Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 54

వకుళాంబ కళ్ళముందు ఎన్నో భయంకర దృశ్యాలు కానవచ్చాయి. ఆమె ఒక్కసారిగా భోరున ఏడ్చి, అంతలోనే ధైర్యం తెచ్చుకుని కళ్ళు తుడుచుకుంది.
"నిజమే నేను తప్పు చేశాను. నా పాపానికి పరిష్కారం లేదండీ!" దగ్గుత్తికతో పలికింది ఆమె.
పరాయి సొమ్ముమీద ఆశపడిన భార్యను చూస్తూంటే, ఇప్పుడీ దుస్థితికి విలపిస్తూంటే, రామానుజాచారికి హృదయం ద్రవించింది.
"ఇంక మన ప్రయత్నమేమీ లేదు. చేసిన పాపం ఆ భగవంతుడితో చెప్పుకుని, మనసారా క్షమించమని వేడుకో" అన్నాడు రామానుజాచారి.
"భగవంతుడా! నేను నిజంగానే తప్పు చేశాను. నా ఆశకి ఆ పిల్లవాడు బలికాకుండా చూడు. నేను చేసిన పాపానికి, నాకు కుష్టురోగం వచ్చేటట్లు చెయ్యి, పక్షవాతం వచ్చేటట్లు చెయ్యి. నా నోరు పూర్తిగా పడిపోయినా నేనేమీ బాధపడను. వాళ్ళ బాబుని రక్షించు. ఎలా రక్షిస్తావో నీవే రక్షించు" ఈ మాటలు పైకి అన్న వకుళాంబ రొంటిన దోపుకున్న డబ్బులోంచి రూపాయి బిళ్ళలని తీసి అప్పటికప్పుడు వెంకటేశుని ముడుపుగా గుడ్డ ముక్కలో మూటగడుతూ" మా శ్రీమహాలక్ష్మి క్షేమంగా మళ్ళీ మా కళ్ళ పడేటట్లు చెయ్యి తండ్రీ! నీ కొండమెట్లు అన్నీ నడిచి ఎక్కుతాను. తన నీలాలు సమర్పించు కుంటాను." ముఖ్యంగా నాపాత బుద్ధి మార్చుకుంటాను." అని మ్రొక్కుకుంది వకుళాంబ.
"భగవంతుడు నాకు అన్యాయం చెయ్యడు" నెమ్మదిగా గొణుక్కున్నాడు రామానుజాచారి.
ఆ భార్యా భర్తలు ఇరువురూ చివరికి భగవంతుడి మీద భారంవేసి, వూరుకున్నారు.
వీళ్ళ సంగతి ఇక్కడ ఇలావుంటే.
అక్కడ,
శ్రీ మహాలక్ష్మి ఆ యింట్లో ఎలా వుంది? అన్నది ఆ భగవంతుడికే తెలియాలి!
అలాగే,
ఏం జరగబోతున్నదీ అన్నది కూడా ఆ దైవానికి మాత్రమే తెలుసు.

                                      23

రూమ్ చాలా చల్లగా వుంది.
ఆ గదిలో ముగ్గురు ఆడపిల్లలున్నారు.
ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి ఎంతో సేపటినుంచీ ఏడ్చి ఏడ్చి వుందేమో బాగా అలసిపోయి పడుకుని వుంది.
రెండో అమ్మాయి మోకాళ్ళలో తలదూర్చుకుని బిగ్గరగా ఏడుస్తున్నది.
ఆ గదిలో రెండు మంచాలు. మంచినీళ్ళ కూజా, ఒక గ్లాసు తప్పించి మరేమీ లేవు. నలభై కాండిల్స్ బల్బు ఒకటి మాత్రం వెలుగుతున్నది.
ఆ గదిలోకి చేర్చబడిన అయిదు నిమిషాలకే తెలివివచ్చిన శ్రీ మహాలక్ష్మి "చలిగా వుందేమిటబ్బా!" అనుకుంటూ లేచి కూర్చున్నది. అప్పుడు కనిపించింది ఆ గదిలోని దృశ్యం.
ఒకసారి గదినంతటినీ పరికించి చూసి అంత క్రితం జరిగిన దానిని జ్ఞప్తికి తెచ్చుకుంది శ్రీమహాలక్ష్మి.
తనకి సినిమా యాక్టరు శ్రీదేవిని చూపిస్తానంటే, క్రొత్తామెతో పడి ఆ యింట్లోకి వచ్చింది. తను గదిలోకి రాంగానే, ఇద్దరు మొగవాళ్ళు తనమీద పడ్డారు. ఒకడు తనని గట్టిగా పట్టుకుంటే, రెండోవాడు ఒక కర్చీఫ్ ని తన ముక్కుకి గట్టిగా అదిమి పెట్టాడు. ఆ తరువాత తను పెనుగులాడింది. కానీ, ఆ తరువాత ఏం జరిగిందీ అన్నది తనకి తెలియదు. మళ్ళీ తెలివివచ్చేసరికి తను ఈ గదిలో వుంది.
అదంతా గుర్తుతెచ్చుకున్న శ్రీమహాలక్ష్మి, తననెవరో మోసం చేశారన్నది మాత్రం గుర్తించింది.
శ్రీమహాలక్ష్మి చాలా మొండిది, వాళ్ళమ్మ లాగానే. వెర్రి తెలివితేటలు, నోరు పారేసుకోవటం, మొండితనం అన్నీ వున్నాయి. "జరిగేది జరుగక మానదు" అని మొండితనం తెచ్చుకున్న శ్రీమహాలక్ష్మి, ఆ అమ్మాయి వైపు తిరిగి "ఏయ్" అంది.

ఆ పిల్ల పలుకకుండా మరింత గట్టిగా ఏడ్వసాగింది.
"ఏయ్! పిలుస్తూంటే నిన్నుకాదు!" గట్టిగా అంది శ్రీమహాలక్ష్మి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS