"పెదవి విరిచారు. ఏమిటండి సంగతి?" అని అడిగాను.
"మనకి కేష్ ఇవ్వలేదు సరోజా! అయిదువేల రూపాయలకి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ ఇచ్చార"ని చల్లగా చెప్పారు.
"పదివేలు ఇస్తారని కదండీ అనుకున్నాం" అన్నాను.
"మనకేమిటి? ఎంతయినా అనుకుంటాం. వాళ్ళిచ్చిన అయిదు వేలైనా కాష్ కాదు. ఇప్పుడేం దారి? మనం యింటికి ఎలా వెళ్ళడం?" అన్నారు. "అన్నట్టు ఔను కదూ! తిరుగు ప్రయాణం గురించే మరచిపోయాను. కేష్ గా వస్తుందనుకొని ఇద్దరం ధైర్యంగా వుండిపోయాం" అన్నాను. పాపం, ఆయనకైతే మతేపోయింది.
"ఏవండీ_ఏమిటాలోచిస్తున్నారు?" అని అడిగాను.
"వేరే ఏంవుంది సరోజా! ఇక్కడ్నుండి మనం ఎలా బయటపడాలా అనే ఆలోచిస్తున్నాను" అన్నారు.
అడుక్కోవడం ఎలాగూ తప్పదని తేలిపోయింది.
"మీరూరికే బుర్ర పాడుచేసుకోకండి. ఆలోచిద్దాం. చేతిలో ఇంకా మూడువందలున్నాయి. మరో రెండు వందలుంటే ట్రెయిన్ లోనైనా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సాయంకాలం కృష్ణస్వామిగారి పార్టీ వుందికదా, వెళదామా" అని అడిగాను.
"అన్నట్టు_అదొకటి వుందికదూ! మరచిపోయాను. ఇంకేం_కృష్ణస్వామినే అడుగుతాను" అన్నారు వెంటనే ఫోన్ చేసి, కృష్ణస్వామిగారికి అన్ని విషయాలూ వివరంగా చెప్పి, "మీరే మమ్మల్ని మద్రాసు పంపించాలి. ఇంటికి వెళ్ళగానే డబ్బు ఇచ్చేస్తాన"ని చెప్పారు.
"దానికేమిటి? తప్పకుండానండి. మీరు సాయంకాలం వచ్చేయండి.
డోంట్ వర్రీ" అని చెప్పారాయన.
మా మనసులు కుదుటపడ్డాయి.
బైటకి వెళ్ళాలనే కుతూహలం మా ఇద్దర్లోనూ చచ్చింది.
'అయిదు_ఆరు గంటల మధ్య కారు పంపిస్తున్నాను. రమ్మ"ని కృష్ణస్వామిగారు ఫోన్ చేశారు.
కారు వచ్చి, మేం హోటల్ కి చేరుకొనేసరికి ఏడు గంటలైంది.
"ఫ్లయిట్ లో పంపిస్తాను వెళ్ళమ"ని కృష్ణస్వామిగారు చాలా చెప్పారు. కానీ నేను ఒప్పుకోలేదు.
"కేష్ ఇంట్లోలేదు. ఈ నేషనల్ సర్టిఫికెట్స్ అయిదేళ్ళకి పదివేలు అవుతాయిట. పదివేలమాట ఎలా ఉన్నా ఇవి వెంటనే కేష్ చేసుకోలేమని తేలిపోయింది. అందువల్ల రెండురోజులు హాయిగా బండిలో రెస్ట్ తీసుకుంటూ ఇంటికి పోదామ"ని అన్నాను.
"ఇంటికి ఎలా వెళతావు సరోజా! బిలాస్ పూర్ వస్తామని మీ అన్నయ్యకి మాట ఇచ్చాం. మనం వస్తామని నమ్మకంతో ఆయన నాకు సన్మానం కూడా ఏర్పాటు చేశాడన్న సంగతి మరచిపోయావా?" అని అడిగారు శ్రీశ్రీగారు.
"బిలాస్ పూర్ వెళ్ళి మద్రాసంటే డబ్బులు చాలవేమోనండి" అన్నాను.
