Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 55

    "నాకొకటి  తెలిస్తేగా  నీకు చెప్పడానికి. ఓ రౌండ్ కొట్టివస్తాన"ని వెళ్ళారు. వారు వెళ్ళినా, నేనున్నచోటు నుండి కదలకుండా  ఆలోచిస్తున్నాను. నా ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ టెలిఫోన్ వచ్చింది.

    "శ్రీశ్రీగారున్నారా అమ్మా" అని.

    "లేరండి. మీరెవరో తెలుసుకోవచ్చా" అని అడిగాను.

    "నేను పద్మాలయా నుండి  హనుమంతరావుని  మాట్లాడుతున్నానమ్మా కంగ్రాచ్యులేషన్స్" అన్నారు.

    "దేనికి సార్?" అన్నాను.

    "అల్లూరి సీతారామరాజు పిక్చర్లో శ్రీశ్రీగారు రాసిన 'తెలుగు వీర లేవరా' పాటకి నేషనల్ అవార్డ్ వచ్చిందమ్మా. గురువుగారు రాగానే వారికీ విషయం చెప్పి మా ఆఫీసుకి రమ్మని చెప్పండి" అన్నారు.

    "థాంక్సండీ" అన్నాను.

    "పిల్లలూ మీరూ బాగున్నారా అమ్మా" అని అడిగారు.

    "బాగున్నా"మన్నాను.

    "ఉంటానమ్మా" అని ఫోన్ పెట్టేశారు.

    నేషనల్ అవార్డ్ అంటే ఢిల్లీలో తీసుకోవాలిగా! ఆ వివరాలన్నీ  తెలుసుకోవాలని  ఒకటే ఉబలాటంగా వుంది.

    వారింకా  రాలేదు.

    మళ్ళీ ఫోను వచ్చింది. "కంగ్రాచ్యులేషన్స్ అమ్మా" అని.

    ఎవరని అడగను? ఎంతమందినని అడగను?

    అలా ఫోన్లు  వస్తూనే వున్నాయి.

    'థాంక్స్'లు చెప్తూనే వున్నాను.

    మధ్యాహ్నం మూడు గంటలప్పుడు  మా శ్రీవారు నవ్వుతూ వచ్చారు.

    "గుడ్ న్యూస్ సరోజా!" అన్నారు.

    "అంటే పద్మాలయాకి వెళ్ళే వస్తున్నారన్నమాట" అని అడిగాను.

    "అంటే నీకప్పుడే  విషయం తెలిసిపోయిందన్నమాట" అన్నారు.

    "కంగ్రాచ్యులేషన్స్" అంటూ, హనుమంతరావుగారు ఫోన్ చేసిన విషయం చెప్పాను.

    "హనుమంతరావుగారు ఫోన్ చేశారా" అని అడిగారు.

    "అవునండి. సాక్షాత్ హనుమంతరావుగారే చేశారు. నేనే మాట్లాడాను.

    ఇంతకూ మీ ఢిల్లీ ప్రయాణం ఎప్పుడ"ని అడిగాను.

    "మీ అంటావేమిటి సరోజా! మనం అను. ఇద్దరం కలిసే హాయిగా ఢిల్లీ వెళదాం" అన్నారు.

    "నిజంగానే?" అన్నాను.

    కొన్ని నెలల తర్వాత, పద్మాలయావాళ్ళు  మాకిద్దరికీ ఫ్లయిట్ టిక్కెట్లు, వెళ్ళడానికి మాత్రం బుక్ చేసి, ఇంటికి పంపించేశారు.

    ఇద్దరం  బయలుదేరాం.

    రాత్రి పదకొండున్నర  గంటలకి  'మీనంబాక్కం'లో  ఫ్లయిట్ బయలుదేరింది.

    ఇద్దరం బెల్టులు తగిలించుకున్నాం.

    "చెవుల్లో దూదిపెట్టుకో" అన్నారు.

