డాక్టర్ అతని రక్తాన్ని పరీక్షించాడు.
ఆయన ముఖంలో సంతృప్తి...
రవితేజ ఊహించలేకపోయినా ఇద్దరిదీ ఒకే రక్తం అయివుండాలని ఆనందరావు నమ్మకం వమ్ముకాలేదు అతనినుంచి తీస్తున్న రక్తాన్ని అలానే రెండోవైపు నుంచి డైరెక్టర్ గా ఆమెకు ఎక్కిస్తూ వసుమతి ప్రాణాపాయ స్థితినుంచి గట్టెక్కించాడు డాక్టర్.
ఆనందరావు చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకున్నాడు.
"రవీ... ఇంతకాలం నీ కన్నతల్లి ఎవరు అని అడిగావు... జవాబు చెప్పలేక పోయాను. ఇప్పుడు నువ్వు రక్తం ఇచ్చి బతికించింది నీ తల్లినే బాబూ... అభినయ్ నీ తమ్ముడు" అన్నడు ఆనందరావు.
ఆ నిజాన్ని రవితేజని తట్టుకోలేక పోయాడు.
అతని మనసులో ఎన్నెనో అనుమానాలు.... అయితే తన తండ్రి జయచంద్ర, అనందరావులలో ఎవరు! అర్దంకాని సందిగ్దావస్థ...
"ఈ నిజం నీ మనసును చిత్రవధ చేస్తుందని నాకు తెలుసు. మీ ఇద్దరూ కవలపిల్లలు ఇద్దరికీ తండ్రిని నేనే. నీ తర్వాత ఐదునిమిషాలకు అభినయ్ పుట్టాడు. ఒకప్పుడు వసుమతి నేనూ ప్రేమికులం. కానీ నీ మేనమామ డబ్బుకి ఆశపడి చెల్లెలి సంసారానికి అనర్హుడయిన మగతనం లేని జయచంద్రకు ఇచ్చి చేశాడు. ఈ విషయం వస్తవానికి నీ మేనమామకుకూడా తెలియదు. అయితే అప్పటికే వసుమతి గర్బవతి....
"నా వల్లనే ఆమె తల్లి అయింది అనే నిజం జయచంద్రకు తెలిసింది. ఆ కారణంగానే జయచంద్రకూ, నాకూ శత్రుత్వం మొదలయింది. తన భార్య అక్రమ మార్గాన గర్బవతి అయిందన్న నిజాన్ని భరించలేక సంతానం కనేటంతవరకూ పుట్టింటిలోనే వుండిపొమ్మని పంపించివేశాడు. హాస్పిటల్ లో ప్రసవించిన కవలలో ఒకరిని నేను తీసుకొచ్చి పెంచుకున్నాను. ఈ రహస్యం మూడవ కంటికి తెలియదు... అందుకే నాపై వున్న కసితో అభినయ్ ను జయచంద్ర దుర్మార్గుడిగా తీర్చిదిద్దాడు. అయినప్పటికీ తల్లి అంతే అతనికి అవ్యాజమైన ప్రేమనురాగాలు వుండిపోయాయి" అన్నాడు ఆనందరావు.
లేదు అనుకున్న తల్లి వుందని ఇన్నేళ్ళ తర్వాత తెలియడంతో తవితేజ ముఖం సంతోషంతో వికసించింది. తనకు తండ్రి మాత్రమే కాదు... తల్లి... తమ్ముడు కూడా వున్నారు.
మనిషి స్వార్ధపరుడు అని నిరూపించే మరొక సంఘటన ఇది... ఎవరికి వాళ్ళు తెలివిగా తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకున్నారు. డబ్బు కోసం చెల్లెలి జీవితాన్ని పణంగా పెట్టింది. ఒకరు పరువు ప్రతిష్టల కోసం ఒక అమాయక ఆడపిల్ల జీవితాన్ని బలి తీసుకుంది మరొకరు. మరొకరిని ఇల్లాలిని అక్రమంగా చేజిక్కించుకున్నాననే వ్యధతో ఆమె సంతానానికి తండ్రిగా మారి జీవితాతం బ్రహ్మచారిగా మారి తను చేసిన తప్పుకు తనే శిక్ష వేసుకుంది మరొకరు.
రవితేజ తల్లి పాదాల వద్దకు వెళ్ళాడు.
కళ్ళు మూసుకుని పడుకుని వున్న ఆమె ముఖాన్ని తనివితీరా చూశాడు. ప్రాశంతత... నిర్మలత్వం ఆమెలోని నిజాయితీకి చిహ్నాలుగా కనిపించాయి.
