Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 55


    "మీకుగా మీరు ఇష్టపడితే నన్ను ప్రేమిస్తే అది నాతప్పుకాదు. నేను మిమ్మల్ని ఇష్టపడ్డంలేదు. ప్రేమించడంలేదు."


    ఆ మాటలకి మనోహర్ కృంగిపోలేదు.


    "నువ్వీమాట చెబుతావని నాకు తెలుసు. కానీ నేనేమిటో నీకు చెప్పాలని వచ్చాను. దయచేసి కారెక్కు" అన్నాడు.


    భారతికి కాస్త ధైర్యం వచ్చింది.


    "మీరు కారెక్కమనగానే ఎగిరి గంతేసి ఎక్కడానికి మీరు అనుకునే ఆడపిల్లని కాదు. సారీ, సోసారీ, నేను రాను అంది.


    "నా మాట వింటావన్న ఆశ నాకుంది" అన్నాడు మనోహర్.


    "ఓహో. పాపం ఆ రోజు పెద్దమనిషిలా వచ్చి కాపాడినందుకు ఎగిరొచ్చి మీ వడిలో పడతాననుకున్నారా అలాంటి పిచ్చి ఉద్దేశం మీకుంటే చాలా పొరబడ్డారు. ఇక మీరెళ్ళవచ్చు" అంది భారతి.


    మనోహర్ తల పంకించాడు.


    "ఇట్సాల్ రైట్" అని కారు డిక్కీదగ్గరకు నడిచాడు.


    భారతి అతనేం చేస్తున్నాడోనని చూసింది. డిక్కీలోంచి పెట్రోలు డబ్బాని తీసాడు. భారతికేసి ఓసారి చూసి అన్నాడు మనోహర్.


    "నువ్వు లేకుండా నా జీవితాన్ని మరో ఆడదానితో పంచుకోను. నువ్వు కాదన్న తరువాత నాకు బతకాలనిలేదు. అందుకే నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను.


    భారతి కంగారుగా చూసింది.


    పెట్రోలు డబ్బా మూతతీసి వంటిపైన జల్లుకున్నాడు మనోహర్.


    అతను జేబులోంచి సిగరెట్ లైటర్ని తీశాడు.


    వ్యవధిలేదు. భారతి నోరు పెరిలేలోపు క్షణంలో వెయ్యోవంతు కాలంలో లైటు వెలగబోతోంది.


    మనోహర్ లైటర్ బటన్ పైన బొటన వేలుని పెట్టాడు.


    భారతి కెవ్వుమని అరిచింది.


    మనోహర్ భారతికేసి చురుగ్గా చూశాడు. భారతి స్పృహ తప్పిపోతున్న దానిలా కనబడింది.


    అతని చేతిలోంచి సిగరెట్ లైటర్ జారి కిందపడిపోయింది. అతను అప్రయత్నంగా ఓ అడుగు ముందుకేశాడు. భారతి వణికిపోతోంది.


    "ప్లీజ్ నన్నిలా బెదిరించకండి. జరిగింది చాలు. ప్లీజ్ నడవండి" అంది భారతి.


    ఆమె కళ్ళలో నీరు గిర్రున తిరుగుతోంది. మనోహర్ పేలవంగా నవ్వాడు. ఆమె చాలా రియార్ట్ అయిందని అతనికి తెలుస్తూనే వుంది.


    నేను ఏదో అయిపోతానన్న భయంతో అయితే మాత్రం నాతో రానవసరం లేదు. నన్నో మనిషిగా నాకూ ఓ మనస్సుందని నువ్వు నమ్మితేనే రావాలి. అప్పుడే నాకు తృప్తి" అన్నాడు మనోహర్.


    భారతి అతనికేసి పిచ్చిదానిలా చూసింది. ఆమె ఓ పక్కకోపం వస్తోంది. మరోపక్కజాలి కలుగుతోంది. మరోపక్క అతని మొండితనం వళ్ళు మండేలా చేస్తోంది. కానీ ఏం చేయడానికి తోచడం లేదు.


