానిజాలని కళ్ళతో చూసిన వాళ్ళున్నారు అందుకే కోర్టు నన్ను నిర్దోషిగా భావించి వదిలేసింది. నేను నిజంగా నిర్దోషిని. నువ్వు నన్ను హంతకుడని సంబోధించినప్పుడు నేనెంత నరకం అనుభవించానో నీకు చెప్పలేను భారతీ," అతని గొంతు జీరబోయింది.
