సీ|| నమ్మినవాని నన్యాయంబు సేయుట
కాశిలో గోహత్యగాదె కలికి
వలచి వచ్చినవాని వంచనల్ సేయుట
నరహత్యగాదె పున్నాగవేణి
చెలిమి కోరినవానిఁ జేవట్టి విడుచుట
బ్రహ్మహత్యయెకాదె పంకజాక్షి
ఆడి తప్పినదోష మన్ని దోషములలో
మొదటిదోషము సుమీ మోహనాంగి
గీ|| నిన్ను నమ్మితి వలచితి నీవు నన్నుఁ
బ్రేమఁ జేపట్టితివి యిఁక విడువ ననుచు
బాసఁ జేసితి విప్పు డీపగిదిఁ గూర్మి
మఱచిపోవంగఁ దగునె రామావధూటి. 576
సీ|| చంద్రఖండంబు పైఁ జంద్రఖండము రేక
నుదుటఁ గుంకుమవంకఁ బదిలపఱచి
కొండలపై మంచు నిండియుండినరీతిఁ
జనులపై మైఱైకఁ జక్కపఱిచి
కలువరేకులఁ దుమ్మెదలు వ్రాలి యున్నట్లు
కనుదోయి నంజనంబును ఘటించి
బంగారుప్రతిమలఁ బటిక నార్చినరీతి
లలి జిల్గుమల్లిసెల్లా ధరించి
గీ|| యంగజప్రభు విజయకాహళులపగిదిఁ
గాళ్ళ సందెలు పాంజెబుల్ ఘల్లురనుచు
మ్రోయ మెల్లన వచ్చి నామ్రోల నిలుచు
ఠీవి మఱవంగఁ దరమె రామావధూటి. 577
సీ|| ఒకనాఁడు మేడపై నొంటిగా కిటికిటీ
లెల్ల బిగించి శయించువేళఁ
జల్లగా నే వచ్చి మెల్లమెల్లనె ముద్దు
లిడఁబోవఁగాఁ దృళ్ళిపడి బిరాన
లేచి చెంగట నన్నుఁ జూచి సెబాసు రా
రండి యటంచు నురంబుపైకి
తిగిచి నాచిబుకంబుఁ దివురుచు నవ్వుచు
మధుర వాక్యముల న మరులుకొల్పి
గీ|| సరసులై నట్టి నీవంటిజాణ లిట్లు
చెలులమానంబులను బయల్ సేయఁదగునె
యంచు మంచిగ బోధించినట్టినేర్పు
మదికి మఱవంగఁ దరమె రామావధూటి. 578
సీ|| చిననాఁటి నుండి విజృంభించి సఖులతోఁ
బొందు లొనర్చితిఁ గుందరదన
యీలాటిమోహంబు లీలాటివిరహంబు
లేనాఁ డెఱుంగనే యిగురుఁబోఁడి
నీవంటిచెలియతో నేస్త మబ్బె నటంచుఁ
జాలఁ బొంగితిఁ గదే జలజగంధి
యిప్పు డిట్లెడఁ బాసి యేఁగుట నాపూర్వ
పుణ్యంబు గాఁబోలుఁ బూవుఁబోఁడి
గీ|| యింతపాపంబు జగతిలో నెచటనైనఁ
గలదె నాపాప మిటు సందెఁగాక యైనఁ
దరుణి నీమది కరుణమాత్రంబు తప్పి
పోవకున్నను జాలు రామావధూటి. 579
సీ|| 'బోఁటి నేఁ డూరికిఁ బోవలె' ననుచు నే
నొక్కింత పలుకంగ నుస్సురనుచు
'నెపుడుఁ బ్రయాణాలె యేమి సేతు' నటంచుఁ
గనుఁగొలఁకుల నీరు గ్రమ్మఁ గొంత
సేపున "కెపుడు విచ్చేయుదు రొక్కొ! య
చ్చటనె యచ్చటల ముచ్చటల మరగి
యుందురో" యన భయం బొంది నేనన్నటి
కిని నట్టివాఁడఁగా నని పలుకఁగ
గి|| నొట్టుసుండి తప్పక హుటాహుటిగ రండి
యనుచుఁ గౌఁగిటఁ జేర్చి బాష్పాంబు లొలుక
రేపు పోవచ్చు ననుచుఁ బ్రార్ధించునట్టి
మంచి మఱవంగఁ దరమె రామావధూటి. 580
సీ|| ధరలోన జన్మ మెత్తంగ నేమి ఫలంబు
సరసవిద్యల నెల్ల జదువవలయుఁ
జదినిన నేమాయె సారస్య మెఱిఁగిన
చెలియతో స్నేహంబు సేవవలయుఁ
జేసిన నేమాయెఁ జిడిముడి లేక వి
చ్చలవిడి ముచ్చట్ల మెలఁగ వలయు
మెలఁగిన నేమాయె నెడబాయ కెల్లప్పు
డేకీభవించి వర్తింపవలయు
గీ|| నటుల వర్తింప నేమాయె నవ్విధమునఁ
జెడని ప్రేమలతోఁ దను ల్విడువవలయు
నహహ యివి యెల్లఁ బూర్వపుణ్యమునఁ గాక
మనుజులకు వీలుపడునె రామావధూటి 581
సీ|| మేడలోఁ జన్నీళ్ళు మెండుగాఁ జల్లించి
తడియొత్తి చిఱిచాఁప లిడి సుమృదుల
తల్పంబుఁ బఱిచి చెంతల మిన్న లగుషర్భ
తులును షోడావాటరులును గల్గు
సీసాలు చక్కరల్ జీడిపప్పులును బా
దముపప్పులును మంచి ద్రాక్షపండ్లు
కజ్జాయములు ముంతఖర్జూరముల్గల
వళ్ళెముల్ ప్రేమతో భద్రపఱిచి
గీ|| భోజన మొనర్చి నేను రాఁ బొలుపు మీఱ
శయ్యపైఁ జేర్చి యుచితోపచారములను
వేసఁగిపగళ్ళ సుఖియింపఁ జేసినట్టి
మంచి మఱవంగఁ దరమె రామావధూటి. 582
సీ|| కమలాక్షి నీమోముఁ గనుఁగొన్న నాకన్ను
లేమియుఁ గనుఁగొన నేవగించు
బింబోష్టి నీదు మోవిని గ్రోలునాజిహ్వ
యేమియుఁ గ్రోలంగ నేవగించుఁ
గలవాణి నీదు పల్కులు విన్న నావీను
లేమియును వినంగ నేవగించుఁ
గనకాంగి నీతోడఁ గలసిననాదుమే
నేమియు స్పృశియింప నేవగించుఁ
గీ|| సరసిరుహగంధి నీమేని పరిమళంబుఁ
గొన్న నానాస యెదియు మూకొనఁగఁబోదు
అహహ! పంచేద్రియములు నీయందె నాటి
మఱల విఁక నేమి సేతు రామావధూటి. 583
