మరుక్షణం జీపు రివ్వున ముందుకు దూకింది.
"ఏయ్ ఏయ్ ఎటు వెళ్ళిపోతున్నావ్?" కంగారుగా అడిగాడు బంగార్రాజు.
మీరేగా జీపుని త్వరగా పోనివ్వమని అన్నారు?" ఆశ్చర్యంగా అడిగాడు డ్రైవర్.
"ముందు జీపు ఆపు. త్వరగా లేకపోతే మర్డరు చేస్తా" కోపంగా అన్నాడు బంగార్రాజు.
జీపు ఆగిపోయింది.
"వెళ్ళమనగానే వెళ్ళిపోవడమే? ఇందాక మనల్ని చూసి పారిపోయాడే అతన్ని పట్టుకోవాలి మనం ఇప్పుడు."
"అతన్ని మీరు చూశారుగాని నేను చూడలేదు కద్సార్?" అన్నాడు డ్రైవరు.
"అధికప్రసంగం మని జీపుని వెనక్కి తిప్పి ఆ సందులోకి పోనియ్ లేకపోతే మర్డరు చేస్తా" విసుక్కుంటూ అన్నాడు బంగార్రాజు .
డ్రైవరు జిపుకి వెనక్కి తిప్పి కన్నారావు పరుగెత్తుకుని వెళ్ళిన సందులోకి తిప్పాడు.
"ఏయ్ ఏడుకొండలూ!" బంగార్రాజు రోడ్డు మిడి నుండి దృష్టిని మళ్ళించ కుండానే పిలిచాడు.
"యస్సార్" వెంటనే పలికాడు ఏడుకొండలు
"బి ఎలర్ట్! రోడ్డుకి ఇటూ అటూ జాగ్రత్తగా పరిశీలించు. అతన్ని మనం ఎలాగ్తెనా పట్టుకోవాలి. మనం ఊహించినట్టుగానే అతను దొంగో, ఖూనికోరో అయితే మర్డరు చేసేద్దాం."
"యస్సార్" హుషారుగా అన్నాడు ఏడుకొండలు
జీపు రెండు పర్లాంగుల దాకా ముందుకు వెళ్ళింది. బంగార్రాజు, ఏడు కొండలూ రోడ్డుకి అటూ ఇటూ జాగ్రత్తాగా పరిశీలించారు. ఎక్కాడా కన్నారావు జాడ వాళ్ళకి కనిపించలేదు.
"ఇంత తక్కువ టైంలో అతను ఇంతదూరం వచ్చే అవకాశం లేదు సార్.... జీపుని వెనక్కి తిప్పదామా?..." బంగార్రాజు వ్తెపు వింటావా నువ్వు చెప్పినట్టు నేను వినాలా?...పిచ్చి పిచ్చి సలహాలిచ్చా వంటే నిన్ను మర్డరు చేస్తా..."
"ఇవ్వను సార్...."అన్నాడు డ్రైవర్.
పావు నిముషం ఆగి బంగార్రాజు గట్టిగా అరిచాడు.
"జీపుని వెనక్కి తిప్ప"
"అదేంటి సార్... ఇప్పదేగా నేను వెనక్కి తిప్పదాం అంటే వద్దని అన్నారు?" ఆశ్చర్యంగా అడిగాడు డ్రైవరు.
"షటప్...చెప్పినట్టు చెయ్యి. ఇందాక నువ్వు అన్నప్పటికంటే ముందుకి రాలేదు?... అతను ఇంత దూరం వచ్చి ఉండడు...." అన్నాడు బంగార్రాజు.
డ్రైవరు పక్కకి తిరిగి ముసిముసిగా నవ్వుకుని జీపుని వెనక్కి తిప్పాడు.
"కాస్త నెమ్మదిగా పోనియ్..." అన్నాడు బంగార్రాజు దృష్టినంతా రోడ్డు మీదే ఉంచి.
జీపు మెల్లగా వెళ్ళసాగింది.
ఇన్ స్పెక్టర్ బంగార్రాజు, ఏడుకొండలూ రోడ్డుమీద జనాలను జాగ్రత్తగా పరిశీలించి చూడసాగారు.
ఉన్నట్టుండి ఏడుకొండలు కెవ్వున కేకేసి "డ్రైవర్ జీపు ఆపు" ఆన్నాడు.
సడెన్ బ్రేకుతో ఆగింది జీపు.
"ఏమ్తెంది?... ఎందుకట్టా అరిచావ్?" వెనక్కి చూస్తూ కంగారుగా ఏడుకొండల్ని అడిగాడు బంగార్రాజు.
"ఆ పుస్తకాల షాపు ముందు చూడండి."
బంగార్రాజు ఏడుకొండలు చూపించిన దిక్కుకి చూశాడు. అతనికేమి ప్రత్యేకంగా కనిపించలేదు.
"ఏముందక్కడ?"
"చూడండీ సార్... వాడెవడో న్యూస్ పేపర్లో మొహం దాచుకుని నిలబడ్డాడు... మనల్ని చూసి పారిపోయివాడే అయ్యుంటాడు" హుషారుగా అన్నాడు కానిస్టేబులు ఏడుకొండలు.
బంగార్రాజు జిపులోంచి ఒక్క దూకుదూకి "సెవెన్హిల్స్... ఫాలోమి... వాడ్ని పట్టుకుని మర్డర్ చేద్దాం..." అన్నాడు గబగబా అడుగులు ముందుకు వెస్తూ.
ఏడుకొండలు కూడా జిపులోంచి కిదింకి దూకి బంగార్రాజుని ఫాలో అయ్యాడు.
ఇద్దరూ గబగబా న్యూస్ పేపర్లో మొహం దాచుకుని నిల్చున్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. బంగార్రాజు ఆ వ్యక్తి చేతుల్లోంచి న్యూస్ పేపర్ని విసురుగా లాగేశాడు.
ఆ వ్యక్తి తెల్లబోయి బంగార్రాజువంకా, ఏడుకొండలు వంకా మార్చి మార్చి చూశాడు.
అతను కన్నారావు కాడు.
"ఏందయ్యా ఇది...న్యూస్ పేపరట్లా పిక్కున్నవేంది?..." ఆశ్చర్యంగా అన్నాడా వ్యక్తి బంగార్రాజుతో.
"సార్...ఇతను మనం వెతుకుతున్న వ్యక్తి కాదు సార్..." అన్నాడు ఏడుకొండలు ఎక్కడ తిట్లుతినాల్సి వస్తుందో అని భయం భయంగా బంగారాజు వంక చూస్తూ.
కాని బంగార్రాజు ఏడుకొండల్ని పట్టించుకునే స్దితిలోలేడు.
"ఏవయ్య...ఎందుకలా పేపర్లో మొహం దాచుకుని నిలబడ్డావ్?... చెప్పు!!! ఏం నేరం చేశావ్?" సూటిగా ఆ వ్యక్తి మొహంలోకి చూస్తూ అడిగాడు బంగార్రాజు.
"ఏందయ్యో.....నేనేమ్తెన దొంగనా ఏంది పేపర్లో మొహం దాచుకోడానికి?.... నేను పేపరు సదువుతా ఉండా...." అన్నాడా వ్యక్తి నిర్బయంగా బంగార్రాజు వంక చూస్తూ.
"పేపరు చదువుతా ఉండావా? ...కాని నువ్వు సదువుతా ఉన్నట్టు లేదు... ముహం దాచుకున్నట్టే ఉంది.. నిజం చెప్పు లేకపోతే మర్డరుచేస్తా"
"ఇదెక్కడి గలాటా బాబూ...నేను నిజంగానే పేపరు సదూతూ ఉండా... నాకు రవ్వంత స్తేటుండాది. దానికే మొహం దగ్గర పెట్టుకుని పేపరు సదూతా ఉండా" నెత్తినోరు కొట్టుకుని చెప్పాడా వ్యక్తి.
బంగార్రాజు ఆ వ్యక్తి మొహం వంక పరిశీలనగా చూశాడు. అతను నిజమే చెప్తున్నట్టు అనిపించింది.
"అట్టాగ్తేతే మేం వెళ్తా ఉంటాం... నువ్వు పేపరు సదూకుంటా ఉండు..." వేలాకోళం చేస్తూ ఆ వ్యక్తి మొహం మీద పేపరు కప్పి వెనక్కి అడుగులు వేశాడు బంగార్రాజు.
కానిస్టేబుల్ ఏడుకొండలు అతన్ని ఫాలో అయ్యాడు.
నాలుగు అడుగులు వేశారో లేదో వెనుక నుండి మళ్ళి కేవ్వమని కేకేశాడు ఏడుకొండలు.
బంగార్రాజు ముందుకు తూలి, నిలదోక్కుని, వెనక్కి తిరిగి కోపంగా చూశాడు ఏడుకొండలు వంక.
"మళ్ళి ఎందుకా పిచ్చి కేకలు?" మర్డరు చేసేవాడు లేకా?" అన్నాడు అరుస్తూ.
"అది కాద్సార్. అటు చూడండి" అన్నాడు ఏడుకొండలు సంబరంగా.
బంగార్రాజు ఏడుకొండలు చూపించిన దిక్కుకి చూశాడు. ఇందాకటి వ్యక్తికి కాస్త దూరంలో నిల్చుని మరో వ్యక్తి మొహం మీద న్యూస్ పేపరు కప్పుకుని నిల్చున్నాడు.
"సార్.. అతని మొహం మిది న్యూస్ పేపర్ని కూడా లాగి చూద్దాం సార్..." ఉత్సాహంగా అన్నాడు ఏడుకొండలు.
"ని బోడి సలహాలు పక్కన పెట్టు ఇందాక జరిగింది చాలదా? వీడికి కూడా స్తేటు ఉంది మొహం దగ్గరికి పేపర్ని పెట్టుకున్నాడేమో!!..."
"లేద్సార్... ఆ కాళ్ళు చూడండి ఎలా వణుకుతున్నాయో!!..."
బంగార్రాజు ఆ వ్యక్తి కాళ్ళ వంక చూశాడు.
నిజమే!!!...
అవి గడగడా వణుకుతున్నాయి.
బంగార్రాజు ఏడుకొండలుకి కను స్తెగా చేశాడు.
ఇద్దరూ ఆ వ్యక్తివ్తెపు మెల్లగా అడుగులు వేస్తూ దగ్గరికి వెళ్ళి అతని మొహం మీద న్యూస్ పేపర్ని లాగేశారు.
17
చిట్టబ్బాయ్ ఒక్కడే గదిలో కూర్చుని ఆలోచించసాగాడు.
అతని మనసంతా అల్లకల్లోలంలా ఉంది.
నిన్న మొన్నటిదాకా అతనికి జీవితం అంతా రంగులస్వప్నంలా కానీ పించింది.
మరి నేడో?
