అప్పటికీ ఆ పిల్ల ఏడుపు మానలేదు.
శ్రీమహాలక్ష్మి కూర్చున్న చోటునుండి లేచి, ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ప్రక్కనే కూర్చుంది.
"ఎందుకు ఏడుస్తున్నావ్ అంటే పలకవేమిటి?" కాస్త గట్టిగానే అడిగింది శ్రీమహాలక్ష్మి ఆ అమ్మాయిని.
అప్పటికి ఆ పిల్లలో చలనం వచ్చింది.
"ఏడ్వక నవ్వమంటావా?" అంది ఆ పిల్ల ఒకసారి తలెత్తి చూస్తూ.
"నవ్వొద్దులే, కానీ అలా ఏడ్వటం మటుకు చేయకు!" అంది శ్రీమహాలక్ష్మి.
"నీకు ఏడుపు రావటంలేదా?" ఆ పిల్ల శ్రీమహాలక్ష్మిని ఆశ్చర్యంగా చూస్తూ అంది.
"నాకేమీ ఏడుపు రావటం లేదు. అసలెందుకు ఏడుపు రావాలి? కాలు నొప్పనా? లేక కడుపునొప్పనా?
"కడుపు నొప్పీ, కాలు నొప్పి అని కాదు. మన బ్రతుకులు ఏమవుతాయో అని భయంతో ఏడుస్తున్నాను."
"ఇప్పుడు మన బ్రతుకులకి ఏమొచ్చింది?" కాస్త గట్టిగానే అంది శ్రీమహాలక్ష్మి.
"మనం మోసపోయాము. ఇంక మనకి మిగిలింది జీవితాంతం ఏడుపే."
శ్రీమహాలక్ష్మికి ఇంకా శ్రీదేవి మీద ఆశ పోలేదు. "అయితే ఇక్కడ శ్రీదేవి లేదా?" అంది.
"శ్రీదేవా? శ్రీదేవేమిటి?" అంది ఆ పిల్ల.
"ముందు నీ పేరు ఏమిటో చెప్పు!"
"నా పేరు క్రిష్ణవేణి!"
"చూడు క్రిష్ణవేణి! నువ్వు నాకన్నా కాస్త చిన్నగా వున్నావు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. శ్రీదేవిని చూడటానికి వచ్చినవాళ్ళు గోలచేసి వుంటారు. దాంతో ఇక్కడ వాళ్ళు, మనం కూడా మోసగాళ్ళమానుకొని తెలియక బంధించి వుంటారు. చూస్తూ వుండు కాసేపయ్యాక వాళ్ళే మనల్ని విడిచిపెడతారు."
ఆ పిల్లకి చూచాయగా విషయం అర్థమైంది. అయినా కూడా వివరంగా చెప్పమని శ్రీమహాలక్ష్మిని అడిగింది.
తన పెళ్ళిచూపుల నిమిత్తం తన తల్లీ, తండ్రీ, తమ్ముడితో బయలుదేరి రావటం, తాను హోటల్ దగ్గర ఆగితే తనకి శ్రీదేవిని చూపిస్తానని తీసుకురావటం అంతా వివరంగా చెప్పింది శ్రీమహాలక్ష్మి.
సాంతం విని ఆ అమ్మాయి "నేనొక రకంగా మోసపోతే, నువ్వొక రకంగా మోసపోయావు!" అంది.
"నేను మోసపోవటమేమిటి?" అంది శ్రీమహాలక్ష్మి.
"ఇది బ్రోతల్ హౌస్."
"అంటే ఏమిటి?"
ఆ పిల్ల అంటే ఏమిటో చెప్పలేదుగానీ, "నీకు ఇంగ్లీషు రాదా!" అని అడిగింది.
"నాకు తెలుగు బాగా వచ్చు. సంస్కృతం కూడా నేర్చుకున్నాను. ఇంగ్లీషు మాత్రం రెండు మూడు ముక్కలు నేర్చుకున్నాను. కాట్ అంటే పిల్లి, రాట్ అంటే ఎలుక... ..." తన భాషా పరిజ్ఞానం ఇంకా చెప్పబోయింది శ్రీమహాలక్ష్మి.
"అందుకనే నీకు బ్రోతల్ హౌస్ అంటే ఏమిటో తెలియలేదు." మధ్యలో అడ్డు తగిలి క్రిష్ణవేణి అంది.
"పోనీ, నీకు తెలిస్తే చెప్పరాదూ!" అంది శ్రీమహాలక్ష్మి.
"బ్రోతల్ హౌస్ అంటే వేశ్యా గృహం."
"నువ్వు చెప్పేది నిజమేనా!" ఆ గదినంతటినీ, ఎగాదిగా చూస్తూ అంది శ్రీమహాలక్ష్మి.
ఈ వెర్రి పిల్లను చూస్తూంటే ఆ పిల్లకు కోపమొచ్చింది.
"నాకు తోచక ఏడుస్తున్నాననుకున్నావా! 'నేను మోసపోయి ఇక్కడికి వచ్చాను. మా వాళ్ళకి దూరం అయ్యాను అన్న బాధతో ఏడ్చాను. ఇలాంటి చోట్లనుండి తప్పించుకోవటం కూడా కుదరదు. మనం ఎదురు తిరిగితే అన్నం కాదుగదా నీళ్ళు కూడా ఇవ్వరు. గొడ్డుని బాదినట్లు బాదుతారు. వాళ్ళ మాటలు వినేదాకా అంతే."
"పెద్దగా అరుద్దాము, ఎవరో ఒకరు వచ్చి రక్షిస్తారు!" అంది శ్రీమహాలక్ష్మి వాకిలి వైపు చూస్తూ అంది.
"మనం గొంతు చించుకుని అరిచినా మన మాటలు బయటకి వినిపించవు."
"ఎందుకని?"
"ఇది ఎ.సి.రూమ్."
"ఎ.సి. రూమ్ అంటే....?"
"ఎ.సీ రూమ్ అంటే చాలా వివరంగా చెప్పాలి, అదంతా తరువాత చెబుతాను. ఎ.సి. రూమ్ లో టపాకాయ పేల్చినా బయటకి వినిపించదు. అంతవరకూ ఖాయం." అంది క్రిష్ణవేణి.
