జవాబు చెప్పక తప్పదా అన్నట్టు అతనివైపు చూశాడు.
"మిస్టర్ జయచంద్రా... నా ప్రశ్నకు మారూ జవాబు చెప్పాలి."
తనను పేరుపెట్టి పిలుస్తున్న కొడుకువైపు కోపంగా చూశాడు
ఆ క్షణంలో కొడుకు ఉగ్రనరసింహునిలా కనిపించాడు.
అతని కళ్ళు అగ్నిగోళాల్లా వున్నాయి. ముఖం అంతా ఎర్రగా కందిపోయింది. పిడిగిళ్ళు బిగుసుకుని వున్నాయి.
"ఏమైందిరా ఈ రోజు నీకు..." పరిస్థితిని చక్కబరచటానికి అన్నట్టు అన్నాడు జయచంద్ర.
"ఇప్పటివరకు ఏమీకాలేదు... ఇంకా ఏమౌతుందో తెలియదు. పేలడానికి సిద్దంగా వున్న ఫిరంగిని... మీరు తయారుచేసిన ఆటంబాంబుని. మీరు పెంచిన రాక్షసి లక్షణాలతో పెరిగిన పిచ్చివాణ్ని.... మీరు రూపొందించిన మారణాస్రాన్ని... ఇప్పుడు మీమీదే తిరగబడి మిమ్మల్నే దహించు వేయడానికి సిద్దంగా వున్నాడు" అన్నాడు అభినయ్.
జయచంద్ర మేధస్సుకు అంతుబట్టనిది కాదు.... అభినయ్ ఆవేశం!
అతని మనసు ఎరిగినవాడు కావడం వలన చిన్నగా నవ్వాడు.
"కూల్ డౌన్ మై బోయ్.... కూల్ డౌన్..." అంటూ చేతిలోని విస్కీ గ్లాసుని అందించాడు.
అభినయ్ రెండు గుక్కల్లో ఫినిష్ చేసి ఆ గ్లాసును విసిరి కొట్టాడు.
"మిస్టర్ జయచంద్రా.... మీ మారణహోమాన్ని ఇకనయినా ఆపండి.... ఇంతకాలం ముఖ్యమంత్రి పదవీ వ్యామోహంతో రక్తం మరిగిన పులిలా ప్రజల మీదకు విరుచుకుపడ్డారు. మీ కౄరత్వాన్ని యికనయినా ముగించండి..." పెద్ద గంతుతో హెచ్చరికలా అన్నాడు అభినయ్.
జయచంద్ర వికటంగా నవ్వాడు.
"నేను తుది శ్వాస విడిచేవరకు నాలో పదవీకాంక్ష చావదు....నా తరువాత నా ఆస్థికి, రాజకీయ సింహాసనానికి నువ్వే వారసుడివి... నా మాట విని నేను చెప్పినట్టు చెయ్యి. నాతోపాటు నువ్వు సుఖపడతావు"
"నాలో ప్రవహించే రక్తం నా తల్లిది. మీ పెంపకంలో దుర్మార్గుడిలా పెరిగినా నా తల్లి గుణాలు నాలో నిక్షిప్తమై వున్నాయి. నాలోని రాక్షసుడు నిద్రలేవలేకముందే మీ అంతట మీరే పోలీసులకు లొంగిపోవాలి"
ఆ క్షణంలో అభినయ్ ఏం చెప్పినా వినడు అని తేలిపోయింది. అతనిలోని పితృ వాత్సల్యం మాయమైంది. డస్క్ లో నుండి రివాల్వర్ తీశాడు.
కానీ, అంతకు క్షణంముందే అభినయ్ తన చేతిలోని రివాల్వర్ ను గురి చూసి కాల్చాడు.
జయచంద్ర చావు కేకలతో నేల కూలిపోయాడు.
తండ్రి చనిపోయాడని నిర్దారణ చేసుకున్నాక అభినయ్ ఆ ఇంటిలో నుంచి బయటకు నడిచాడు. అతనని ఎవరూ ఆపే సాహసం చేయలేదు.
సరాసరి డి.జి.పి. దగ్గరకు వెళ్ళి తను చేసిన హత్య విషయం చెప్పి రివాల్వర్ ను హాండోవర్ చేసి లొంగిపోయాడు అభినయ్.
జయచంద్ర కొడుకు చేతిలోనే హత్యగావింపబడ్డాడన్నా విషయం తెలిసిన ఆనందరావు మ్రాన్పడిపోయాడు.
కొన్ని గంటల వ్యవధిలో...
తన కన్నకొడుకు లిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళను ఎలా రక్షించుకోవాలో అర్ధంకాక ఆనందరావు అయోమయావస్థలో వుండిపోయాడు.
* * * *
ముఖ్యమంత్రి ఛాంబర్ లో...
ఆయనతో పాటు డి. జి. పి. కూడా వున్నాడు.
చట్టానికి ఎవరూ అతీతులు కారు.... న్యాయం అన్యాయాన్ని దహించక మానదు. ధర్మానిదే అంతిమ విజయం. నేరస్థులు ఏ హోదాలో వున్నా శిక్షించి తీరవలసిందే.
అప్పటికి తగినన్ని సాక్ష్యాధారాలు దొరకడంతో సత్యమోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
కొన్ని గంటల క్రితమే రాష్ట్రానికి పరిశీలన జరపడానికి వచ్చిన కేంద్ర బృందం డిల్లీ వెళ్లిపోతుంది. నగరంలో జరిగిన అరాచకాలకు, అల్లర్లకు జయచంద్ర, సత్యమోహన్ ఇరువురూ బాధ్యులు అని నిర్దారించుకుని ఆ విధంగా నివేదిక తయారు చేసుకుని వెళ్ళిపోయింది ఆ బృందం.
ఎమ్. ఎల్. ఏ లు పొరుగు రాష్ట్రంలో దాచబడ్డారన్న విషయం తెలియడంతో ఆ రాష్ట్ర హోం శాఖను కాంటాక్ట్ చేశాడు ముఖ్యమంత్రి. వెంటనే వాళ్ళను విడిపించి స్వరాష్ట్రంకు పంపించే ఏర్పాట్లు చేసింది. పొరుగున వున్న కర్ణాటక ప్రభుత్వం...!
* * * *
కోర్టు కిటకిట లాడుతుంది...
విజిటర్స్ గాలరీ రద్దీగా వుంది.
జడ్జిగారు రాగానే విచారణ ప్రారంభమయింది.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేచి నిలుచున్నాడు. ఆ కేసు పూర్వాపరాలను వివరించాడు. ముద్దాయి రవితేజను బోనులో నిలబట్టారు. ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రజల మధ్యలో ధీరజ, రజని, అనందరావులు వున్నారు.
"మిలార్డ్... తండ్రి గెలుపు అసాద్యం అని తెలిసిన ఎన్నికలలో ఓట్లు కొల్లగొట్టడానికి ప్రత్యర్ది నమ్మకమైన అనుచరుడిమీద హత్యాప్రయత్నం చేసినట్టు అభియోగం మోపబడింది. హత్యాస్థలంలో దొరికిన రివాల్వర్ పై హంతకుడి వేలిముద్రలే వున్నాయి. అదీగాక గతంలో జయచంద్రకు చెందిన కార్యకర్తలపై దాడిచేసినట్టు అయన కొడుకుపై కూడా ఒకసారి హత్యా ప్రయత్నం చేసినట్టు పోలీసు దర్యాప్తులో తేలింది. ముద్దాయికి తప్ప మరొకరికి ఆ హత్యచేసే అవసరం, ఆవకాశం లేవు అని విన్నవించుకుంటున్నాను. సదరు హంతకుడిని తగిన విధంగా శిక్షించవలసిందిగా కోర్టువారిని వేడుకుంటున్నాను. దట్సాల్ యువర్ ఆనర్ ....
పబ్లిక్ ప్రాసిక్యూటర్ గంభీరోపన్యాసం యిచ్చాడు.
కోర్టుహాలు నిశ్శబ్దంగా వుంది.
"మిస్టర్ రవితేజా__ కోర్టుకు చెప్పకోవలసింది ఏమైనా వుందా? నీ తరుపున న్యాయవాదిని నియమించుకో దలిచావా__" న్యాయమూర్తి ప్రశ్నించాడు.
ఆనందరావు నియమించిన లాయర్ పరాంకుశం లేచి నిలుచుని కోర్టుకు అభివాదం చేశాడు. అయన రవితేజ కేసును వధించ బోతున్నారు అని అర్ధమైన మిగిలిన లాయర్లు అవాక్కయ్యారు.
ప్రజలలో ఉత్కంఠ బయలుదేరింది.