"అక్కడికి వెళ్ళి చూసుకుందాం. బిలాస్ పూర్ మాత్రం వెళ్ళక తప్ప"దన్నారు.
నాకు చాలా సంతోషం వేసింది. ఏ ఆడపిల్ల 'పుట్టింటికి వెళదాం' అంటే సరదాపడదు చెప్పండి? బిలాస్ పూర్ లోవున్న మా అన్నయ్య మా తల్లిదండ్రుల సంతానంలో మొదటివాడు. మా పెద్దన్నయ్య భార్య పేరు 'లక్ష్మీనరసమ్మ' అనుకుంటాను. కానీ 'లక్ష్మీ' అని మా వాళ్ళు పిలవడంవల్ల నాకు ఆ పేరే బాగా జ్ఞాపకం.
బిలాస్ పూర్ లోనే ఏభై సంవత్సరాలుగా వుంటూ మేం వెళ్ళిన నాటికి రైల్వేలో పార్శిల్ ఆఫీసరుగా పనిచేస్తున్నాడు.
మా అన్నయ్యా వదినలిద్దర్నీ తల్లిదండ్రుల్లా భావిస్తాను. ఈ నాటికి కూడా. ఆదర్శదంపతులంటే వాళ్ళిద్దర్నే చెప్పాలి. మా వదిన దగ్గర నాకు చాలా చనువు.
వాళ్ళిద్దరికీ శ్రీశ్రీగారంటే చెప్పలేనంత గౌరవం, అభిమానం.
శ్రీశ్రీగారు "వస్తున్నాం" అని వైరు ఇచ్చేశారు. కృష్ణస్వామిగారి దగ్గర రెండు వందలు తీసుకొని, డిన్నరయ్యాక "మర్నాడు వెళ్ళిపోతున్నామ"ని వారికి థేంక్స్ చెప్పి మా బసకి వచ్చేశాం.
నేను అనవసరంగా రెండు వందలు ఖర్చు చేసినందుకు చాలా బాధపడ్డాను.
"అయిపోయినదానికి విచారించి లాభం ఏమిటి సరోజా! అందుకే ఏదైనా సరే_చేతిలో పడేదాకా నమ్మకూడదు. ఇందులో నీ తప్పూలేదు. ఇద్దరి లెక్కా తప్పే అయింది" అన్నారు.
"మనం అనవసరంగా రెండు వందల కోసం చేయి చాచవలసివచ్చింది. అందుకేనండి. కష్టంగా వుంది" అన్నాను.
"ఇక అవన్నీ మరిచిపో. ఇంటికి వెళ్ళగానే ఇచ్చేద్దాం. కృష్ణస్వామి నాకు బాగా తెలిసిన మిత్రులు. ఆయన నన్ను అపార్ధం చేసుకోరు" అన్నారు. మర్నాడు తెల్లవారేసరికి స్టేషన్ కి వెళ్ళిపోయాం. ఎనిమిదిన్నర గంటలకి ఉత్కళ ఎక్స్ ప్రెస్ పట్టుకున్నాం. రెండవనాటి సాయంకాలం అనుకుంటాను. అయిదు గంటలకి బిలాస్ పూర్ చేరుకున్నాం.
శ్రీశ్రీగారి కోసం వచ్చిన అభిమానులతో స్టేషన్ నిండిపోయింది.
"మహాకవి శ్రీశ్రీకి జై!
ప్రజా కవి శ్రీశ్రీకి జై!
విప్లవ కవి శ్రీశ్రీకి జై!
శ్రీశ్రీ జిందాబాద్!"
అంటూ మెడలో పూలమాలలు వేస్తూ, జయజయధ్వానాలతో వారిని ముంచెత్తేశారు.
జనం మధ్యనుండి, స్టేషన్ లో నుండి బయటపడడానికి అరగంట పట్టింది. ఆటోగ్రాఫులంటూ గొడవచేశారు చాలామంది. అప్పుడు మా అన్నయ్య తన ఇంటి అడ్రస్సిచ్చి, 'దయచేసి ఇంటికి వచ్చి తీసుకోండ'ని చెప్పి, మమ్మల్ని కారులో తీసుకువెళ్ళిపోయాడు.


