ఎందుకంటే అయన ఎంతో సీనియర్ లాయర్!
ఏదయినా కేసును చేపట్టడం అంటూ జరిగితే విజయం సాధించవలసిందే....
కేసును కూలకషంగా పరిశీలించిన మీదటే ఆ క్లయింట్ కేస్ ని టేకప్ చేస్తాడు.
అంత మంచి పేరున్నా సీనియర్ లాయర్ రవితేజ తరుపున వాదించబోతున్నారంటే మేధావులు మెచ్చుకోకుండా వుండలేకపోయారు.
అనుభవంలేని కుర్ర లాయర్లు ఆయనపట్ల జాలిని ప్రదర్శించారు.
"మిలార్డ్.... ముద్దాయి తరుపున వాదించబోతున్న లాయర్ ను నేనే...."
"ఓ.కే... ప్రొసీసిడ్..."
"మిలార్డ్... మొదటి సాక్షిగా అభినయ్ ని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను"
అభినయ్ బోనులోకి వచ్చి నిల్చున్నాడు.
"మిస్టర్.... మీ తండ్రి అనుచరుడ్ని చంపిన హంతకుడు రవితేజ అంటూ అభియోగం మోపపడింది. నువ్వు కూడా అదే నిజమని నమ్ముతున్నావా?"
"రవితేజ నిర్దోషి.... ఆ హత్య అతను చేయలేదు. ఒక సందర్బంలో నాపై అతను హత్యా ప్రయత్నం చేసేలా రెచ్చగొట్టడం జరిగింది. అప్పుడు ఆవేశంలో వచ్చిన రవితేజ నన్ను చంపడం వీలుకాక పారిపోయాడు. వెళుతూ వెళుతూ రివాల్వర్ ని వదిలి పారిపోయాడు. అప్పుడు వదిలి వెళ్ళిపోయిన రివాల్వర్ నే ఈ హత్యకు ఉపయోగించి హత్యాస్థలంలో వదిలి పెట్టడం వలన రవితేజని హంతకుడిగా భావించవలసి వస్తుంది తప్ప అ హత్య అతను చేయలేదు అని ఘంటాపదంగా చెప్పగలను..."
"నువ్వు చెప్పిన దానినిబట్టి రవితేజ అ హత్య చేయలేదు. మరి ఎవరుచేసి ఉంటారు?" రెండవ ప్రశ్న వేశాడు లాయర్ పరాంకుశం.
"అది నాకు తెలియదు...." అన్నాడు అభినయ్.
"ఇక నువ్వు వెళ్ళవచ్చు..."
అభినయ్ వెళ్ళిపోయాడు.
"యువర్ ఆనర్.... కేవలం రివాల్వర్ పై వేలిముద్రల ఆధారంగానే ప్రాసిక్యూషన్ అతనని దోషిగా కోర్టు ముందు నిలబెట్టింది. నిజానికి ఆ రివాల్వర్ ను అతను ఎప్పుడో జారవిడుచుకున్నాడని కోర్టువారు విన్నారు కూడా. రెండవ సాక్షిగా ధీరజను ప్రవేశ పెట్టమని కోర్టువారిని కోరుతున్నాను..."
ధీరజ వచ్చి బోనులో నిలబడింది.
"లుక్ మిస్... హత్య జరిగిన స్థలంలో మీరు తప్ప మరొక జర్నలిస్టు లేరు. జరిగింది ఏమిటో, అసలు అక్కడ మీరు ఏం చూశారో చెప్పండి"
"నేను హంతకుడ్ని ఫోటోలు కూడా తీశాను సర్... ఆ ఫోటోలు కోర్టువారి ముందుంచాను. ఆ ఫోటోలను చూస్తుంటే హంతకుడు రవితేజలా కనిపిస్తున్నాడే తప్ప అతను కాదు.... ఆ ఒడ్డూ పొడుగూ కలిగిన మరొక వ్యక్తి ముఖం కనిపించకుండా ఆ హత్య చేసి పారిపోయాడు తప్ప అతను రవితేజ కాదు...."
