Previous Page Next Page 
త్రీ -ఇన్- వన్ పేజి 55

    "మరి నా రెండువేలు అడ్వాన్సు మాటో?" అని అడిగాడు సుదర్శనం.

    "ఇంకెక్కడి అడ్వాన్సు సాబ్... ఆల్లకీ ఈల్లకీ పార్టీలిచ్చేటాన్కి సరిపోయింది" అన్నాడు యాదగిరి. సుదర్శనం నోరెళ్ళ బెట్టాడు.

    సుదర్శనం సంగతెలా ఉన్నా గుర్తింపు కార్డులున్న అభిమాన సంఘాల ప్రెసిడెంట్లు సెక్రెట్రీలు మాత్రం వాళ్ళ పనులూ వీళ్ళ పనులూ చేయించిపెట్టి లక్షలు సంపాదిస్తున్నారు.


                                     నేనూ - నా ప్రేమ కథ


    ఆశ్చర్యం కలిగించే ప్రేమకథలు ఉంటాయ్. వార్నీ!... ప్రేమకోసం ఎంత తెగించారు! ఎంత సాహసం చేశారు వీళ్ళసాధ్యం కూలా! అని మనం ముక్కున వేలేస్కుని తీరాల్సిందే కొన్ని ప్రేమకథలు విన్న తరువాత. అలాగే మనసుకు బాధ కలిగించే ప్రేమకథలు ఉంటాయ్. అరెరె! ప్రేమకోసం ప్రాణాలు కూడా త్యాగం చేశారే అని కొన్ని ప్రేమకథలు విన్న తరువాత బాధపడతాం. అందులో ప్రాణత్యాగం చేసిన హీరోతో మనల్ని మనం పోల్చుకుని మరింత ఇదిగా బాధపడ్తాం. నిజమేకదా... హీరోతో కాకుండా విలన్ తొ పోల్చుకోవడం సాధ్యమా చెప్పండి.

    నా మట్టుకు నేను కొన్ని ప్రేమకథలు చదివి ముక్కున వేలేస్కున్నాను. నాకు ప్రేమకథలు చదివి బాధపడిపోయాను.

    ఒకసారి" పకపకా నవ్వించే ప్రేమకథలు  ఉండవా?" అని సందేహంతో న ప్రక్కసీట్లో పనిచేసే పాపారావ్ ని అడిగాను. వాడు జేబురుమాలుతో నోరుమూసుకుని ఘొల్లున నవ్వాడు.రూమలుతో నోరుమూసుకుని నవ్వడమేమిటీ అని ఆశ్చర్యపోతున్నారా? నవ్వేటప్పుడు నామీద తుంపర్లు పడకుండా ఉండేందుకు వాడు అలా చేసి ఉండొచ్చు అని సహృదయంతో మీరు ఆలోచించవచ్చు గానీ అ గాడిదకలాంటి ఉపకారబుద్ది ఉన్నవాడు కాడు. నాదగ్గర సంవత్సరం క్రితం అప్పుగా తీస్కున్న వంద రూపాయలు ఇప్పటివరకూ ఇవ్వలేదు.

    సరే... పకపకా నవ్వించే ప్రేమకథలు ఉండవా అని కదూ నేను వాడిని అడిగింది?....

    నవ్వీ నవ్వీ తడిసిముద్దయిన జేబు రుమాలు నోటి మీదినుండి తీసి తెలుగు సినిమాలు నువ్వసలు చూడవా?" అని ఎదురు ప్రశ్న వేసి వెళ్ళిపోయాడు పాపారావ్.

    నేను బిక్కచచ్చిపోయాను. ఆ సమయంలో అద్దంలో ణా ముఖం నేను గనుక చూసుకుని ఉంటే వెధవని వెయ్యికి తక్కువ కాకుండా తిట్టుకుని ఉండేవాడిని.

    అసలు పాపారావ్ జేబురుమాలు నోటికి అడ్డు పెట్టుకుని ఎందుకు నవ్వుతాడో చెప్పలేదు కదూ? వాడి పలువరస వంకరగా ఉంటుంది.

    ఈ నవ్వు పుట్టించే ప్రేమకథలు నాకో పెద్ద సమస్య అయిపోయింది. వాటి తాలుకు ఆలోచనలు పాతబడిపోయిన పెళ్ళాంలా మెదడుని తినేయసాగాయ్. ఎన్నో... ఎన్నెన్నో ప్రేమకథలు చదివాను గానీ, అన్నీ త్యాగాల ప్రేమకథలు, విచారం ప్రేమకథలు, సంతోషం ప్రేమకథలు. ఇంకా వగైరా వగైరా ప్రేమకథలు....

                                                               

     అసలు రచయితల్ని అనాలి థూ...

    డ్రాప్టింగ్ చెయ్యడం రాకపోతే... అడిగి తెలుసుకోవాలి. అలా ఫైలుమీద ఉమ్మేస్తే ఎలా?..." మా సూపరింటెండెంటు సీరియస్ గా నా వైపు చూస్తూ అన్నాడు.

    ఆలోచనల్లో మునిగిపోయి నేను చేసిన తప్పును గ్రహించాను. జేబురుమాలు తీసి ఫైలును తుడిచాను.

    ఆ రోజు నా మనసు ఆనందంతో గంతులు వేసింది. ఎందుకంటే ఆ రోజే మా ఆఫీసులో కొత్తగా ఓ టైపిస్టు చేరింది. పేరు హేమ్మాలిని అయితే బావుండేది కానీ కాదు... సుబ్బలక్ష్మి.

    సుబ్బలక్ష్మి.... ఆ అమ్మాయిని చుసిన తరువాత ఆ పేరుకూడా నాకు ఎంతో మంచిపేరులా అనిపించింది. అయినా పేరులో ఏముంది...?

    చూసిన మరుక్షణం నేను అనుకున్నాను.... నా డ్రీమ్ గర్లు ఆ అమ్మాయేనని.

    అంతమాత్రం చేత మనసు గంతులు వేయలనేం లేదుగా?...

    మా మేనేజరు పరాంకుశం ఆ అమ్మాయిని ప్రతి బల్ల దగ్గరికీ తీసుకువెళ్ళి అందరికి పరిచయం చేశాడు.

    "ఈయన ఈ షెక్షనులో యు.డి.సి. అప్పుడప్పుడూ మన ఆఫీసు కల్చరల్ ప్రోగ్రాంలో నాటకాల్లో వేషాలు వేస్తుంటాడు. చాలా యాక్టివ్ పర్సన్ లే..." అన్నాడు అమ్మకడుపు చల్లగా పరాంకుశం.

                                  

     సుబ్బలక్ష్మి చిరునవ్వుతో నమస్కరించింది.

    "అయితే మీరు మంచి నటులన్న మాట!...."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS