లోగొంతుకతో అతనికి మాత్రమే వినిపించేలా అన్నది.
సత్యమోహన్ స్థాణువైపోయాడు.
తను పొరపాటుగా నోరు జారాడు. కానీ, తను ఇప్పుడేం చేసినా కోర్టు నమ్మదు.
అభినయ్ ముద్దాయిగా బోనులో నిలబడ్డాడు.
అన్ని సాక్ష్యాలు అతనే హత్య చేశాడని రుజువు చేయడంవలన అతనికి ఉరిశిక్ష పడటం ఖాయం అనుకుంటున్న సమయంలో కేసును తలక్రిందులు చేశాడు లాయర్ పరాంకుశం.
ముఖ్యమైన సాక్షిగా ఏ.సి.పి వీరేష్ ను ప్రవేశ పెట్టాడు.
కోర్టు హాల్లోని వారందరితోపాటు ముద్దాయి, లాయర్ సత్యమోహన్ సైతం ఆశ్చర్యపోయారు.
మతిస్థిమితం లేని వ్యక్తి, అందునా కదలలేని వ్యక్తి వచ్చి సాక్ష్యం చెప్పడం ఏమిటా అని సందేహపడ్డారు.
"మీలార్డ్... అందరూ అనుకుంటున్నట్టు నాకు మతి భ్రమించి లేదు. కేవలం అలా నటించాను. ధీరజ అందుకు సహకరించింది.
నేను అందించిన క్లూ ప్రకారంగానే జయచంద్ర, సత్యమోహన్లు పదిలక్షల కోసం మూడు మర్డర్లు చేసిన దొంగ నోట్ల సూట్ కేసుని ధీరజ సాధించగలిగింది.
వాళ్ళ నేరాలను వివరించే వీడియో కేసెట్ ను నాకు అందజేయడంలో నాకు చేదోడు వాదోడుగా వున్న కానిస్టేబుల్ ప్రాణాల్ని బలిపెట్టవలసి వచ్చింది.
తను వీడియో తెసిన ఒరిజనల్ కేసెట్ ను అక్కడే దాచి, డూప్లికేట్ కాసెట్ తో వాళ్ళకు దొరికి తను బలయిపోయాడు.
ఆ కాసెట్ నే అసలుది అనుకుని జయచంద్ర ధ్వంసం చేసి ఊరుకున్నాడు.
"ఇప్పుడు ఆ కాసెట్ చూస్తే ఇన్ స్పెక్టర్ చతుర్వేదిని ని చంపింది ఎవరో, దొంగనోట్ల ముఠా నడుపుతున్న పెద్దమనుషులు ఎవరో వాళ్ళ బండారం బయటపడుతుంది.
అలానే జయచంద్రను చంపింది అభినయ్ కాదు..... అతను కాల్చిన వెంటనే తండ్రి చచ్చిపోయాడని భావించి వెళ్ళి పోలీసులకు లొంగిపోయాడు.
కానీ అతని వెనకునే వచ్చిన సత్యమోహన్... తన ఎదుగుదలకి అడ్డుగా వున్న తన బావగారిలో ఇంకా ప్రాణాలు వున్నాయని గ్రహించి తన దగ్గరున్న రివాల్వర్ తో షూట్ చేసి మరీ చంపాడు. అతను షూట్ చేస్తుండగా ప్లాష్ లేకుండా ధీరజ ఫోటోలను తీసింది. ఆ ఫోటోలు, వీడియో కాసెట్ కోర్టువారికి సమర్పించింది.
కాబట్టి అసలయిన దోషికి తగిన శిక్ష విధించవలసినదిగా కోరుతున్నాను" అంటూ ఏ.సి.పి వీరేష్ వివరించాడు.
సత్యమోహన్ వూహించని పరిణామానికి బిత్తరపోయాడు.
అన్ని సాక్ష్యాలూ ఎదురు తిరగడంతో ఉరితాడు అతని కనులముంది మెదిలింది.
ఇంతమంది ఇన్నిరకాలుగా తనకు ఎదురు నిలిచినప్పుడు ఓటమిని ఒప్పుకోక తప్పదు అనిపించింది.
అయినా అతనిలోని మేకపోతు గాంభీర్యం సడలిపోలేదు.
"దోషులుగా భావించిన రవితేజ, అభినయ్ లను కోర్టు నిర్దోషులు అని నమ్మి వాళ్ళను విడుదల చేయమని ఆదేశించడమైనది. అన్నింటికీ కారకుడైన ప్రధాన నిందితుడు పవిత్రమైన న్యాయవృత్తిని చేపట్టి, డబ్బు కోసం రాజకీయ నాయకుల పంచన చేరి కుయుక్తులతో సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి నందుకు, రెండు హత్యలూ చేసినట్టు ప్రాసిక్యూషన్ అభియోగం చేయడంవలన సత్యమోహన్ రిమాండ్ కు పంపుతూ అయ్యా కేసులలో దర్యాప్తు పూర్తి చేసి కోర్టుకు సమర్పించవలసింది" అగ్నాలు జారీ చేయడం జరిగింది.
న్యాయమూర్తి మాటలు విని బోనులోనే గుండె చిక్కబట్టుకుని మోకాళ్ళపై ఒదిగిపోయాడు ఒకప్పటి ది గ్రేట్ క్రిమినల్ లాయర్....!
ఆనందరావు మెల్లగా నడచి వెళ్ళి విడుదల అయినా ఇద్దరు కొడుకుల భుజాలపై చేతులు వేశాడు.
ఆ ఇద్దరి కళ్ళలో ఆనందాశ్రువులు తొంగి చూస్తున్నాయి.
రజినిని దగ్గరకు రమ్మన్నట్టు సైగ చేశాడు ఆనందరావు. తనని ఆదరించే వాళ్ళు వున్నారన్న విశ్వాసంతో రజని కళ్ళు తుడుచుకుంది.
ఆనందరావు... రవితేజ, రజనిల చేతులుకలపడం చూసిన ధీరజ కళ్ళు మిలమిల మెరిశాయి.
"వీరూ... జీవితంలో ఏదో ఒక గొప్ప క్రెడిట్ కొట్టేసిన తరువాతనే నా మెడలో మూడుముళ్ళు వేస్తాను అన్నావు కదా... మరి ఎప్పుడు పెట్టిస్తావు మూహూర్తం?" చిలిపిగా కన్ను గీడుతూ అన్నది.
"చేసుకుంటానని మాట యిచ్చానుగా.... యిక ఎందుకంత తొందర?"
"ఎందుకేమిటి... ఇంతకాలం కలలు కనడంతోటే సరిపోయింది. నీ కేసుని ఒక కొలిక్కి తీసుకురావడానికి నేను ఎంత రిస్క్ తీసుకున్నానో చూడు.... అలాగయిన తొందరగా మనం ఒకటైపోవచ్చుననే తెగించి ఇన్ వెస్టిగేషన్ లో తలదూర్చాను."
"ఆహా... అదన్నమాట అసలు విషయం..... బయలుదేరండీ పెద్ద లేడీ కమెండో..." అన్నాడు వీరేష్ పరిహాసంగా.
"ఎస్... నేను లేడీ కమెండోనే ... ఎవరయినా కాదనగలరా?"
అందరి ముఖాలలోనూ నవ్వులు చోటుచేసుకున్నాయి.
"ధీరజ చెప్పింది నిజమే వీరేష్.... నువ్వు హాస్యానికి అంటున్నా నిజాన్నే చెప్పావు. మీరు అందరూ భావిస్తున్నట్టు ధీరజ జర్నలిస్టు మాత్రమే కాదు. సి.బి.ఐ. లేడీ ఏజెంట్... ఆమె కోడ్ నేమ్ లేడీ కమాండో..." సి.బి.ఐ. డైరెక్టర్ చటర్జీ తన ఏజెంట్ వైపు గర్వంగా చూస్తూ అన్నాడు.
వీరేష్ ఆశ్చర్యంతో నోరు వెళ్ళ బెట్టాడు.
ధీరజ కళ్ళలో చిలిపితనం....
"ఏయ్ మొద్దూ... ఇంతకాలం ఈ రహస్యాన్ని నా దగ్గర కూడా దాచావు కదూ!"
"అలా సస్పెన్స్ వుంటేనే జీవితంలో థ్రిల్ వుంటుందని నువ్వు ఎప్పుడో ఒకసారి చెప్పినట్టు గుర్తు... అది ఎప్పుడబ్బా....?"
"ఆ.... అవన్నీ మీరు ఇద్దరూ తీరిగ్గా శోభనం గదిలో కూర్చుని ఆలోచించుకోవచ్చు.... కానీ నా చేతుల మీదుగా మీ పెళ్ళి చేయాలనుకుంటున్నాను. మంచి ముహూర్తం ఎప్పుడు వుందో చూడమంటారా?" అన్నాడు ఛటర్జీ.
ధీరజ సిగ్గుల మొగ్గయిపోయింది.
"అమ్మో.... నీలోనూ అంత సిగ్గు దాగివుందా... బాప్ రే నేను తట్టుకోగలనా?" వీరేష్ చిలిపిగా ఆమెను ఉలికించాడు.
"ఛీ పో..." అంటూనే వీరేష్ హృదయంపై వాలిపోయింది ధీరజ.
__: సమాప్తం :__
