Previous Page Next Page 
త్రీ -ఇన్- వన్ పేజి 54

    "నీ బొంద... అదేంకాదు... ఈ కిళ్ళీ కొట్టాయన చేత రికమెండేషను చేయిస్తే నీ పని జరిగిపోతుంది..."

    సుదర్శనం ఆశ్చర్యపోయాడు.

    "కిళ్ళి కొట్టువాడు చెపితే పని కావడం ఏమిటి నీకేమైనా మతి పోయిందా?"

    "ఎదురుగుండా ఉన్న ఫాన్సీషాపులో ఓ అద్దం కొనుక్కుందాం రా.." అన్నాడు ఫాన్సీషాపువైపు అడుగులు వేస్తూ.

    "ఎందుకూ?"

    "ఎందుకేమిటి...? మొహం చూస్కుందువు గాని" పళ్ళు కొరుకుతూ అన్నాడు రంగారావు.

    "సరే.. నాది దేభ్యం మొహమని ఒప్పుకుంటున్నా... పోనీ నువ్వెందుకు అతనిచేత రికమెండేషను చేయించాలని అనుకుంతున్నావో చెప్పొచ్చుగా?!...." అన్నాడు చిరాకుపడుతూ సుదర్శనం.

    "అలా రా దారికి.. మన ముఖ్యమంత్రి ఎవరూ?"

    "చిన్నపిల్లల్ని అడిగినట్లు అలా అడుగుతావేం? భీమారావు!!" చెప్పాడు సుదర్శనం.

    "భీమారావు కొడుకెవరూ?" కళ్ళెగరేసి చిలిపిగా నవ్వుతూ అడిగాడు.

    "చిన్నికృష్ణ! అయితే యేంటి?"

    "చిన్నికృష్ణ. యేం జేస్తాడు?"

    "సినిమా హీరో!!" అసహనంగా చూస్తూ జవాబిచ్చాడు.

    "చిన్నికృష్ణ సూపర్ స్టార్ కదా... అతనికి బోల్డన్ని అభిమాన సంఘాలున్నాయి. ఆ అభిమాన సంఘాలకి సెక్రట్రీలు, ప్రెసిడెంట్లు ఉంటారు కదా! వాళ్ళు మినిష్టర్ల దగ్గరికి వెళ్ళి మేం చిన్నికృష్ణ అభిమాన సంఘానికి ప్రెసిడెంట్లమీ, సెక్రట్రీమీ అని చెప్పుకుని ఆ పనీ ఈ పనీ పెట్టుకుని అడుగుతున్నారు. ముఖ్యమంత్రి కొడుకుగారి అభిమానులు చెప్పిన పని చెయ్యకపోతే ముఖ్యమంత్రి కొడుక్కీ, తద్వారా ముఖ్యమంత్రికీ కోపం వచ్చి తమ పదవులకే ఎక్కడ మోసం వస్తుందోనని భయపడి మంత్రులు వాళ్ళ పనులు చేసి పెడ్తున్నారు..." చిద్విలాసంగా నవ్వుతూ చెప్పాడు రంగారావు.

    "అయితే ఈ కిళ్ళీ కొట్టాయనా..." అనుమానంగా చూస్తూ ప్రశ్నించాడు సుదర్శనం.

    "చిన్నికృష్ణ ఫాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంటు... పేరు యాదగిరి.... రా వాడికి నమస్కారం పెడ్డాం...."

                                    

    ఇద్దరూ యాదగిరికి నమస్కారం పెట్టారు.

    "ఏం కావాలి?"... సాదా కిళ్ళీనా, జర్దా కిళ్ళీనా, కలకత్తా రాంప్యారీనా?.... ఏం గావాలెసాబ్?" అడిగాడు యాదగిరి.

    రంగారావు వాళ్ళు వచ్చినపని చెప్పాడు.

    "సిఫారిష్ కోసం వచ్చిండ్రా... మల్లఅట్ల కడక్ నించుని సలాం కొడ్తుండ్రేంది?.... వంగి వంగి సలాంలు కొట్టుండ్రి-" అన్నాడు యాదగిరి కాస్త గీరగా.

    రంగారావు సుదర్శనం వాడికి వంగి వంగి నమస్కారాలు చేశారు.

    "మీ పని నేను చేస్పెడ్తా, ఓ అయిదు వేలు ఇస్తార్ మల్ల?"అన్నాడు యాదగిరి.

    "అయిదు వేలే? ఎందుకూ అంత" అన్నాడు సుదర్శనం గుండెలమీద చేయ్యేస్కుంటూ.

    "అర్రె ఇస్కీ-మల్ల ఇవ్వొద్దా?...

    ఇస్మంటి పైసల్తోనే మేం చిన్నికృష్ణ సిన్మాల్ రిలీజ్ గిట్టయినప్పుడు హాల్ టౌన్ డెకరేషన్ గిట్టజేస్తం!-"

    "పోనీ నాలుగు వేలు తీస్కో" అన్నాడు సుదర్శనం.

    "ఛల్ నీ యవ్వ. మీరు వేరేవాళ్ళకి రిక్ మెండ్ చైనీకె పదివేలిస్తార్. మాకు అయిదివ్వనీకి ఏడుస్తార్. ఇగ నావల్లకాదు పోండ్రి-" అన్నాడు యాదగిరి మొహం చిట్లిస్తూ.

    రంగారావు యాదగిరికి సుదర్శనం చేత అయిదువేలిప్పిస్తానని నచ్చజెప్పి బుజ్జిగించాడు.

    "ఓ రెండు వేలు అడ్వాన్సు ఇవ్వూండ్రి... మిగ్తాది పనయ్యాక..." అన్నాడు యాదగిరి.

    ఆ సాయంత్రం యాదగిరికి రెండు వేల రూపాయలు తెచ్చిచ్చారు. పని అయిపోయినట్టే మాట్లాడాడు యాదగిరి.

    సుదర్శనం ఇంటర్య్వూ అయిపోయింది. కానీ ప్రమోషన్ రాలేదు. నాలుగు రోజుల తరువాత యాదగిరి మొహం వేలాడేస్కుని చెప్పాడు.

  

                                      

       'చవించు సాబ్, మీ పని కాలే... అభిమాన సంఘాల పేరు చెప్పి అందరూ పన్లు చేయించుకుంటున్నారని మంత్రులందరూ పరేషాన్ అయినారు- ఎవరికి నిజంగా చిన్నికృష్ణ అభిమాని సంఘం ఉందో, ఎవరికి లేదో తెలుస్తలేదు. అందుకనే చిన్నికృష్ణ అభిమాన సంఘాలకి గుర్తింపు కార్డులు ఇమ్మని ముఖ్యమంత్రి చెప్పిండ్రు. కొన్ని అభిమాన సంఘాలకి గుర్తింపు కార్డులు వచ్చిండ్రు. ఆ కార్డు చూసి మంత్రులైన పన్లు చేయించుకోవచ్చు. నాకు ఆ గుర్తింపు కార్డు ఇవ్వలే- అందుకనే మీ పనికాలే..." అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS