Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 56

    "అవును ఇవన్నీ  మీరు చూసేసిన ప్రదేశాలే" అన్నాను.

    "అదేంకాదు. నేను ఇక్కడ (ఢిల్లీలో)రేడియోలో  న్యూస్ అనౌన్సర్ గా వుండిన రోజుల్లో ఎన్నోసార్లు ఈ ఎర్రకోట పక్కనుంచే నడుచుకుంటూ వెళ్ళేవాణ్ణి. ఎప్పుడూ  లోనికివెళ్ళి చూడలేదు. చూడాలనిపించలేదు  కూడా" అన్నారు.

    "అయితే ఇంకేం? పదండి. ఇద్దరం చూసివద్దాం" అని, బలవంతాన చెయ్యి పుచ్చుకుని తీసుకువెళ్ళాను.

    టిక్కెట్టు కొనుక్కుని లోపలికి వెళ్ళాం. అక్కడ ఒక అరగంట చూశాం. "నీకు కావలసింది కొనుక్కో" అన్నారు.

    కోటలోకి  ప్రవేశించే దారిలోనే  పక్కలా కొట్లు. నాకు కావాల్సినవి కొనుక్కున్నాను.

    బసకి  చేరుకునేసరికి దగ్గర దగ్గర మూడు గంటలు కావచ్చింది. చల్లారిపోయినా  మా భోజనాలు సిద్ధంగానే వున్నాయి. డ్రైవర్ని మళ్ళీ ఐదు గంటలకి రమ్మని చెప్పాం.

    "ఆ ఎర్రకోటలో నుండి నాకు ఎంత వేగం బైట పడతానా అనిపించింది సరోజా! నువ్వు భలే హుషారుగా, సరదాగా షాపింగ్ చేశావు. బాగానే వుంది. కానే ఎంత తగలేశావు? అక్కడ చేసిన ఖర్చంతా  అనవసరం అనే నాకు అనిపించింది" అన్నారు.

    "డబ్బంతా  మీ దగ్గరే కదండీ వుంది. నేనడిగినప్పుడల్లా మీరేగా తీసి ఇచ్చారు. వద్దని చెప్పి వుంటే నానేద్దునుగా" అన్నాను.

    "సరేలే. అయ్యిందేదో అయిపోయింది. నిన్నేమీ అనలేదులే" అన్నారు.

    "ఇక మరేమీ అడగనులెండి" అన్నాను.

    "త్వరగా  తయారవు. అలా తిరిగొద్దాం" అన్నారు.

    రడీ అయి బైటకొచ్చేశాం.

    కానీ అప్పటికే స్టూడెంట్స్, మిత్రులు వచ్చి గుమిగూడారు.

    "గురువుగారు బయటికి వెళుతున్నట్టున్నారే" అని వచ్చినవాళ్ళు  అన్నారు.

    శ్రీశ్రీగారు  'ఏం చేద్దాం' అన్నట్టు నా ముఖం  చూశారు.  

    నేను అర్ధం చేసుకొని, అందర్నీ లోపలికి రమ్మని ఆహ్వానించాను.

    "బైటికి వెళ్ళొద్దా" అని అడిగారు.

    "ఫరవాలేదు. రేపు మధ్యాహ్నమంతా ఖాళీయేగా ! చూసుకుందాంలెండి" అన్నాను.

    అందర్నీ  ఆహ్వానించి కూర్చోమని చెప్పాను. బోయ్ ని పిలిచి, అరడజను కుర్చీలు వేయించాను. అందరూ కూర్చొని మాటల్లోకి  దిగారు.

    నా దగ్గరకొచ్చి  కూర్చున్నారు.

    "గురువుగారు మేం చేస్తున్న సన్మానాన్ని  స్వీకరించనని  అన్నారట. కారణమేంటి?" అని అడిగారు.

    "మీరు ఎవరికి చేస్తున్న సన్మానమో మాకు తెలీదుకానీ 'కాబట్టి సన్మానం' గనక వారు వద్దన్నారు" అన్నాను.

    వాళ్ళు ఆశ్చర్యపోయి, "కాబట్టి సన్మానం ఏమిట"ని అడిగారు.

    "అదేనండీ_ఎలాగూ  శ్రీశ్రీగారు వచ్చారు 'కాబట్టి' మీరు అకస్మాత్తుగా చెయ్యదలచుకున్న  సన్మానం కనుక దానికి  'కాబట్టి సన్మానం' అంటున్నాను" అన్నాను.

    "మీరు శ్రీశ్రీగారితో చెప్పి ఒప్పించవచ్చుకదా" అన్నారు.

    "చూడండి. శ్రీశ్రీగారికి  మంచి చెడ్డలు తెలుసు. వారికి చెప్పి ఒప్పించేటంత గొప్పదాన్ని కాను. ఒకవేళ అలా చెప్పినా వినే ఘటమూకాదు. వారు సన్మానం విషయంలో నేనింతదూరం  మాట్లాడిందే  అధిక ప్రసంగం అవుతుంది. దయచేసి  వేరే టాపిక్  ఏదయినా వుంటే మాట్లాడండి" అన్నాను.

    మా వారు అవతల వాళ్ళతో మాట్లాడుతున్నా, క్రీగంటతో  నన్ను కనిపెడుతూనే వున్నారు.

    "పోనీ, మా ఆడవాళ్ళంతా  చిన్న పార్టీ ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని ఆహ్వానిద్దామనుకుంటున్నారు. దానికి మీరు వస్తారా" అని అడిగారు వాళ్ళు.

    "సారీ. నేనింకా  అంత గొప్పదాన్ని కాలేదండి. పైగా...నాకిలాంటివి ఇష్టంలేదు" అన్నాను.

    "మీరు శ్రీశ్రీగారి భార్య కావడమే గొప్ప. అంతకుమించిన గొప్ప ఇంకా ఏం కావాలండీ" అన్నారు.

    "నిజమే. ఈసారి వచ్చేటప్పుడు తప్పకుండా వస్తాం. ఇప్పటికి క్షమించండ"న్నాను.

    "మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు  వేస్తాం. కాదనకుండా  దయచేసి సమాధానాలు చెప్తారా?" అని అడిగారు.

    "ప్రయత్నిస్తాను. అడగండి" అన్నాను.

    "ఎవరయినా మిమ్మల్ని చూసి, శ్రీశ్రీ భార్య అని చెప్పేటప్పుడు మీరెలా ఫీలవుతారు?"

    "అదృష్టవంతురాలినని."

    "శ్రీశ్రీగారిని  తాగుబోతని అంటారే. మీరేమంటారు ?"

    "పచ్చి అబద్ధం అంటాను."

    "అదెలాగ ?"

    "శ్రీశ్రీగారు తాగుతారు. కాని తాగుబోతు కారు కనుక."

    "శ్రీశ్రీగారు నాస్తికులు కదా. మరి మీరు?"

    "నేను ఆస్తికురాలిని."

    "అంటే దైవభక్తులనా ?"

    "అనే"

    "శ్రీశ్రీగారు చైన్ స్మోకరా ?"

    "కాదు. సిగరెట్ స్మోకర్ననివారే అన్నట్టు జ్ఞాపకం"

    "శ్రీశ్రీగారు బాగా జోక్ లు వేస్తారటకదా ?"

    "చాలా బాగా"

    "థాంక్సండీ. గురువుగారి దగ్గరకెళ్ళి  వస్తాం. నమస్కారమండీ" అన్నారు.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS