"నాకు తెలీదు" సన్నగా రివటలా వున్న సాగర్ చేతులు జోడించాడు.
"నీ బాస్ కి అనుక్షణం నీడలా వుండే నీకు తెలీదంటే నన్నెలా నమ్మమంటావు" పెదవులకి చిరునవ్వు అద్దుకుని సాగర్ మెడపై చేతినుంచాడు. "చెప్పావంటే నీ మీద ఎలాంటి కేసుల్లేకుండా కాపాడతాను."
రెండో ఉపాయం "దానం" అమలు చేశాడు.
"మీకు దణ్ణమెడతాను... నాకేం తెలీదు" కళ్ళ నీరు పెట్టేసుకుంటున్నాడు సాగర్.
"అలా నీ బాస్ ని కాపాడే ప్రయత్నం చేయకు. ఆ రోజు ఏం జరిగిందీ మీవాడు తాగి వాగుతుంటే మా క్రైం డిటెక్టివ్స్ రహస్యంగా విని వివరాల్ని సేకరించారు." అంతటి సాత్వికతను ప్రదర్శించడం కష్టంగానే వుంది అవినాశ్ కి. అయినా తమాయించుకుంటున్నాడు. "మీ బాస్ చెప్పిందాని ప్రకారం మొదటి తూటా ప్రయోగించింది నువ్వు. అప్పుడు కుమార్ దాదా నీ మీద గుడ్లురిమాడు కూడా."
భేదోపాయాన్ని అర్థం చేసుకుని సాగర్ "కాదు" అన్నాడు తొట్రుపడుతూనే.
"ఏదీ గుడురుమడమా"
"అహ, నేను మొదట కాల్చడం" అసంకల్పితంగా కక్కేసాడు.
"అంటే, కృప హత్యలో తొలిసారి రివాల్వర్ పేల్చింది కుమార్ అన్నమాట"
"ఆ" అనేసి వెంటనే "ఏమో నాకు తెలీదు" తల అడ్డంగా వూపాడు అప్పటికి తన తప్పు తెలుసుకున్న సాగర్.
సరిగ్గా ఇక్కడే అవినాశ్ కి క్షుణ్ణంగా బోధపడి పోయింది. కృపని హత్య చేసింది ధనుష్కోటి గేంగ్ కాదని.
రోజుల తరబడి కృప హత్య విషయాన్ని శోధించే ప్రయత్నంలో పొందిన అలసట కాలయాపన ఒక నిజాయితీ గల పోలీసాఫీసర్ గా అవినాశ్ ని ఎంతటి అసహనానికి గురిచేసిందీ అంటే తనను తనిక అదుపుచేసుకోలేనట్టు సాగర్ పొట్టలో గుద్దాడు... "చెప్పు... ఇంతవరకు వచ్చాక దాచి నన్ను రెచ్చగొట్టకు... కృపని ఎందుకు హత్య చేశారు చెప్పు" సాగర్ జుట్టు పట్టుకుని మోకాలితో మరోమారు పొట్టలో పొడిచాడు.
సన్నని మూలుగుతో నేలకి జారబోయిన సాగర్ జుట్టు పట్టుకుని పైకి లేపాడు...
ఒక నిజాన్ని వెలికితీయాలన్న తపనో తన ఈడువాడే అయిన శశాంక జీవితాన్ని కూడని మలుపు తిప్పిన ఆ గేంగ్స్ పై పెల్లిబికిన కసో - అవినాశ్ రెచ్చిపోయాడు.
ఏ నేరస్థుడి నుంచి ఎలా వాస్తవం రాబట్టాలో నేరస్థుడి సైకాలజీ బట్టి ఏ థర్డ్ డిగ్రీ మెథడ్ వాడాలో బాగా తెలిసిన అవినాశ్ అతను సామాన్యంగా ఉపయోగించే పద్ధతుల్ని ఇక్కడ అమలు చేయలేదు..
సాగర్ అతి క్రూరుడే అయ్యుంటే కాళ్ళూ, చేతుల్ని తాళ్ళతో సమతలంగా వేలాడతీసి నడుంపై బరువుంచి 'ఎయిర్ ప్లేన్' పద్ధతిలో నిజాన్ని కక్కించేవాడు.
అసలు పెదవి విప్పని నేరస్థుడే అయితే వెల్లకిలా పరుండబెట్టి గుండ్రంగా వున్న మోదుల్ని మోకాళ్ళపై వుంచి కానిస్టేబుల్స్ ని చెరో ప్రక్క నిలబెట్టి వాటిని గుండెలదాకా దొండ్రిస్తూ ఎముకలు విరిగేటట్టు బాధని కలిగించే "రోలర్ ట్రీట్ మెంట్'కు గాని, ఒంటికి కంబళిని చుట్టి లాఠీలతో కొట్టే 'కంబల్ మార్'నో, 'చైనీస్ టార్చర్'నో, 'ఎలక్ట్రిక్ షాక్', 'బాక్సర్ ట్రీట్ మెంట్', 'స్వీట్ ట్రీట్ మెంట్' వంటి పద్ధతుల్ని అనుసరించేవాడు.
కాని తొలి ప్రయత్నంలోనే అర్ధమైపోయింది సాగర్ చాలా పిరికివాడని...
అందుకే తనే వ్యక్తిగతంగా వాస్తవాన్ని బయటికి లాగాలని గట్టిగా ప్రయత్నించాడు.
ఓ అయిదు నిమిషాలపాటు సాగర్ ఒక్కడు మాత్రమే వున్న ఆ సెల్ అతడి అరుపుల్తో ప్రతిధ్వనించి పోయింది...
అవినాశ్ వెనుక నిలబడ్డ ఎస్.ఐ.తోపాటు కానిస్టేబుల్స్ ఓ పక్క కంగారుపడుతూనే వున్నారు. అతడి ఉక్రోషం ఎలాంటి పరిణామానికి దారితీసేదీ ఊహించలేక...
చివరికి కక్కేసాడు అప్పటికే ఒళ్ళంతా నుజ్జయిపోయిన సాగర్...
సాగర్ చెప్పిన కారణం అవినాశ్ ని ఎంత కదిలించిందీ అంటే ఇలాంటి కారణానికి హత్య చేయడమన్నది అతడి అనుభవంలో ఎప్పుడూ విననిదీ, ఊహించనిదీను...
అయిదు నిమిషాలలో సాగర్ దగ్గర స్టేట్ మెంట్ తీసుకున్నాడు.
ఎస్. ఐ. చేత తెలుగులోనే రాయించి సాగర్ చేత సంతకం చేయించుకున్నాడు...
ఒక బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోడానికి పథకం ఆ విధంగా సిద్ధం చేసుకున్నాడేగాని అవినాశ్ ఊహించలేకపోయాడు ఆ తర్వాత తనెలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నదీ...
నీరసంగా ఓ మూల చతికిలబడిపోయిన సాగర్ ను వోమారు చూసి రేపటి పోరాటం ఎక్కడ మొదలుపెట్టాల్సిందీ ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరాడు.
అప్పుడు రాత్రి పదకొండు గంటలు కావస్తోంది.
* * * *
మామూలుగానే తెల్లారింది.
కాని...
సాగర్ అనే నేరస్థుడు పోలీస్ టార్చర్ మూలంగా లాకప్ లో మరణించాడు అన్న వార్త సిటీ అంతా ఎంత వేగంగా వ్యాపించిందీ అంటే పోలీస్ స్టేషన్ చుట్టూ పత్రికా విలేకరులు గుమిగూడారు...
జయచంద్ర ఈ అవకాశాన్ని జారవిడుచుకోలేదు.