"దట్సాల్ యువర్ ఆనర్....రవితేజ నిరపరాధి అనడానికి చివరిగా అతి ముఖ్యమయిన సాక్షి సత్యమోహన్ ప్రవేశ పెట్టవలసిందిగా కోరుతున్నాను"
వింటున్న వాళ్ళందరిలో సంభ్రమం చోటుచేసుకుంది
ఎలాంటి కేసును ఎటు మలుపు తిప్పుతున్నాడో లాయర్ పరాంకుశం మేధాశక్తికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
లాయర్ సత్యమోహన్ వచ్చి బోనులో నిలుచున్నాడు.
"మిస్టర్ సత్యమోహన్.... రవితేజలా ఒడ్డూ పొడుగూ వున్న వ్యక్తి మీరు మాత్రమే. మీరే ఆ హత్య చేశారని నేను అంటాను ఎందుకంటే ఆ హత్య చేసే అవసరం ఉన్న వ్యక్తులు ముగ్గురు మాత్రమేనని రవితేజ తన సందేహాన్ని వెలిబుచ్చాడు.
ఆ ముగ్గురిలో అభినయ్ కు సంభంధం లేదు. మరొక వ్యక్తి జయచంద్ర చనిపోయాడు.... అదీగాక వయసులోనూ, ఆకారంలోనూ అతను సరిపోలడు. ఇక మిగిలింది మీరు.... దీనికి మీ సమాధానం ఏమిటి?"
"మీరు చెప్పింది కేవలం కట్టుకథ... ఆ హత్య చేయవలసిన అవసరం నాకేముంది?"
"సరే, అలానే అనుకుందాం .... ఆ రోజు మీరు ఎక్కడ ఉన్నారు?"
"నా ఇంట్లోనే వున్నాను...."
"మీరు చెప్పేది అబద్దమని, ఆ రోజు మీరు అసలు ఇంటికి రాలేదని ఇంతకుముందే మీ అమ్మాయి రజని సాక్ష్యం ఇచ్చింది. దానికి మీరు ఏమంటారు?"
పరాంకుశం క్షణం ఆగాడు.
ఊహించని ఆ ప్రశ్నకు సత్యమోహన్ బిత్తరపోయాడు.
"హంతుకుడి ఫోటోలు తీసిన ధీరజ తన తెలివితేటలను ఉపయోగించి అసలు హంతకుడ్ని గుర్తించడంలో కూడా సహయాపడింది. మీకు తెలియని రహస్యం చెప్పమటారా.
తను తీసిన ఫోటోలను క్లోజప్ లు తీసి మరింతగా కుదించి.... తిరిగి ప్రింట్లు వేయడం వలన ఒక ఫోటోలో హంతకుడి ముఖం సగం కనిపిస్తుంది. అది మీదేనని తెలిసి పోతుంది కాబట్టి ఇకనయినా మీ నేరాన్ని ఒప్పుకుంటే మంచిది.... కోర్టు శిక్ష తగ్గించవచ్చు"
లాయర్ పరాంకుశం ఒక నిముషం మౌనం వహించాడు.
ఏమనుకున్నాడో ఏమో సత్యమోహన్ నోరు విప్పాడు.
"నిజమే మిలార్డ్.... ఆ హత్య చేసింది నేనే.... ముందు అభినయ్ చేత చేయిద్దామనుకున్నాను. కానీ చూస్తూ చూస్తూ నా అల్లుడ్ని హంతకునిగా చేయడం ఇష్టం లేక నేనే ముఖం కనిపించకుండా జాగ్రత్తపడి పధకం ప్రకారం హత్య చేసి పారిపోయి..... ఆ నేరాన్ని రవితేజ మీద పడేలా చేశాను" అంటూ తన నేరాన్ని ఒప్పుకున్నాడు.
ఊహించని నిజాన్ని విన్న వాళ్ళు అందరూ స్థాణువులయి పోయారు.
సత్యమోహన్ బోను దిగి వెళ్ళిపోబోతుండగా ధీరజ అతన్ని సమీపించింది.
"అంకుల్.... ఈ పిల్లకాకి దెబ్బ ఎలాంటిదో తెలిసిందిగా.... మీకు ఒక నిజం చెప్పమంటారా?
నేను తీసిన ఫోటోలలో అసలు మీ ముఖం కనిపించనేలేదు. ఐనా మీ నోటివెంటే నేరాన్ని ఒప్పుకునేలా చేశాను....దటీజ్ ధీరజ"