"అమ్మా" అంటూ రెండు చేతులతో ఆమె పాదాలను తాకాడు.
అతని కనుకొసలనుంచి జారిన అశ్రువులు ఆమె పాదాలమీద పడ్డాయి.
వసుమతి కళ్ళు తెరిచింది.
రవితేజ రూపం అస్పష్టంగా కనిపించింది.
మల్లె తెరవాలనే ప్రయత్నం చేసింది కానీ కనురెప్పలు మత్తుగా వాలిపోయాయి.
అప్పుడే ద్వారంవద్ద ప్రత్యక్షమయ్యాడు సబ్ ఇన్ స్పెక్టర్ శక్తి.
"మిస్టర్ రవితేజా.... మర్యాదగా లొంగిపో"
రవితేజకు అప్పుడు తప్పించుకోవాలనిలేదు. మనస్సంతా ఆనందమయం కావడం వలనమో సంతోషంగా ముందుకు నడచి రెండు చేతులూ చాపాడు.
సబ్ ఇన్స్పెక్టర్ శక్తి అతనికేసి విస్మయంగా చూసి అతని చేతులకు సంకెళ్ళు తగలించాడు.
ఆనందరావు బొమ్మలా నిలుచుండి పోయాడు.
* * * *
రాష్ట్రంలో శాంతి బద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి.
రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం పరిశీకులను పంపింది. పరిశీలకులు గవర్నర్ తోను, ముఖ్యమంత్రితోను విడివిడిగా చర్చలు జరిపారు.
అప్పటికే ఎమ్.ఎల్.ఏల కిడ్నాప్ జరిగి పన్నెండు గంటలు అయినా పోలీసులు వాళ్ళ జాడ తెలుసుకోలేక పోయారు.
క్రైమ్ రిపోర్టర్ ధీరజ నగరంలో కనిపించక పోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది.
చటర్జీ రాష్ట్ర ఇంటలిజెన్స్ అధికారిని, డి.జి.పి. ని లా అండ్ ఆర్డర్ ఐ. జి. పి. ని కాంటాక్ట్ చేశాడు.
అప్పటికే ప్రధానమంత్రినుంచి సి.ఎమ్ కు అక్షింతలు పడనేపడ్డాయి.
అటు రాజకీయ నాయుకులు, ఇటు పోలీస్ డిపార్ట్ మెంట్ నేటి సవాళ్ళను ఎదుర్కోవడానికి రంగాన్ని తయారు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా అధికార అనధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు.
ఐ జి పి చీవాట్లతో తల వాచిపోయిన ఎస్. పి. స్వయంగా రంగంలోకి దిగి సెర్చింగ్ ప్రారంభించాడు. సత్యమోహన్, జయచంద్రలకు చెందిన ప్రతి బిల్డింగ్ నూ వదలకుండా శోధించండంలో ధీరజ, రజనిలను బంధించి వుంచిన రహస్య భవనం వెలుగులోకి వచ్చింది.
పెద్ద సంఖ్యలో పోలీసులు వుండటంతో ఎలాంటి ప్రతిఘటనా లేకుండానే సత్యమోహన్ సిద్దం చేసుకున్న బ్లాక్ కమెండోలు పోలీసులులకు లొంగిపోయారు.
కిడ్నాప్ చేయబడిన ఎమ్. ఎల్. ఏలు ఎక్కడ దాచిందీ ధీరజ చెప్పడంతో ఎస్. పి. అవాక్కయిపోయాడు.
* * * *
తన గదిలోకి అడుగుపెట్టిన అభినయ్ వైపు ఎగాదిగా చూశాడు జయచంద్ర.
అతని ముఖంలో ఏదో మార్పు కొట్టు వచ్చినట్టు కనిపిస్తుంది. అసలు ఈ రోజు అతని ప్రవర్తనలోనే ఏదో మార్పు వుంది ఎప్పుడూ సరదా సంతోషాలతో కనిపించే అభినయ్ ఈ రోజు చాలా డిస్టర్బ్ డ్ గా కనిపిస్తున్నాడు.
"ఇన్ని రోజులు ఏమైపోయావురా?"
"అమ్మ చావు బతుకుల మధ్య హాస్పిటల్ లో వుంటే మీరు ఎందుకు రాలేదు" అడిగి సూటిగా అతని కళ్ళలోకి చూశాడు అభినయ్.
కొడుకులో మార్పు రావడమే కాదు. అతను తనను సంజాయిషీ కూడా అడుగుతున్నాడు. ఆలోచనలతో జయచంద్ర భృకుటి ముడిపడింది.
