సీ|| సౌధంబుపై నీళ్ళు చల్లించి చిమ్మించి
చాపలు పఱిపించి చారురత్న
కంబళంబులు వేసి మనహంసతూలికా
తల్పంబు బఱిపించి తమక మలర
సందుపై ననుఁ జేర్చి యగరుగంధముఁ బూసి
చలువపన్నీరులు చల్లి మల్లె
పూదండలును జాజిపూదండ లురమున
వేసి చల్లనిగాలి వీచుచుండ
గీ|| రమణ నీరీతి వేసవిరాత్రులందు
రాగ మెచ్చంగ నిష్టోపభోగములను
నన్ను సుఖియింపఁ జేసిననాఁటికూర్మి
మదికి మఱవంగ వశమె రామావధూటి. 584
సీ|| ఉదయమే లేచి ని వదలలే కై దాఱు
గడియలవఱ కుండి కదలి మేడ
దిగి వచ్చుచో వాకిటికిముందు గుబగుబ
నీ వేఁగి యీవల నావలఁ గని
సై యన నే వేగఁ జని బసలోఁ గల
పనులెల్లఁ దీర్చి సాపాటు చేసి
గంధంబుఁ బూసి వేడ్కల మించి కెలఁకుల
నమ్మలక్కలు వెఱఁగంది చూడ
గీ|| నీటుగా వచ్చుచోఁ జూచి నేఁడు దృష్టి
తాఁకు నని ప్రొద్దు గ్రుంకినతత్ క్షణంబు
జీడిగింజల దృష్టి తీసినవిధంబు
మఱచిపోవంగఁ దరమె రామావధూటి. 585
సీ|| ఊరు నేఁడే బైలుదేరుట నిశ్చయం
బైనచో నెదురు మాటాడలేక
మోము వెల్వెలఁబోవ ముచ్చటాడుచునుండి
ధ్యానంబు వేఱుగాఁ దల్లడిలుచు
నామాట లీమాట లడుగుచు నుచితోవ
చారముల్ సేయుచు గారవమున
భోజనానంతరంబునను దమ్ములము గు
డాన్వితంబుగ నిచ్చి యవలఁ జేయు
గీ||చేతిలో నుంచి యూరికి క్షేమముగను
బోయి శీఘ్రంబు రమ్మని పొలుపు మీఱ
నన్నుఁ బంపిన యానాఁటినై పుణంబు
మఱచిపోవంగఁ దరమె రామావధూటి. 586
సీ|| కడుపులోఁ గమ్మనికాంక్ష లూరుచునుండు
నిను జ్ఞాపకము సేయఁ గనకగాత్రి
కనుల కేమో తళుక్కను నట్లుగాఁ దోఁచు
నిన్నెన్న సౌదామనీలతాంగి
నిలువెల్ల నేమేమొ పులకించు నీతీరు
స్మరియించ శీతాంశురుచిరసుముఖి
సారెకు నేమేమొ నో రూరుచుండు నీ
మాటలఁ దలఁవ బింబాధరోష్ఠ
గీ|| యోచనగ నుండు మది కేమి తోఁచకుండు
దిగులుగా నుండు మరుమాయ దెలియకుండు
దైవ మిఁక ముందెటులు సేయఁదలఁచినాఁడొ
మనకుఁ దెలియంగరాదు రామావధూటి. 587
సీ|| ధరలో ననేకసుందరు లుందు రైన వా
రలయందు నెందు నీవలెనె మంచి
గుణము విశ్వాసంబు కుదురు సత్యము తప్ప
కుండుట యుక్త మయుక్త మెఱిఁగి
తివురుట వినయవిధేయత లభిమాన
మాదరంబు దయామయాంతరంగ
మందంబు చందంబు నళుకును బెళుకును
సమయంబునకు దెంపు సౌష్ఠవంబు
గీ|| దగినసరసునిఁ జేపట్టి తప్పు లొప్పు
లెఱిఁగి విడువక ప్రేమచే నేలికొనుట
తెలివితేట లుపాయముల్ లలితవాక్య
మాధురియు నిన్ని గలవె రామావధూటి. 588
సీ|| నీయాత్మ నాయాత్మ నిజముగా నొకటంచు
నామనంబునఁ జాల నమ్మియుంటి
నాతోడఁ జేసిననమ్మిక లెప్పుడు
మఱచిపో వని రూఢి పఱిచియుంటి
నెవరెన్ని చెప్పిన నిఁక నన్ను విడనాడ
వంచు నామది నిశ్చయించుకొంటి
మనశరీరములున్న మట్టుకు మనలోనఁ
బొర కల్గదని తలపోసియుంటి
గీ|| వనితరో యిప్పు డిటు కాలవశముచేత
మనల కెడబాపు కల్గె నీమది విరక్తిఁ
బొరయ లోగడ సంగతుల్ మఱచిపోవ
మంచిమార్గము కాదు రామావధూటి 589
సీ|| ఘన మైనమోహంబుఁ గలవాఁడ నౌటచే
లలన నే నీకింత తెలుపవలసెఁ
బట్టుకై యభిమానపడువాఁడఁ నౌటచేఁ
దెఱవ నీకింత బోధింపవలసెఁ
బ్రౌఢానుభవ మాసపడువాఁడ నౌటచే
నింతి ని న్నింత ప్ర్రార్ధింపవలసెఁ
జెలిమిపై లక్ష్యంబు గలవాఁడ నౌటచే
వనిత నీకింతగా వ్రాయవలసెఁ
గీ|| గాక తమతమ యక్కఱల్ గడవుకొనెడు
వార లందఱతో పాటివాఁడ నైన
నింత యేటికి? నీకు నొక్కింతయైన
మనమునను దయ లేదు రామావధూటి. 590
సీ|| నీమోము నే నొక్కనిముసంబు గనుఁగొన
శశి యేటి కనిపించుఁ జంద్రవదన!
నీమోవి నే నొక్క నిముస మానిన దొండ
పండేటి కనిపించుఁ బల్లవోష్ఠి!
నీకను లే నొక్కనిమిషంబు గనినఁ బ
ద్మమ్మేటి కనిపించుఁ దరళనయన!
నీబొమల్ నే నొక్కనిమిషంబు గనుఁగొన్న
విల్లేటి కనిపించు విలసితభ్రు!
గీ|| నీదుచెక్కులు నే నొక్కనిమిష మైనఁ
గనిన నద్దంబు లేమిటి కనుచుఁ దోఁచు
నిట్టి నినుఁ బాసి యున్ననా కిపుడు జన్మ
మే వృథా యని తోఁచు రామావధూటి. 591