    "యు ఆర్ బి హేవింగ్ లైక్ ఎ చైల్డ్" అంది భారతి కోపంగా.


    "అంతేకాదు మీ రెండు చెంపల్నీ పగలకొట్టాలనికూడా వుంది" అని చెప్పాలనుకొంది.


    భారతి అతనికి మరోమాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కారు దగ్గరకి నడిచింది. మనోహర్ ఆమె వెనుకనే నడిచాడు. భారతి కారు డోర్ తెరిచి ఎక్కి కూర్చుంది. మనోహర్ కారు స్టార్ట్ చేశాడు.


    కారు మెత్తగా వెళుతోంది. కొంతసేపు ఆ ఇద్దరి మధ్యనా నిర్లిప్తత తాండవం చేసింది. అటు తర్వాత భారతి అంది.


    "ఇప్పుడు చెప్పండి మీ గోల."


    మనోహర్ మాట్లాడలేదు.


    మళ్ళీ అడిగింది భారతి.


    "ఎందుకలా నా వెంట పడుతున్నారు" ఈ ప్రశ్నని అనుకోకుండానే అడిగింది భారతి. మనోహర్ బట్టలు పెట్రోలు వాసన గుప్పుమని కొడుతున్నాయి.


    తనడిగిన రెండు ప్రశ్నలకి అతడు సమాధానం చెప్పలేదు. అతను చాలా గంభీరంగా వున్నాడు.


    ఏదో మాట్లాడాలి రమ్మని అంత రాద్దాంతం చేసిన మనిషి ఏమీ మాట్లాడకపోవడం చూసి ఆశ్చర్యపడింది భారతి.


    కాని అంతలోనే బహుశ జరిగిన సంఘటనననుంచి ఇంకా మెంటల్ గా సెటిల్ కాలేదేమోనని అనుకుంది.


    భారతి జాలిగా చూసింది.


    "ఎందుకంత సాహసం చేశారు పొరపాటున లైటర్ వెలిగివుంటే!" అంది భారతి.


    "వెరీ సింపుల్, చచ్చిపోయేవాడిని అంతేగా!" అన్నాడు.


    "చనిపోవడం అంత తేలికైన పనా! అన్నది.


    భారతికే ఆశ్చర్యంగా వుంది.    


    అతనంటే ఎంతో ఏవగింపుగల తను అతనితో అంత చనువుగా ఎలా మాట్లాడగలుగుతోంది!


    మనోహర్ ఉదాసీనంగా వుండిపోవడం చూసి "అంత మాట్లాడ్డం ఇష్టం లేనప్పుడు ఎందుకు రమ్మన్నట్టు!" అంది.


    మనోహర్ ఆమెకేసి చూశాడు.


    "నీకోసం, నీమనసుకోసం, నీ ప్రేమకోసం ఆఫ్ట్రాల్ ఈ ప్రాణాన్ని పోగొట్టుకున్నా ఫరవాలేదనుకున్నాను."


    "ఆఫ్ట్రాల్ ప్రేమకోసం ప్రాణాన్ని పోగొట్టుకొని సాధించేదేమిటి!" అడిగింది.


    "ప్రేమకోసం చస్తేనేం" అన్నాడు.


    భారతి అతనికేసి చూస్తూ కూర్చుంది. తనకోసం తన ప్రేమకోసం అతను ఆత్మాహుతికి తెగించడం చూశాక ఆమె గుండె లోతుల్లో గర్వపు రేఖలు తొంగిచూసినాయి.


    ఆడదానికి తను ప్రేమించినవాడు కదా కావాల్సింది తనని ప్రేమించిన మగాడు దొరకడం పెద్ద వరం. అప్పుడే ఆ ఆడదానికి ఏ విధమైన ఒడిదుడుకులు వుండవు.


    "భారతీ?" పిలిచాడు మనోహర్.


    "ఊ"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS