Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 54


    అన్ని విషయాలు రాంసింగ్ కి చెప్పాను. ఈ విషయం కూడా రాంసింగ్ కి చెబితే ఏంపోయింది? నాలో నేను దాచుకోవటం వల్ల మధనపడటం తప్ప సాధించేది ఏముంది? ఆలోచించాను. చివరికి చెప్పటానికే నిర్ణయించుకున్నాను. "అడ్డు ప్రశ్నలెయ్యవద్దు. ఇప్పుడు టూకీగ చెప్తాను. ఆ తరువాత ఎప్పుడైనా వివరంగా చెబుతాను." అన్నాను.


    రాంసింగ్ మొహం విప్పారింది.


    "నేను కాలేజీలో చదివే రోజుల్లోనే సుస్మితతో పరిచయం. స్నేహంతో కూడిన మా పరిచయం చివరికి ప్రేమలోకి దారి తీసింది. నేను బీదవాణ్ణి. సుస్మిత కోటీశ్వరుడి కూతురు. కాని మా ప్రేమకి ఈ హెచ్చు తగ్గులు అడ్డురాలేదు. సుస్మిత వాళ్ళ నాన్నకి మాత్రం అడ్డు వచ్చింది. సుస్మిత విషయం మర్చిపొమ్మని నన్ను బ్రతిమలాడాడు. ధనం ఆశ చూపించాడు. చివరకి బెదిరించాడు. నేను దేనికీ లొంగలేదు. 'విధి తలచుకుంటే ఏదైనా చేయగలదు. అలాగే ధనవంతుడు తలచుకున్నా ఎంతకైనా తెగించగలడు ఏదైనా చేయగలడు' అన్న మాట నా విషయంలో నిజం అయింది.


    పైకి మా ప్రేమని వప్పుకున్నట్టు నటించాడు. చదువు పూర్తయిన తర్వాత పెళ్ళి చేస్తానన్నాడు. పడుకొని తీయని కలలు కంటున్న ఒక రాత్రి వేళ పోలీసులొచ్చి నన్ను పట్టుకున్నారు.


    'నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారో?' ఆ నిమిషంలో నాకర్థం కాలేదు.


    అడిగినా చెప్పలేదు వాళ్ళు.


    తీసికెళ్ళి కటకటాల వెనక పారేశారు.


    మర్నాడు పేపర్ తీసుకొచ్చి నా ముఖాన పారేశారు.


    పేపర్లో నా ఫోటో వుంది.


    దానికింద మేటర్ ఈ విధంగా ఉంది.


    నేను పైకి కాలేజీ స్టూడెంట్ నేనట గాని పేరుపొందిన స్మగ్లర్ కింద చాటుగ పనిచేస్తున్న మనిషినట.


    బ్లూ ఫిల్మ్ లలో నటించానట.


    ఆ క్యాసెట్లు వున్నాయట.


    మత్తు పదార్థాలు ఇతర దేశాలనుంచి వచ్చినవి చేతులు మారుస్తూండంగ నన్ను పట్టుకోవటం జరిగిందట..." ఇలా అవాకులు, చెవాకులు నా గురించి రాసున్నాయ్.


    బ్లూఫిల్మ్ లలో నటించానని, మోసగాడినని, స్మగ్లర్ నని, కాలేజి స్టూడెంట్లకి కూడా హీరాయిన్ లాంటివి సప్లయ్ చేస్తుంటానని...అవాకులు చెవాకులు రాశారుగాని నన్ను హంతకుడిగ మాత్రం చిత్రీకరించలేదు. కొంతలో కొంత అదొక్కటే మేలు.


    నా పక్క సాక్ష్యం చెప్పడానికి ఎవరూ లేరు. నన్నాదుకొనేవాళ్ళు లేరు.


    నన్ను చూడ్డానికి జైలుకి సుస్మిత రాలేదు.


    కనీసం పక్క ఫ్రెండ్ కూడా రాలేదు.


    రాలేదో! లేక పోలీసులు కలుసుకోనివ్వలేదో? నాకు తెలీదు. నేను ఏ నేరమూ చెయ్యకపోయినా నేను నేరాలు చేసినట్టు రుజువులు, సాక్ష్యాలు కోర్టుకి నివేదించబడ్డాయ్.


    నాకు రెండేళ్ళపాటు కఠిన కారాగారశిక్ష పడింది.


    నేను శిక్ష అనుభవిస్తుండగా అప్పుడు...అప్పుడు...సుస్మిత వాళ్ళ నాన్న నా దగ్గరకొచ్చాడు.


    "నా మాట వింటే బాగుపడిపోయేవాడివి. నేను చెప్పింది వినలేదు జైలుపాలయ్యావ్. నీ బంగారు భవిష్యత్తుని సర్వనాశనం చేసుకున్నావు. అది నా తప్పు కాదు. నీ తప్పు. అందని ద్రాక్షాపళ్ళకి ఎగబడితే ఇలాగే అవుతుంది. చక్కటి వలపన్ని, ఆ వలలో నీవు చిక్కుకొనేలా చేసింది నేనే. డబ్బు చూశావా ఎంతటి పనినయినా చేయిస్తుంది. చాతనయితే జైలు నుంచి వచ్చిన తర్వాత ఇదే మార్గాన డబ్బు సంపాదించి నా అంత గొప్ప వాడివికా. ఆనాడు వచ్చి నాకు కనపడు. సుస్మిత విషయం ఇంక మర్చిపో. నీవు మోసగాడివని సుస్మిత నమ్మింది. ఇదే నెలలో సుస్మితకి పెళ్ళి చేసి ఫారిన్ పంపిస్తాను. ఈ విషయం నీకు చెబుదామని వచ్చాను. బై..." అని చెప్పి వెళ్ళిపోయాడు.


    ఇంతపని చేసినవాడు ఎంత పనైనా చేయగలడు.


    సుస్మిత ఎక్కడున్నా సుఖంగా వుంటే చాలు.


    సుస్మితని మరిచిపోదామని చూశాను.


    కానీ అది నాకు సాధ్యం కాలేదు.


    నాకొక్కటే కోరిక.


    నేను సుస్మిత దగ్గరకెళ్ళి "ఈ నేరాలేవీ నేను చేయలేదని... నేను నిర్దోషినని...ఈ వక్కమాట నమ్మితే చాలని..." చెప్పాలనుకొన్నాను.


    జైలునుంచి విడుదలై వచ్చాను. వెంటనే ఇంకో కేసులో ఇరుక్కొన్నాను. అలా రెండు సార్లు జరిగింది. మూడోసారి అనుకోకుండా బాస్ దగ్గర చేరాను.


    ఏ డబ్బు నన్ను దెబ్బతీసిందో అదే డబ్బుని అంతులేనంతగా సంపాదించి సుస్మిత తండ్రిని దెబ్బతీద్దామని అనుకొన్నాను. బాస్ కి కుడిభుజంగా మారి ఎన్నో పనులు చేసిపెట్టాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS