Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 57

    "నమస్కారం" అన్నాను.

    శ్రీశ్రీగారి దగ్గరికి చేరి వాళ్ళంతా  ప్రశ్నల వర్షం  కురిపిస్తున్నారు. ఆయన అన్నిటికీ సమాధానాలు చెపుతున్నారు. వాళ్ళు శ్రీశ్రీగారిని అడిగే ప్రశ్నలు ఏమిటో, శ్రీశ్రీగారి సమాధానాలేమిటో వినాలని అటు తిరిగి కూర్చున్నాను.

    "ఆరుద్రగారు 'మీ శిష్యరత్నం' అంటారు. దానికి మీ సమాధానం ఏమిటి ?"

    "శిష్యుడంటే  ఆరుద్ర ఒప్పుకోడు. 'రత్నం' అంటే నేనొప్పుకోను"

    "సమాజంలో మీకున్న అనుభవంతో, రానున్న కాలంలో  అధికారం కోసం ఎటువంటి మార్పులు జరుగుతాయో చెప్పండి"

    "దీని గురించి చెప్పడానికి  జ్యోతిష్కుడిని కాను"

    "2001వ సంవత్సరానికి ముందే విప్లవం వస్తుందా?"

    "నేను ఆశావాదిని. ఇంకా ముందే వస్తుందని అనుకుంటున్నాను. నా జీవితకాలంలో విప్లవాన్ని  చూడాలని నా కోరిక"

    "మీ జీవితంలో  ఏ సంవత్సరాన్ని గొప్పగా  భావిస్తారు?"

    "నా షష్టిపూర్తి సంవత్సరం 1970. ఆ సంవత్సరంలోనే  'విరసం' కూడా పుట్టింది. ఆ సంవత్సరాన్ని నా జీవితం అంతట్లోకి  ముఖ్యమైన సంవత్సరంగా భావిస్తాను."

    "మీరు జీవితంలో  మహదానందం పొందిన మరువలేని  రోజు  ఏదైనా వుందా?

    "వుంది. అదే 1964వ సంవత్సరం  ఆగస్ట్ నెల పద్దెనిమిదవ తేదీ, అమావాస్య, ఆదివారం...నాకు కొడుకు పుట్టిన రోజు."

    "సినిమా కవిత్వం  రాసేటప్పుడు  మీరెలా ఫీలవుతారు?"

    "ఈ పూట ఎంత వేగం అయిపోతుందా  వాళ్ళిచ్చే డబ్బులు  ఎప్పుడు చేతుల్లో పడతాయా అని."

    "అల్లూరి సీతారామరాజు పిక్చర్లోని 'తెలుగు వీర లేవరా' పాటకి మీకు నేషనల్ అవార్డు దొరికింది కదా. సినిమాలో పాటకి అవార్డు దొరకటం ఇదే మొదటిసారి  అనుకుంటాను."

    "అనుకుంటాను"

    __అని అంటూ వుండగా, శ్రీశ్రీగారికి ఫోన్ వచ్చింది.

    మాట్లాడివచ్చి_"కృష్ణస్వామిగారు ఫోన్ చేశారు సరోజా! వారు అక్బర్ హోటల్ లో వున్నారుట. రేపు డిన్నర్ కి రమ్మని పిలిచారు." అని చెప్పారు.

    (కృష్ణస్వామిగారు  డైరెక్టర్ పద్మనాభంగారి  కుమారులు. వారు కూడా డాక్యుమెంటరీ పిక్చర్స్ చాలా తీసి అవార్డ్స్ కూడా తీసుకున్నారు.)

    మధ్యలో  ఫోను  వచ్చి మాట్లాడడంవల్ల  కలిగిన  అంతరాయంలో  ప్రశ్నలు, జవాబులు అక్కడితో ఆగిపోయాయి. ఒక అబ్బాయి మాత్రం  తన సందేహం తీర్చమంటూ ఓ మాట అడిగాడు...

    "తిథి వార నక్షత్రాలతో  పాటు  మీ అబ్బాయి పుట్టినతేదీ అంత బాగా జ్ఞాపకం పెట్టుకున్నారే" అని.

    "మా ఆవిడ సరోజ రోజూ  పదిసార్లయినా  వల్లిస్తుంది. అన్నీ 'ఆ'కారాలే వచ్చాయని అందుకే అంత బాగా జ్ఞాపకం వుండిపోయింది."

    "వస్తాం సార్! నమస్కారం" అని అందరూ వెళ్ళిపోయారు.

    "తెల్లవారితే  విజ్ఞాన  భవనంలో అవార్డ్ ఇస్తారు. తొమ్మిది గంటలకి కారు తీసుకువస్తాం. రడీగా వుండ"మని ఒకాయన  చెప్పేసి వెళ్ళిపోయారు.


                            నగదు కాదు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్


    తెల్లవారింది.

    ఇద్దరం రడీ అయికూర్చున్నాం. చలి బాగానే వేస్తోంది. కారులోబయలుదేరి  పది గంటలకి 'విజ్ఞాన భవనా'నికి చేరుకున్నాం. నేను వెళ్ళేసరికి లతామంగేష్కర్, ముకేష్ (ప్రసిద్ధ  హిందీ గాయనీ గాయకులు) కూర్చొని వున్నారు. నేను వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చున్నాను.

    ముందు వరుసలో  శ్రీశ్రీగారు, శ్యామ్ బెనగల్, సత్యజిత్ రే. మృణాల్ సెన్, కృష్ణస్వామిగార్లు, ఇంకా హేమాహేమీలంతా  కూర్చున్నారు. హాలంతా కిటకిటలాడిపోతోంది.

    నాకెందుకో  ఆ భవనం పేరు చాలా నచ్చింది. పేరుకి తగ్గట్టుగానే  భవనం కూడా వుందనిపించింది.

    (పాఠకులకు  ఒక విన్నపం_'తెలుగువీర లేవరా' పాటకి అవార్డ్  వచ్చిన సంవత్సరం విషయంలో సందేహం ఏర్పడుతోంది. శ్రీశ్రీగారు రాసిన దాన్ని బట్టి 73 లోపలే. ఈ అవార్డ్ వచ్చినట్టు తెలుస్తోంది. నా జ్ఞాపకాన్నిబట్టి 75, 76 సంవత్సరాల్లో ఇచ్చారని  అనుకుంటున్నాను. ఈ సంవత్సరాల్లో  తేడాలేమైనా  వస్తే దయచేసి మన్నించాల్సిందిగా కోరుతున్నాను. అవార్డ్ జాకీర్ హుసేన్ గారి చేతిమీదుగా  మాత్రం  తీసుకున్నారు. అందులో ఎంతమాత్రం సందేహం లేదు)

    పదకొండు గంటలకి జాకీర్ హుసేన్ గారు వేదిక మీదకి వచ్చారు. ఆ వేడుకలు ముగిసి బైటపడేసరికి  రెండు గంటల పైమాటే అనుకున్నాం. మా వారి వంతుకూడా వచ్చింది.

    రజిత కమలం (వెండి కమలం), ఒక కవరు ఇచ్చారు. అవి తీసుకొని వచ్చి, వెనక సీట్లో  కూర్చున్న నా చేతికిచ్చేశారు. కవరు విప్పి చూస్తే బాగుండదని  కమలం మాత్రం చూశాను.

    చాలా బరువుగా, అందంగా వుంది. పదహారు, ఇరవై తులాలకి తక్కువ వుండదనుకున్నాను. చేతిలో డబ్బు పడిందనుకొని  సంతోషించాను. శ్రీశ్రీగారు వెనక్కి  తిరిగి నా ముఖం చూసి పెదవి విరిచారు.

    నాకేమీ అర్ధంకాలేదు సరికదా, పెదవి ఎందుకు విరిచారు  అనే ఆలోచన మొదలైంది. ఎంత ఆలోచించినా ఆయన పెదవి విరుపుకి కారణం అర్ధం కాలేదు. రెండున్నరకి  హాల్లో నుండి బైటపడ్డాం.

    "ఇక్కడేమీ మాట్లాడకు" అన్నారు.

    ఆకలి వేస్తోంది. హోటల్ కి వచ్చాం. తిండికన్నా, విషయం తెలుసుకోవాలన్న ఆత్రుత  ఎక్కువైంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS