కానీ బాస్ గాడు మాత్రం నాకు కనీసం పావలా వాటా కూడా ఇవ్వలేదు.
సుస్మిత గురించి ఒకసారి ఎంక్వయిరీ చేస్తే తండ్రి దగ్గర లేనట్టు తెలిసింది.
బహుశా సుస్మితకి పెళ్ళి చేసి ఉంటాడు.
ఏ దేశంలోనో భర్తతోను, పిల్లలతోను వుండి వుంటుంది అనుకున్నాను.
డబ్బు సంపాదించటం ఒక్కటే నా ధ్యేయంగా పెట్టుకొన్నాను. అందుకే కోటీ యాభై లక్షల రూపాయిల విలువగల వజ్రాల మీద ఆశ పడ్డాను.
వజ్రాలు దొరకలేదు గానీ విచిత్రంగా సుస్మిత కనబడింది.
సుస్మితకి ఉద్యోగం చేసే అవసరమేమిటో నాకర్థం కావటం లేదు.
సూక్ష్మంగా ఇదీ నా కథ.
పోలీసులు నమ్మకపోయినా, కోర్టుకి కళ్ళూ చెవులు లేకపోయినా ఈ లోకమంతా వేలెత్తి నన్ను చూపినా పర్వాలేదు. నేను నిర్దోషినని... నా ప్రేమ తనమీద ఇసుమంతయినా తగ్గలేదని_ నా సుస్మిత నమ్మితే చాలు భాయ్! ఆ తర్వాతనే పగలు, ప్రతీకారాలు" అంటూ నా కథని క్లుప్తంగా చెప్పాను రాంసింగ్ కి.
"మరి ఇదివరకు మీ అమ్మగారి గురించి, నీ గురించి కొద్ది మార్పుతో ఇంకో కథ చెప్పావ్!" రాంసింగ్ అడిగాడు.
"ఆ రోజు నా కథని టూకీగా చెప్పాను. ఈ రోజూ నా కథని టూకీగా చెప్పాను. కానీ నేను చెప్పిందంతా యథార్థమె. నేను నా తల్లిని, నా పరువు మర్యాదని, నా సర్వస్వాన్ని పోగొట్టుకున్నాను. అంతే భాయ్" బాధగా కణతలు నొక్కుకొన్నాను.
"చాలు యార్! అక్షరం అక్షరం చెప్పక్కరలేదు. నేను అర్థం చేసుకోగలను. ప్రస్తుతం విశ్రాంతి ముఖ్యం" అన్నాడు రాంసింగ్.
"ఎస్. నాకిప్పుడు విశ్రాంతి కావాలి" అన్నాను.
25
ఇన్ స్పెక్టర్ వర్ధనరావు హెడ్ కానిస్టేబుల్ అహోబిలం పచ్చబొట్టు పొడిచే వాళ్ళ వేషం అంటూ ఎప్పటి లాగానే రంగు రంగుల దుస్తులు ధరించి బయలుదేరారు.
ప్రజలు మరీ మూర్ఖులు కారని గ్రహించిన వర్ధనరావు "పచ్చ బొట్టు పొడుస్తాం. రంగు రంగుల పేర్లు పచ్చగా పొడుస్తాం" అంటూ మధ్య మధ్య కేకలు పెడుతూ వూరు చివరికి అహోబిలంతో వచ్చాడు.
"బాస్ గాడు అక్కడ వున్నాడో లేదో! వాణ్ని తను కనిపెట్టినట్లు వాడు తనని మారువేషంలో వున్నట్లు కనిపెట్టలేదు కదా! కోటీ యాభై లక్షల రూపాయల విలువగల వజ్రాలు తీసుకుని వుడాయించలేదు కదా! వెంటనే అప్పుడే అరెస్ట్ చేస్తే పోయేదానికి ఏదేదో వూహించి మీనమేషాలు లెక్కెడుతూ రాత్రి తిరిగిరావటం జరిగింది. వాడు పారిపోయి వుంటే!"
చాలా దిగులు పడుతూ వర్ధనరావు ఆలోచిస్తున్న వేళ "గురువా! నాకో అనుమానం వస్తున్నది అడగనా?" అన్నాడు అహోబిలం.
ఏదో ఒకటి మాట్లాడితే కాలక్షేపంగా వుంటుంది కదా అని "అనుమానం రానేకూడదు. వస్తే అడిగి తీర్చుకోవటమే మంచిదిరా శిష్యా!" అన్నాడు వర్ధనరావు.
"మీరు బాస్ గాడిని చూసినట్లే బాస్ గాడు మిమ్మల్ని ఆరోజు చూశాడు కదా! నిన్న మిమ్మల్ని గుర్తుపట్టాడేమో తెలియదుకదా! గుర్తుపట్టి వుంటే పలాయనం చిత్తగించి వుంటాడు గదా!" తనకొచ్చిన అనుమానం వ్యక్తం చేశాడు అహోబిలం.
"నాకొచ్చిన అనుమానమే నీకు రావాలా! వచ్చెను పో నన్నే అడగాలా!" అనుకుంటూ కోపంతో ముక్కు పుటాలు ఎగరేసి "ఓరోరి శిష్యగా! నా అనుమానం ఏంటంటే మీ అమ్మగారు నిన్ను కనేటప్పుడు వీడి బుర్ర ఎదుగుతుందాలేదా! అని అనుమానంతోనే కనేసి వుంటారు. నీకొచ్చేవన్నీ నిష్ట దరిద్రపు అనుమానాలే. అలాంటి అనుమానం ఏదన్నా వస్తే నాకు రావాలి. నాకు రాలేదే. ఎందుకో తెలుసా! బాస్ గాడు నన్ను కనిపెట్టలేదు కాబట్టి. వాడు పలాయనం చిత్తగించటం అన్నది లేనేలేదు. వాడు అక్కడే వుండి చస్తాడు సరేనా! ఇంకెప్పుడు దిక్కుమాలిన అనుమానాలు వెళ్ళడించకు" ముక్క చివాట్లు పెట్టాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.
"తప్పైపోయింది గురువా! ఈ వక్కసారికి క్షమించి పారేయండి గురువా!" అన్నాడు అహోబిలం. "నాకొచ్చిన అనుమానం బైటపెట్ట నేల దానిని బైటికి కక్కనేల బుద్ధితక్కువ పని కాకపోతే" అనుకున్నాడు చింతిస్తూ.
"మించిపోలేడు క్షమించితిని శిష్యగా!" అన్నాడు వర్ధనరావు.
"అహో, బతికి బైట పడితిని కదా! ఏమి నా భాగ్యము!" అనుకుని నోరుమూసుకున్నాడు అహోబిలం.