    "వద్దండి" అన్నాను.


                                    ఢిల్లీలో  శ్రీశ్రీ


    ఇద్దరం కలిసి ఢిల్లీ వెళుతున్నందుకు నా ఆనందానికి అవధులు లేవు.

    ఫ్లయిట్ అర్దరాత్రి నాగపూర్ లో ఆగింది. చలి బాగానే వుంది. వేడిగా కాఫీ తాగుదామని ఇద్దరం దిగాం. ముప్పావుగంట సేపు  అటూ ఇటూ తచ్చాడి, మళ్ళీ మా స్థానాల్లోకి వెళ్ళి  కూర్చున్నాం.

    తెల్లవారుతూండగా  పాలం విమానాశ్రయంలో  దిగాం. ఎయిర్ పోర్ట్ కి కారు వచ్చింది. బ్రహ్మాండమైన హోటల్లో  బస ఏర్పాటుచేశారు.

    ప్రోగ్రాం కనుక్కున్నాం. రెండవరోజు ఉదయం పదిగంటలకి  అవార్డ్స్ ఇస్తారని తెలుసుకున్నాం.

    'బైటకి  వెళ్ళదలచుకున్న  వాళ్ళకి కారు ఇస్తాం. వెళ్ళిరావచ్చ'ని  చెప్పారు.

    పదిగంటలకి మేం రడీగా వున్నాం. కారు వచ్చింది. బయలుదేరుదామనుకొంటూ వుండగా, తెలుగు  అసోసియేషన్ వాళ్ళు వచ్చారు. మేం రావడానికి ఆలస్యం అవుతుందని డ్రైవర్ తో చెప్పాం.

    "ఫరవానై" అంటూ అతడక్కడే  కూర్చున్నాడు.

    "మేం ఫలానావారికి  (ఇక్కడ  పేరు అనవసరం) సన్మానం చేస్తున్నాం. ఎలాగూ మీరూ వచ్చారు కాబట్టి వారితోపాటు మీకు కూడా ఒకే వేదిక మీద సన్మానం చేస్తాం. తప్పకుండా రావాల"ని అడిగారు అసోసియేషన్ వాళ్ళు.

    "మీరు చెయ్యదలచుకున్నవాళ్ళకి  సన్మానం చెయ్యండి. నాకేమీ అభ్యంతరం లేదు. మీరు కావాలంటే నేను వస్తాను. మాట్లాడతాను. కానీ ఎలానూ వచ్చాను కాబట్టి  అతనితోపాటు నాకూ సన్మానం చేసే పని పెట్టుకోకండి. నేను ఒప్పుకోన"ని అనేశారు శ్రీశ్రీగారు.

    "పోనీ రేపు పెట్టుకుంటాం సార్" అని వాళ్ళు ఎంతో ప్రాధేయపడ్డారు.

    "మరోసారి వస్తాను. ఈ ట్రిప్ లో మాత్రం  కుదరద"ని చెప్పేశారు.

    "మీరు బైటికి  వెళుతున్నట్టున్నారు. సాయంకాలం వస్తాం సార్" అని వాళ్ళు వెళ్ళిపోయారు. మేం కూడా బయల్దేరాం.

    కారులో  హాయిగా  ఢిల్లీ  ఒక భాగం తిరిగాం. జంతర్  మంతర్, ఇంకా ముఖ్యమైన రెండు ప్రదేశాలు చూసి ఎర్రకోట దగ్గర ఆగాం.

    "లోపలకి వెళదామండీ" అన్నాను.

    "ఎందుకులే సరోజా! అందులో ఏముందని?" అన్నారు.

    "అదేమిటండీ! ఊరికే  వెళ్ళి చూసి వచ్చేద్దామండీ" అన్నాను.

    "నేను కారులో  కూర్చుంటా  నువ్వు వెళ్ళిరా" అన్నారు.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS